మల్లీశ్వరి
ఆరునెలల జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం బెయిల్ మీద విడుదలయిన డి.ఎం.కె. ఎం.పి. కనిమొళి గులాబీరంగు చుడీదార్‌లో అరవిరిసిన పూలగుత్తి పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ జైలునుంచి బయటకి వచ్చారని పేపర్లు వర్ణనాత్మక కథనాలను ప్రచురించడాన్ని మనం చదివాం. గత ఆరునెలలుగా ఆమెకి లభించిన ప్రచారం పుణ్యమా అని కొన్ని హృదయాలయినా ‘పోన్లే… పాపం… యిప్పటికయినా బెయిలు దొరికింది’ అని సానుభూతిగా నిట్టూర్చాయి.
ఈ ఆరునెలల్లో బెయిల్ పిటిషన్ తిరస్కరించబడినపుడల్లా, ఆమె, ఆమె కుటుంబ సభ్యుల వేదన, రోదనలు మీడియా ద్వారా చూసినపుడు కష్టాలూ, కన్నీళ్ళూ సెంటిమెంట్ బలంగా పండిన కుటుంబ కథా సీరియల్‌ని పత్రికలు చూపించాయి అనిపించింది.
వందల కోట్ల 2జి స్కామ్‌లో నిందితురాలయిన కనిమొళి కేసు సామాజిక, న్యాయ సంబంధమయినది. ఈ పరిధిని దాటి ఆమెకి యితర మినహాయింపులూ, సానుభూతి దొరకడం వెనుక అనేక కారణాలుండొచ్చు. వాటితోపాటు దక్షిణ భారత స్త్రీల విలక్షణ సౌందర్యానికి ప్రతీకలా, చురుకుదనం, నాయకత్వం లక్షణాలు కలిగిన స్త్రీగా కూడా ఆమెకి ఉన్న అదనపు ఆకర్షణలను ప్రభావవర్గాలు గుర్తించాయి.
నేరంలోనూ స్త్రీల సౌందర్యం ముందుకు రావడం విషాదం. గనుల కుంభకోణం కేసులో ఐ.ఏ.ఎస్. అధికారిణి శ్రీలక్ష్మిని సి.బి.ఐ. విచారిస్తున్నపుడు ఆమె పదేపదే విలపించడం, సమాధానాలు చెప్పలేక నిస్సహాయతతో ఉద్వేగానికి లోనుకావడమూ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చాయి. ఈ రకమయిన వార్తల ద్వారా కేసులో ప్రధానాంశపు తీవ్రతనుంచి భావోద్వేగాల వైపు ప్రజల దృష్టి మరలే ప్రమాదమే కాక ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కష్టాలొచ్చినపుడు స్త్రీలు అబలలుగా, నిస్సహాయులుగా వుంటారనీ అవి స్త్రీత్వపు లక్షణాలుగా పదే పదే రుజువు చేసినట్లుగానూ ఈ ఉదాహరణలో తెలుస్తోంది.
స్థిరమయిన పాలనా వ్యవస్థలేమి, ఆర్థిక సంక్షోభం, తీవ్రవాదుల దాడులు, అమెరికా బెదిరింపుల మధ్య బేజారెత్తి ఉన్న ఒక దేశానికి విదేశాంగ శాఖామంత్రి కావడం అంటే ఎంత ప్రతిభ, రాజకీయ నైపుణ్యం, సంయమనం ఉండాలి!
పిన్న వయస్సులోనే పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రిగా ఎదిగిన హీనా రబ్బానీఖాన్ యిటీవల భారత్‌లో పర్యటించినపుడు ఆమె రూపవిలాసాలూ, ధరించిన దుస్తులు, ఆకర్షణీయమయిన హావభావాలూ రాజకీయాలలో సమానంగా చర్చకి వచ్చాయి. లేడీ డయానా, ప్రియాంకాగాంధీ లాంటి వారి విషయంలోనూ యిదే ధోరణి కనిపిస్తుంది. స్త్రీల శక్తి యుక్తుల కన్నా మూసపోసిన సౌందర్యమే ప్రధాన ఆకర్షణ అవుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతాబెనర్జీ విజయం సాధించినపుడు కొన్ని దశాబ్దాలుగా దుర్భేద్యంగా ఉన్న కమ్యూనిస్ట్ కంచుకోటని బద్దలు గొట్టిన ధీరవనితగా ఆమె హారతులందుకున్నారు. ఆమె సాధించిన విజయం కొన్ని కోణాల్లో ఆహ్వానించదగిందే. సామాన్యుల హక్కులకు సంబంధించి, వారి రాజకీయ స్వేచ్ఛకి సంబంధించి వున్న అసంతృప్తులను గమనించి వారిని ఏకతాటి మీదకి తెచ్చి నడిపించడంలో ఆమె సఫలమయ్యారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలూ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నపుడు ప్రతిపక్షంలో ఉన్న మమతా బెనర్జీ అభివృద్ధి వ్యతిరేక ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. యిటువంటి స్థితిలో అధికారం లోకి వచ్చిన మమత పశ్చిమబెంగాల్ పురోగతిని ఎలా సాధించగలరన్న ప్రశ్న సహజంగా కలగాలి. కానీ ఆమె విజయాన్ని వ్యాఖ్యానించడంలో మీడియా, కొందరు రాజకీయ విశ్లేషకులు, సాహిత్యకారులకి సహనం లేకపోవడం ఆశ్చర్యకరం. ఆమె విజయాన్ని భావోద్వేగాల దృష్టికోణం నుంచి చూడటం మూలంగా ఆమె ఏ రాజకీయ వ్యవస్థకి ప్రతినిధో… ఆ వ్యవస్థ క్రూరత్వాన్ని అమలుచేయడానికి ఎంతదూరం వెళ్ళగలరో వూహించలేక ఇపుడు కిషన్‌జీ మరణంతో ఉలిక్కిపడుతున్నాం.
ఉన్నతస్థాయికి ఎదిగిన కొద్దిమంది స్త్రీలను వ్యక్తులుగా వారి ప్రాతినిధ్యాల్లోంచి చర్యల్లోంచి కాక వ్యక్తిగత జీవితం, దానికి ఉన్న ఆకర్షణల్లోంచి చూసి పేట్రనైజ్ చేసే ధోరణి యిప్పటికీ బలంగా వుంది.
ప్రభావవర్గాలకి కూడా పితృస్వామిక స్వభావం ఉండటం మూలంగా స్త్రీల చురుకుదనమూ, సౌందర్యం, శక్తియుక్తులూ నేరంలోనూ, ప్రతిభలోనూ, విజయంలోనూ నమూనీకరణకి గురి కావడమే ఇప్పటి కాలంలో స్త్రీల చైతన్యానికి ఎదురయ్యే పెద్ద సవాలు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags