మొత్తానికి తెలంగాణ ప్రత్యేక సంచికను ఆలస్యంగానైనా మీ చేతుల్లో వుంచగలిగినందుకు మాకు సంతోషంగానే ఉంది. వివిధ అంశాల మీద ఒక సంవత్సరం పాటు ప్రత్యేక సంచికలు తీసుకు రావాలని భూమిక సంపాదకవర్గం నిర్ణయించింది. ఆ క్రమంలో మే-జూన్ సంచికను తెలంగాణ ప్రత్యేక సంచికగానూ, ఆ తర్వాత వరుసగా ”జాతీయోద్యమం-స్త్రీలు; స్త్రీలు-శ్రమశక్తి; రాజకీయాలు; బ్యాంకింగ్ వ్యవస్థ; స్త్రీల ఉద్యమాలు” అనే అంశాల మీద పనిచేయాలని అనుకున్నాం. అయితే అనుకున్న విధంగా సకాలంలో తెలంగాణ సంచికను ఆవిష్కరించలేకపోయాం. వేసవి ఎండలు ఒక కారణమయితే, రావల్సిన రచనలు సమయానికి అందకపోవటం ఇంకొక కారణం. అన్నింటినీ మించి ఆర్థిక ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. అందుకే రెండు సంచికలను కలిపి ఈ ప్రత్యేక సంచికగా తీసుకు వస్తున్నాం.
సాధ్యమయినంత వరకూ వివిధ కోణాల్నుంచి తెలంగాణకు సంబంధించిన అంశాల్ని పొందు పరచడానికి ప్రయత్నించాము. అభివృద్ధి పథకాలలో, వ్యవసాయ రంగంలో దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయేతర ఉత్పాదనలో తెలంగాణకున్న చారిత్రక ప్రాధాన్యత, పత్తిరైతుల ఆత్మహత్యలు, అంతర్గత వలసల వల్ల అస్తవ్యస్థ మవుతున్న ఆదివాసుల స్థితిగతులు, అసంఘటిత రంగంలలో స్త్రీ బీడీ కార్మికుల పరిస్థితి, పెరుగుతున్న ప్రాంతీయ అసమానతలు, తెలంగాణ భాషా సంస్కృతులను ఎగతాళి చేస్తున్న సినిమా రంగం, కులంతో ముడిపడివున్న ఆడపిల్లల చదువు, తెలంగాణ కథ, నవల సమకాలీన ఉద్యమాల గురించి ఈ ప్రత్యేక సంచిక చర్చిస్తుంది. అయితే ఇది సమగ్రం అని మేము అనుకోవడం లేదు. ఇంకా చర్చించవలసిన అంశాలు చాలానే వున్నాయి.
మేము తెలంగాణ ప్రత్యేక సంచికను తీసుకురావాలనే ఆలోచనను ముందుకి తీసుకువచ్చినపుడు, ఒక స్త్రీ వాద పత్రికగా తెలంగాణ గురించి ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం ఏమిటి? దీని నేపథ్యం ఏమిటి? ‘ప్రత్యేక తెలంగాణ’ ఉద్యమం మీద మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఉద్యమాన్ని మీరే విధంగా చూస్తున్నారు? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.
మా దృష్టిలో, తెలంగాణకున్న ప్రాధాన్యత దాని ఉద్యమ పోరాట చరిత్రతో ముడిపడి వుంది. ఈ ప్రాంతం అధికార రాజకీయాల్లో, అధికార భావజాలాల్లో, భాషా పరమైన రాజకీయాల్లో అసమానతలకు, వివక్షతకు గురైన ప్రాంతం, ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాల దుష్పలితాలు దేశం మొత్తం మీద ఉన్నప్పటికీ, ప్రతిరంగంలో అసమానతలకి గురైన ఈ ప్రాంతం మీద వాటి ప్రభావం వేరే రకంగా ఉండవచ్చని మేము భావిస్తున్నాము. రాజకీయ, సాంస్కృతిక నేపథ్యంలో చూస్తే కూడా తెలంగాణ సమస్య ఇతర ప్రాంతీయ సమస్యలకన్నా కూడా భిన్నంగా వుంటుంది. ఇన్ని వైవిధ్యాలతో కూడి ఉన్న ప్రాంతంలో పౌరసత్వం, ఆధునికతలాంటి అంశాల పట్ల ఈనాడు జరుగుతున్న సంఘర్షణల గురించి చర్చించడం, ఇటువంటి విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం అవసరమని మేము అనుకుంటున్నాము.
చారిత్రక నేపథ్యం
1724 నుంచి దక్కన్ ప్రాంతం ఆసఫ్‌జాహీల పాలనలో ఉండటం, 1766లో నిజాంఅలీఖాన్ కోస్తా జిల్లాలను బ్రిటిష్ వారికి ధారాదత్తం చేయడం, నాలుగో మైసూర్ యుద్ధానంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ అత్యంతబలమైన రాజకీయ శక్తిగా రూపొందడం, 1800లో బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను బ్రిటిష్ వారికి వదిలిపెట్టడం (దత్తమండలాలు) ఇవన్నీ చారిత్రాత్మక అంశాలు. 1802లో ఆర్కాట్ నవాబునుండి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతం ఈస్ట్‌ఇండియా కంపెనీ పాలన కిందకు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నిజాం ఫ్యూడల్‌వ్యవస్థ కిందనే ఉండిపోయింది. 1840-1870 మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్‌వారు తమ పెట్టుబడులను పెట్టి సరుకుల రవాణాకోసం కాలువలు, ఆనకట్టలు కట్టారు. కృష్ణా, గోదావరి, డెల్టా ప్రాంతాల్లో ఆనకట్టల నిర్మాణానికి ఖర్చు పెట్టడం వలన ఆ ప్రాంతాలు వ్యవసాయంలో అభివృద్ధి చెందాయి. మద్రాసు ప్రెసిడెన్సీ కిందనున్న ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమం, సంస్కరణోద్యమం రాజకీయ మార్పులు తేవడానికి తోడ్పడ్డాయి.
సంఘ సంస్కరణలు, రాజకీయ చర్చలు, మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్న కోస్తా జిల్లాలలో చాలా విస్తృతంగా బహిరంగ చర్చలుగా జరగడం చరిత్రలో మనకు కనిపిస్తుంది. వీటి మూలంగా స్త్రీల స్థితిగతులు, వాళ్ళ పాత్రలపట్ల సమాజం అవగాహనలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో (ఇప్పటి తెలంగాణ) అవే మార్పులు అంత పెద్ద ఎత్తున కనిపించకపోవటానికి అటువంటి విస్తృత చర్చలు ఇక్కడ జరగక పోవటం ఒక కారణం. రాజకీయ వాతావరణం ఇంకొక కారణం.
అప్పటి కాలంలో కోస్తా జిల్లాలలోనే కాక దేశంలోనే ఇతర ప్రాంతాలలో కూడా ఈ మార్పులు మనకు కనిపిస్తాయి. ‘ఆధునికత’ ప్రతి సంఘ వ్యవస్థలోనూ, భావజాలాల్లోనూ వేళ్ళూనుకుంటున్న సమయం అది. ‘ఆధునికత’ అనే అంశంలో ఒక నూతన స్త్రీని సృష్టించే కార్యక్రమం కూడా ఇమిడి ఉంది. అప్పుడు జరుగుతున్న చర్చలన్నింటిలోను సమాజపు కట్టుబాట్లు, ఆచారాలు, మూఢ నమ్మకాలు, స్త్రీల పట్ల వ్యవస్థకున్న అవగాహన, కుటుంబ నిర్మాణం అన్నీ ప్రశ్నించటం జరిగింది. స్త్రీ విద్య గురించి విస్తృతంగా చర్చ జరిగింది. కాని, హైద్రాబాద్ రాజ్యంలో సమాజం వీటన్నింటికీ దూరంగానే ఉండిపోయింది. 1930ల వరకు తెలుగులో ఉన్నత స్థాయి స్త్రీ విద్య అందుబాటులో లేదు. బాలికల కోసం నిర్దేశించిన పాఠశాలలన్నీ దాదాపు మిషనరీ ఇంగ్లీషు బడులు లేదా ఉర్దూ మీడియంలో బడులే కనిపిస్తాయి. అప్పటి సాంఘిక వాతావరణంలో ఉర్దూ మీడియంలో చదవటానికి వెళ్ళే ఆడపిల్లల సంఖ్య కూడా అతి కొద్దిపాటిదే. శతాబ్దం మొదటి భాగంలో ఉన్నత విద్య నభ్యసించిన స్త్రీలను వేళ్ళమీద లెక్కించవచ్చు. అంతేకాకుండా దేశంలో ఇతర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర-కోస్తా జిల్లాలలో జరిగినంత ఉధృతంగా స్త్రీ విద్య, కుటుంబం, స్త్రీల సెక్సువాలిటీల గురించి అవగాహన, వాతావరణం, చర్చా ఇక్కడ లేకపోవటం మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.
హైదరాబాద్ సంస్థానం, దేశంలో అన్ని ఇతర సంస్థానాలలోకి పెద్దదే కాదు, ఆర్థిక వనరులున్న ప్రాంతం కూడా. బహమనీ సుల్తానుల కాలం నుంచీ విశాలమైన సామ్రాజ్యంగా నిల్చిన ప్రాంతం. 1930ల వరకు కూడా ఆస్థాన రాజకీయాలు, ఒక వైపు నిజాం, మరొక వైపు బ్రిటిషు రెసిడెంటు వైస్రాయిల మధ్య జరిగిన ఘర్షణలే రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నిజాంకు బ్రిటిషువాళ్ళ దగ్గర నుంచీ బీరారు, ఉత్తర సర్కార్ జిల్లాలని పిలవబడిన కోస్తా ఆంధ్రా జిల్లాలను తిరిగి వశం చేసుకోవటం ప్రధాన లక్ష్యంగా ఉండింది. నిజాం సామ్రాజ్యాధికారాన్ని ప్రశ్నించే విధంగా బ్రిటిషువాళ్ళు అడ్వైజరీ కౌన్సిల్స్ ఏర్పాటు చేయటాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. నిజాం చపలబుద్ధి నిలకడలేని తనాన్ని అదుపులో పెట్టడమే తెల్లవాళ్ళ ఏకైక లక్ష్యం. వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వ నిర్మాణాన్ని ‘సంస్కరించ’ టానికి నిజాం అంగీకరించకపోవటం వాళ్ళని మరింత చికాకు పెట్టింది.
అప్పటివరకు సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వం, సంస్థలు రాజకీయాలతో ఏ సంబంధం లేనట్లే ఉండింది. సమాజంలో ముఖ్యులెవరైనా ఉంటే నవాబు, జమీందారీ వర్గాలకు చెందిన వాళ్ళే. దేశ్‌ముఖ్‌లు, దేశాయి సర్దేశాయిలు భూముల రెవెన్యూ వసూలు చేసుకునే వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించారు. పెద్ద భూస్వాములై వేలాది ఎకరాలు, ఆస్తులు గడించారు. దాదాపు 60 శాతం వ్యవసాయ భూములు వాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. పౌరసమాజం, పౌరహక్కులు అనే పదాలున్నప్పటికి వాడుకలో లేవు. ఆ జాగీర్లూ, సంస్థానాల్లో సివిల్ కోర్టులు, దావాలు, పిటిషన్లు అనే మాట ఉండేది కాదు. కౌలుకు తీసుకున్న రైతు బానిసకంటే హీనస్థితిలో ఉండేవాడు. తరతరాలుగా భూములు చేసుకున్న వ్యవసాయదారులు వాళ్ళ భూముల్ని కోల్పోయారు. వెట్టిచాకిరి ఎటుచూసినా కన్పించేది. వ్యవసాయ కూలీలు, పేద రైతుల ఆడవాళ్ళు, మగవాళ్ళ కంటే రెట్టింపు బాధలననుభవించేవాళ్ళు.
సాంఘిక ఉద్యమాలు
ఆ పరిస్థితులలో నాలుగు రకాల సాంఘిక, మతపరమైన ఉద్యమాలు ఈ ప్రాంతంలో ప్రారంభమయినాయి. ఈ ఉద్యమాలే రాజకీయ చైతన్యాన్ని, జాతీయ తత్వాన్ని సామాన్య ప్రజలలో ప్రేరేపించినాయి. మొదటిది ఆంధ్రోద్యమం, రెండవది గ్రంథాలయోద్యమం, మూడు ఆర్యసమాజ్. నాలుగవది పత్రికోద్యమం.
తెలంగాణ ప్రాంతంలో ఆంధ్య్రోద్యమం ప్రధానంగా తెలుగుభాష కోసం కృషి చేసిన ఉద్యమం. తర్వాత ఇది రెండుగా చీలి ఒక వర్గం రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో కమ్యూనిస్టు పోరాటంలో భాగం అయింది. ఇంకొక వర్గం మందుముల నర్సింగ్‌రావు, కొండా వెంకట రంగారెడ్డి నాయకత్వంలో జాతీయతా ధోరణిలో కొనసాగి కాంగ్రెస్‌లో విలీనమయింది. తెలంగాణలో పత్రికలు 1922 నాటికి ప్రారంభం అయినాయి. దేశంలో ఇతర ప్రాంతాలలో స్త్రీలు లాయర్లు, డాక్టర్లుగా ప్రొఫెషనల్ కోర్సులలో ఉత్తీర్ణులయే సమయానికి కూడా తెలంగాణ ప్రాంతంలో బాలికలకు ఉన్నత విద్య, కనీసం హైస్కూలు వరకు చదివే సాంఘిక విద్యావకాశాలు లేవు.
సాయుధ రైతాంగ పోరాటం – స్త్రీలు
ఇటువంటి పరిస్థితులలో ప్రారంభమైంది రైతాంగసాయుధ పోరాటం. ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొని మనదేశంలో ‘యేనాస్ పోరాటం’గా పేరొందిన ఉద్యమానికి వెన్నెముకగా నిల్చిన రైతాంగ, దళిత, నిమ్న కులాల స్త్రీలు, స్త్రీల ఉద్యమాలకే ఒక కొత్త సంప్రదాయాన్ని స్థాపించారు. ఈ ప్రాంతంలో పేద, దళిత, నిమ్న కులాల స్త్రీలు, పురుషులూ నూతన చరిత్రని సృష్టించారు. అప్పటికి దాదాపు 70 సంవత్సరాలుగా మారుతున్న సాంఘిక పరిస్థితులలో విద్యావకాశాలు పొంది సంఘసేవలలో భాగం అయిన కోస్తా జిల్లాల స్త్రీలకు, ఇక్కడి స్త్రీలకు పోలిక చూడడం సరైనది కాదు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోరాటానికి ఉన్న విముక్తి లక్షణాలను, క్షణాలలో వంటబట్టించు కున్నారు ‘చదువురాని’ తెలంగాణ రైతు స్త్రీలు. అటువంటి స్త్రీలను వారి జీవిత పద్ధతుల్ని సరిగా అర్థం చేసుకోలేకపోయింది పార్టీ నాయకత్వం. అప్పటి కాల పరిస్థితులు ఆ అవగాహనను కూడా కల్పించలేకపోయాయి. అన్ని సౌకర్యాలు, అవకాశాలు ఉండి కూడా ఆంధ్ర ప్రాంతాలలో స్త్రీలు అంత పెద్ద ఎత్తున కదిలి బహిరంగ రాజకీయ జీవితంలోకి రాలేకపోయారు. జాతీయ ఉద్యమంలో స్త్రీలు పాల్గొన్నారనుకున్నా వాళ్ళ పాత్రను తెలంగాణ స్త్రీలతో పోల్చి చూస్తే తేడా కనిపిస్తుంది. అదే తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం స్త్రీలను ఒక ఊపుగా ముందుకు తీసుకొచ్చింది. ఏ కోణంలో చూసినా ఇది ఒక ప్రగతిశీల చర్య, కాని చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ రాజకీయ అనుభవాలు, విజ్ఞానం వాళ్ళను నాయకత్వ స్థానంలో నిలబెట్టలేకపోయాయి. తెలంగాణ ప్రాంతంనుండి వచ్చిన మగనాయకులకే తర్వాత రాజకీయాధికారం పంచుకోవటంలో పాలులేకుండా పోయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం ప్రతిపాదన ననుసరించి యూనియన్‌లో చేరటానికి నిజాం అంగీకరించలేదు. నిజాం, మజ్లీస్ ఇంతకుముందే, అంటే నలభైల ప్రాంతంలో, బ్రిటిషు ప్రభుత్వం రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం సూచించిన మార్పులను మళ్ళీ మళ్ళీ తిరస్కరించటం జరిగింది. అప్పటి పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులవుతాయని నిజాం ఊహించలేదు. ఆ తరువాత ‘పోలీస్ యాక్షన్’ పేరుతో జరిగిన మిలిటరీ చర్య నిజాం శక్తుల్ని పూర్తిగా హరించి వేసింది. నిజాం షరతుల్ని ప్రతిపాదించినా, అప్పటికే చేయిదాటిన పరిస్థితుల కారణంగా ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యంగా తిప్పి కొట్టింది. అప్పటి మ్యూనిస్టులే కాకుండా తెలంగాణ రాజకీయ అవసరాల్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా తమ స్థానాన్ని పోగొట్టుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల రాజకీయ ప్రయోజనాలకు తలవొగ్గి ఉండటం నేర్చు కున్నారు. ఈ పరిస్థితుల్లో స్త్రీల ఉద్యమాల్ని పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయాలు కొన్ని ఉన్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేకపోవటం ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ తదితర రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి నిలకడ కల్గిన విధానాల్ని రూపొందించుకోలేకపోవటం ఒక అంశం అయితే, ఈ పరిస్థితులలో రాజకీయాలలో స్త్రీల ప్రాతినిధ్యం కనిపించకపోవటం ఇంకొక అంశం. దీనికి పైన చెప్పిన రాజకీయ పరిస్థితులే కాకుండా ఇక్కడి చారిత్రాత్మక పోరాటాలు నిర్వహించిన స్త్రీలు చదువురాని, నిమ్న కుల రైతాంగానికి చెందిన వాళ్ళు కావటం మరొక కారణం. ఆంధ్రా జిల్లాలలో వంద సంవత్సరాలకు పైగా జరిగిన సాంఘిక, సామాజిక మార్పులు, సంస్థల నిర్మాణాలు ఇక్కడ జరగకపోవటం ఒక కారణం. మిగతా ప్రాంతాలలో లాగా ‘ఆధునికత’ కు సంబంధించిన వ్యవస్థల స్థాపన అంతగా జరగలేదు. విద్య, న్యాయ వ్యవస్థలు, పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడానికి చాలా సమయం పట్టింది.
ఆధునికతను రూపొందించే ‘విద్య’ ఆంధ్ర ప్రాంతాలలో స్థాపించినట్టు తెలంగాణలో జరగలేదు. అయితే ఇక్కడ రైతాంగ పోరాటం స్త్రీలకు రాజకీయ విద్యను కలిగించినట్టు దేశంలో ఇంకెక్కడా కనిపించదు. కాని ఈ విద్య వాళ్ళకు ‘పౌరసత్వం’ ఇవ్వలేక పోయింది. ఈ రోజు దేశంలో ‘పౌరులు’ అంటే ఉన్నత వర్గాలు, అగ్రకులస్థులు, విద్యాధికులే కాని స్త్రీలు అందులో మరీ ముఖ్యంగా దళిత స్త్రీలు, మైనారిటీలు, గిరిజనులు మాత్రం కాదు. వాళ్ళెవరూ పౌరులు అనిపించుకోరు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థతోపాటు, రాజకీయ నిరంకుశత్వం ఉండటంవల్ల, జాతీయోద్యమం కొంత తరువాత వచ్చినా, తెలంగాణ రైతాంగం, కమ్యూనిస్టు నాయకత్వంలో నిజాం, రజాకార్ వ్యతిరేకపోరాటాన్ని, సాయుధ పోరాటంగా కొనసాగించింది. చివరకు భారత సైన్యం నిజాం ప్రభుత్వాన్ని, పోలీస్ యాక్షన్ ద్వారా సెప్టెంబరు 1948లో ఓడించి 1952లో హైద్రాబాద్ రాష్ట్రాన్ని భారత సమాఖ్య రాజ్యంలో విలీనం చేసింది. 1953లో హైద్రాబాద్ సంస్థాన శాసనసభకు ఎన్నికలు జరిగి, బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
1953లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రాంతం విడిపోయి ఆంధ్రరాష్ట్రం స్థాపించబడటంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజనకై ఉద్యమాలు రావడంతో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ నియమించబడ్డది. ఈ కమిటీ సెప్టెంబరు 1955లో నివేదికను సమర్పిస్తూ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలని సిఫార్సు చేసింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్న తెలంగాణను ఏడేళ్ళపాటు ప్రత్యేక రాష్ట్రంగా వుండనిచ్చి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, 1962 శాసనసభ ఎన్నికల తర్వాత ఏర్పడే తెలంగాణ, హైద్రాబాద్ రాష్ట్ర శాసనసభ్యులలో మూడింట రెండోవంతు సభ్యులు ఆమోదిస్తేనే తెలంగాణని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయవచ్చని సలహా ఇచ్చింది. హైద్రాబాద్ శాసనసభలో 1955లో ప్రవేశపెట్టిన విశాలాంధ్ర తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించడంతో అనుకూలంగా 103 మంది, వ్యతిరేకంగా 29 మంది, 15 మంది తటస్థంగా వుండటంతో ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆంధ్ర తెలంగాణ నాయకుల చర్చల ఫలితంగా ఒక ఒప్పందం కుదిరిన తర్వాత 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.
ఎస్‌ఆర్‌సి నివేదికలో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణకు జరిగే నష్టం గురించి తెలంగాణపై ఆంధ్ర ఆధిపత్యం వచ్చే అవకాశం గురించి ప్రస్తావిస్తూ, తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా కూడా నిలవగలుగుతుందని నివేదించింది. తెలంగాణలో ఉండే వనరులు తెలంగాణకు చెందకుండా, కోస్తా జిల్లా ఆంధ్రులు ఆధిపత్యం వహించే సందర్భం రావచ్చని, అందులో విద్యారంగంలో వెనుకబడ్డ తెలంగాణకు ఉద్యోగావకాశాలు తగ్గవచ్చని కూడా కమీషన్ వాదించింది. ఆంధ్రప్రదేశ్ స్థాపన తర్వాత క్రమంగా కమీషన్ అనుమానాలన్నీ నిజమయ్యాయి. తెలంగాణ అవసరాల్ని భద్రపరచడానికై చేసిన పెద్దమనుషుల ఒప్పందం బుట్టదాఖలు చేయడం జరిగింది.
శ్రీభాగ్ ఒప్పందం, పెద్దమనుషుల ఒప్పందాలు, ఆంధ్ర నాయకులకు అనుకూలించడంతో వెనుకబడిన రాయలసీమ, తెలంగాణలు మరింత వెనుకబడాల్సిన దుస్థితి ఏర్పడింది. అదే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దోహదం చేసింది.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం కొత్త రాష్ట్రం పేరు ‘ఆంధ్ర-తెలంగాణ’. తరువాత 1956 లో జూలైలో రాష్ట్రాల పునర్విభజన బిల్లు జాయింట్ సెలక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నప్పుడు ‘ఆంధ్ర-తెలంగాణ’ పేరు మార్చి ‘ఆంధ్రప్రదేశ్’ అని పెట్టారు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెసు కమిటీ వేరుగా ఏర్పాటు కాలేదు. తెలంగాణ మిగులు నిధులు ప్రాంతం అభివృద్ధికి వినియోగపడలేదు. ఉద్యోగాలు తెలంగాణ వారికి లభించలేదు. విద్యాసంస్థలలో సీట్లు తెలంగాణ విద్యార్థులకి లభించలేదు. ఇటువంటి పరిస్థితులే 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రేరేపించాయి.
అప్పటి ప్రధానమంత్రి 1969 ఏప్రిల్ 11న పార్లమెంటులో ప్రకటించిన అష్ట సూత్ర పథకం ఫలించలేదు. 1971 ఆగస్టులో ఇందిరాగాంధీ పంచసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకానికి అనుగుణంగా 1971 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమయింది. ఈ విలీనమే తమను ఘోరమైన మోసానికీ, ద్రోహానికీ బలిచేస్తూ దగా చేసిందని తెలంగాణ ప్రజలు నిస్పృహ పాలయ్యారు.
అభివృద్ధి – ఆర్థికాంశాలు
తెలంగాణ భూవిస్తీర్ణం 1,14,863 చ.కి.మీ (మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో 42%). అయితే దానిలో 29, 242 చ.కి.మీ. అడవి ప్రాంతం. భారతదేశంలో రెండోస్థానం దీనికి ఉంది. తెలంగాణ చెరువులకు ప్రసిద్ధి గాంచింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మూడు పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. గోదావరిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో కృష్ణా నదిపై నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద, మధ్యరకం పరిశ్రమలు తెలంగాణలోనే ఉన్నప్పటికి, గమనించాల్సిన విషయమేమిటంటే ఇవన్నీ కూడా హైద్రాబాద్ చుట్టు పక్కలే ఉండటం. అభివృద్ధికి సంబంధించిన సూచనలు చూసినట్లయితే తెలంగాణ వెనుకబాటుతనం తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలు-మందులు, పేపర్, పల్ప్, సిమెంట్ పరిశ్రమలు. ఇంకా సింగరేణి బొగ్గుగనులు, రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టు, భారత హెవీ ఎలక్ట్రికల్స్, నిజాం షక్కర్ ప్రాజెక్టు మొదలైనవి. హైద్రాబాద్ రాష్ట్ర రాజధాని నగరం కాబట్టి తెలంగాణ అభివృద్ధి చెందడానికి కావలిసిన వనరులు ఉన్నప్పటికీ తెలంగాణ వెనుకబడి ఉండటానికి కారణాలు-అభివృద్ధి లాభాలు తెలంగాణకు చేకూరకపోవడం. పైస్థాయి ఉద్యోగాలు బయటనుండి వచ్చినవారే సంపాదించుకోవడం. పారిశ్రామికరంగంలో శ్రామికవర్గ పోరాటాలకు దూరంగా ఉంచడానికి బయటవాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.. మరో కారణం, విద్యారంగంలో వెనుకబాటుతనం. తెలంగాణలో రెండు విశ్వవిద్యాలయాలు ఉంటే (ఉస్మానియా, కాకతీయ) హైద్రాబాద్ నగరంలో 9 విశ్వవిద్యాలయాలు ఉండటం గమనార్హం. అయితే హైద్రాబాద్ రాజధాని కనుక ఇక్కడ సంస్థలు అందరికీ (ఉస్మానియా, కాకతీయ తప్ప) చెందినవి. తెలంగాణ విద్యావసరాల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిశ్రమలకు కావలసిన పనితనం నేర్పగలిగే కోర్సులు గాని, విద్యాసంస్థలను గాని తెలంగాణలో ప్రోత్సహించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రాంతాల అసమానత్వం చారిత్రాత్మకంగా వచ్చిందే అయినప్పటికి 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణతో తెలంగాణ ప్రాంతం మరింత వెనుకబడటం గమనించాల్సిన విషయం. అందువల్ల, ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అసంఘటిత రంగంగా పరిగణించవచ్చు.
ప్రాంతీయ అసమానతలు
అప్పటినుంచి చూస్తే ప్రాంతీయ అసమానత్వం కేవలం ఆర్థిక అభివృద్ధిలోనే కాకుండా, ఇతర రంగాల్లో కూడా కనిపించడం మనకు తెలిసిందే. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను ఒకే భాష అనే ప్రాతిపదికన ముడేసి 42 సంవత్సరాలు పైనే అయినప్పటికీ తెలంగాణ ప్రాంత ప్రజలను, భాషను, సంస్కృతిని చిన్నచూపు చూడటం, అపహాస్యం చేయటం, అవమానపర్చటం తెలుగు సినిమారంగంలో విస్తృతంగా ఉంది.
రాష్ట్రంలో ఉన్న పది పేపర్ పరిశ్రమల్లో ఆరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల, ఇక్కడి అడవి ప్రాంతం తగ్గిపోతున్నది. పరిశ్రమలవలన చాలా ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు రావడమే కాకుండా నీటి సమస్య పెరిగింది. వ్యవసాయమే తెలంగాణ ప్రాంత ప్రజల ముఖ్య జీవనాధారమయితే. ఈ రోజు నీటి వసతులు లేక, ఇదివరకు ఉన్నటువంటి చెరువులను కూడా సంరక్షించకపోవడంవల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడింది. కమాండ్ ఏరియా ఇరిగేషన్‌లో తెలంగాణ రైతులకు శిక్షణ లేకపోవడంవల్ల, ఇతర ప్రాంతాలనుంచి ధనిక రైతులు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినందువల్ల, తెలంగాణ ప్రాంత రైతులు నష్టపోవటమే కాకుండా, అభివృద్ధికి సంబంధించిన జబ్బులు ఫ్లురోసిస్, ఎన్‌సెఫలైటిస్‌లాంటి వాటికి గురి అవుతున్నారు. అటవీ ప్రాంతం తగ్గడంవల్ల, పర్యావరణం కలుషితం కావడంవల్ల, సాగునీటి సదుపాయాలు లేకపోవడంవల్ల మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో, సంక్షోభం, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
ముగింపు
నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, అభివృద్ధిలో అసమానత్వాన్ని మరింత పెంచే అవకాశం వుంది. ప్రపంచబ్యాంకు ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న రుణాలు ఇరిగేషన్‌కై ఇవ్వడం, మెట్ట ప్రాంతాలకు వర్షాధార వ్యవసాయ ప్రాంతాలకు సహాయం ఇవ్వకపోవడం గమనించాలి. ఎక్కువ సంఖ్యలో రైతులు ఈ మెట్టప్రాంతాలకు చెందినవారే. బ్యాంకు రుణ విధానాలు ప్రాంతీయ అసమానత్వాన్ని మరింత పెంచే పరిస్థితి ఏర్పడుతున్నది. పైగా ఇచ్చే రుణాలను తీర్చే బాధ్యత పేద ప్రజలపై కూడా పడుతుంది. పెట్టుబడులను ఆకర్షించటానికై చేస్తున్నటువంటి సంస్థాగత మార్పులు, పేద ప్రజలకు ఇస్తున్నటువంటి రాయితీలను తగ్గించడంవల్ల పరిస్థితులు మరింత విషమించవచ్చును.
ఈ నేపథ్యంలో చిన్న రాష్ట్రాల స్థాపనకై వస్తున్న ఉద్యమాలు, అలాగే పౌరసత్వం, ఆధునికత, అభివృద్ధి అనే అంశాలు తెలంగాణకు ఏ విధంగా వర్తిస్తాయి అనే విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి ప్రస్తుతం మన దేశ పరిస్థితులలో ‘పౌరసత్వం’ అనే మాటకు అర్థం ఏమిటి? ఆ పౌరసత్వం ఎవరికి ఉంది? కొన్ని కులాలు, వర్గాలు పౌరులు కారు అని చెప్పటంలో ఏ అవగాహన ఇమిడి ఉంది? ఈ అంశాలన్నింటినీ అర్థం చేసుకోవాలంటే మరింత వివరంగా లోతుగా ‘ఆధునికత’ అనే అంశాన్ని అధ్యయనం చేయాలి. వలస విధానాలతో దేశంలో రూపొందిన ‘ఆధునికత’ను, ఆ ఆధునికతతో సంబంధం లేకుండా మిగిలి పోయిన ప్రాంతాలు, కులాలు, వర్గాల ఉనికిని ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
(మే-ఆగష్టు 98 ఎడిటోరియల్)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags