– ఉదయమిత్ర
“నిన్ను చూడ్డానికి వొస్తున్నారే!” అంటే చాలు
తెగ గాబరపడిపోయి
అద్దంముందు వయసును సరిచేసుకుని
ఉబికి వొచ్చే ప్రశ్నల్ని పంటికిందతొక్కిపట్టి
చిర్నవ్వుతో, నమత్రతో
చూడొచ్చిన పెద్దలందరికీ
చూపుల్తో గుచ్చే గద్దలందరికీ
స్వీట్లో, చాయలో ఇవ్వడం తప్ప
దానికేం కోరికలుంటాయమ్మా!
ముక్కు సొట్టవాడయితేనేం?
ముఖం నిండా గుంతలుంటేనేం?
బండపెదాలవాడయితేనేం?
బద్మాష్ గాడయితేనేం?
అడ్డమైన వాళ్లందరి ముందూ
నా బిడ్డ
నిలువెత్తు చదువులో, సంస్కారంతో పెంచిన నాబిడ్డ
ఒదిగి కూర్చోవడం తప్ప
దానికేం కోరికలుంటాయమ్మా!
ఒళ్లంతా తెగ చెమటలు పడ్తోంటే
నోచ్చిన వాళ్ళందరిముందు
అదొక సర్కస్ జంతువయిపోయి
అరిగిపోయిన రికార్డుల్లాంటి ప్రశ్నలకు
అంతే భదంగా జవాబులు చెప్పడం తప్ప
అదేం ఎదురు ప్రశ్నలడుగుతుందమ్మా…
నిన్నటి దాంకా
ఆడీ పాడీ, చదివీ నేర్చీ
ఒరిసి పారిన జీవితాన్ని ఘనీభవింపజేసుకు
వొకచటంలో బిగించుకు
వొచ్చిన వాళ్లందరిముందు
మైనపు ముద్దయి కూచుని
వొక భయంకర నిశ్శబ్దాన్ని నెత్తిన మోసుకొని
అన్ని పరీక్షల్ని అవలీలగ దాటి
ఈ ‘ఒక్క’ పరీక్షకాడనే తడబడే నాతల్లి
ఆచూపుల తతంగం పూర్తయ్యాక
అవతలకి జారుకొని
వాళ్ల మాట కోసం ఎదురు చూడ్డం తప్ప
దానికేం కోరికలుంటాయమ్మా!
(ఆడపిల్లల్ని గన్న తల్లిని నేను ఈ పెళ్లి చూపులనేర్పాటు జేసిన వాళ్లని నర కాలంటాను.)
excellent……. ammayila manasu pade vedanani adbutanga tana kavita lo chepparu