– ఎ. విద్యాసాగర్
ఏటికేడు బతుకు గోడు
ఏళ్ళకొద్ది బతకుబీడు
ఎన్ని బాధలమ్మ తల్లీ
ఎంత వేదనమ్మ తల్లీ!
నువ్వేదో వస్తావని కొత్త బతుకు తెస్తావని
ఎన్ని ఆశలమ్మ తల్లీ!
* * *
ఉన్న కాస్త భూమి చెక్క ఉండెనో ఊడేనో!
వల్లపోడు దోచెనని ఉడిగి పోయి ముసలి తండి
బంక జిగుళ్లేరుకొచ్చి బతుకు బండి లాగాలని
అడివికెళ్ళె బక్క తల్లి
జంగ్లాతోళ్లు జడిపిస్తే పోలీసులు కస్సుమంటే
ఎంత వేదనమ్మ తల్లి!
* * *
పదిలోనే తప్పి నేను పని కోసం వెదుక్కుంటూ
పివోసారు దగ్గరెళ్తె చదువు పూర్తి చేయమనె
చదువు రాదు
కొలువు రాదు
పైసల్లేక పట్నంలో పని లేదని తెలిపొయె!
* * *
నేలతల్లి నీడ చేరి తల్లిదండుల్ర జూసుకుంట
సొంత ఊళ్ళో ఉందామని డాంబరోడ్డ్రు నొదిలి పెట్టి
కాలిదారి బట్టాను
అడివి దారి బట్టాను
దారంతా గుబులమ్మా!
గుబురు లాంటి దిగులమ్మా!
గుండె నిండ కలలమ్మా!
* * *
గూడేనికి నీళ్ల బోరు నీ తోటే వస్తదనీ
ఊరిపైగ వెళిపోయె దేవతంటి కరెంటులైను ఊళ్లోకి వస్తుందనీ
భూమి తల్లి గొందు దడప ‘డిల్లి’ బోరు వస్తదనీ
కొన్నాళ్ళకు మా వూరికి సింగిల్ స్కూల్ వస్తదనీ
అందులోనే నాకేదో ఉద్జోగం వస్తదనీ
మా యింట్లో బతుకు మారి
ఆశలతో తరం మారి
మాకు మేమే నాయకులై మును ముందుకు పోతామని
ఎన్ని ఆశలమ్మ తల్లి!
నువ్వెదో వస్తావని కొత్త బతుకు తెస్తావని
ఎన్ని ఆశలమ్మ తల్లి!
(జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)
బాగుంది
చాల బాగు0ది బతుకు ఆశా థా0క్