అబ్బూరి ఛాయాదేవి
ప్రముఖ కథా, నవలారచయిత శ్రీ ముక్తవరం పార్థసారథి అనువాద రచనల్లో కూడా ప్రసిద్ధులు. ఇంతకు ముందు 18 అనువాద గ్రంథాలు-కథాసంపుటాలూ, నవలలూ, నాటకాలూ మొదలైనవి ప్రచురితమయ్యాయి. ఇప్పుడు 14 మంది ప్రపంచ రచయిత్రుల 14 కథల్ని అనువదించడమే కాకుండా, క్లుప్తంగా వారి జీవిత నేపథ్యాల్ని కూడా అందించారు.
ఈ 14 మంది రచయిత్రుల్లో ఇద్దరు రష్యానుంచి వలస వెళ్ళి అమెరికాలో స్థిరపడిన కుటుంబాలకు చెందినవాళ్ళూ, ఒకరు అమెరికాలో ఉన్నత కుటుంబానికి చెందినవారూ, ఇద్దరు అమెరికన్ ఇండియన్ (ఆదివాసీయులు) రచయిత్రులూ, ఒకరు అమెరికాలోని నల్లజాతికి చెందిన వారూ, ఇద్దరు ఇంగ్లండుకి చెందినవారూ, ఒకరు న్యూజిలాండ్‌కి చెందినవారూ, ఒకరు కెనడాకీ, ఇద్దరు లాటిన్ అమెరికాకీ, ఒకరు ఈజిప్ట్‌లో పుట్టి ఫ్రాన్స్‌లో స్థిరపడినవారూ, ఒకరు మయన్మార్(బర్మాకి) చెందినవారూ ఉన్నారు ఈ సంపుటిలోని కథలు రాసిన వారిలో. భారతదేశపు రచయిత్రులు (ఇండో ఆంగ్లియన్) ఎవరూలేరు.
ఈ 14 మంది రచయిత్రుల్లో ఒక రచయిత్రి 19 వ శతాబ్దం చివరి దశలో పుట్టినది కాగా, పదిమంది దాకా 20 వ శతాబ్దంలో మొదటి మూడు దశాబ్దాల్లోనూ, ఇద్దరు నాల్గవ దశాబ్దంలోనూ పుట్టిన రచయిత్రులు. అందరికన్నా ఎక్కువ కాలం (90సం.) బతికిన రచయిత్రి అండ్రీ చెడెడీ, అందరికన్నాచిన్న వయస్సులో (34సం) పోయినది కేధరైన్ మేన్స్‌ఫీల్డ్. ఇద్దరు రచయిత్రులు 2007లోనూ, ఒకరు 2011లోనూ, అయిదుగురు 1990లలోనూ మరణించారు. ఆరుమంది 60,70 ఏళ్ళ వయస్సులో ఉన్నవాళ్ళు ఇంకా సజీవంగా ఉన్నారు. వీరిలో చాలామంది కటిక దారిద్య్రాన్ని అనుభవించిన వారూ, క్లిష్ట పరిస్థితుల్లో రచనలు చేసిన వారే. స్త్రీలు రచనలు చేయడం, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం ఎంతకష్టమో ఈ ప్రపంచ రచయిత్రులు 14 మంది గురించీ చదివితే తెలుస్తుంది.
పేదరికం, ఒంటరితనం, నిస్సహాయతా కథా వస్తువులుగా తీసుకుని రచనలు చేసిన రచయిత్రి టిల్లీ ఆల్సెన్. ‘ఇస్త్రీ’ అనే కథలో, ”ఎప్పటికప్పుడే ఏ పనీ సరిగా చెయ్యనివ్వని ఆటంకాలు,చేసే పనుల భారం,చెయ్యని వాటి గురించి బెంగ, అనివార్య పరిస్థితులు మిగిల్చిన అసంతృప్తి.” అని ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం ఈనాటికీ చాలామంది స్త్రీలకు వర్తిస్తుంది. ఒక తల్లికి పుట్టిన అయిదుగురు కూతుళ్ళలో ఒక కూతురితో ఆ తల్లికి ఉన్న వైరుధ్యంతో కూడిన అనుబంధాన్ని చిత్రించిన మంచి కథ ఇది.
పౌరహక్కుల ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్న రచయిత్రి టోనీకేడ్ బాంబారా. ”నల్లవాళ్ళకు జీవితమంటే పోరాటమని..” మాటలను కూడా ఆయుధాలుగా వాడగలగాలి అని తల్లి చెప్పింది’ట ఆమెకు బాల్యంలోనే. ”పెట్టుబడిదారీ సమాజంలో పురుషుడికే సర్వాధికారాలూ, సర్వసుగుణాలు. స్త్రీ తలవంచుకుని, పురుషుడి కనుసన్నలలో అతడి ఆజ్ఞాపాలనే తన ధ్యేయంగా బతకాలి” అంటూ తన ఆక్రోశాన్ని వ్యక్తంచేసిందిట తన వ్యాసాల్లో. ” వ్యక్తి జీవితానికి అంతం ఉంటుంది. కాని పోరాటం నిరంతర ప్రక్రియ” అన్నవి ఈ రచయిత్రి చివరి మాటలు. ” నా ఉద్దేశంలో మనిషికుండవలసిన ముఖ్యమైన లక్షణాలు రెండు..అన్యాయంపట్ల లావా చిమ్మగలగటం, .. ఎంతటి కష్టాల్లోనైనా నవ్వగలగటం” అన్న ఈ రచయిత్రి రాసిన కథ ‘పాఠం’ . ఈమె సామాజిక కార్యకర్తా, స్త్రీవాద చలనచిత్ర దర్శకురాలూ కూడా.
సంస్కృతీ, సాహిత్యాల గురించి లెస్లీ మార్మన్ సిల్కో వ్యక్తం చేసిన అభిప్రాయాలు అందరూ తెలుసుకోదగినవి. ”మన కోరికలు, అవసరాలు శరీర సహజమైనవి కావు. డబ్బు ఒక డ్రగ్‌లాగ మారింది” అన్న ఈ రచయిత్రి రాసిన కథ ‘జోలపాట’ . అమెరికాలోని ఒక ఆదివాసి స్త్రీ వృద్ధాప్యంలో ఆమె జ్ఞాపకాల కథ ఇది. కథనం కొంత అస్పష్టంగా ఉన్నా, ఆర్ద్రత కలిగిస్తుంది.
గొప్ప కథా రచయిత్రి కేధరైన్ మేన్స్ ఫీల్డ్ క్షయవ్యాధితో 34 ఏళ్ళకే మరణించింది. ”రాయగలిగీ, రాయలేకపోవడమే నిజమైన దురదృష్టం” అని రాసుకుందట. అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఏడుగురు పిల్లలు పుట్టినా, భర్తపోయాక, పిల్లలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి పోయాక, తన దగ్గరున్న ఒక్క మనవడూ (కూతురి కొడుకు) కూడా చనిపోతే, ఏడవాలన్నా ఏకాంత ప్రదేశందొరక్క బాధపడిన ఒక పనిమనిషి కథ ‘ఏకాంతం’.
శిల్పరీత్యా ప్రయోగాత్మక కథలు కూడా ఉన్నాయి ఈ సంపుటిలో. వాటిలో ‘నాన్నకో కథ’ ఒకటి. మంచం పట్టిన ఎనభై ఏళ్ళ తండ్రి కోరిక మేరకు కథ రాస్తూ, రాసినంతవరకు ఎప్పటికప్పుడు తండ్రికి వినిపిస్తూ, ఆయన వ్యాఖ్యలూ, వాటికి కథకురాలి స్పందనలతో కథ సాగుతుంది. మంచి కథలు రాయాలంటే, మన చుట్టూ ఉన్న మనుషుల్ని గమనించి వాళ్ళని అర్థం చేసుకోవాలని సలహా ఇస్తాడు తండ్రి చివరికి. రచయిత్రి పేరు గ్రేస్‌పాలీ.
”కథా కథన నైపుణ్యానికి పరాకాష్ట బ్యాట్ రచనలు” అంటారుట విమర్శకులు. ఆమె కథన శైలి కొరుకుడు పడకపోయినా చదవవలసిన అధివాస్తవిక కథ ‘గాజు పేటిక’. బాలసాహిత్యంలో అధిక కృషి చేయడంతో పాటు, ‘ఇంగ్లండులోని అత్యంత సంచలన, వివాదాస్పద ”రచయిత్రిగా” ప్రతిభావంతురాలైన రచయిత్రిగా పేరు తెచ్చుకున్న ఏంజిలా కార్టర్ రాసిన కథ ‘ముద్దు’. మధ్య ఆసియాలోని ఒక దేశానికి చెందిన జానపద కథలాంటిది. పాతివ్రత్యభంగానికి పర్యవసానం ఎలా ఉంటుందో చూడవచ్చు ఈ చిన్న కథలో. కథాశిల్పంలో మరొక విలక్షణ ప్రయోగం ‘సుఖాంతాలు” కథ. ‘ప్రేమ-పెళ్ళి’ గురించి ఎన్ని రకాలుగా కథలు రాయొచ్చునో తమాషాగా రాసిన కథ మార్గరెట్ అటవుడ్ రాసిన ఈ కథ.
సైన్స్ ఫిక్షన్ రాయడంలో చేయి తిరిగిన రచయిత్రి ఉర్సులా కె. లిగూన్. ”నిత్యం తనను తాను ధ్వంసం చేసుకుంటున్న ఈ లోకంలో స్త్రీలు మాత్రమే జీవన ప్రదాతలు” అని ప్రకటించిన ఉర్సులా ‘ఆనందానికి అటూ ఇటూ’ అనే కథ రాసింది. ”గుళ్ళులేని, పోలీసులు లేని, సాంకేతిక సదుపాయాలు లేని” చోట ”బతుకే పండుగ”లా ఉండే ఒక ఊహాలోకంలో ఒక ఆదర్శ నగరాన్ని చిత్రిస్తుంది రచయిత్రి ఈ కథలో.
మ్యాజిక్ రియలిజమ్ పద్ధతిలో లూయిసా వాలెంజుయెలా రాసిన కథ ‘నేను నీ స్వారి గుర్రాన్ని. రహస్య స్థావరంలో ఉండే విప్లవకారుడు పోలీసుల కళ్ళు గప్పి భార్యని కలుసుకున్నాడని ఊహించి ఆ భార్యని పోలీసులు ఎంత చిత్ర హింస పెడతారో మనకి తెలుసు. అటువంటి సంఘటన గురించి ‘పీడకల’గా రాసిన కథ ఇది.
మరొక మ్యాజిక్ రియలిజమ్ కథ ‘జడ్జిగారి భార్య’. తనకి ‘స్త్రీగండం’ ఉందని తెలుసుకున్న ఒక నేరస్థుడు ఎన్ని నేరాలు చేసినా పట్టుబడకుండా తిరుగుతూ ఉంటాడు. అతని తల్లిని మరణావస్థలో ఉండేటట్లు చేస్తున్న విషయం తెలిసినా ఆమెని చూడటానికి రాని వాడు చివరికి జడ్జిగారి భార్య ఆకర్షణలో పడతాడు. జడ్జిగారి నుండి తప్పించుకోగలడా? ఈ చిత్ర హింసాత్మక కథని రాసిన ఇలా బెల్ అలెండ్ కథన నైపుణ్యంలో గాబ్రియెల్ గార్జియా మార్కెజ్‌తో పోలుస్తారుట విమర్శకులు. అమాయకులైన ఇద్దరు తల్లీ కూతుళ్ళని నమ్మించి దారుణంగా మోసగించినవాడి ‘మానసిక బలహీనత’కి ఆ భగవంతుడే తగిన శిక్ష విధించగలడని సూచించిన ‘ఆత్మగ్లాని’ కథని రాసిన రచయిత్రి ఫ్లానరీ ఓ కానర్. అమెరికాలోని జార్జియాలో పుట్టి పెరిగి, తండ్రికి వచ్చిన వ్యాధి ఆమెకీ వచ్చి, నలభై ఏళ్ళ లోపునే పోయింది. ఆమె మరణానంతరం వెలువడిన కథా సంకలనానికి నేషనల్ బుక్ అవార్డ్ లభించింది.
ఈ ప్రపంచ విఖ్యాత రచయిత్రుల కథల్ని చక్కని తెలుగు నుడికారాలతో స్వేచ్ఛానువాదం చేసి తెలుగు పాఠకులకు అందించిన ముక్తవరం పార్థసారధిగారు ఎంతగానో అభినందననీయులు. ముఖ్యంగా, ప్రపంచంలోని వివిధ దేశాల రచయిత్రులు ఒక శతాబ్దకాలంపాటు ఏయే కథా వస్తువులపైన ఎటువంటి కథా శిల్పంతో కథలు రాశారో చదివే అవకాశం ఈనాటి తెలుగు కథారచయిత్రులకు కలుగజేసినందుకు అనువాద రచయితకి ప్రత్యేక అభినందనలు!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags