జూపాక సుభద్ర
10 రోజుల కింద మా చుట్టాలామె చిన్ని ఫోను జేసి ‘అక్కా నీకేసు గీ పోలీసాయన తీస్కుంటలేడు ఉల్టానన్నే కొట్ట కొట్ట వస్తుండు. ఎట్లబడితే అట్ల బూతులు తిడ్తండు. ఏందే నీదేమి కేసని రాయాల్నే దొంగముండ, లంజముండ బట్టేబాజి ముండ పోలీస్‌స్టేషన్ కెక్కి నావంటే నువ్వు ఏమెరుగని యెడ్డి పాపవానే నన్ను కేసు రాసుకో అనేంత ఆడదానివానె చల్ దెం.. అని మీది మీదికి వురికొచ్చిండాట. ఏంది సంగతి ఏం కేసు బెట్టబోయినవని వివరమడిగిన.
‘అక్కా నేను హాస్టల్ల ఔటుసోర్సింగ్ స్వీపర్‌గ పంజేస్తన్న. మా మరిదికి మేము బాకి పడ్డం. గా బాకి కోసం వాల్లన్నతోని మాట్లాడాలె లొల్లి బెట్టుకోవాలె. పంచాయితీ బెట్టిచ్చి పెద్దమనుషులతోని అడిగియ్యాలె. గవన్ని వొదిలేసి నేను పంజేసే హాస్టలుకొచ్చి సెడ్డ సెడ్డ మాటలు తిట్టిండక్క.గిట్ల తిట్టిండని సెప్పుకోలేని మాటలు. వాని మాటలకగ్గివెట్ట దొంగబాడ్కావు తల్లికి పుట్టని మాటలు దిట్టిండు వాని బొంద మురుగ. నన్నెందుకు తిడ్తవు మీ అన్నను అడుగుపో..పంచాది బెట్కపో..యింటికచ్చి అడుగు. గీ నేంపనిజేసే హాస్టల్లు కచ్చి తిట్టుడేండని అన్నందుకు వాడు రెచ్చిపోయి నా యెంటికలు బట్టి కొట్టిండు వాని సేతులు సెర్లబోను’ అని కొంచెంసేపు ఏడిసింది. ఎందుకేడుస్తవు వాన్ని కొట్టనీకి చాత గాలేదా నువ్వెందుకు వూకున్నవు? నువ్వు నాలుగు తన్నితె మంచిగుండు.
నేను సెయిజేసుకుంటే ఎంతలక్కా నా సెయికింద పిడికెడులేడువాడు కాని కొట్టి తప్పులవడ్తనని కొట్టలేకపోయిన.వాన్నే పంచాదిల, పోలీస్టేషండ్లేసి వాడు కొట్టిన తప్పుకు తూ తూ అని వూంచి పిత్తనుకున్న.’మరేమాయె వూంచిపిచ్చినవా’! గట్లజేత్తె మంచిగనే వుండు కాని పోలీసు కొడుకులు కేసే రాసుకోలే. వాడు తిట్టి కొడితే కోపంతోని దుక్కంతోని పోలీసుస్టేషనుకు బోయి ‘సారూ నేను హాస్టల్‌ల డ్యూటీ మీదుండుంగ గ దొంగగాడిది కొడుకు నన్ను గొట్టిండు తిట్టిండు అని చెప్పిన. మావూల్లెనే పోలీస్‌స్టేషనున్నది. ఆ ఆ పోలీసోల్లకు నన్ను గొట్టినోడుమరిదని తెలుసు. వాడు బాకీపేరు మీద నన్ను కొడితే ఏమి లేదాట గానీ నన్ను కొట్టినోన్ని తిట్టొద్దాట. నువ్వాడిదానివే నానే, స్వంత మరిదిని వాడు వీడని తిడ్తవానే యింక సిగ్గు శరం లేక స్టేషన్ కొస్తావానె చల్ యీన్నుంచి నడువ్ అని కొట్టనీకి వురికొచ్చిండు ఎస్సై. ఎదైెతే అదయింది యీ ఎస్సైగాన్ని గూడ సప్పసిప్పదంచుదామన్న కోపమొచ్చింది. మరి నీపెనిమిటి రాలేదా ‘ అని అడిగిన వచ్చిండు ‘సార్ ఆడామెను డ్యూటీ మీదకొచ్చి కొట్టిండు కేసు బుక్ చేయండ్రి సార్ అని బతిమిలాడితే అయినను గూడ తిట్టిండ్రు. అరేయ్ నీ పెండ్లానికి బుద్ది జెప్పుకోవారా సొంత తమ్మున్ని నీ పెండ్లం అరేయ్ తొరేయ్ అని బూతులు తిడ్తాంటే ఎట్లూరుకుంటవ్ రా బేకార్ నా కొడకా అని తిట్టిండు. నీ పెండ్లం అట్ల తిడ్తాంటే ఎవడూరుకుంటర్రా వాడు కొట్టిందే చెప్తన్నవుగానీ నీ పెండ్లం తిట్టింది లెక్క లేదారా! దాని నోరుకు తట్టుకోలేక కొట్టిండు. అది తిడితె తప్పులేదుగనీ కొడితేనే వచ్చిందా! దానికి కేసు రాయాలార! దాన్ని లోపలేస్తే సక్కగౌతది. దాని మీద కేసు రాస్తం. మీ దిక్కున్నకాడ చెప్పుకోండ్రి వానికిచ్చే బాకీ వానికివ్వకుంట వాన్ని దిట్టిన ఆ మాటలకు నీ పెండ్లాన్ని కొట్టిండేమో! అయినా నీ పెండ్లాన్ని కొట్టిండని రుజువేడున్నది? బాకడుగుతె గియ్యాల నీ పెండ్లాం నీ తమ్ముడు కొట్టిండని పోలీస్‌స్టేషన్ కొచ్చింది, రేపు నీ తమ్ముడు గుంజిండని వస్తది. అసోంటిదే నీ పెండ్లాం’ అని అవమానిస్తే ఏడ్సుకుంట యింటికొచ్చిండ్రాట అసహాయంగ.
ఆ అమ్మాయి చిన్ని అట్లా చెప్పినంక నాకు కడుపు సలసల వుడికింది. ఏందిది యిట్ల వుండుడేంది పోలీసులు, పోలీస్టేషండ్లు. ఎస్సీ ఆడోల్లంటే యింత లోకువా! ఏందే గీందే అనడం, వాల్లకు ఎలాంటి అన్యాయమైనా పట్టించుకోక పోవడం సర్వసాధారణమట. నేను ఆ చుట్టుపక్కల తెల్సిన లీడర్స్‌ను అడిగితే వూర్ల వుండే పోలీస్‌స్టేషన్స్‌లో అలాంటివి కామన్ మనం మార్చలేం. వాల్లకు ఆదత్ అయింది. అనే సమాధానం యింకా పుండు మీద కారం బోసినట్లయింది. ఎస్సీ ఎస్టీ కేసులో ఆ పోలీసుగాడిని వేద్దామంటే ‘ఆమె పెనిమిటి వద్దక్కా వున్న వూర్లె వానికి వ్యతిరేకం జేస్తే మమ్ముల బత్క నియ్యడువాడు అన్నల సంబంధమంటరు, దొంగలపేరు జేస్తరు. వానిది పెద్ద దంద వాని పాపాల వాడే పోతడుతియ్’ అని అన్నడు. కాని అటు తన ప్రమేయం ఏమిలేకున్నా మరిదితో అన్యాయంగా దెబ్బలుబడి తిట్లు తిని న్యాయం చేయమని పోలీస్‌స్టేషన్‌కు బోయి అవమానాలు ఎదుర్కొని ఆ బాధలకు జ్వరమొచ్చి మంచాన బడ్డదట చిన్ని.
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగమవుతుంది అని మొరిగే పెద్ద మనుషులు యిట్లాంటి కేసులు చూడుండ్రి. అసలు యీ చట్టం సవ్యంగా, న్యాయం గాఅమలు చేస్తున్నారా! కనీసం కేసులు బుక్కవుతున్నయా! వూల్లల ఎస్సీ ఆడోల్లని కులంపేరుతోని బూతులు తిడ్తున్న వాల్ల మీద కేసులు పెడితే దేశం జైల్లు సాలవు. చట్టాలను అమలు చేసే పోలీస్ వ్యవస్థ కూడా చట్టాల్ని ఉల్లంఘిస్తుంటే ఎస్సీ ఆడోల్లు ఎక్కడికి బొయి కష్టం జెప్పుకుంటరు? యీ ఆడవాల్లు సమూహంగా ఎదిగితేనే యిట్లాంటి పోలీస్ట్‌షండ్లని మార్చగలరు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags