‘ఏ ఉద్యమానికైనా పునాదులు స్త్రీలే’ మేధాపాట్కర్‌్‌తో ఇంటర్వ్యూ

టి.యస్‌.యస్‌. లక్ష్మి , రమామెల్కోటె
రమ : పర్యావరణానికి, జెండర్‌ సమస్యకి గల సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీకు తెలుసుకదా ప్రస్తుతం ‘ఎకోఫెమినిజం’ ప్రశ్న మన ముందుంది. ఎకోఫెమినిజానికి, జెండర్‌ సమస్యకి గల సంబంధాన్ని వివరించండి? ప్రస్తుతం భారతదేశంలో ఉన్న స్త్రీ ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది సరైన దిక్కుగా సాగుతోందా? ఉద్యమం ఇంకా అనేక సమస్యలపై తన విధానాన్ని రూపొందించుకోవలసి ఉందా? దళిత స్త్రీ సమస్యల గురించి మీరేమయినా చెప్తారా?
మేథ : ఇది ఒక్క ప్రశ్నలా అనిపించడం లేదే!
లక్ష్మి : మీ గురించి చెప్పండి. మీరు ఈ పనిని ఎలా మొదలు పెట్టారు?
మేధ : నాకు సమస్యల మీద ఎక్కువ కేంద్రీకరించి మాట్లాడాలని ఉంది.
రమ : స్త్రీల వ్యక్తిగత అనుభవాలు కూడా చాలా ముఖ్యమైనవని మేం అనుకుంటున్నాం. అనుభవ రాజకీయాలు చాలా ముఖ్యమైనవి. ఇవి ప్రేరణ కలిగిస్తాయి. అర్థం చేసుకోవటం చాలా అవసరం కూడా.
మేధ : వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడటం మొదలు పెడితే, జనం దాని గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించడం మొదలు పెడతారు. ఇక మనం దాన్లో ఇరుక్కు పోతాం. ఏదో కొంత ప్రభావం ఉండేలా నిరాహారదీక్షకి కూర్చుందామంటే, విషయాలన్ని ఒక దానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉంటాయంటే – మనం వాటి నుంచి బయట పడలేం.
సామాజిక సమస్యల గురించి పనిచేయటం మా కుటుంబంలో ఉంది. ఆ ప్రభావం వల్ల ఉద్యోగం, డబ్బు, భవిష్యత్తు అనే ఆలోచన నాలో తట్టలేదు. మా అమ్మ కూడ వివిధ సంఘాల సేవా సంస్థల కార్యక్రమాల్లో పాల్గొనేది. మధ్యలో కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసింది.ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆమె ప్రస్తుతం మహిళా సంఘాలతో పనిచేస్తోంది. మా నాన్న ట్రేడ్‌ యూనియన్‌ కార్య కర్త కావడం-వీటన్నిటి ప్రభావం నా మీద ఉంది. చాలా మంది కార్మి కులు మా ఇంటికి వస్తూ ఉండేవారు. మా ఇల్లు జనంతో హడావుడిగా ఉండేది. నాన్న ఒక పారిశ్రామికవేత్త పంపించిన స్వీట్లను నిరాకరిస్తూ,”నాకు లంచం ఇవ్వడానికి చూస్తున్నారా?” అనడం నాకు గుర్తుంది. ఈ విషయా లన్నీ నా బుర్రలో పాతుకుపోయాయి. అంతకంటే గొప్ప విశేషాలేమీ లేవు.
నేను పేదల కొరకు పనిచెయ్యాలనుకున్నాను. ఈ ఆలోచన నాకు గొప్ప ఆకర్షణీయంగా కనిపించింది. దాంతో ఇంటర్మీడియట్‌లో నాకు ఫస్టు క్లాసు రాకుండా పోయింది. నేనసలు డాక్టర్ని కావాలని అనుకున్నాను. కాని నేను చేసింది వేరుగా ఉంది. విద్యార్థులతో చిన్న గ్రూపుని తయారు చేశాను. అంటే తమ భవిష్యత్‌ కార్యక్రమంగా వీళ్లంతా గ్రామాల్లోకి పోయి ఆ ప్రజల్లో మార్పు కోసం పనిచేయాలని… అదంతా భలే ఆకర్షణగా ఉండేదిలే. ఏదో పెద్ద నాయకురాలయ్యే భావన లాంటిది.
అయితే నేను టాటా ఇన్‌స్టిట్యూట్‌లో పిజి కోర్సు పూర్తి చేశాక సిద్ధాంతానికి, ఆచరణకి సంబంధం ఏర్పడింది. మొదటగా నేను మురికి వాడల్లో పనిచేయడానికి ఉత్సాహపడ్డాను. దాన్నుంచి బయటికొచ్చాక నాకు కొంత ఖాళీ సమయం దొరికింది. నాలుగేళ్లు మురికి వాడల్లో పనిచేశాను. ఆ పని చేయడంలో నాకు చాలా తృప్తి కలిగేది. తర్వాత ఒక పెద్ద సేవా సంస్థలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశాను. కాని అందులో నాకు కొంత స్తబ్దత లాంటిది కలిగింది. కాని అది చాలా విలువయిన అనుభవంగా మిగిలిపోయింది. పెద్ద పెద్ద సంస్థలు – లక్షల కొద్దీ డబ్బు – పెద్ద పెద్ద వ్యవహారాలు – అయితే ఎప్పుడూ నిజమైన పోరాటాల్లో పనిచేయాలని నాకు ఉండేది. ఎవ్వరూ పట్టించుకోని జనం దగ్గరికెళ్లి పనిచేయాలని ఉండేది. పిజి కోర్సు పూర్తి చేశాక రీసెర్చి పని కొనసాగించాలనుకున్నాను. పని చేస్తూ రీసెర్చి మొదలు పెట్టాను. నేను దానికి ఎన్నుకున్న విషయం కూడా సాంఘికంగా ప్రాముఖ్యత కలిగింది. తర్వాత నెమ్మదిగా పర్యావరణాభివృద్ధి, సాంప్రదాయ గిరిజనుల జీవితంపై దాని ప్రభావం అనే విషయాన్ని ఎంచుకున్నాను.
రీసెర్చి అయిపోయాక అభివృద్ధి, ఉద్యమాలు ఆయా రంగాలకు సంబంధించి వివిధ సమస్యలు, అధ్యయనం చేస్తున్నాననే అవగాహన అప్పట్లో నాకు లేదు. అయితే మంచే జరిగిందనుకుంటున్నాను. లేకపోతే నేను సైన్సు స్టూడెంటుని అయ్యుండేదాన్ని. ఎందుకంటే డాక్టర్ని కావాలని ఉండేది కదా. చివరికి సంఘసేవలో తర్ఫీదు పొందటం జరిగింది. అలా అని ఇదొక్కటే నాకు నా పనిలో స్ఫూర్తి, నిబద్ధతను ఇచ్చిందని చెప్పలేను. బాల్యం నుంచి సరైన అనుభవం ఉంటే ఇప్పుడున్న సమస్యలతో పోరాడగలం. నేను నర్మద లోయకు వచ్చినప్పుడు…
లక్ష్మి : అదెలా జరిగింది?
మేథ : నేను బొంబాయి వదిలి గుజరాత్‌ వచ్చాను. అక్కడ ఒక సంస్థ పనిచేస్తోంది. నీటి రిజర్వాయర్‌ లోతట్టు భూమిపై హక్కుల కోసం పోరాడుతోంది. వేసవిలో రిజర్వాయర్‌ నీరు తగ్గినప్పుడు అక్కడ కొంత భూమి బయపటడుతుంది. చిన్నకారు రైతులు, కూలి వారికి ఆ భూమిపై హక్కు దొరుకుతుంది. ఆ భూమి వ్యవసాయానికి పనికొచ్చేది. ఇలా భూమి సంపాదించటం పాత పద్ధతే.
నేను బొంబాయి వదిలేయాలని అనుకున్నప్పుడు గుజరాత్‌ గురించి ఒక యూనిసెఫ్‌ అధ్యయన కార్యక్రమాన్ని చేపట్టాను. నేను అధ్యయనం పూర్తి చేసి, లెక్కలు గట్రా ముగించేసరికి, గుజరాత్‌లో స్థిరపడితే అదో మంచి మార్పు అవుతుందనిపించింది. ఎక్కువ మంది ప్రజల్ని కలిసే అవకాశం కలుగుతుంది. నా పనికోసం ఒక ప్రాంతాన్ని ఎన్నుకోవాలనుకున్నాను. అది…. అలా జరిగింది – గుజరాత్‌లో స్థిరపడటం.
గుజరాత్‌లో జరిగిన ఒక సెమినార్‌లో బ్రతుకు తెరువు సమస్యల గురించి, నర్మద ప్రాంతపు ప్రజల గురించి నాకు తెలిసింది. ఈ ప్రాంతాలకు వెళ్లాలని నేను వెంటనే నిర్ణయించుకున్నాను. మా గురువు గారు ఒక్క చట్టపరమైన విషయాల్లోను, పునరావాసంలో మాత్రమే ఆసక్తి చూపించారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు, సరైన రోడ్లు, పాస్టాఫీసు, బడులు, ఆసుపత్రులు లాంటి కనీస సౌకర్యాలు లేని గ్రామాలు – ఇవన్నీ తిరిగాం. దాదాపు మహారాష్ట్రలో గ్రామాలు కూడ ఇలాంటివే. ఈ గ్రామాల పరిస్థితి ఇప్పటికీ ఇంచుమించు ఇలానే ఉంది. మేం కొంత కాలం పోరాటం జరిపాక ఇప్పుడు కొన్ని ఆశ్రమ పాఠశాలలు. కొన్ని చిన్న డిస్పెన్సరీలు వచ్చాయి. కొన్ని ఉద్యోగ సదుపాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాకు స్వంత ”జీవన్‌ శాలలు”, సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక గిరిజన సమాజానికి ఏం జరుగుతుందో తెలియచేయడానికి తగిన ప్రాంతం ఇదేనని, దానికిది ఒక గట్టి ప్రతీకగా నిలుస్తుందని భావించాను.
ఒక పరిమితమైన, శక్తివంతమైన ఉద్యమంలో నాకెప్పుడూ ఆసక్తి ఉండేది. కాని దాని ప్రభావం మాత్రం అనన్య సామాన్యంగా ఉండాలని మా ధ్యేయం. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను”. ”ఎంతకాలం మనం ఇలా పనిచేస్తాం. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కాకపోతే మహా అయితే 15 సంవత్సరాలు. ఆ తర్వాత మనం వెళ్లిపోతే మరి పరిస్థితి అలాగే ఉంటుంది” నాకు అసహనంగా ఉండేది. కనీసం విత్తనం నాటినట్లు ఉంటుంది అనుకున్నాను. రెండు రోజులు మొత్తం తిరిగి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అహమ్మదాబాద్‌కి వస్తున్నప్పుడే బస్సులో ఉద్యమం కోసమని నా మొదటి పాటను రాశాను.
అక్కడి ట్రస్టీలతో, కేధార్‌ మొదలయిన వారితో మాట్లాడాను. వాళ్లు ఒప్పుకోలేదు. నేనొక ఉద్యమాన్ని నిర్మించి దాంట్లో భాగం కావాలనుకున్నాను. కాని మా సంస్థలో ఉన్న మిగతా నా తోటి ఉద్యోగులంతా వదిలి వెళ్లిపోయారు. తర్వాత జరిగిందంతా ఓ పెద్ద కథ… మొదటి రెండు సంవత్సరాలు రాత్రనక – పగలనక గ్రామాల్లో తిరగడం, జనాన్ని సమీకరించడం జరిగింది. మాకు కావలసిన ప్రాథమిక సౌకర్యాలు కూడ లేవు. మేము పాత సంస్థను 1987 సంవత్సరంలో వదిలేశాం. కాని ఆ సంస్థ నుంచి మాకు మద్ధతు ఉంది. అయితే ఒకోసారి చాలా మందికి ఏ మద్దతూ ఉండదు. చేతిలో పైసా కూడా ఉండదు.
తర్వాత నేను ఆ లోయలో ప్రతి చోటికి మొదటిసారిగా వెళ్లడం జరిగింది. వెళ్లిన ప్రతీచోట ఒక కొత్త అనుభవం. మొట్టమొదటిసారిగా ధూలియా జిల్లాకి వెళ్లినప్పుడు బస్సు దిగి, నేను ఉండటానికి లాడ్జి ఎక్కడ దొరుకుతుందని ఓ దుకాణం అతన్ని అడిగాను. ఆయన కొంచెం పెద్ద వయసువాడు. నాకు లాడ్జి చూపించాడు. అతని పార్టీలోని కొంతమంది రాజకీయ కార్యకర్తల పేర్లు సంపాదించాను. వాళ్ల టెలిఫోన్‌ నంబర్లు కనుక్కొని, ఫోన్లు చేసి ఒక్కొక్కరితో 15 నిముషాలు మాట్లాడాను. ఒక అరగంట అందరం సమావేశం కావాలని నేను వాళ్లను కోరాను. కాని ఆ సమావేశం రెండు గంటలు నడిచింది. వాళ్లది జిల్లా స్థాయిలో చాలా బలమైన పార్టీ. అన్ని పార్టీల వాళ్లకు మా ఉద్దేశం బాగా నచ్చింది. ఆ రాత్రికి రాత్రే ఒక కమిటీ నిర్మాణం జరిగింది. ఒక మెమోరాండాన్ని తయారు చేశారు. అలా మొదలయి పెద్ద సంఖ్యలో మమ్మల్ని బలపరిచే వాళ్లు తయారవడంతో నెమ్మదిగా నా పాత సహచరులు కూడా మాతో కలిశారు. అందరూ ఈ కార్యక్రమంలో తమ వంతు కృషి చేశారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా ”మేం మీకు సాయం చేస్తాం” అంటూ అక్కడున్న ప్రజా ఉద్యమాల వాళ్లు, వామపక్షాల వాళ్లు ముందుకొచ్చారు. ”పునరావాసం కార్యక్రమంలో పాల్గొంటాం కాని ఇంకే సమస్యలోనూ మేం ఉండం. ఈ పర్యావరణ వ్యవహారం మాకు పడదు” అనేవారు. అక్కడినుంచి మరో చోటుకి వెళ్ళేవాళ్ళం. అక్కడ ”విదేశీ ధనం మనకొద్దు. కాని కొంత కాలం తర్వాత తప్పదు” అనేవారు. పౌరహక్కుల సంరక్షణ కార్యకర్త ”మీరేమాత్రం అణచివేతకు గురయినా మా దగ్గరకు రండి. మనందరం కలిసి కట్టుగా పనిచేద్దాం” అనేవారు. స్త్రీల సంఘాలు కూడా ”ఆడవాళ్ల కార్యక్రమాలయితే మేమూ వస్తాం అనేవారు. మనం జనాన్ని చేరుకోవాలంటే మనం పోరాడ్తున్న సమస్యల గురించి ఏకాభిప్రాయం ఉండాలి. ఒక విధంగా వాళ్లు చెప్పింది కూడా నిజమే అనిపించింది.
ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే మా మద్దతుదార్లు ఒక్కొక్కళ్లు ఎంత పని చేశారో తెలుస్తుంది. మమ్మల్ని చూసి వెక్కిరించిన వాళ్లున్నారు. లోయనుంచి అవమానంతో తిరిగొచ్చిన సందర్భా లున్నాయి. కాని మేం ఎప్పుడూ అనుకునే వాళ్లం – ”దీనికి కొంత కాలం పడుతుంది. మా స్థానం మాకు లభిస్తుంది. కేవలం వివిధ సంస్థలనే కాక శాసన సభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని ప్రతి ఒక్కర్నీ మేం చేరుకుంటాం”. అట్లాగే జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా అంతే. ఈ రోజు మేం వెళ్తే అన్ని పార్టీల నాయకులు కలుస్తారు. కొంత సమయం మాకు కేటాయిస్తారు. కాని మొదట్లో మరోలా ఉండేది. అంతా కష్టసాధ్యం అనిపించేది. ఎక్కడికి వెళ్లినా ప్రాజెక్టు విషయంలో మేమే ఎందుకు రాజీపడాలి. పునరావాస కార్యక్రమాన్నే చేపట్టడం వ్యూహాత్మకంగా మంచిదే కావచ్చు ఈ ప్లాను ఆర్థికంగా పూర్తిగా నిలదొక్కుకునేది కాదు అనుకున్నాం. మమ్మల్ని మేం ఎందుకు కొంత పరిధుల్లో ఉంచుకొంటున్నాం? అని మేం ఒక నిర్ణయానికొచ్చాం. నాకు బాగా గుర్తుంది. మహారాష్ట్రలోని ప్రజా ఉద్యమాల్లో ఉన్న ఐదారుగురు మేధావుల్ని నేను పిలిచాను. ”ఎలా చేస్తే బావుంటుంది. అసలు దీన్నంతా ఎలా ముందుకు తీసుకురావాలి? నేనయితే అంతా సంపూర్ణంగా చెయ్యాలని ఉంది” అని అడిగాను. భాగారామ్‌ తిర్‌పుడే (ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు) లాంటి వారు నన్ను చాలా సమర్థించారు. మరికొంత మంది, ”కాదు నువ్వు మాట్లాడేది తప్పు. నువ్వు సవాలు చెయ్యగల మానవ సమస్యనే తీసుకోవాలి” అన్నారు. చివరకు మేం ఏం చేసినా సమగ్రంగా చెయ్యాలనే నిర్ణయానికే వచ్చాం. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. నిజం చెప్పాలంటే నాలుగు రోజులు నేను బాగా ఆందోళన పడ్డాను. ఇప్పుడయితే సమగ్రత అనేది ప్రజలకు అర్థమవుతోంది. సంస్థలన్నింటినీ ముందుకు తీసుకొస్తోంది. అప్పుడప్పుడు ఇదంతా కొంచెం అయోమయంగా ఉంటుంది. కాని జీవితమంటే అంతేకదా!
రమ : అభివృద్ధికి సంబంధించి సమస్యలు?
మేథ : అవునవును. అభివృద్ధి – మన జీవన విధానానికి అంగీకారమైతే, ప్రభుత్వం ప్లానులు, విధానాలకు అంగీకారమైంది, అంటే రెండు విధాలుగాను అంగీకారమైంది. అంతేగాక ఇది కేవలం ప్రభుత్వాన్ని కోరికలు కోరడం మాత్రం ధ్యేయంగా పెట్టుకోలేదు. అందువల్లే ఎక్కువ జనం, ఇంకా ఎక్కువ జనం మాతో కలిసారు. అందుకే ఇది పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. స్త్రీ హక్కుల పోరాట వ్యూహం రూపొందిస్తున్నప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తాయి. వివిధ సంస్థల్లో – ఒక గ్రామం నుంచి ప్రపంచ బ్యాంకు వరకూ ఏ రంగంలోనైనా సరే, ఏ స్థాయిలోనైనా సరే – వీటన్నిటిని చేరుకోగలిగిన స్థితి ఉండాలనీ నేనెప్పుడూ అనుకున్నాను. మరి ప్రపంచ బ్యాంకు ఉంది కదా. అది ప్రాజెక్టులో భాగస్వామి. అసలు ప్రపంచ బ్యాంకు అంటే నాకు సరయిన అవగాహన లేదు. అయితే మామూలుగా నిధులిచ్చే దేశాల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఉంటారని అందరికీ తెలుసు. మన ఆలోచన వాళ్ల బుర్రల్లోకి ఎక్కేలా ఎలా చెయ్యాలి? వీళ్లని ఒప్పించడమెలా? ఇదంతా జరగడానికి 8 సంవత్సరాలు పట్టింది. మరి ఏ సంస్థల నుంచీ చందాలు తీసుకోకుండా ఉండటం. 6-7 సంవత్సరాలు ఏ విధమైన వాహనం లేకుండా గడిచింది. బస్సుల కోసం ఎదురు చూడ్డం, కాలినడకతో ప్రయాణం సాగించడం ఇదంతా గంటలకొద్ది కాలాన్ని తినేసేది. మేం ఇదంతా భరించాం. చివరికి మాతోటి ఉద్యోగులు మమ్మల్ని బలపరచారు. ఇంతకు ముందు ఏ ఉద్యమాలతో సంబంధం లేని అనేక మంది యువజనులు మాతో కలిసారు. మేం అందరం ప్రత్యేక సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాడాం. అంతా దాన్ని ఆపేయడానికి సకల ప్రయత్నాలు చేశారు. ఇంతవరకు సగం గోడ కట్టడం జరిగింది. అందులో సందేహం లేదు. అయితే ఈ పదిసంవత్సరాల తర్వాత చూస్తే మధ్య బ్లాకులో ఆనకట్ట పని పెద్ద భాగం నిర్మాణం ప్రస్తుతానికి ఆగిపోయింది. కాని సుప్రీం కోర్టు ఈ కేసు మొత్తాన్ని తిరిగి విచారణ జరపాలని నిర్ణయించింది. కనుక ప్రభుత్వం అనుకున్నట్టు ఆ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగడాన్ని కోర్టు అంగీకరించదని మేం భావిస్తున్నాము. ఎక్కడుందో అదే స్థాయిలో నిలిపివేస్తుంది.
నర్మదలోయ ప్రాజక్టులో 30 పెద్ద ఆనకట్టలు, 135 మధ్యతరహా ఆనకట్టలున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల కోట్లాది ప్రజలు నిరాశ్రయులవు తారు. మొత్తం లోయంతా నాశనమవుతుంది. ఈ లోయ పురావస్తు ప్రాధాన్యత కలది, పురాతన మానవ నాగరికతకు ఆటపట్టు. ప్రస్తుతం జనసాంద్రతతో కూడిన మైదానాలు, వ్యవసాయపు భూములు, చక్కటి కొండ ప్రాంతాలు, సహజ వనరులు, నూటికి నూరు శాతం గిరిజనులు ఉన్నారు. ఈ ప్రాజెక్టు వలన పైన చెప్పినవన్నీ సర్వనాశనమవుతాయి. మేం ఈ పెద్ద పెద్ద ఆనకట్టల్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం చెప్పేదేమిటంటే నర్మదను చేరకముందే జలాల వినియోగం మొదలవుతుంది. ఇదే పని అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో చెయ్యొచ్చు. ఎందుకంటే నర్మదలోయలో ఉన్న చాలా జిల్లాలు కరువు ప్రాంతాలే. మరి ఇదంతా ఏమిటి? ఇక్కడి కరవు ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడో కచ్‌, సౌరాష్ట్రాల్లో ఉన్న కరువు ప్రాంతాలకి నీటిని మళ్లించడం. అది కూడ జరుగుతుందనే నమ్మకం లేదు.
ఆ కచ్‌, సౌరాష్ట్రాల వాళ్లు తమ ప్రాంతంలోని నీటి వనరులను కనిపెట్టి, ఉపయోగించుకోవచ్చు కదా. అక్కడి ఆరవల్లి అడివిని నాశనం చేయడం వలన ఆ ప్రాంతం నీటి వనరులు తగ్గిపోయాయి. ఆరవల్లి అడవి నుంచి వచ్చే నదులు ఎండి పోయాయి. ఆ నదుల్లో కేవలం రెండు, మూడు నెలలు మాత్రమే నీళ్లుంటాయి. భూమి కోత, అలాగే హఠాత్తుగా వచ్చే వరదల వల్ల ఒండ్రు కొట్టుకొచ్చి నదిని పూడిపోయేలా చేశాయి. అందువల్ల వారి ప్రాంతాల్లో పడుతున్న వర్షపు నీటిని వారు వెంటనే జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ పనిని 5 సంవత్సరాల్లో చేయొచ్చు. అంతేకాదు, ఇది సత్ఫలితాలను ఇచ్చేపని అని ఈ ప్రాంతంలో జరిపిన ప్రయోగాల వల్ల తెలిసింది.
లక్ష్మి : నీటి సంరక్షణ, సద్వినియోగం ఎలా చేయాలి?
మేధ : నీళ్ల కట్టడాల అభివృద్ధి ద్వారా, ప్రపంచంలో చాలాచోట్ల ఈ నీళ్ల కట్టడాలు ఉంటాయి. ఇక్కడి నుంచే అసలు నీళ్లు వచ్చేది. వనరుల నుంచి నీటిని ఆకట్టుకునే ప్రతి దాన్ని (అది కాలువ అయినాగాని, సెలయేరు అయినాగాని) గుర్తించాలి. ఆ ప్రాంతంలో చిన్న చిన్న కాలువలు తవ్వి అభివృద్ధి చెయ్యాలి. చిన్న చిన్న గట్ల ద్వారా నీటిని ఆపాలి. అంతేకాక నీళ్లు ఎక్కడికి వెళ్లకుండా నేలను చదును చేయాలి. నీళ్లు అక్కడే ఆగి కిందికి భూమిలోకి దిగుతాయి. నీళ్లు కిందికి దిగాలంటే కనీస సంఖ్యలో చెట్లుండాలి. చెట్ల వేళ్లు నీళ్లను భూమిలోపలకు చేర్చి నిల్వ ఉండేలా చేస్తాయి. తర్వాత నేల మీద ఉండే నీళ్ల గుంటలు కూడ. వీటిలోని ఉపరితలపు నీళ్లు లేక వర్షపు నీళ్లు ఉపయోగపడతాయి. కూరగాయల తోటలు పెంచొచ్చు. పశువులు ఈ నీటిని తాగొచ్చు. ఈ నీరు కూడ కొంత కిందికి భూమిలోకి దిగుతుంది. ఉపరితలపు నీటిని నిల్వ చేయడం, నేలను చదును చేసి అభివృద్ధి పరచడం ద్వారా భూగర్భ జలాల నిల్వలు పెంచవచ్చు. గట్టులేయడం, నేల చదును చేయటం – ఈ రెండూ చెట్ల కనీస సంఖ్యను పెంచుతాయి. దీని వల్ల సాధ్యమైనంత ఎక్కువ నీటిని ఉపయోగించుకోవచ్చు.
రమ :     మీ సాంప్రదాయ పద్ధతులను తెలంగాణాలో ఉపయోగించారు..
మేధ : ఇది ప్రజల విజ్ఞానం, సంస్కృతి. ఇది ప్రతిచోటా ఉంది. మద్రాసులో కూడ ఈ మధ్యనే చెరువులను నాశనం చేశారు. ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో చెరువులు, కొలనులు ఉండేవి. ఈ చెరువుల నాశనం అనేది హైదరాబాద్‌లో కూడా జరుగుతోందని విన్నాను. అలా చేయడం వల్ల ప్రకృతి సిద్ధంగా లభించే నీళ్లను మనం అందకుండా చేస్తున్నాం. పై సాంప్రదాయపు పద్ధతులు వెనుక బడిన పద్ధతులు కావు. అవి నిజానికి పురోగతికి చెందినవి. చాణుక్యుని కాలం నుంచే ఉన్న మన సాహిత్యంలో ఉన్న సాంప్రదాయాలు నేలను, నీటిని సమాన స్థాయి పద్ధతిలో దీర్ఘకాలపు పద్ధతిలో ఉపయోగించుకునే విధానం చెప్పబడింది. కాబట్టి ఈ పద్ధతుల్లోనే ఉంది న్యాయంతో కూడిన దీర్ఘకాలపు లాభం. ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం తలబిరుసుగా ఓ 50 లేక 100 సంవత్సరాల కోసం ప్లానులు చూపిస్తాయి. కాని నిజానికి అంతకాలం కూడా ఆ ప్లానులు మనలేవు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆనకట్టలే పూడిపోయి వాటి జీవిత కాలం మూడో వంతుకి, నాలుగో వంతుకి తగ్గుతుంది. నాగార్జున సాగర్‌ ఆనకట్టే దీనికి మంచి ఉదాహరణ. దాంట్లో మేటవేసి పూడిపోయే రేటు జీవిత కాలం ఎనిమిదో వంతుకి తగ్గింది. మరి దీనివల్ల సాధించింది ఏముంది? నీటి కోసం పెట్టే ఖర్చు – ఉపయోగాలను బేరీజు వేస్తే పెద్ద ఉపయోగం ఏమీ కనిపించదు. ఈ ఖర్చులన్నీ మళ్లా పేద వర్గాల ప్రజలే భరిస్తారు. ఉదాహరణకి మంచినీటికి, ఇంధనానికి, పశువుల ఆహారానికి ఎప్పుడూ తిప్పలు పడేది ఆడవారే. అధిక సంఖ్యాకులైన వారి ప్రతి కుటుంబం అవసరాలు తీర్చలేని ఈ ఆనకట్టల వల్ల మనం సాధించింది ఏమిటి? మన సైన్సు తిరిగి ప్రజల దగ్గరికే పోవాలి.
రమ : మీ ఉద్యమాల్లో స్త్రీ పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు. పర్యావరణానికి, జెండర్‌ సమస్యకి ఉన్న సంబంధం ఏమిటి?
మేధ : నిజం చెప్పాలంటే స్త్రీలో నిగూఢమైన సృజనాత్మకత దాగి ఉంటుంది. ప్రకృతి వల్ల గాని, మానవుని వలన గాని తనకి, లేక జీవితం మొత్తానికి కలిగే మార్పుల్ని అర్థం చేసుకోగల సున్నితత్వం ఆమెలో ఉంది. మీరు గమనిస్తే ఆ సున్నితత్వమే కవిత్వాన్ని, సాహిత్యాన్ని మనకు అందించింది. ఆ సున్నితత్వంతోనే స్త్రీ తన చుట్టూ ఉన్న ప్రకృతి రక్షణ బాధ్యత నిర్వహిస్తుంది. మానవుడికి, ప్రకృతికి ఉన్న సంబంధాన్ని గమనిస్తే సహజ వనరుల్ని దారుణంగా దోపిడీ చేయడం వల్ల చివరికి ఆ సహజ వనరుల విధ్వంసానికి ఒడిగడుతున్నారని తెలుస్తోంది.
రెండవది ఏమిటంటే పట్టుదల అనేది స్త్రీ లక్షణం అని నేను నమ్ముతున్నాను. అయితే అది ప్రకృతి సిద్ధమో లేక పర్యావరణం కారణమో నాకు తెలియదు. ఎందుకంటే వారి మీద ఉండే అణచివేత, వత్తిడి, వారికి జరిగే అన్యాయం ఒక లాంటివే. మూలకారణం ఏదైనా పట్టుదల అనేది మాత్రం మన ఆడవాళ్ల లక్షణం. అందుకే దీన్ని ఒప్పుకోకుండా మగవాళ్లలా ప్రవర్తించే కంటే నేను అనేదేమిటంటే, అహింసాయుత ప్రజా ఉద్యమాల్లో పట్టుదల అనేది అవసరమైన లక్షణం. అందుకే ఈ ఉద్యమాల్లో స్త్రీలు అందరికంటే ముందున్నారు. స్త్రీలు అంత సులభంగా ఉద్యమాన్ని వదిలి వెళ్లరనేది నేను గమనించాను. వారికి నిజంగా ప్రతిఘటించడం తెలుసు. చివరికంటా ఉద్యమాన్ని నడుపుతారు. మరి సారా వ్యతిరేకోద్యమంలో కూడ – నాకు ఆంధ్రప్రదేశ్‌ గురించి సరిగా తెలీదు, కాని ఇతర ప్రదేశాల్లో అనుభవాలు వింటే తెలుస్తుంది. ఉదాహరణకి చిప్కో ఉద్యమం. అక్కడి వారంతా అందులో పాల్గొన్నారు. సమస్యలను ఎదుర్కొన్నారు. పరిస్థితుల్ని పర్యవేక్షించి తమ ఉద్యమం విధానాల్లో మార్పులు తీసుకొచ్చారు. అయితే ఉద్యమాన్ని మాత్రం వదల్లేదు. దీనిలో స్వార్థం ఏమీ లేదు. ఇదంతా చివరికంటా సాధించాలనే పట్టుదల మాత్రమే.
మూడోది. నేటి మన నేరాల పరిస్థితి చూడండి. మన సమాజం లోని జనంలో ఆడవాళ్లే అందరికన్నా ఎక్కువ నిజాయితీపరులుగా పరిగణించబడుతున్నారు. ఈ నిజాయితీయే ఎప్పుడూ అందర్నీ కదిలిస్తోంది. స్త్రీకి ఉన్న ఈ రకమైన నిజాయితీ, మరీ ముఖ్యంగా వాళ్లు ప్రజా ఉద్యమాల్లో భాగం కావాలనుకున్నప్పుడు వాళ్ల నిబద్ధతా విలువలు మొత్తం సమాజాన్నే తన వెంట నడిపిస్తాయి. ఖచ్చితంగా మేం దాన్ని గమనించాం. స్త్రీలు తమంతట తామే వచ్చి పాల్గొంటున్నారు. వాళ్లు సూటిగా, నిర్మొహమాటంగా హృదయపు లోతుల నుంచి మాట్లాడుతున్నారు. ఇది నేటి భారతీయ మహిళ పరిస్థితి. ప్రపంచ మహిళల పరిస్థితి కూడ కొంచెం అటూ ఇటుగా ఇలానే ఉంది. నేను స్త్రీవాదులతో మాట్లాడినప్పుడు కూడ ఈ విషయమే చెప్పారు. ప్రస్తుత ఉద్యమాల్లోను, మహోద్యమాల్లోను స్త్రీలను కవచాలుగా వాడడం మనకు తెలుసు. జనాభాలో సగభాగం అయిన మహిళలను ఎలా ఎదుర్కోవాలో తెలీని పరిస్థితి ఉండటం ఒక బలహీనత. ఈ బలహీనతనే మనం ఉపయోగించుకొని వాళ్లను సవాలు చేయడంలో తప్పేమీ లేదు. శత్రువులను, ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి స్త్రీలు, పిల్లలు ఉద్యమంలో ప్రధాన భాగం.
స్త్రీ వ్యక్తిగత విముక్తి గురించి నగర జీవితం పునాదిగా ఆధునిక విశ్లేషణలతో స్త్రీ విముక్తి గురించి చెప్పడానికి బదులు సాంఘిక ఉద్యమాల్లోకి స్త్రీలను తీసుకు రావడం ద్వారా అది మరింత తేలికవుతుంది. ఆమె సమస్యలకు సంబంధించి విషయాలయితే ఇది మరింత సులువవుతుంది. వంట చెరకు, దాణా, కుటుంబం, గ్రామ కమిటీ ఈ రకమైన సహజ వనరుల వికేంద్రీకరణ జరిగితే కనీసావసరాలు తీరతాయి. అప్పుడే స్త్రీలు తమ సొంత ఆలోచనలతో, ఆచరణాత్మక దృక్పథంతో ఉద్యమాల్లో పాల్గొంటారు. కనుక సహజవనరుల నిర్వహణలో స్త్రీలు పాల్గొనాలి. దాని వల్లే వాళ్లు విముక్తులవుతారు. మా ఆందోళనకు సంబంధించి నేను గమనించిందేమంటే గ్రామ స్థాయిల్లో వ్యతిరేకత రావడం. దీనికి సంబంధించి స్త్రీలు పూర్తి బాధ్యత తీసుకుంటున్నారు.
రమ : గ్రామాల్లోనూ, పట్నాల్లోనూ మహిళలు ముందుకు రావడమే కాదు, ప్రతి రంగం నుంచ రకరకాల డిమాండ్లతో పోరాడ్డానికి స్త్రీలు సిద్ధమవుతున్నారు.
మేధ : నిజమే! స్త్రీ విముక్తి గురించి కేవలం చర్చించేబదులు ఆమెను నిజంగా విముక్తి చేసే ఉద్యమాల్లో పాల్గొనడం మేలు. విముక్తి సాధించేందుకు అది కూడ ఒక మార్గం. ఇంట్లో రోజు వారీ పనులు చేస్తూ పోరాటాల్లో పాల్గొన్నందువల్ల ఆమె దేనికీ కొరగాకుండా పోతుందనేం లేదు. ఇంటి సమస్యలకి ఇతర సమస్యలకి ఉన్న సంబంధాన్ని గుర్తించాలి. ఆడవాళ్ల సమస్యల గురించి ఆడవాళ్లే పోరాడాలనే భావన వదిలిపెట్టాలి. ఆడవాళ్ల సమస్యల మీద మీరెందుకు కేంద్రీకరించ కూడదని నన్ను చాలా మంది అడిగారు. నేను మాత్రం మొత్తం సమస్య పట్లే మొగ్గు చూపుతాను. ఒక స్త్రీల సమస్యలే కాకుండా నేను ఎక్కువగా కమ్యూనిటీ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాను. (జనవరి-మార్చి 95)

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.