మృణాలిని
పి. సత్యవతి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం. అది కేవలం మనసును తాకే అనుభవం మాత్రమే కాదు. మనసును తాకి, మెదడును మేల్కొలిపే అనుభవం. ఆ కథల్లో అసాధారణమైన వస్తువులుండవు, అద్భుతమైన పాత్రలూ ఉండవు. కానీ మనల్ని గురించి మనకు చెప్పే ఎన్నో విశేషాలుంటాయి. మనల్ని మనం తెలుసుకునేందుకు ఉపకరించే ఎన్నో సూత్రాలు లభిస్తాయి. ఆమె రాసిన నాలుగు కథాసంపుటాలను పరిశీలిస్తే, స్త్రీవాద సాహిత్యంలోని అన్ని కోణాలూ కనిపిస్తూనే అదనంగా మరెన్నో రేకెత్తుతాయి. ఆమె కథల్లో ఆదర్శాలు, ఊహాలు ఉండవు. వాస్తవికత పునాదులను ఎప్పటికీ వదలకుండా, ఏ అనూహ్య నిర్ణయాలు, పరిణామాల జోలికి పోకుండా, స్త్రీ పురుషులు మారవలసిన అవసరాన్ని, విధానాన్ని చెప్పడం ఆమె పద్ధతి.
సాధారణంగా స్త్రీవాద సాహిత్యంలో కనిపించే వ్యవస్థ మీద తిరగబడే పాత్రలు (‘గోవు’ లో గోమతి, రత్నపాపలో రత్న,కాడిలో దుర్గ మొ.) వ్యవస్థకు బలయ్యే పాత్రలు (ఆకాశంబుననుండి, భద్రతిత్యాదులు) యథావిధిగా ఇందులోనూ ఉన్నాయి. కానీ వాటి వెనుక అంతర్లీనంగా కనిపించే సామాజిక పరిణామం, విభిన్న తరాలు, వర్గాల మనస్తత్వాల విశ్లేషణ అబ్బుర పరుస్తాయి.
సత్యవతి రాసిన నాలుగు కథాసంపుటాల నేపథ్యంలో ఆమె సాహిత్య ప్రమాణాలను అర్థం చేసుకోడానికి ఈ వ్యాసం ఓ చిన్న ప్రయత్నం.ఆమె కథా సంపుటాలు – సత్యవతి కథలు 12 కథలు, ఇల్లలకగానే 15 కథలు,,మంత్రనగరి12 కథలు, మెలకువ15 కథలు
ఈ 54 కథలలోనూ ‘రత్నపాప’ అన్న కథ రెండు సంపుటాల్లో ప్రచురింపబడింది కనుక, 53 కథలుగా పరిగణించవచ్చు. వీటిలోనివన్నీ గొప్ప కథలు కాకపోవచ్చు.కానీ అన్నీ మంచి కథలు, కొన్ని గొప్ప కథలు (మాఘ సూర్యకాంతి, ఇల్లలకగానే, రత్నపాప, ఆకాశంబుననుండి, తాయిలం. గోధుళివేళ, గోవు, మంత్రనగరి, సూపర్‌మామ్ సిండ్రోమ్, పెళ్ళి ప్రయాణం, భాగం, భారవాహిక, కాడి..) ఆ మంచి, గొప్ప కథల ”జీవితం” మనం చదివే పది నిమిషాలు కాదు, గుర్తుండి పోయే అనంతకాలం.
సత్యవతి కథల్లో స్త్రీ ప్రధానం. కానీ ఆమె కేవలం సమకాలీన నగర స్త్రీ కాదు. మధ్యతరగతి స్త్రీ మాత్రమే కాదు. చదువుకున్న స్త్రీయే కాదు. వీరందరితో పాటు స్త్రీలు, నిర్లక్షరాస్యులు, గ్రామీణ నిమ్నకులాల స్త్రీలు కూడా. మూడు నాలుగు పేజీల కథల్లో మూడేసి తరాల జీవితాలను వారి బాల్యం నుంచి ప్రస్తుత స్థితి వరకు వివరించడం, వారి కుటుంబంలోని ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలు ఆ స్త్రీల అణచివేతను కొనసాగించిన క్రమాన్ని, ఆ స్త్రీల ఆలోచనల్లో, ఆచరణలో రావలసిన మార్పులను అత్యంత శక్తివంతంగా చిత్రించడం ఆమె రచనా నైపుణికి నిదర్శనం. ఈ మూడు తరాల స్త్రీలు గత 60 ఏళ్ల తెలుగు జన జీవన సంప్రదాయాలకు ప్రతినిధులు.
ఈ మూడు తరాల్లో మొదటి తరం – ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే 60-80 మధ్యవారు. వీరు జీవితాన్ని యథాతథంగా స్వీకరించిన వారు. తాము ఆనందంగా ఉన్నారో లేదో ఎన్నడూ ఆలోచించనివారు. రెండోతరం- పాతభావాల నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించే అమిత ఘర్షణకు గురయిన, గురవుతున్న తరం. మధ్య వయస్కులైన భార్యలుగా, అత్తలుగా, తల్లులుగా తాము కొత్త ఆదర్శాలను ప్రవేశపెట్టాలనుకునే తరం. వీరే ఈమె కథల్లోని ప్రధాన పాత్రలు, మాఘ సూర్యకాంతి కథతో తన మార్గం స్పష్టమయిందని రచయిత చెప్పడంలో ఇదే ఇమిడి వుంది. మూడో తరం అమ్మల ప్రగతి శీలకమైన పెంపకం వల్ల స్వేచ్ఛ కలిగి, సొంతనిర్ణయాలు తీసుకోగలిగే క్రమంలో విజయం సాధించినవారు, తమ ముందు తరాలను అర్థం చేసుకోవలసిన అవసరాలను తెలుసుకున్నవారు ఇందులో ఉన్నారు. అదే సమయంలో ఆ జ్ఞానమేమీ లేకుండా, ఆధునిక జీవిత వ్యామోహంలో గమ్యం లేకుండా పడి కొట్టుకుపోతున్నవారూ ఉన్నారు. చాలా కథల్లో ఈ మూడు తరాలూ ఉండడం విశేషం. ఒక్కో కథలో వీరిలో ఒకరి కోణం ప్రధానం కావచ్చు.
మాఘ సూర్యకాంతి రచించిన నాటి నుంచీ తనకు తన రచనల లక్ష్యం తెలిసిందని చెప్పుకున్న సత్యవతి అన్ని అనుబంధాలను, కుటుంబాన్ని, సమజాన్ని స్త్రీ పురుషులిద్దరూ స్త్రీల కోణం నుంచి చూడాల్సిన అవసరాన్ని తన రచనలన్నిటిలోనూ చెప్పారు. అలాంటి పురుష పాత్రలనూ సృష్టించారు, (బదిలీ, పెళ్ళి, ప్రయాణం)
మొత్తంగా చూసినపుడు వీరి కథల్లో ఏ రకమైన సందేశం ఉందన్న ప్రశ్నకు సమాధానం వెతకాలి. ఒక విధంగా ఆలోచిస్తే ”విముక్తి” అన్న పదాన్ని ఆమె ఎక్కడా వాడలేదు కానీ, ఆమె తన కథల ద్వారా చెప్పిన సందేశం విముక్తి సాధనే అనిపిస్తుంది.
ఏ రకమైన విముక్తి గురించి ఆమె మాట్లాడింది? అని ఆలోచిస్తే స్థూలంగా మూడు రకాలు తోస్తాయి.
1. స్త్రీలు ఆర్ధిక సంకెళ్లనుండి, మానసిక సంకెళ్లనుంచి, సామాజిక సంకెళ్ళనుంచి సాధించాల్సిన విముక్తి గురించి
2. స్త్రీలు తమలో తరతరాలుగా పాతుకుపోయివున్న త్యాగశీలత నుంచి సాధించవలసిన విముక్తి గురించి 3. స్త్రీ పురుషులిద్దరూ వస్తు వ్యామోహ సంస్కృతి నుంచి సాధించాల్సి విముక్తి గురించి. ఆర్థిక స్వాతంత్య్రం సాధించినంత మాత్రాన స్త్రీలు మానసిక స్వాతంత్య్రం సాధించినట్టు కాదు. ప్రధానంగా ఎమోషనల్ డిపెండెన్స్ స్త్రీలను అన్ని రకాల పరిస్థితులతోనూ రాజీ పడేలా చేస్తుంది. ఆ ఆధారపడ్డం తండ్రి మీద కావచ్చు, అన్న మీద కావచ్చు భర్త మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు అనుబంధం రూపంలో ఉండే దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. ”భాగం” కథలో అన్నగారు కోరినట్టు శారద తను తన వాటా ఆస్తి ఇవ్వడానికి నిరాకరించాలని నిర్ణయించుకోవడంలో ఆర్థిక కారణం కంటే మానసిక కారణమే బలమైనది. ”నాన్న తనకి, తన పేరు మీద సర్వ హక్కులతో ఒక నివాసం ఇచ్చాడు. ఎప్పుడైనా వెళ్లి రెండు రోజులు గుండె నిండా ఊపిరి తీసుకోడానికి. మొన్నటి ఆవేశంలో ”కాగితం తిరిగిచ్చేద్దాం. అన్నయ్యా, వదినా మాట్లాడితే చాలు’ అనిపించింది. కానీ ఇప్పుడలా అనిపించడం లేదు’ అని రాయడంలో శారద తన పట్ల ఏ గౌరవమూ చూపని తన కుటుంబ సభ్యులను తిరస్కరించగల ఒక మానసిక స్వేచ్ఛను పొందింది.
సాధారణంగా స్త్రీవాద సాహిత్యంలో ఎక్కువ కనిపించని కోణం స్త్రీలలోని ఆత్మవంచన. దీనిని ఎంతో సమర్ధంగా చెప్పడం సత్యవతి ప్రత్యేకత. సమాజం తమకు అయాచితంగా ఇచ్చిన ‘త్యాగమయి’ ‘ఉత్తమ ఇల్లాలు’ వంటి బిరుదులను సార్ధకం చేసుకుని, అందులో ఆనందం ఉందని ఆత్మవంచన చేసుకునే స్త్రీలను తీవ్రంగా విమర్శిస్తుంది సత్యవతి కలం. సూపర్‌మామ్ సిండ్రోమ్ – చీమ,దేవుడు.,గాంధారి రాగం, పునాది, ఒక రాజ్యం కథ – వీటన్నిటిలోనూ ఇలాంటి స్త్రీలను ఆమె మన కళ్ళెదుట అత్యంత వాస్తవికంగా చూపుతారు. తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ, కుటుంబానికి సేవ చేయడమే జీవితాశయంగా, అదే తమకు గొప్ప ఆనందం కలిగించేదిగా తమని తాము మధ్యపెట్టకుంటూ, సమాజాన్ని మధ్య పెడుతూ జీవించే స్త్రీలకు ఈ దేశంలో ఏమి కొరత లేదు, ఇటువంటి సూపర్‌మామ్‌లకు సత్యవతి తీవ్ర హెచ్చరిక చేస్తారు. స్త్రీలు సమానత్వాన్ని, సాధికారతను సాధించడంలో ఈ ప్రవృత్తి ఎలా అడ్డుపడుతున్నదీ ఈ కథలు చదివితే తెలుస్తుంది. ఇటువంటి స్త్రీలు అనాలోచితంగా పితృస్వామాన్ని మరింత బలపరుస్తున్నారని గుర్తించడం సత్యవతి లోతైన అవగాహనకు నిదర్శనం. పితృస్వామాన్ని మరింత బలపరుస్తున్నారని గుర్తించడం సత్యవతి లోతైన అవగాహనకు నిదర్శనం. పితృస్వామ్య వ్యవస్థ నిలబడేందుకు స్త్రీలు తమకు తెలియకుండానే ఎంతగా దోహదం చేస్తున్నారో ఈ కథలు చెప్తాయి. దీనికి మంచి ఉదాహరణ సూపర్ మామ్ సిండ్రోమ్ కథ. ఇందులోని అనూరాధ కథ చాలామంది ఆధునిక తల్లులకు కనువిప్పు. ఈ కథ చివరలో పక్కింటి అమ్మాయి తన తల్లిని కాపాడుకోవాలనుకోవడం గొప్ప ముగింపు. ఈ ప్రవృత్తి నుంచి స్త్రీలకు విముక్తి చాలా అవసరం.
మూడవ విముక్తి అత్యంత సమకాలీనమైన పరిణామాలకు సంబంధించింది. ఈ రోజుల్లో అన్నింటికంటే గొప్ప బంధం ఆర్థిక బంధం. వ్యాపార సంస్కృతి మీద సత్యవతికి ఉన్న చిరాకు చాలా కథల్లో బయటపడుతుంది. ఆస్తి అన్నది రక్త సంబంధాన్ని ఎలా కనుమరుగు చేస్తుందో, ఆస్తి సంపాదన అన్నది నేటి యువతీ యువకులను ఎలా మరమనుషులను చేస్తుందో స్పష్టంగా చూపించారు సత్యవతి. మనుషుల్లో పెరుగుతున్న కన్సూమరిజంను ఆమె చాలామంది కథకులకంటే చాలా ముందుగానే తన కథల్లో ఖండించారు. ‘నేనొస్తున్నాను’ కథ ఇందులో తలమానికమయినదైతే, ”మంత్రనగరి” ఆర్థిక మాయాజాలాన్ని గొప్పగా వ్యాఖ్యానిస్తుంది. సంపదకు అలవాటుపడిన కొడుకు తల్లిదండ్రులను, పెరిగిన మూలాలను మరచి వెళ్లడం చాలా సహజమని (వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు) కూడా సత్యవతి చూపిస్తారు.
అయితే, ప్రపంచం ఇంత డబ్బుమయంగా మారిపోతున్నా, స్త్రీలు మాత్రం పిత్రార్జితంలో తమ హక్కు కోసం పోరాడనిదే జరగడం లేదు. ఈ ద్వంద్వనీతిని ఆమె ఎండగట్టారు. అసలు తెలుగు కథా సాహిత్యంలో స్త్రీల ఆస్తి హక్కుల గురించి ఇంత రాసిన రచయిత్రి ఎవరూ లేదు. స్త్రీలకు ఈ విషయంలో ఆలోచనను, ఆచరణను పెంచే విధంగా సాగుతుంది ఆమె రచన. తన ఆస్తిని తను కాపాడుకోవడంలో స్త్రీలు చూపాల్సిన చొరవని, ధైర్యాన్ని చెబుతాయి. ఒక వసుంధర అన్న కథలో ఆర్థిక రక్షణ స్త్రీ జీవితంలో ఎంత ప్రధానమయిందో రచయిత విశ్లేషిప్తారు. ఆడవాళ్ళ శ్రమకు విలువ లేదనీ, ఏ శ్రమ అయినా డబ్బులోకి మారినప్పుడే విలువ అనీ చెప్పే ఈ పరిస్థితి 60 ఏళ్ళ వయస్సులోనూ సంపాదించడానికి వసుంధర వంటి వారిని ప్రేరేపిస్తుందనీ చెప్పే కథ. ఒక వైపు యువతీ యువకులు డబ్బు సంపాదనే పరమ ధ్యేయంగా జీవిస్తోంటే మరో వైపు, ఎందరో స్త్రీలు కనీస జీవనం, ఉపాధి లేకుండా, ఆర్థిక స్వావలంబన కోసం పోరాడవలసిరావడం ఆధునిక యుగంలోని గొప్ప వైరుధ్యం. ఈ రెండింటినీ చిత్రిస్తూ, అందులో స్త్రీలు నిర్వహించవలసిన పాత్రను వ్యాఖ్యానిస్తే, సామాజిక వాస్తవికతను తన రచనల్లో రంగరించారు సత్యవతి. ఇలాంటి కథల్ని మొత్తంగా చూసినపుడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక పరాధీనతనుంచి, వస్తు వ్యామోహం నుంచి విముక్తి సాధించాలని సూచించారు సత్యవతి. స్త్రీ పురుషులు ఈ మూడు రకాల విముక్తులను సాధించగలిగితే మానవీయతే మనుషుల మధ్య ప్రధాన బంధం కాగలదని రచయిత ఆశించినట్టు అనిపిస్తుంది.
విలక్షణ కథనం: సత్యవతి తన కథల్లో వస్తువు విషయంలో ఎంత స్పష్టత, నిబద్ధత చూపారో, రూపం విషయంలో అంతే సృజనాత్మకత ప్రదర్శించారు. అలా రెండూ ఉన్నత స్థాయిలో ఉన్న వాటినే ఆమె గొప్ప కథలుగా చెప్పుకోవచ్చు. స్త్రీవాద సాహిత్యానికి అస్తిత్వ వేదన అనే కోణాన్ని అత్యంత ప్రతిభావంతంగా తన ”ఇల్లలకగానే’ లో ఆవిష్కరించిన సత్యవతి ‘గోధూళివేళ’ కథద్వారా సిద్ధాంతాలను ఎంత గొప్ప నెరెటివ్‌గా మలచవచ్చో నిరూపించారు. అలాగే సూపర్ మామ్ సిండ్రోమ్‌లోనూ, మంత్రనగరిలోనూ, స్త్రీల జీవితంలోని విషాదాన్ని మేజిక్ రియలిజం ద్వారా అద్భుతంగా మన కళ్లెదుట నిలబెట్టారు. బ్రహ్మపదార్థంలా చాలామంది వర్ణించే మేజక్ రియలిజంను ఖబిశిశినీలిగీ ఐశిజీలిబీనీలిజీ . అనే పండితుడు అతి సరళంగా ”..గీనీబిశి నీబిచీచీలిదీరీ గీనీలిదీ బి నీరివీనీజిగి ఖిలిశిబిరిజిలిఖి, జీలిబిజిరిరీశిరిబీ రీలిశిశిరిదీవీ రిరీ రిదీఖీబిఖిలిఖి లీగి రీళిళీలిశినీరిదీవీ శిళిళి రీశిజీబిదీవీలి శిళి లీలిజిరిలిఖీలి.వ అని నిర్వహించాడు.
సూపర్‌మామ్ సిండ్రోమ్‌లో అనూరాధ శరీరం మాత్రల మయంకావడంలోనూ, గోధూళివేళలో నాయనమ్మ కన్నీళ్ళు చెరువై, గ్రామ ప్రజలు దాన్ని పుణ్య క్షేత్రంగా దర్శించే సన్నివేశంలోనూ, మంత్రనగరిలో భార్య మెడకు భర్త మేకులు కొట్టి ఆమె ఎన్నడూ తలెత్తి జీవించకుండా చేసాడనడంలోనూ అ లక్షణమే కనిపిస్తుంది. సత్యవతి ఈ శిల్ప ప్రయోగాన్ని కథలో అనివార్య భాగంగా, ఎక్కడా ఓ ప్రత్యేక ప్రయోగం చేస్తున్న ప్రగల్భం ఏమీ లేకుండా, స్త్రీల జీవితాల్లోని విషాదాన్ని అతి శక్తివంతంగా ఆవిష్కరించే రచనా విధానంగా మలిచారు. అందుకే ఆమె గొప్ప కథాళిల్పి అయ్యారు.
సత్యవతి కథల్లో పొరలు, అరలు ఉంటాయి. ఇప్పటికే కథలు రాస్తున్న వాళ్లు ఆ పొరలను విప్పుకుంటూ పొతే కొత్త కథన వ్యూహాలు వారికి దొరుకుతాయి. కొత్తగా రాయదలుచుకున్నవారు ఆ అరలను తెరిస్తే తీవ్ర విషాదాన్ని కూడా ఎంత హృదయంగమంగా చెప్పవచ్చో తెలుసుకుంటారు. వస్తుశిల్పాలు రెండింటిలోనూ ప్రయోగశీలిగా సత్యవతి తెలుగు కథలపై వేసిన ముద్ర ఎప్పటికీ చెరగనిది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags