”మీ కథ ‘ఇల్లలకగానే’ భలే వుందండి. చాలా అద్భుతమైన కథ రాసారండి”. ఈ ప్రశంసని అప్పనంగా చాలాసార్లు కొట్టిసాన్నేను. ఎన్నో సమావేశాల్లో పి. సత్యవతికి, కె. సత్యవతికి తేడా తెలియని వ్యక్తుల నుండి ఈ కామెంట్ విన్నాను. ఓ లిప్తకాలం గొప్ప సంతోషం. ఆ తర్వాత ”ఆ కథ రాసింది నేను కాదండి పి. సత్యవతిగారు, విజయవాడలో వుంటారు. ”అవునా! మీరే అనుకున్నా సారీ ‘ఫర్వాలేదులెండి’ అంటూ నవ్వేస్తాను. ఇలా చాలాసార్లు జరిగింది. అంత చక్కటి కథ రాసిన సత్యవతిగారి ఇంటిపేరు ‘పి’ గానీ ‘ఇల్లలకగానే’ సత్యవతిగానే చాలామందికి తెలుసు.
పి. సత్యవతిగారు నాకున్న కొద్దిమంది ఆత్మీయుల్లో ఒకరు. ఏ సమయంలోనైనా ఫోన్ చేసి, మనసువిప్పి మాట్లాడుకోగలిగిన చనువున్న ఆత్మీయురాలు. మాట్లాడడం మొదలు పెట్టగానే ఆవిడ నవ్వు తెరలు తెరలుగా చెవుల్ని తాకుతూంటుంది. కల్మషం లేని సంభాషణలు, తూకాలు వెయ్యని, తరగని మాటలు మా మధ్య ఎప్పుడూ కొనసాగుతుంటాయి..ఏడు పదుల వయస్సులో ఆవిడ హైటెక్ ప్రపంచాన్ని కైవశం చేసుకున్న తీరు, ఇంటర్‌నెట్‌ని, టెక్నాలజీని వాడుకుంటున్న పద్ధతి మహాద్భుతం. అనితర సాధ్యం. చాలామంది రచయిత్రులకి ఇమెయిల్ ఇవ్వడం కూడా తెలియని చోట పి. సత్యవతి వార్తాపత్రికలు, నవలలు, ఎన్నో వ్యాసాలు నెట్ మీద సునాయాసంగా చదివేస్తారు. టకటకటైప్ చేసి వ్యాసాలు క్షణాల్లో భట్వాడా చేసేస్తారు.
సత్యవతిగారి వ్యక్తిత్వం డాబూ, దర్పాల్లేకుండా ఎలాంటి సంక్లిష్టతలూ లేకుండా తేటగా, నీటుగా వుంటుంది. మనసులో ఒకటి, మాటలో మరొకటి లాంటి దాపరికాలు ఆవిడ డిక్షనరీలో లేవు. గలగలా మాట్లాడ్డం, కిలకిలా నవ్వడం ఆవిడ సొత్తు. ఆ నవ్వు కూడా పెదవి అంచుల్లోంచి కాకుండా గుండెలోతుల్లోంచి వస్తుంది. బహుశా ఈ విషయం చాలామందికి అనుభవంలోకి వచ్చే వుంటుంది.
ఇంక ఆవిడ సాహిత్య సృజన గురించి ఎంత రాసినా తక్కువే. ఆరు నవలలు, నాలుగు కథా సంకలనాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఎన్నో అనువాదాలు చేసారు. ”రాగం – భూపాలం” పేరుతో భూమికలో రాసిన కాలం చాలా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ”స్వాతంత్య్ర నంతర తొలి కథా రచయిత్రల” మీద సత్యవతిగారు రాసిన వ్యాస పరంపరలు పిహెచ్‌డి ప్రకటించా ల్సినంత గొప్ప స్థాయిలో వున్నాయని చాలామంది చెప్పడం గమనించాల్సిన అంశం.
ప్రతిమ రాసినట్లు ”పరిణామక్రమంలో వున్న స్త్రీని ఆమె చైతన్యాన్ని గుర్తించి, గుర్తింపచేసిన కథ ”ఇల్లలకగానే..” నిజానికి ఈ కథ స్త్రీవాద సాహిత్యానికి తలమానికం వంటిది. ఆత్మవిధ్వంశానికి పరాకాష్ట అయిన ఆత్మవిస్మృతిని.. తనను తాను పారేసుకోవడాన్ని గురించి మౌఖిక శైలిలో నడిచిన ఈ కథ, స్త్రీ తన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఎలా ఎప్పుడు, ఎక్కడ జారవిడుచుకున్నదో వెతుక్కుంటూ వెళ్ళడాన్ని ఇల్లలుకుతూ పేరు మార్చిపోయిన శారద రూపంలో ఎంత సింబాలిక్‌గా చెప్పారంటే సాహితీ ప్రపంచంలోని ఏ స్త్రీనయినా సరే అర్థరాత్రి లేపి అడిగితే ఈ కథ చెప్పగలిగేంతగా…చైతన్యవంతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందీ కథ.”
భూమిక కవర్ పేజీ మీద మీ ఫోటో వేస్తానంటే అమ్మో! ఎందుకండీ అంటూ సిగ్గుపడిపోయిన నిరాడంబరత ఆవిడ అడ్రస్. ఒకటీ అరా రాసి ఎగిరెగిరి పడుతున్న కొంతమంది అత్యుత్సాహ రచయిత్రు/తల పక్కన ఆవిడని నిలబెడితే చాలా భిడియంగా ఇంకా బాగా చదవాలి, స్త్రీ జీవితాలను అధ్యయనం చెయ్యాలి, ఇంకా చాలా రాయాలి అంటారు. సుశీలా నారాయణరెడ్డి అవార్డు అందుకున్న సత్యవతిగారిని ఇంతకు ముందు బోలెడన్ని అవార్డులు వరించాయి. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి అవార్డ్, కొండేపూడి శ్రీనివాస్‌రావు అవార్డ్, తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారం, యగళ్ళ రామకృష్ణ అవార్డ్‌లతో పాటు ఫిబ్రవరి 2012లో మల్లెమాల అవార్డు అందుకోబోతున్నారు. ఆత్మీయ మిత్రురాలికి భూమిక అభినందనలు తెలుపుతోంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
నేర్చుకోవాలి, చెయ్యాలి అన్న తపన ఉన్నంతకాలం, వయసు ఓ అడ్డంకి కాదని చెప్తున్నట్లనిపించింది, సత్యవతి గారి గురించి చదువుతుంటే. చాలా బావుంది. ఇల్లలకగానే సత్యవతి గారి కి మా నమస్సులు శుభాకాంక్షలు.
ఆవిడ రచనలను, ఆవిడగురించి మాకు వివరాలు అందించిన భూమిక( అలా నేను గుర్తుంచుకున్నాను) సత్యవతి గారికి ధన్యవాదాలు.
చాలా సంతోషం. వయసులోనూ అనుభవంలోనూ ఎంతో చిన్నవాళ్ళకి కూడా తన సాటిస్థాయి యిచ్చి మాట్లాడ్డం చాలా కొద్దిమందికే చేతనవుతుంది. అలాంటి కొద్దిమందిలో సత్యవతిగారొకరు. వీళ్ళతో కాసేపు గడిపి కొన్ని ముచ్చట్లాడుకుని బయటికి వస్తే నాలాంటి ఏమీ తెలీని వాడిలో కూడా ఏదో చిన్న ఆత్మవిశ్వాసం మొలకెత్తుతుంది. నా కథల పుస్తకం ఆవిష్కరణసభలో సత్యవతిగారు మాట్లాడ్డం ఆమె నాకిచ్చిన అపురూపమైన కానుక.
బైదవే .. కే. సత్యవతిగారూ, డెబ్భై పదుల్లో?? 🙂
అచ్చు తప్పు దిద్దాను.ధన్యవాదాలండి.
నిజంగానే ‘ఇల్లలకగానే చదివిమర్చిపోలేనికధ.ఎపుడో చదివిన ఆ కధ ఇప్పటికీ బగ గుర్తే. ”రాగం – భూపాలం”
కుడా మంచి శీర్షిక. పి.సత్యవథి ముఖచిత్రం పరిచయం చాలాబాగుంది.