అత్తలూరి విజయలక్ష్మి
మంచు కురుస్తొంది… అయినా లోపలికి వెళ్లాలనిపించడంలేదు..
నాగుండెల్లో రగులుతున్న మంట చలిని కాచుకున్నట్టు వెచ్చగానే అనిపిస్తొంది.
జరిగిన సంఘటన తాలూకు షాక్ నుంచి నేను బైటపడలేదు.. పడలేను కూడా. ఆ షాక్‌తో నా కాళ్లు చచ్చుబడినట్టు ఐనాయి. సర్వశక్తులు నన్ను అసహించుకుని వదిలేసి వెళ్లినట్టు నిస్సత్తువగా మారిపోయాను..
ఎలాగోలా మంచం మీంచి లేచి బాల్కనీలో నిలబడగలిగాను.. కానీ, ఇక్కడి నుంచి మాత్రం అంగుళం కూడా కదల్లేను అనిపిస్తోంది.. కదలలేకపోతున్నాను.. ఎదురుగా ఉన్న పార్క్‌లో ఏపుగా ఎదిగిన చెట్లు నన్ను చూస్తూ వికటంగా నవ్వుతూ పరిహాసం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. గాలి, పగలబడి నవ్వుతూ నానుంచి దూరంగా వెళ్లిపోతున్నట్టుగా నిలువునా ముచ్చెమటలు పోశాయి. నా కళ్లముందు నా బెడ్‌రూమ్, బెడ్‌రూమ్ నుంచి ఓ పక్కగా డైనింగుహాల్, దాన్నానుకుని కిచెన్.. నా కిప్పుడు ఎలాగో కనిపిస్తున్నాయి. ఆ పరిసరాలన్నీ చాలా అపరిచితంగా అని పిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా నాది అనుకున్న ఆ సామ్రాజ్యం నాది కానట్టు అందులో నేనిప్పుడు ప్రవేశం కోల్పోయినట్టు అనిపిస్తోంది.
ఆ పవిత్రమైన ప్రదేశాల్లో నా పాదం మోపలేని మహాపాపం నేను చేశాను. చూపు తిప్పుకుని కిటికీవైపు చూశాను. కిటికీలోంచి బెడ్‌మీద నలిగిన దుప్పటి నన్ను చూసి వికటాట్టహాసం చేస్తోంది? నో… కళ్లుమూసుకుని కిటికీ రెక్క దభాల్న వేసేశాను.
ఎంత దారుణం జరిగింది? అసలెలా జరిగింది? ఇలా జరగడానికి నేనెంతవరకు బాధ్యురాల్ని? ఈ పాపంలో నాపాత్ర ఎంత? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? చెప్పగలిగితే ఒక్కరే చెప్పగలరు. ఆ ఒక్కరు ఎవరూ కాదు. నాభర్త.. నిజమే ఆయనే చెప్పగలడు.. ఎంతో మంచివాడు.. సహృదయుడు, నిజాయితీపరుడైన నాభర్త.
అవును అతడే నా పట్ల న్యాయమూర్తిగా వ్యవహరించి నేను చేసిన అపరాధాన్ని క్షమించగలరో, శిక్షించగలరో నిర్ణయించేది, నిర్ణయించాల్సింది.
ఎంతటి ఘోరం నేను చేసింది! ఎంతటి మహాపరాధం!
సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలియకుండా జరిగిపోతుంటాయి. వాటి తాలూకు జ్ఞాపకాలు మాత్రం చిత్రవధ చేస్తాయి. జీవితాలను చిందర వందర చేస్తాయి. అందుకేనేమో ఓ అనుభవజ్ఞుడు జీవితాన్ని యాక్సిడెంట్‌తో పోల్చాడు. ప్రమాదంలో ఏర్పడే గాయాలే జీవితంలో జరిగే విషాదాలు. ఆ గాయాల మచ్చలు ఎన్నటికీ మానిపోకుండా నిరంతరం, జరిగిన ప్రమాదాన్ని తల్చుకుంటూ, మరో ప్రమాదం జరక్కుండా మనల్ని మనం కాపాడుకోడానికి దోహదం చేసే గుర్తులు కాబోలు!
ఏది ఏమైనా ఈ రోజు నా జీవితంలో జరిగింది మాత్రం మేజర్ యాక్సిడెంట్.
జరిగిన యాక్సిడెంట్ నా హృదయానికి చాలా పెద్ద గాయమే చేసింది. ఆ గాయం తాలూకు మచ్చ నామీదే కాదు నా కుటుంబంమీద కూడా శాశ్వతంగా ఉండిపోతుంది.
ఎలా నేనేం చేయనిప్పుడు? ఈ పాపాన్ని ప్రక్షాళనం చేసుకునే మార్గం ఏంటి? తల పగిలిపోయే ఆలోచనలు. పవిత్రమైన స్నేహాన్ని అశాశ్వతమైన, క్షణభంగురమైన శారీరక సుఖంకోసం అపవిత్రం చేసిన అతడిని నేను క్షమించలేను. అలా అని అతనిపైన ఏం చర్య తీసుకోగలను? అతనికే శిక్ష విధించగలను.
నిజం చెప్పాలంటే ఇవాళ జరిగిన సంఘటనలో నా తప్పు ఎంత మాత్రం లేదని నా అంతరాత్మ ఘోషిస్తోంది. ఈ మనిషిని నమ్మడమే నేను చేసిన తప్పు.
ఈ మాట నేనే కాదు విషయం తెలిశాక నాభర్త, నాపిల్లలు, ఈ సమాజమూ కూడా నన్నే నిందిస్తారు. ఎందుకంటే నేను స్త్రీని. స్త్రీకి తరతరాలుగా ఈ సమాజం ఎన్నో పరిమితులు విధించింది. నేను వాటిని అతిక్రమించాను. అందుకే భగవంతుడు నాకీ శిక్షవేశాడు.
ఒక స్త్రీగా సమాజం గీసిన లక్ష్మణగీతని దాటకూడదు. కానీ, దాటాను, యాభైకి చేరువ అవుతూ కూడా అందం పట్ల, ఆకర్షణ పట్ల ఆసక్తి చూపించాను. పెద్దదానిలా, ఓ తల్లిలా, ఇల్లాలిలా హుందాగా ప్రవర్తించకుండా అతనిని రెచ్చగొట్టేలా ప్రవర్తించి ఉంటాను. అందుకే అతను అవకాశం తీసుకున్నాడు. అవును అతను మగాడు. మగాడు, ఆడదానితో పవిత్రమైన స్నేహాన్ని ఎన్నడూ ఆకాంక్షించడన్న నగ్నసత్యం నాకిప్పుడే తెలిసింది. చాలా ఆలస్యంగా తెలిసింది.
అతనికి చనువు ఇవ్వడం నా తప్పు. అవును చనువిచ్చేముందు నేను నా వయసు గురించి, నాకుటుంబ నేపధ్యం గురించి ఆలోచించాను. కానీ, అతని వయసు గురించి నేను ఆలోచించలేదు. బహుశా అదే నేను చేసిన తప్పు కావచ్చు.
అదేంటో ఇంతకాలం నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఆయన నన్ను ప్రేమగా గానీ, మోహంతోకానీ తాకి ఎంతకాలమైంది! వ్యాపారం పనుల్లో తల మునకలుగా ఉంటూ బాగా పొద్దుపోయాక అలసిపోయి ఇంటికి వచ్చే ఆయనకి విశ్రాంతి కలగచేయడమే నా లక్ష్యంగా భావించాను. రకరకాల సమస్యలతో చికాగ్గా వచ్చే ఆయనని, నాచేతి వేళ్లతో సున్నితంగా స్పృశించి, వేళ్లసందుల్లోంచి అనురాగ ధారలు కురిపిస్తూ స్వాంతన కలిగించడమే భార్యగా నాధర్మం అనుకున్నాను. ఆయన నన్ను శారీరక సుఖం కోసం వేధించనే వేధించరు. బహుశా ఆయనకి సంపాదన ధ్యాస తప్ప, సుఖాలపట్ల వ్యామోహం లేకపోడంచేతేమో. నాకు ఆ ధ్యాసే రాలేదు. పిల్లల పెళ్లిళ్లు అయి వాళ్లు రెక్కలు విదిల్చి ఎగిరిపోతుంటే విస్మయంతో చూస్తూ ఉండిపోయాను. వంటరిదాన్ని అయానని విషాదంలో మునిగిపోయాను.
కాని, కానీ, ఇదేంటి ఇలా జరిగిందేంటి? నేను మర్చిపోయాననుకున్న అనుభూతులను అతను తట్టిలేపుతోంటే నా వయసు నాకెందుకు గుర్తురాలేదు. ఆ స్పర్శతో కొత్త లోకాలకి ద్వారాలు తెరిచినట్లు ఎందుకైంది? నేనింత బలహీనురాలినా? ఎలా? ఎలాజరిగింది? ఇంతకాలం కాపాడుకున్న నానైతిక విలువలని ఆ ఒక్కక్షణం నేనెందుకు దిగజార్చాను?
ఎందుకు? ఎందుకలా జరిగింది?
సాధారణంగా ప్రయాణంలో అప్రమత్తం గా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయంటారు.
కానీ, నా జీవనయానంలో ఎంతో అప్రమత్తంగా ఉన్నాను. ప్రతి క్షణం నన్ను నేను కాపాడుకుంటూ, దాదాపు 35 సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా ఉన్నాను ఇలాంటి ప్రమాదాలు ఎన్నెన్నో జరిగే పరిస్థితులనుంచి చాకచక్యంగా బైటపడుతూ ఇవాళ జీవితపు చివరిదశకు వచ్చాను. అనుకుని తృప్తిగా అనుకునేలోగా నా ఆత్మవిశ్వాసం మీదా, నాసిద్దాంతాల పట్లా, నా వ్యక్తిత్వం మీదా దారుణమైన దెబ్బ తగిలింది.
నేనింక నా వాళ్లకెవరికీ మొహం చూపించలేను. ఇంతకాలం నాసిద్ధాంతాలకి, నాలోని విలక్షణమైన వ్యక్తిత్వానికి గర్వపడుతూ బతికిన నేనివాళ ఓ అపరాధిలా నా వాళ్లందరి ముందూ తలవంచుకు నిలబడే స్థితికి వచ్చాను. జరిగిన సంఘటన వలన ఎంతో అన్యోన్యంగా, అపురూపంగా సాగిపోతోన్న నా దాంపత్య జీవితంలో తుపాను రేగుతుంది. నా సంసార నావను తల్లకిందులు చేసి, ముంచేస్తుంది. ఆయన ఎంత మంచివారు? వీధిలోకి వెళ్లినా, ఇంట్లోకి మరొక స్త్రీ వచ్చినా తలెత్తి కూడా చడని గుణాభిరాముడు. అలాంటి రాముడికి నేను భార్యగా ఇంక ఎలా బతకగలను? సీతమ్మలాంటి పవిత్రురాలు పుట్టిన ఈ గడ్డమీద నాలాంటి చపలచిత్తురాలు.. ఛీ, ఛీ నాకింక చావే శరణ్యం. కానీ, కానీ నాకు చావాలనిపించడంలేదు. ఆయన నన్ను క్షమించి చేరదీస్తే ఆయన భార్యగా, ముత్తైదువ గా హాయిగా పిల్లలసమక్షంలో దర్జాగా చనిపోవాలని ఉంది. అయినా నేనిలా ఎలా ఆయాను?
ఓణీలు వేసుకుంటున్న రోజుల నుంచీ నా అందానికి ముగ్థులై, పిచ్చివాళ్ళై నావెంట తిరిగిన ఎందరినో తప్పించుకుని నన్ను నేను రక్షించుకుంటూ, ఓ సంస్కారవంతుడికి ఇల్లాలినై, అతని ప్రేమానురాగాల జలధిలో తలమునకలుగా మునిగిపోయి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. అనుకూల దాంపత్యం, ముత్యాల్లాంటి పిల్లలు. ఇద్దరు పిల్లలు ఇంజనీర్లయారు. మగపిల్లలు కావడంతో ఎక్కువ బాధ్యత కూడా నామీద పడలేదు. పెద్దవాడు తనంతట తానుగా అమెరికా వెళ్లిపోయాడు. భార్యని తీసుకుని. అమ్మా, నాన్నల్ని కనిపెట్టుకుని ఇక్కడ ఏ ఉంటానన్న రెండోవాడిని వాడి భార్య బలవంతంగా లండన్ తీసికెళ్లిపోయింది.
పిల్లలిద్దరూ లేకపోడంతో జీవితం శూన్యంగా మారినట్టనిపించింది.
ఇంతకాలం ఆయన వ్యాపారపనులతో ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఏమీ మాట్లాడని నేను ఆయన్ని వేధించడం ప్రారంభించాను. ఆయన ఎంత ఓదార్చినా వంటరితనం నన్ను భయపెడు తోంటే, ఆయన్ని మూడురోజుల పాటు కదలకుండా ఖైదీని చేశాను. ఇంట్లో.. “ఇలా ఇంట్లో ఎంతకాలం ఉంటాను. బిజినెస్ దెబ్బతింటుంది. నీకేదన్నా వ్యాపకం కల్పిస్తాను, దిగులు పడకు” అంటూ వ్యాపారం అనే వ్యాపకంలో పడేశారు ఆయన. అది ఆయన చేసిన నేరం. ఆనేరానికి శిక్షగా నేనీ వయసులో నైతికంగా దిగజారిపోయాను. పతనమై పోయాను.
ఇంట్లోనే ఉంటూ చేసే వ్యాపారం ఆమ్‌వే ప్రాడక్ట్స్‌కి ఏజన్సీ నావ్యాపారం.
మధ్య, మధ్య మీటింగ్సు అటెండ్ అవుతున్న తరుణంలో పరిచయం అయాడతను. నా కన్నా నాలుగేళ్లు చిన్నవాడు. మొదటిసారిగా వంటరిగా బైటకు వచ్చానేమో, తెలియని విషయాలు చాలలా ఉన్నాయి. తెలుసుకోవాల్సిన ఆవశ్యకతా ఉంది. తెలియచేసే వాళ్ళు కావాలి. అందుకే అతనితో పరిచయం స్నేహంగా మారడానికి ఎన్నోరోజులు పట్టింది చిన్న సందేహం తీర్చుకోవడం కోసం ప్రారంభమైన మీ పరిచయానికి ఇకవై నాలుగ్గంటలే పట్టింది స్నేహం ఏర్పడడానికి, ఆస్నేహంలో కబుర్లు, హాస్యాలు, చర్చలు, ఆ తరవాత హటాత్తుగా అతని మాటల్లో నా అందం పట్ల ప్రశంసలు, నావైపు చూసే అతని కళ్లల్లో నాపట్ల ఆరాధన. అయినా, యాభైఏళ్లకు చేరువైన నేను అతనితో పెరిగిన, పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసి కలవరపడలేదు. కానీ, హటాత్తుగా అతను నా అందాన్ని పొగిడినప్పుడు ముందు నిర్ఘాంతపోయాను తరవాత మురిసిపోయాను.
మీ అందం నన్ను పిచ్చివాడ్ని చేస్తోంది. ఈ వయసులో ఇంత అందంగా ఎలా ఉన్నారు? మీకు ఎదిగిన కొడుకులున్నారంటే నమ్మలేకపోతున్నాను.
పాతికేళ్ల అమ్మాయితో మరో పాతికేళ్ల కుర్రాడు అనేమాట.
నాలో ఆ క్షణం కలిగిన భావానికి నిర్వచనం అందలేదు. సమాధానంగా చిరునవ్వు నవ్వడం తప్పే అయింది. మీ నవ్వు ఎంత బాగుందో తెలుసా. ఎప్పుడన్నా మీ వారు చెప్పారా? చెప్పారా? ఏమో నాకేం గుర్తులేదు. ఎప్పుడో పెళ్లిఅయిన కొత్తలో బహుశా శోభనం రోజు అన్నారేమో ఆ తరవాత జీవితం యాంత్రికం అయింది. కాకపోతే పెళ్లికి ముందు చాలా మంది అన్నారు.
కానీ ఇతను అంటోంటే నాకేదోలా అనిపింపింది. ఎక్కడో మారుమూల అంతరాంతరాల్లో చిన్న ప్రకంపన.
ఈ వయసులో కూడా నేను మగాళ్లని ఆకర్షించగల అందగత్తెనా?
నా అందాన్ని చాలామంది పొగిడారు. అప్పుడెప్పుడూ కలగని స్పందన ఇతను పొగుడుతుంటే అదోలా ఉంది. ఎంత ఒద్దనుకున్నా, అతని మాటలు పదే పదే వినాలన్న కోరిక, సహజ సౌందర్యానికి కొంత మెరుగు పెట్టుకోవాలన్న తపన అనుకోకుండానే నాలో ఏదో మార్పు. ముందు మానసికంగా. ఆ తరవాత అతనితో పరిచయం ఒద్దంటున్నా పెరుగుతోంది. ఆయన పదకొండు దాటితేగానీ ఇల్లు చేరరు. ఆయన పనులలాంటివి. నేనేం చేయగలను? అందుకే వంటరితాన్ని అధిగమించడానికి అతని కంపెనీ బాగానే ఉందనిపించింది.
మీటింగు నుంచి నన్ను అతను తన కారులో డ్రాప్ చేయడం, మధ్య, మధ్య హోటల్స్‌లో కాఫీ, టిఫిను అంటూ తిప్పడం. చిన్న, చిన్న బహుమతులు ఇవ్వడం.
ఓరోజు పిల్లల విషయంలో బాధపడుతోంటే హటాత్తుగా దగ్గరకి తీసుకున్నాడు నన్ను. తమాషా అనుభూతి. ఎంతో కాలంగా మర్చిపోయాననుకున్న మధురానుభూతి. నా భర్త నుంచి కూడా పొందలేకపోయిన పారవశ్యం. ఆరోజే నాకెందుకో భయం వేసింది. నేను పతనం పైపు ప్రయాణిస్తున్న భావన. నా పాతివ్రత్యం మంటగలిసిపోతోందన్న ఆవేదన. మానసిక సంఘర్షణ. ఆరోజే ఆయనతో అన్నాను. ఈ వ్యాపారం మానేస్తానండి. అనవసరంగా కొత్త పరిచయాలు, కొత్త మొహమాటాలు.
“నీ తలకాయ, ఎప్పుడు చూసినా కూపస్థ మండూకంలా ఉంటానంటావే? ఏమైందిప్పుడు నీకేం కష్టం” నాకేం కష్టమో నోరు తెరిచి చెప్పలేకపోయాను. ఇంక ఇప్పుడెలా చెప్పగలను?. జరిగింది కష్టంకాదు. నష్టం. అని ఎలా చెప్పగలను?
నామీద వ్యామోహమో, అతనిలోని కామమో నాకు తెలియదు. ఆ ఒక్క బలహీన క్షణాన్ని క్యాష్ చేసుకున్నాడు. నేను నిశ్చేష్టురాల్నైపోయాను.
అంతా అయాక “సారీ మీ అందం నన్ను వివశుడ్ని చేసింది” అంటూ వెళ్లిపోయాడు.
సారీ! ఎంత ఈజీగా చెప్పి వెళ్ళి పోయాడు. కానీ నాశనం కాబోతున్న నా బతుకు ఈ రెండక్షరాలతో నిలబడగలదా?
కాసేపట్లో ఆయన వస్తారు. చెదిరిన నాజుట్టు నాబొట్టు చూస్తారు. నా వాలకం చూడగానే ఏం జరిగిందో అర్థంచేసుకుంటారు. ఆ తరవాత నా బతుకేంటి? నాపిల్లలకి నేనేం సమాధానం చెప్పాలి?
అలా అని ఏమీ జరగనట్లు ఎప్పటిలా ఆయన్ని స్వాగతించనా? పిల్లలతో ఎప్పటిలా ఉండగలనా? నా అంతరాత్మకి నేనేం సమాధానం చెప్పాలి? చెప్పినా నాజీవితం నేనే చేతులారా నాశనం చేసుకోనా? నో! అలా జరక్కూడదు.
నేను ఏం జరగనట్టు చిరునవ్వుతో ఆయనకి స్వాగతం పలకాలి. ఈ తప్పే ఆయన వల్ల జరిగితే ఆయన మనసులో ఇంత ఘర్షణ జరిగేదా? అయితే ఆయన ఇంతవరకు శ్రీరామచంద్రుడిలానే ఉన్నారా? ఏమో!నాకు తెలియదేమో. ఏదన్నా జరిగే ఉంటుందా? ఛీ, ఛీ ఏంటి? ఆయన్ని అనుమానిస్తున్నాను సిగ్గులేకుండా. కామెర్లరోగిలా .ఛ. ఎంత దిగజారిపోతున్నాను!
నేను ఇంకా, ఇంకా దిగజారకుండా ఉండాలంటే నాకు ఆయన అండ కావాలి. ఈ ఇల్లు కావాలి. నా పిల్లల ప్రేమ కావాలి. అవును నేను నా ఈ సంసారం అనే కంచుకోటను వదులుకోకూడదు. అందుకే ఏం జరగనుట్టు ఉండాలి. ఈ కంచుకోట దాటానంటే నా బతుకు బజార్నపడుతుంది. బంధువుల్లో సుగుణవతిగా, శీలవతిగా పేరుపొందిన నేను ఇప్పుడు పతితగా భర్తచేత త్యజించబడి వీధులపాలవనా? పిల్లల్ని చూడకుండా, ఆయన లేకుండా బతకగలనా? ఏం చేయను? ఏం చేయను? ఘర్షణ, సంఘర్షణ.
అవును తప్పదు నా సంసారం నాశనం కాకుండా ఉండాలంటే ఆయన్నీ వంచించాలి. నన్ను నేను వంచించుకోవాలి. తప్పదు. ఈ యాభై ఏళ్ల వయసులో తల్లికాలు జారిందంటే పిల్లలు క్షమిస్తారా? క్షమించరు. అందుకే ఏంజరగనట్టే ఉండాలి.
అలా అని చెప్పకుండా ఎలా? ఇన్నేళ్లుగా మామధ్య దాపరికాలే లేవు. ఎంతో నిజాయితీతో కూడిన సంసార జీవితం నాది. నేనిప్పుడు తప్పుచేశాను. చేసిన పాపం చెబితే పోతుందట. ఆయనకి చెప్పి ఆయన ఓదార్పులో నన్ను నేను ప్రక్షాళనం చేసుకోవాలి. ఆయన తప్పకుండా క్షమిస్తారు. నా సహచరుడు ఇంతకాలం తనకి సేవలు చేస్తూ, సుఖాన్ని ఇస్తూ, తన తల్లి, తండ్రులని కంటి రెప్పలా కాపాడుతూ, తన పిల్లల్ని కనిపెంచి వృద్ధిలోకి తీసుకొచ్చి తన వంశాన్ని నిలిపినందుకు నేను చేసిన ఈ తప్పును ఒక యాక్సిడెంట్‌గా భావించి క్షమిస్తారు. అవును క్షమిస్తారు. ఆయన క్షమించాకే లోపలికి వెడతాను. అప్పుడే మరోసారి ఈ ఇంట్లోకి ఆయనతో కలిసి కుడికాలు పెడతాను తప్పదు లేదంటే ఓ న్యాయమూర్తిగా ఆయన నాభవిష్యత్తుకి ఇచ్చే తీర్పుని శిరసావహిస్తాను. ఆయన విధించే శిక్ష ఏదైనా సరే భరిస్తాను.
అదిరే గుండెలతో, అంధకారం అలముకున్న నా భవిష్యత్తులో చిరువెలుగుకోసం వెతుక్కుంటూ ఆయనకోసం ఎదురుచూస్తూ ఆ చీకట్లో, ఆ మంచులో అలాగే నిలబడిపోయాను.
ఆ క్షణం రానేవచ్చింది.
ఆయన వచ్చారు. కారు చప్పుడైంది.
నాకాళ్లు శిలలై స్థంభించిపోయాయి. గుండెల్లో ఫిరంగులు మోగుతున్నాయి. కళ్లల్లోంచి వేడి రక్తం బొట్లు, బొట్లుగా ధరణిగుండెల్లోకి జారి ఆ గుండెల్ని చీలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. గాలి, గాలి హా హారాలు చేస్తున్న ధ్వని ఆయన బూట్ల శబ్దం ఆ నిశ్శబ్దంలో భయంకరంగా వినిపించసాగింది.
శిలకి చైతన్యం వచ్చినట్టు కొద్దిగా కదిలి, బలవంతంగా అడుగులు వేస్తూ వీధి వైపు బాల్కనీలోకి నడవసాగాను.
ఆయన కారు పార్క్ చేసి, తాళంచేతులు విలాసంగా తిప్పుతూ, మరోచేత్తో సెల్ పట్టుకుని హుందాగా నడిచివస్తున్నారు. ఆ నడకలో రాజసం. హటాత్తుగా సెల్‌ఫోన్ మోగింది.
నేను ఊపిరి బిగపట్టి, నన్ను నేను కూడదీసుకుంటూ, ఆయనతో మాట్లాడడానికి అక్షరాలు వెతుక్కుంటుంటే, దగ్గరగా, మరీ దగ్గరగా ఆయన గంభిరమైన స్వరం సరదాగా వినిపిస్తోంది. “ఏయ్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు. నీ దగ్గర్నించి బయలుదేరి అరగంట కాలేదు. అప్పుడే విరహమా? రేపు వస్తాగా.. ష్యూర్. నీదగ్గరకు రాకుండా నే నేను బతకగలనా? ఓకే డార్లింగు బై గుడ్ నైట్..”
డమాల్, ఢమాల్, ఢమాల్ విస్పోటనాలు.. నెత్తిన, సరిగా నా నడి నెత్తిన విరిగిపడుతున్న కొండచరియలు కళ్లముందు పరచుకున్న చీకటి తెరలు, తెరలుగా విడిపోతూ.. మంచు ముద్దల్లా నామీదే పడుతున్న భావన ఆయన అడుగుల శబ్దం దగ్గరైంది. హటాత్తుగా నాశరీరం చలితో వణకడం ప్రారంభించింది.
నిశ్శబ్దంగా, నిర్జీవంగా లోపలికి నడిచాను.