– పాతూరి అన్నపూర్ణ
కాలానికి కొత్త రెక్కలు మొలిచాయి
నా అడుగుల దారీ మారింది!
సమస్యలను అధిగమించేందుకు
ఆలోచనల పదునూ పెరిగింది!
డెబ్భై వసంతాలు పూర్తిచేసుకున్న అమ్మమ్మ
యాభైయ్యవ పడిలోపడ్డ అమ్మ
ఇంకా అడ్డుగీతల పరిధిలోనే!
గిరిగీసిన పరదాల వెనకాలనే!
చూపుడువేలి శాసనాలకు తలలూపుతూనే!
అమ్మవంటిమీద ఎరన్రి గాయాలు
ఆ కళ్ళలోని కన్నీళ్ళ సందాల్రు
పురుషహంకారం మీద
తిరగబడ్డం నాకు నేర్పాయి!
నా జాతిని మూలలనుండి
అణగదొక్కాలనుకున్న పాదాలకు
ఇప్పటికీ ఇంధనం అందుతూనే ఉంది!
ఈ నిశ్శబ్ద మరణాలకు
నా తరంనుండే వీడ్కోలు చెప్పందే
రేపటి ఆశలకు వెలుగు వాకిళ్ళుండవు!
ఎప్పుడైతే నా అస్తిత్వానికి
వెన్నెముక నిటారుగా నిలబడిందో
ఆశయాల విహంగాలు
అనుకున్న తీరాన్ని చేరతాయి
ఇప్పుడిప్పుడే
నాలాగా ఎందరో!
నాతో కాళ్ళు కలుపుతూ!!