కొడుకులూ కూతుళ్లూ

కె. శ్రీనివాస్‌
నిన్న మొన్నటిది కాదు, ఆమ్లవర్షం ఎప్పటినుంచో కురుస్తూనే ఉన్నది. మనిషి స్వార్థం, దుర్మార్గం, బాధ్యతా రాహిత్యం పొగలు కక్కి, కాలుష్యం కరిమబ్బులై, ఎడతెగని ఆమ్లవర్షం కురుస్తూనే ఉన్నది. బొబ్బలెక్కింది చూడు నాయనా భూతల్లి, చర్మం వూడి పోయి మాంసం ఉడికిపోయి మనిషి ద్వేషమంత వికృతమై..
మగతనమొక గంధకికామ్లం. అది వ్యవస్థనొక విష పురుషునిగా మార్చింది. గర్భాశయాలను తడిమి తడిమి ఆడపిండాలను హత మార్చింది. పసిదనాలను నలిపి వేసింది. తనమనుషులకే పనిమనిషిగా మార్చింది. తల్లులను అత్తలను చేసింది. బానిసత్వానికి అందమైన బిరుదులిచ్చింది. తెగించి మగలోకంలోకి అడుగు పెట్టినప్పుడు ముళ్లతివాచి పరిచింది. కొరడాలను, కిరసనాయిల్‌ను, ఆసిడ్‌ సీసాలను ఆయుధగారంలో మోహరించింది. ధర్మశాస్త్రాలు, నీతిశతకాలు ఆడపిల్లల్ని కట్టిపడవేయలేవను కున్నప్పుడు సినిమాలను, టీవీలను ఆవిష్కరించింది.
బలాఢ్యులొకవైపు అబలలు మరోవైపు, పురుషోత్తములొకవైపు పాద దాసీలు మరొకవైపు తయారయ్యే సమాజంలో, సరస్వతులకు అక్షరాలందివచ్చిందే ఈ మధ్యన. పెద్ద పెద్ద అంగలతో విజ్ఞానశిఖరాలను అందుకుంటున్నదీ ఈమధ్యన. అక్కడ సైతం అడుగడుగునా కందకాలు. ప్రేమ పేరుతో ఒక వేట. ఉద్వేగాల బ్లాక్‌మెయిలింగ్‌తో ఒక ఆట. ఆశల పంజరాలు, భద్రమైన భుజాలంబనల వాగ్దానాలు. కొత్తబంగారు లోకాల సోపానాలు.
ఎవరూ ఆడపిల్లలుగా పుట్టరు. తయారు చేయబడతారు.
ఎవరూ మగపిల్లలుగానూ పుట్టరు, తయారు చేయబడతారు.
ఏ వ్యవస్థ ఆడపిల్లను బేలను చేసిందో నిస్సహాయను చేసిందో, ఆ వ్యవస్థే మగవాడిని పగవాడిగా తీర్చిదిద్దింది. ఒకే కుటుంబం నీడలో, ఒకే అమ్మానాన్నా గొడుగుకింద ఎవరి మూసలో వారు రూపు దిద్దుకుంటారు.
సమాజానికంతటికీ ఛత్రమై నిలిచే వ్యవస్థలకూ పురుషత్వం ఉంటుంది. రక్షకులకు సైతం బారెడు మీసాలుంటాయి. ఆర్తనాదాలను అవి అపహసిస్తాయి. ఆడపిల్ల తండ్రికి అవి బుద్ధులు చెబుతాయి. కాసులు రాలని కేసులను కాలితో తంతాయి. వ్యభిచారగృహాలనుంచి వాటాలు తీసుకుంటాయి. దుశ్శాసనులకు కాపలాకాస్తాయి. వాకపల్లులలో స్వయంగా విజృంభిస్తాయి. రాజకీయం కూడా మగవాసనే వేస్తుంది. కాకపోతే, ఆడ ఓట్లకోసం తెగ పాట్లు పడుతుంది. స్వయంశక్తి పేరుతో కుటుంబ బాధ్యతల కొత్తకిరీటం తొడుగుతుంది. రాజకీయ మహాజాతరలకు బండ్లు పంపి రప్పిస్తుంది. ఆయేషా విషాదాలు ఎదురైనప్పుడు తప్పుకు తిరుగుతుంది.
జ    జ    జ
ఆ ముగ్గురూ ఆసిడ్‌ సీసా పట్టుకుని దాడికి బయలుదేరినప్పుడు- వారి మనసులో చెప్పలేనంత విద్వేషం బుసబుసపొంగి ఉంటుంది. ప్రేమల గురించి, మనిషికి మనిషి సొంతం చేసుకోవడం గురించి, అపజయాల అవమానాలను చల్లార్చుకోవడం గురించి, ఘనతలను చాటుకోవడం గురించి, న్యూనతలను దాచుకోవడం గురించి- ప్రతినాయకుడి బుర్రలో ఎన్నో విషపుటాలోచనలు సుడులు తిరిగి ఉంటాయి. ఆ ఆలోచనలన్నిటినీ ఈ ప్రపంచమే సరఫరా చేసి ఉంటుంది. ఇనుప ప్రేమల కథాచిత్రాలు కొంత, నేరాలు ఘోరాల నాటకీకరణలు కొంత, ఉన్నత జీవితంలోకి అడుగుపెడుతున్న ఆడపిల్లను చూసి అణచుకోలేని అసూయ కొంత- అతన్ని తీర్చిదిద్ది ఉంటాయి. అతనే కాదు, తక్కిన ఇద్దరూ కూడా – వ్యవస్థ విషఫలాలను ఆరగించి వికృతమనస్కులై పోయి ఉంటారు. లేదా తెలియని ఏ మనోకల్లోలమో వారిని విచక్షణకు వెలిచేసి ఉంటుంది.
అయ్యా, వారు దోషులు మాత్రమే కాదు, సంస్కృతి చేసిన చేతబడికి బలి అయి, దానవులైనవారు కూడా. లోకంలో ఆడపిల్లల తల్లిదండ్రులూ మగపిల్లల తల్లిదండ్రులూ వేరు వేరుగా లేరు. అన్యాయమైపోయిన ఆడకూతుళ్లకోసమైనా, చెడబుట్టిన కొడుకుల కోసమైనా తల్లిదండ్రుల దు:ఖమొక్కటే… ఆ ముగ్గురిని కన్న అమ్మా అయ్యా అందరిలాంటివారే అయి ఉంటారు, వారికీ ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఆడపిల్లలు ఉన్న వారందరికీ మగపిల్లలు కూడా ఉండే ఉంటారు.
తల్లిదండ్రుల దు:ఖమే లెక్కలోకి తీసుకుంటే, శుక్రవారం రాత్రిదాకా ఇద్దరు తల్లిదండ్రులకు పరిమితమైన కడుపుమంట, శనివారానికి మరో మూడు జంటలకు విస్తరించింది. ఆరోజు సాయంత్రం స్వప్నిక, ప్రణీతలపై దాడి వార్త తెలిసిన వెంటనే, ఆడపిల్లల తండ్రుల గుండెలెన్నిసార్లు భయంతో విలవిలలాడాయి? శుక్రవారం రాత్రి ఎన్‌కౌంటర్‌ సంగతి తెలిశాక, మగపిల్లల తండ్రులూ మనసు మూలల్లో గజగజ వణికి ఉంటారు.
జ    జ    జ
కొడుకులను చంపుకుందామా, కూతుళ్లను బలిపెడదామా?
ఇది పిల్లల సమస్య, పిల్లలను కాపాడుకునే సమస్య. కడుపుచించు కుంటే కాళ్లమీద పడే సమస్య. వ్యవస్థ కాపాడలేనప్పుడు, దాని కత్తికి రెండువైపులా పదును ఉన్నప్పుడు- కుటుంబమో, ఉంటే గింటే పౌరసమాజమో ఈతరాన్ని కాపాడుకోవాలి. వారి మనసుల్లో సుడులు తిరుగుతున్న అలజడులేమిటో వినాలి. వైఫల్యసాఫల్యాల సుడిగుండంలో వారిలోకి చొరబడుతున్న నేరాలోచన లేమిటో పసిగట్టాలి.
వ్యక్తావ్యక్త వయస్సుల్లోనే అటానమస్‌ స్వేచ్ఛలొద్దు. అహంకారపు అభిజాత్యంతో పిల్లలకూ మనకూ గోడలొద్దు. సెల్‌ఫోన్లూ వద్దు, ఆర్కుట్లూ వద్దు.  కొడుకు మనసూ కూతురు మనసూ తెలియనప్పుడు కొత్త కొత్త డొమైన్లు అసలే వద్దు. రేంకింగుల రేసులూ వద్దు. రియాల్టీషోల ఉద్రేకాలూ వద్దు.  కొడుకులు దారితప్పి స్వయంతీర్పరుల చేతిలో శవాలుగా మిగలొద్దు. కూతుళ్ల భాష పగలూ ప్రతీకారాలతో కలుషితం కావద్దు.
అన్నిటికంటె ముఖ్యం గంధకికామ్లాన్ని ప్రమాదరహితం చేయడం. మగతనపు ఊబిలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటున్న మగపిల్లలను ముందు విముక్తం చేయడం. ఆమ్లవర్షం కురవడానికి కారణమయిన కాలుష్యాలేమిటో గుర్తించి, పరిసరాలను రక్షించుకోవడం. వెల : 150 కాపీలకు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
కె.శ్రీనివాస్‌ ‘సంభాషణ’ (2004-2010) పుస్తకం నుంచి

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.