నాగమ్మ, అనురాధ
నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ విద్యార్థులకు జండర్ మరియు మానవ హక్కులపై అస్మిత ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సర్టిఫికెట్ కోర్సు నిర్వహించాం. మా శిక్షణలో భాగంగా వారికి జండర్ మరియు మానవ హక్కులకు సంబంధించిన అంశాలు బోధించడంతో పాటు అనేక విషయాలు తెలుసుకున్నాం. ఈనాటి విద్యావ్యవస్థ తీరుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాకు కల్గిన ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం.
ఆ కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న పిల్లల్లో దళిత, మైనారిటీ వెనుకబడిన వర్గాలకు చెందిన పేద కుటుంబాల పిల్లలే అధికం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు రోజువారి కూలీకి వెళితే గాని పూట గడవని స్థితి. ఈ పిల్లలు ప్రతిరోజు నందికొట్కూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉదయాన్నే బయల్దేరి గం|| 8:30 ని||లకు కాలేజీ చేరుకుంటారు. చాలామంది ఇంట్లో తినడానికి ఏమి లేకపోవడంతో ఖాళీ కడుపులతోనే కాలేజీకి బయల్దేరుతారు. నందికొట్కూరు బస్టాండ్‌లో బస్ దిగగా మూడు కిలోమీటర్ల దూరంలో వున్న కాలేజీకి కాలి నడకన వస్తారు. వీళ్ళల్లో కొంతమంది అబ్బాయిలు కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేని బీద స్థితిలో వట్టి కాళ్ళతోనే కాలేజీకి వస్తున్నారు. మధ్యాహ్నం 12:00 గం.లకు ఆకలితో కడుపులు నకనక లాడుతుంటే తరువాతి క్లాసుల మీద దృష్టి నిలుపలేక ఆ పిరీయడ్స్ బంక్ కొట్టి నీరసపు మొహాలతో, ఖాళీ కడుపులతో తిరిగి ఇళ్ళకు వెళ్తారు.
ఈ విద్యార్థులలో కొంతమంది ఆటోలు నడుపుకుంటూ వెల్డింగ్ పనులు, పనులు చేసుకుంటూ చదువుకుంటున్నారు. అన్ని కష్టాలు మధ్య ఆ పేదరికంలో ఆ పిల్లల్లో చదువుకోవాలన్న ఆసక్తి, తపన, తమ జీవితాలను బాగుపరుచుకోవాలన్న కోరిక వున్నాయి. అంతే కాదు (సిటీలో పెరుగుతున్న పిల్లల మాదిరి కాకుండా) చాలా సంస్కారం విలువలు వున్న పిల్లలు. ఇంటి పని వంట పని కేవలం ఆడవాళ్ళ పని మాత్రమే కాదని మగవాళ్ళు కూడా ఆ పని చేయవచ్చని, అందులో తప్పేమి లేదనే అభిప్రాయంతో పాటు సహ విద్యార్థినుల పట్ల గౌరవభావం, వారి పట్ల ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం నేరం అనే అవగాహన కల్గిన పిల్లలు వీరు. ఆ కాలేజికి 2004లో ఒక దాత 14 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. కాని అన్ని ఎకరాల స్థలం నిరుపయోగంగా పడివుంది. ఏవో కొన్ని క్లాస్‌రూమ్‌లు తప్పితే వసతులు లేవు. ఎండాకాలం వున్న ఒక్క బోరు ఎండిపోతే మంచినీళ్ళు వుండవు. సరైన మరుగుదొడ్లు సదుపాయాలు లేవు. వేసవికాలంలో పరీక్షల సమయంలో లెక్చరర్స్ తలా కొంచెం డబ్బు వేసుకొని ఒక నెల పాటు పిల్లలకు మంచి నీటి క్యాన్స్ తెప్పించి ఇస్తుంటారు. మంచి సైన్స్ లాబ్, కంప్యూటర్ రూమ్, ఆడిటోరియం లాంటి సదుపాయాలు లేవు. పేరుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీనే కాని నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనపడుతుంది.
మరుగుదొడ్లు సదుపాయాలు లేకపోవటం గ్రామాలకు దూరంగా కాలేజీలు వుండటం వలన అనేకమంది ఆడపిల్లలు విద్యకు దూరం అవుతున్నారనే విషయం అనేక నివేదికల్లో వెల్లడయింది. ఈ కాలేజీలో వసతులు లేక చదువుకునే ఆడపిల్లలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు వసతుల లేమి, నిర్వహణ లోపం పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిని తగ్గించవచ్చు. బీద కుటుంబాల్లో అధిక సంతానం వుంటుంది, కాబట్టి అందరూ తలో పని చేసుకుంటే కుటుంబం గడుస్తుంది పిల్లలను చదువు మాన్పించి పనికి పంపుతుంటారు. దీనితో పాటు సౌకర్యాల కొరత వారిని చదువుకు దూరం చేయవచ్చు. మైనార్టీ వర్గాల వారి పిల్లలో ఈ భావన ఇప్పటికే వుంది. చదువు కంటే కూడా సంపాదన వచ్చే వెల్డింగ్ పనులు ఇతర పనుల మీద దృష్టి పెడుతున్నారు. వీళ్ళందరిలో చదువుపట్ల ఆసక్తిని పెంచాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వం మీదే వుంది.
ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగం వుంది. ప్రభుత్వాలు ఒకప్పుడు రాజ్యాంగ స్ఫూర్తితో విద్యారంగం పట్ల పూర్తి బాధ్యత వహించాలి ప్రతి ఒక్క పౌరుడికి విద్య నందించాలనే లక్ష్యంతో పనిచేసేవి. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అన్ని వర్గాల పిల్లలు చదువుకునేవారు. విద్య ఉపాధితో పాటు జ్ఞానాన్ని అందించేట్లు వుండేది. 1991 నుంచి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఫలితంగా దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి సరళీకరణ ననుసరించే నూతన ఆర్థిక విధానం వైపు పయనించింది. ఉదార ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రభుత్వాలు విద్యారంగం యొక్క ఆర్థిక భావాన్ని మోయలేననే సాకుతో విద్యా వ్యవస్థలోని ఒకొక్క విభాగం నుంచి తప్పుకోవడం మొదలు పెట్టాయి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య, సాంకేతిక విద్య వంటి వివిధ అంశాలలో కొన్నింటిని ప్రభుత్వాలు వదిలించుకోవటం మొదలుపెట్టాయి.
ఇంకోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇవ్వటంతో ఇంగ్లీష్ మీడియంలో బోధించే ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా మొలిచాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాల్లో టీచర్లు, లెక్చరర్స్ లేకపోవటం, పక్కా భవనాలు, సరైన క్లాస్‌రూమ్‌లు, బోధనా పరికరాలు, శిక్షణ పొందిన బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత వలన మధ్య తరగతి సంపన్న వర్గాలు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థలకు పంపటం మానేసి ప్రైవేట్ విద్యాసంస్థలకు పంపటం ప్రారంభించారు. తగిన ఆర్థిక స్తోమత లేని పేద దళిత, మైనారిటీ, వెనుకబడిన వర్గాల పిల్లలు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన అనేక కళాశాలల్లో నందికొట్కూరు కళాశాల ఒకటి. బీదరికం, ప్రభుత్వ నిర్లక్ష్యం నందికొట్కూరు కాలేజీ పిల్లల భవిష్యత్ పట్ల శాపంగా మారుతోంది. బీదరికంలో పుట్టటం ఈ పిల్లల పాపం కాదు, కార్పోరేట్ కళాశాల్లో చదువుకునే స్తోమత లేకపోవటం వారి స్వయంకృత అపరాధం కాదు. ఈ పిల్లలకు కాలేజీలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన చదువును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవచూపి ఈ క్రింది విషయాల మీద దృష్టి నిలిపి కాలేజ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
1.మొదట మంచినీళ్ళు, మరుగుదొడ్లు లాంటి మౌలిక వసతులు కల్పించాలి.
2.కాలేజీలో కంప్యూటర్ కోర్సులు, ఇతర కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి.
3.క్లాస్‌రూమ్ పాఠాలతో పాటు వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆడపిల్లలకు కూడా క్రీడలలో పాల్గొనేందుకు ప్రోత్సాహం అవకాశం ఇవ్వాలి.
4.అంతేకాదు చదువుతో పాటు సోషల్ సర్వీసెస్‌కు అవకాశం ఇవ్వాలి.
5.కొత్త కోర్సులు సదుపాయాలు వున్నట్లయితే ఇతర వర్గాల వారి పిల్లలు ఈ కాలేజీలో చదువుకోవటానికి ఆసక్తి చూపుతారు.
6.ప్రభుత్వంతో పాటు నందికొట్కూరు, కర్నులులోని సంపన్న వర్గాలు, వ్యాపార వేత్తలు ఈ కాలేజ్ అభివృద్ధి పట్ల దృష్టి నిలపాలి. అలాగే ఇక్కడ చదువుకున్న కాలేజీ పూర్వ విద్యార్థులు, కాలేజీ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి.
అందరి సహకారం వున్నట్లయితే ఈ కాలేజీ అభివృద్ధి సాధ్యపడుతుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ఇప్పటికీ కళాశాల్లో మౌలిక వసతుల కల్పించటంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా అమ్మాయిలు విద్యావంతులు కాకపోవడము నిజంగా విచారకం. అస్మిత వారి కార్యక్రమం ద్వారానయినా కొంత ప్రయోజనం కలగాలని ఆశిస్తున్నాం.