వేములపల్లి సత్యవతి
వర్ణ వ్యవస్థ సమాజపు పునాదుల్లోకి మర్రి వూడల్లాగ బాగా లోతుదాకా చొచ్చుకు పోయింది. ఉక్కు కన్న, ఇనుము కన్న చాలా బలిష్టమైనది, గట్టిది, శక్తివంతమయినది. క్రీ.పూ. బుద్ధుని కాలం నుంచి ఇరవయ్యో శతాబ్దంలోని గాంధీజీ వరకు ఆ వ్యవస్థను కూకటి వ్రేళ్లతో సహా పీకి పారవేయలేక పోయారు. కొంచెం మార్పు జరిగింది. సమయం చూచి వీలు చిక్కినపుడల్లా కాటు వేస్తూనే వుంది. దళితులు, నిమ్న కులాల వారు ఆ కాటుకు గురవుతున్నారు.
ఈ సంవత్సరం వినాయక చవితి 1 సెప్టెంబర్ 1911న వచ్చింది. మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలోని దళితులు తమవాడలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టింప తలపెట్టారు. ఈ సంగతి ఆ గ్రామ అగ్రకులస్తులకు తెలిసింది. ఇంకేముంది! కొంపలంటుకు పోయినట్లు ఆందోళన చెందారు. కోపోద్రిక్తులయ్యారు. అడ్డుతగిలారు. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపనమంటారు. రేపు ఏకంగా గుళ్ళల్లోకే వస్తామంటారని ఆగ్రహించారు. చట్టరీత్యా అది నేరమవుతుందని వారికి తెలియక పోవటం ఆశ్చర్యం కలిగించే విషయం. స్వతంత్ర భారత రాజ్యాంగ రచయిత ఆదళిత కులానికి చెందిన డా. అంబేద్కరన్న సంగతి విస్మరించారేమో! వడ్డేపల్లి గ్రామంలో అస్పృశ్యత పురివిప్పి విలయతాండవమాడింది. 13వ తేదీ అక్టోబర్ 1911న ఆ గ్రామ అగ్రకులాల వారి దాష్టీకం ఒక దళితుడిని బలితీసుకుంది. ఆవూరి నడిబొడ్డులో చెన్నకేశవస్వామి ఆలయం వుంది. గ్రామం చుట్టూ ఆలయానికి చెందిన భూములున్నవి. ఆ భూముల్లో అగ్రకులాలవారు పక్కా బిల్డింగ్‌లు కట్టుకొని వాణిజ్య వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారితోపాటు చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్డెర మొదలగు కులాలకు చెందినవారు యిండ్లు కట్టుకొని నివాసముంటున్నారు. వారి యిండ్ల మధ్య కేవలం రెండు సెంట్లు ఖాళీ జాగా వుంది. దానిలో 49 సంవత్సరాల సుబ్రమణ్యం అనే దళితుడు గుడిసె వేసుకోవటానికి ప్రయత్నించాడు. అగ్రకులాల వారితోపాటు, మిగతా కులాల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందరూ ఏకమై అడ్డు అత్యాచారాల నిరోధక చట్ట ప్రకారం కేసు వేశాడు.
ఈ సంగతి అడ్డు తగిలిన కులాల వారికి తెలిసింది. అతని మీద కక్ష కట్టారు. వారి క్రోధం కట్టలు తెంచుకుంది. 12 అక్టోబర్ 1911న ఉదయం 9.30 గంటల సమయంలో అగ్రకులానికి చెందినవారు ఇనుపరాడులతో సుబ్రమణ్యం మీద దాడి చేశారు. ఇనుపరాడులతో బాది, మోది అతి కిరాతకంగా హత్య చేశారు. హత్యానంతరం తోటి దళితవాదులకు చెందిన దళితులందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఇక ముందు అగ్రకులాలవారి యిండ్లలో జరిగే వేడుకలకు పనులు చేయటానికి వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. వివాహాది శుభకార్యాలలోను, అశుభకార్యాల (చావులు) లోను డప్పులు వాయించే పని మానివేయాలని తీర్మానించుకున్నారు. డప్పులను ధ్వంసం చేసేశారు. ఈ విధమైన తిరుగుబాటు చేసి దళితులే అగ్రకులాల వారిని బహిష్కరించటానికి శ్రీకారం చుట్టారు. వేల సంవత్సరాలనుంచి వర్ణవ్యవస్థ వలన దళితులు, నిమ్నజాతీయులు అగ్రకులాల వారి చేత అవమానాలకు గురయ్యారు. అణచవేయబడ్డారు. ఆవేదన చెందారు. నేటికి వారి ఆక్రందనలు వినిపిస్తూ వుండటం విచారం కల్గిస్తుంది. అగ్ర కులాల వారి భూముల్లో పంటలు పండించేది దళితులే. వ్యవసాయరంగంలో ధాన్యాన్ని వ్యుత్పత్తి చేసేది అధికశాతం దళిత మహిళలు, పురుషులే. వారు పండించే పంటనే అగ్రకులాల వారితోపాటు సమాజంలోని అన్ని వర్ణాల, వర్గాలవారు అంటున్నారు. వారు పండించే పంటకులేని అంటు వారిని ముట్టుకుంటే పట్టుకుందా?
దేశం స్వతంత్రమై 65 సంవత్సరాలు కాలగర్భంలో కలసిపోయాయి. కాని సమాజంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలోని అసమానతలు తొలగించబడలేదు. అందుకే కులసంఘాలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. కులాల పేరుతో తమకు జరిగే సాంఘిక అన్యాయాన్ని గుర్తించారు. కాని కులసంఘాల మధ్య ఐక్యత లోపించింది. ఎవరికివారు అంతర్మధనంలో పడిపోయారు. హైందవం మాలలను, మాదిగలను అంటరానివారిగా నెట్టివేసింది. పసరాలను ముట్టుకుంటాము. కాని మాల, మాదిగలను తాకము. వారు సంఘాలను ఏర్పాటు చేసుకొని పరస్పరం ఒకరినొకరు దూషించుకోవటమో, విమర్శించుకోవటమో జరుగుతూ వుంది. అందరూ ఒకటై పోరాడితేనే సత్ఫలితాలను సాధించగల్గుతారు.
అక్షయపాత్రలాంటి హిందూమత అంబులపొదిలో అనేకరకాల అస్త్రశస్త్రాలున్నవి. వాటిని సమయానుకూలంగా వుపయోగించే మాయోపాయాలు, చాకచక్యం, నేర్పరితనం హైందవంలో పుష్కలంగా వుంది. కులవ్యవస్థను ఖండించిన బుద్ధుడిని వేరుచేయటం సాధ్యంకాక అంబులపొదిలోని అవతారమనే ఆయుధాన్ని ప్రయోగించి బుద్ధుడిని దశావతారాలలో చేర్చుకుంది. ఒక బ్రాహ్మణ బాలుని చావుకు శూద్రుడు యజ్ఞం చేయటం కారణంగా చూపించి రాముని చేత శూద్రకుడుని వధింపచేసింది పౌరోహితవర్గం. హిందూమతంలోని కులాలన్ని ఒకటేనని, వారిలో హెచ్చుతగ్గులు లేవని చెప్పి ‘ఆర్యసమాజాన్ని’ స్థాపించిన స్వామి దయానంద సరస్వతిని అంతమొందించటానికి కుట్రపన్నింది. గాజుపొడిని మెత్తని పిండిలాగ తయారుచేయించి దయానంద సరస్వతి వంటమనిషికి భారీ పారితోషికం ముట్టచెప్పి పాలలో ఆ పొడిని కలిపించి స్వామీజీ త్రాగే ఏర్పాటుచేసి అతనిని అంతమొందించింది. ఇటువంటి వ్యవస్థను రూపుమాపటానికి కులాల సంఘాలు ఏకమై పోరాడితేతప్ప సామాజికన్యాయం సాధించలేరు. అయినా ఒక కులం పెత్తనం వహించే స్థానంలో మరో కులం పెత్తనం సాగటం వలన సమాజానికి మేలు కల్గుతుందా? సామాజిక అసమానతలు తొలగిపోతాయా? ప్రజలసేవలో, సామాజిక కర్తవ్యనిర్వహణలో, చిత్తశుద్ధితో అంకితమయ్యే నేతలు నేడు మనకు కరువయ్యారు. ఎప్పటికైనా మతరహిత, కులరహిత సమసమాజ స్థాపనవల్లనే మానవసమాజం సుఖశాంతులతో మనుగడ కొనసాగించ కల్గుతుంది. అందుకు ప్రతి మనిషి కేంద్రబిందువు కావాలి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags