– ఆర్.శాంతసుందరి
ఎలా చెప్పనమ్మా
మనిద్దరికీ ఇక అక్కడ చోటే లేదని!
మనసులో గాని ఇంట్లోగాని
మన జ్ఞాపకాలేవీ లేవనీ!
నువ్వు చెప్పే ఆ నా ‘పిన్ని’ ఎంతో ప్రేమగా నా తల నిమిరినా
రకరకాల చిరుతిళ్లు వండిపెట్టినా
ఇప్పటి వరకూ తన కొడుకుతో
నువ్వు వాడి ‘పెద్దమ్మ’వని చెప్పనే లేదు. తెలుసా?
— — —
ఎవరినైతే నువ్వు
చాలా తెలివైనవాడనీ, మంచి వాడనీ
నీ భర్త అనీ, నా తండ్రి అనీ
అంటున్నావో
అతను ఉత్త పిరికివాడు
ఏకాంతంగా ఉన్నప్పుడైనా
నిన్ను తలుచుకోవానికి
నన్ను నలుగురిలో తన కొడుకని చెప్పుకోటానికి సిగ్గు పడతాడు
చెప్పకుండా తప్పించుకుంటాడు.
-ఈ పంక్తులు ఒక కవి కలం నుండి వచ్చినవి. పవన్ కరణ్ అనే ఈ యువకవి, ఒక పూర్తి కవితా సంపుటిని ‘స్త్రీ’ని కేంద్రబిందువుగా తీసుకుని, ‘స్త్రీ మేరే భీతర్’ (నాలోని స్త్రీ) శీర్షికతో 37 కవితలతో ప్రచురించాడు. ఇందులో స్త్రీని తల్లిగా, చెల్లిగా, భార్యగా, ప్రియురాలిగా, కూతురిగా, ఇలా ఎన్నో రూపాల్లో చిత్రించాడు. ‘నేనిప్పటికీ ఆమెని ప్రేమించటంలేదు. అనే కవితలో స్త్రీ ప్రేమకీ, పురుషుణి ప్రేమకీ గల తేడాని స్పష్టంచేశాడు.
నేనామెని ప్రేమించలేదు
ఇప్పుడు కూడా ప్రేమించటం లేదు
నాకామె మీద ఇష్టం ఉండేది
ఆమెని పొందాలనుకున్నాను
నిజం చెప్పాటంటే
నేను పొందాలనుకున్నది ఆమె శరీరాన్ని
— — — —
ఆమెని చూసినప్పడల్లా
ఈమె పొందు ఎలా ఉంటుందో
అనుకునేవాణ్ణి
ఎంత తెల్లగా
మెరిసిపోతూ ఉంటుందో
ఆమె (నన్ను) శరీరం!
అప్పుడామె నవ్వుతూ సిగ్గుపడటం
ఎంత బావుంటుందో!
అనే ఆలోచనే ఉండేది
ఆమె శరీర ప్రపంచంలోకి
ప్రవేశం కోసం
నన్ను నేను
ఆమె కాళ్లకింద పచ్చగడ్డి తివాచీలా పరిచాను
“నీ అందమైన పాదాలకింద
నేనెంతగా నలిగితే
అంతగా నారూపం స్వచ్ఛమౌతుంది
నన్ను తొక్కుకుంటూ
ఎంత దూరమైనా సరే వెళ్లు
నేను నీ ముందు
అంత దూరమూ పరుచుకుంటూ పోతాను
ప్రపంచం అంచులదాకా అయినా సరే!”
అన్నాను.
ఆమె నా వశమయాక
ఎంతో దూరం ఆమెతో కలిసి నడిచాక
ఈ రోజు ఆమెని అడుగుతాను కదా,
“నీ కోర్కెలని అదుపులో పెట్టకోలేక పోయావేం?
‘వద్దు’ అంటూ బెట్టు చెయ్యటం మానేశావేం?
ఇప్పటికీ ఆమె మీద నాకు ప్రేమ లేదు
ఆమె అంటే ఇష్టం, అంతే
ఆమె శరీరమంటే ఇష్టం
కానీ
ఆమె కళ్లు
నాలో ఇప్పటికీ ఒకనాటి ఆవేశాన్ని వెతుకుతాయి.
ఆమె స్థైర్యాన్ని
సమూలంగా పెకలించివేసిన
గాలివానలాంటి నా ఆవేశం!
‘మగాడి తోడు లేకుండా బతికేయ్యగలవు నువ్వు’ అనే కవితలో పెళ్లయిన మగాడు తన ఒకనాటి ప్రియురాలితో మాట్లాడే తీరుని కవి ఎంత వ్యంగ్యంగా వర్ణించాడో చూడండి.
నేను నిన్ను వదిలి దూరంగా పోయాను
నిజమే
జీవన సహచరిగా ఇంకొకర్ని ఎంచుకున్నాను
తండ్రిని కూడా అయాను – అయితే మాత్రమే?
ఏడాదైనా గడవకుంగానే
నీ జ్ఞాపకాలు వేధిస్తున్నాయి నన్ను
నువ్వు కావాలని తహతహలాడుతోంది మనసు
నీ స్పర్శకోసం తపిస్తున్నాయి ఈ చేతులు
—- — — — —
ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు!
నేను నా భార్యతో సంతోషంగా ఉండాలా?
అసలు ఎవరైనా భార్యలతో సుఖంగా ఉండగలరా, చెప్పు?
— — —-
నువ్వు మగతోడు లేకుండా బతుకుతున్నావట
అది నేను కలలోకూడా ఊహించలేని విషయం
నన్ను అంత త్వరగా మర్చిపోగలిగావన్న మాట!
నామీద ఆసక్తి అంత త్వరగా పోయిందని నేను నమ్మను!
‘అందంగా లేని భార్యలున్న భర్తలు’ అనే కవితలో భార్యలు అందంగా లేకపోతే మగవాళ్ల కళ్లెప్పుడూ పరాయి స్త్రీల వేటలోనే ఉంటాయని అంటాడు. కవి-పైకి అటువంటి మగవారిని సవుర్థిస్తున్నట్టు కనిపించే ఈ కవితలో మగవారి వంచననీ, కపటత్వాన్నీ చిత్రించాడు. ఈ కవితమీద చాలా విమర్శలూ చర్చలూ, వాగ్వివాదాలూ జరిగాయి.
‘నీకు కావలసినట్టుగా లేను నేను’ అనే కవితలోని భావం చూడండి:
నాకు పశ్చాత్తాపం లేదు
ఈ రోజు శాశ్వతంగా అతని దాన్నవుతున్న రోజు
అపదాధ భావం లేదు
— — —
మా ఇద్దరికీ ఇది మొదటి కలయికే
కానీ నాకు మాత్రం ఇది మొదటిది కాదు
బహుశా అతనికీ కాదేమో!
—- —- —-
నిజం చెప్పాలంటే
నా కన్యాత్వాన్ని
పెట్టుబడిలా దాచిపెట్టుకోవాలనీ
ఎవరి చెయ్యీ పడకుండా జాగ్రత్త పడాలనీ
కేవలం నా భర్తకే అర్పించుకోవాలనీ
అనుకోలేదు నేనెప్పుడూ
— — — —
అలోచిస్తే
అందరు మగాళ్లూ ఒకేలా కనిపిస్తారు నాకు
అందరి గొంతులూ ఒకేలా వినిపిస్తాయి
ఇంతకు ముందు
పరపురుషుడు కాదు కదా
నా చేతులే నన్ను ముట్టుకుని ఉండవని
ఆశిస్తారు పాపం ఈ మగవాళ్లు
మా పొందులో పరవశించటానికి బదులు
అన్నీ మర్చిపోయి ఆనందసాగరంలో మునకలు వెయ్యటానికి బదులు
మొుదటి కలయికలోనే
చేదు మాటలతో మొదలుపెట్టి
ఇక జీవితాంతం మా ఇద్దరి మధ్యా
అదే రుచి శాశ్వతంగా ఉండేట్టు చేస్తారు.
‘ఆ గొంతులో నిజాయితీ కనిపించదు నాకు’ అనే కవితలో గుజరాత్ గొడవల్లో స్త్రీలు ఎదుర్కొన్న ఘోరమైన యాతనల్ని చిత్రించాడు కవి:
నా ఒంటిమీద నూలుపోగైనా లేదు
గుజరాత్ వీధుల్లో
దుండగులకి చిక్కకుండా పారిపోతున్న స్త్రీని నేను
నా ఒడిలోని పసిగుడ్డుని లాగేసుకుని
నన్ను కింద పడేసి
ఒకే సారిగా ఎన్నో చేతులు నా స్తనాలని నలిపేస్తే
వాటినుంచి కారి
వాళ్లచేతికంటిన పాల జిడ్డుని కూడా
పట్టించుకోలేదు వాళ్లు
నా జననాంగంలో కర్రని దూర్చి
దానికి జెండానెగరేశారు!
— — —
మగవాళ్లని అడిగినట్టు
నాపేరేమిటని అడగలేదు
నా మతమేమిటో తెలుసుకోవాలనుకోలేదు
బట్టలూడదీసి పరిక్ష చేయ్యలేదు
నా దుస్తుల బట్టి దూరం నుంచే పోల్చు కున్నారు
కానీ నా సోదరులనీ, తండ్రినీ నరికినట్టు
ఒక్క వేటుతో నరకలేదు నా గొంతుకని
నేను చావు కోరుతూ
జోడించిన నాచేతుల్ని కుక్కల్లాగా నాకారు
నా కన్నీళ్లు వాళ్ల వీర్యంతో కలిసి చెదిరి పోయాయి
ఇంతలో
దూరాన్నించెవరో గొడవలు ముగిశాయని కేక పెడతారు
కానీ నాకు ఆ మాట నిజమని అనిపించదు
ఈ ఉపద్రవం ఇంతటితో ముగిసిందనుకోను
దీనికి ఎప్పటికీ ముగింపు ఉండదు
నా పైనా, నా శరీరంపైనా ఈ అత్యాచారం
ఎన్నో శతాబ్దాలుగా జరుగుతోంది
ఈ దుండగుల బారినుంచి తప్పించుకుని పరిగెత్తటం
నేను యుగయుగాలుగా చేస్తున్నదే
కానీ ఈ మధ్య నేను పరిగెత్తుతున్నది
గుజరాత్ వీధుల్లో!
-ఈ మధ్య వార్తల్లో, ఒక దేశంలో రాజకీయంగా జరిగే యుద్ధంలో స్త్రీలపై బలాత్కారం చెయ్యటం అనేది ఒక భాగంగా ఉందని చదివిన మనకి ఈ కవితలో కవి ఏం చెప్పదల్చుకున్నాడో, ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది.
స్త్రీకి సంబంధించిన అన్ని అంశాలనీ స్పృశించిన ఈ కవి ‘బురఖా’ వెనక ఉన్న ‘కుట్రని’ కూడా బహిర్గతం చేశారు.
నువ్వు ఎన్ని సార్లు చెప్పినా
నాకు అస్సలు నమ్మకం కలగటంలేదు
దీన్నీ నాకోసం
ఆ దేవుడే స్వయంగా తయారు చేశాడంటు న్నావు
నీ ఆజ్ఞ పాటించి
దీన్ని తొడుక్కున్నప్పుడల్లా
గీరుకుపోయిన నా దేహం
దీన్ని అసలు ఇష్టపడం లేదు
—– ——
తొడుక్కున్న ప్రతిసారీ
ఇది గొంతు చించుకుని అరుస్తుంది.
దీన్ని దేవుడు కాదు
నువ్వే తయారు చేశావని నాకోసం
నాకు నువ్యే దేవుడివని చెప్పుకోవాలన్న దురాశతో
దీన్ని నాకు తొడిగింది నువ్వే!
పురుషులు స్త్రీలని ఎంత లోకువగా చూస్తారో చెప్పటానికి కవి ఇలా అంటాడు:
నేను
ఈ మధ్యనే ఆమెకి దొరికిన కొత్త ప్రియుణ్ణి
—– —– —–
ఒక రోజు
ఆమెని దగ్గరకి తీసుకుంటూ
ఇంతకు ముందెవరినైనా ప్రేమించావా
అని అడిగాను
ఆమె చాలా సేపు
తలదించుకునే ఉండిపోయింది
చివరికి
నేను జీవితంలో చాలా తప్పులు చేశాను
అంది
ఇంకోరోజు…
అద్సరేగాని.. నీ మొదటి ప్రియుడి పేరేమిటి
అని అడిగాను
ఆమె ఎటో చూస్తు ఉండిపోయి
కొంతసేపటికి
తెలుసుకుని ఏం చేస్తావు?
తెలిసే పొరపాటు చేశాను
అంది
అయితే చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావా? అన్నాను
నువ్వు నీ ప్రియుడితో ఎంత దూరం వెళ్లావు శారీరకంగా?
అని అడిగాను
ఆమె నాకేసే చూస్తు ఉండిపోయింది
చెప్పాలని లేకపోతే మానెయ్యి
ఊరితే అడిగాను, అన్నాను.
ఒక స్త్రీకి ఎవరో వ్యక్తి రోజంతా ఫోన్ చేసి పిచ్చి వాగుడు వాగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అరడజను సార్లు ఫోనెత్తి అవతలి వ్యక్తిని కసిరి కొట్టిన తరవాత, ఇంక ఎంత మోగినా ఫోనెత్తదు. సాయంత్రం భర్త ఇంటికొచ్చి ‘ఎన్నిసార్లు ఫోన్ చేసినా పలకలేదేం? ఎక్కడికెళ్లావు? అంటాడు ఆమె ఏమీ జవాబు చెప్పదు.
రాత్రి పడుకోబోయే ముందు విషయం తెలుసుకున్న భర్త ఇలా భార్యని ‘సముదాయిస్తాడు!”
భార్య తలని ఒడిలోకి తీసుకుని
ముంగురులు సవరిస్తూ
“ఏం ఫరవాలేదోయ్
రకరకాల మనుషులుంటారు లోకంలో
వాళ్లకదో ఆట!
పాపం రోజంతా వాడెవడో సతాయిస్తుంటే
ఎంత బాధ పడ్డావో!
సరే కాని, ఇది చెప్పు
వాడు టెలిఫోన్లో నీతో ఏమేం అన్నాడు?”
అంటాడా మహానుభావుడు!
‘స్తనాలు’ అనే కవితలో కాన్సర్ ఒక స్తనాన్ని బలితీసుక్ను తరవాత భర్త అనురాగం, శారీరకంగానూ, మానసికంగానూ కూడా సన్నగిల్లడాన్ని చిత్రిస్తాడు కవి:
“నువ్వు నాముందు కూర్చునుంటే
వీటి అందాలని తనివితీరా చూడాలి నేను!”
—– —– —–
“ఇవి రెండూ నావి
వీటిని జాగ్రత్తగా కాపాడుకో
నా ఆనందమంతా వీటిలోనే ఉంది”
అని ముద్దు లాడతాడు.
—– ——
కానీ
రోగం ఆమె శరీరంలో ప్రవేశించి
వాటిల్లో ఒకదాన్ని బలి తీసుకునేదాకా వదిలి పెట్టలేదు
కాపాడుకునే మార్గం లేకపోయింది
ఇప్పుడతను
మిగిలిన ఒక్కదాన్ని గురించీ మాట్లాడడు
ఊరికే చూసి నొచ్చుకుంటూ ఉండిపోతాడు
—– —– —–
పోయిన ఆ స్తనం గురించి
వాళ్లిద్దరూ ఏమీ మాట్లాడకపోయినా
ఆమె శరీరంలోంచి దాన్ని తీసేశాక
వాళ్లిద్దరి మధ్యా ఉన్నదేదో కూడా
శాశ్వతంగా తొలగిపోయిందని ఆమెకి తెలుసు
కానీ ఏం చెయ్యగలదామె?
-సంగీతా రంజన్ అనే స్నేహితురాలికి కాన్సర్ వచ్చి ఒక స్తనాన్ని తీసివేసినప్పుడు స్పందించి రాసిన కవిత ఇది
ఒక కవితా సంపుటి శీర్షిక ‘నాలోని స్త్రీ’ అనే కవితలో కవి స్త్రీలు పడే కష్టాలన్నిటినీ తానే అనుభవించి రాసినట్టుగా అనిపిస్తుంది.
నాలో ఒక స్త్రీ
దిగులుగా గోడకానుకుని నిలబడింది
ఆమె ఎప్పుడూ ఉండేది నాలోనే
లోలోపలే గొణుగుతూ…. ఏడుస్తూ….
తన మౌనాన్ని పరుచుకుని పడుకునేదీ
నాలోనే
—– —– —–
ఆమె మూలుగు కూడా
నా తరవాత వరసగా నలుగురు ఆడపిల్లల్ని కని
తన శరీరంలో గూడు కట్టుకున్న రోగాలతో పోరాడుతూ
మంచం పట్టి
మృత్యువుకోసం ఎదురు చూస్తూ మాత్రమే బతికిన
మా అమ్మ మూలుగులాగే ఉంటుంది సరిగ్గా
సామూహిక బలాత్కారానికి గురై
ఏకాంతంగా ఉన్నప్పుడల్లా
తన శరీరాన్ని గురించిన ఆలోచనతోటే ఉంటూ
కోపంతోనూ అసహ్యంతోనూ నిండిన
స్త్రీ హృదయం లాగే
అవమానం భరించలేక పోతుంది
నాలోని స్త్రీ హృదయం
గుంజకి కట్టిన పశువులా
గిలగిల్లాడుతుంది
తన కలలు కుళ్లిపోవటం చూస్తూ
తన చుట్టూ ఉన్న చువ్వల్ని
పళ్లతో కొరికి విరగ్గొట్టాలని చూస్తుంది
నాలోని స్త్రీ….
నాలో మౌనంగా ఉండే ఆ స్త్రీ
—– —— —–
నేనే తన స్థితికి బాధ్యుడినంటుంది
నా మొహాన ఉమ్మేయాలనుకుంటుంది
నే చేసిన అన్యాయానికి
నన్ను ఉరికంబం ఎక్కించాలనుకుంటుంది
నాలోని స్త్రీ!
స్త్రీల కష్టాల గురించీ, బాధల గురించీ ఎక్కువ కవితలు రాసినప్పటికీ కవిలో ఉన్న భావుకత అక్కడక్కడా కనిపించక మానదు:
నిన్నెలా కలుసుకోను?
ఖాళీగా ఉన్న క్లాసురూమ్‌లో
బెంచికింద పెన్సిల్లా పడిఉంటే
నువ్వు మారు మాట్లాడకుండా
నన్ను తీసి నీ పుస్తకాల సంచీలో
పెట్టుకుంటే ఎంత బావుణ్ణు!
ఏదైనా తిరునాళ్ళలో
నీకిష్టమైన రంగు రిబ్బన్‌గా నీకు నేను కనిపిస్తే
నువ్వు సంతోషంగా
నన్ను కొనుక్కుంటే బావుణ్ణు!
పోనీ
నడుస్తూండగా
తెగిపోయిన నీ చెప్పుకి
పిన్నుగా మారి
నీ దరికి చేరుకోగలిగితే బావుణ్ణు!
పదిహేనేళ్ల వయసులో, తెలిసీ తెలియని మనోభావాలు అలజడి చేసే తరుణంలో ఉన్న అందమైన ఆడపిల్ల తండ్రి హృదయాన్ని ఈ కింది కవితలో విప్పి చూపిస్తాడు కవి:
ఇదే వయసు
తొలి ప్రేమ అంకురించటానికి
—– —– —–
కానీ నా కూతురు
భయపడుతూ, వణికిపోతూ ప్రేమించకూడదు
జాగ్రత్తగా ఆలోచించి
అడుగు ముందుకి వేయాలి
ప్రేమ ఎక్కువైతే ఏకాంతం కావాలనిపిస్తుంది
ప్రేమాభివ్యక్తి దేహభివ్యక్తికి దారి తీసుస్తుంది
ప్రేమిస్తే ఇది తప్పదు
శరీరం అపవిత్రమైనదని నేననను
కానీ
అది అంత పవిత్రమైనది కూడా కాదు
ఎప్పుడూ దాన్ని గురించే ఆలోచించటానికి
కానీ
ప్రేమ అమూల్యమైనది
ఆ అనుభూతిని వర్ణించటం ఎవరి తరం?
ప్రేమకీ శరీరానికీ ఉన్న సంబంధం లోతైనది
నిజానికి
ప్రేమ రక్షించబడితే
శరీరం రక్షించబడ్డట్టే
రెంటికీ మధ్య
చెప్పలేని ఒక విశ్వాసం!
తెలిసీ తెలియక
ఒక వేళ తను ఏదైనా పొరపాటు చేసినా
నేనున్నాను ఆదుకోవటానికి!
-ఎటుకాని వయసులో పిల్లలకి తల్లిదండ్రుల ఆసరా, నమ్మకం ఎంత అవసరమో, వాళ్లు చేసే పొరపాట్లని విమర్శించకుండా, ఆదుకోవటం ఎంత ముఖ్యమో కవి ఈ కవితలో చెప్పాడు.
కవి కోరికపై స్త్రీల గురించి రాసిన ‘కవి’ని తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యటానికి నేను చేసిన ప్రయత్నామే ఈ వ్యాసం.
చాల బాగుంది….
నిజంగా చాలా బాగుంది. చక్కటి సమీక్ష. మంచి వాక్యాలు కవితలో. నాకసలు కవిత్వం అర్థం కాదు. నేనెప్పుడూ చదవను. ఇది మాత్రం అలా చదువుతూ వెళ్ళిపోయాను. చాలా చక్కగా, అద్భుతంగా అంతా అర్థం అయిపోయింది. శాంత కుమారి గారు చాలా చక్కగా రాశారు సమీక్షని. అసలు పుస్తకం తెప్పించుకుని చదువుతాను.
ప్రసాద్
ప్రసాదు గారూ
ధన్యవాదాలు.ఈ కవితని అనువాదము చేసినవారు ఆర్.శాంతసుందరి గారు.
వీరు కొడవటిగంటి కుటుంబ రావు గారి కూతురు.
సత్యవతి