కొండవీటి సత్యవతి
మన రాష్ట్రంలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలుతీరుపై గత డిసెంబరు నెలలో రెండు రోజులపాటు వర్క్‌షాప్ నిర్వచించాం. ఇదే అంశంపై అంతకు ముందు సంవత్సరంకూడా ఒక సమావేశాన్ని భూమిక నిర్వచించింది.
భారతదేశం మొత్తం మీద చూసుకుంటే మన రాష్ట్రంలో ఈ చట్టం అమలుతీరు కొంత మెరుగ్గా వున్నప్పటికీ చాలా సమస్యలు కూడా వున్నాయి. ఈ చట్టం అమలులోకి వచ్చి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ రాష్ట్రంలో చాలామందికి దీని గురించిన అవగాహన లేదు. రక్షణాధికారులంటే ఎవరు? ఎందుకున్నారు? ఎక్కడుంటారు అనే అంశం మీద చదువుకున్న స్త్రీలకి కూడా అవగాహన లేదు. ఒక విధంగా గ్రామీణ, నిరక్షరాశ్య మహిళలకి, వారు సంఘాలుగా ఐక్యమై వుండడం ద్వారా ఈ చట్టం గురించి కొంత చైతన్యం వుంది.
గృహహింస నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవతో వ్యవహరించిన మాట నిజమే. అయితే ఈ చట్టం ప్రకారం ఎన్నో శాఖలు కలిసి కట్టుగా పనిచేస్తూ బాధిత స్త్రీలకు న్యాయం అందించాల్సి వుంది. గృహహింస నిరోధక చట్టం నిజానికి చాలా అందంగా అద్భుతంగా తయారు చేసిన చట్టం. బాధిత మహిళలకు లభించాల్సిన పరిహారాలన్ని అతి తక్కువ సమయంలో అంటే కేవలం 60రోజుల్లో లభించే అవకాశం వుంది. హింసకు పాల్పడుతున్న వ్యక్తులనుండి రక్షణ పొందడం, తాను నివసిస్తున్న ఇంట్లోనే నివాస హక్కును పొందగలగటం, భరణం, పిల్లల కస్టడీలాంటి పరిహారాలన్నింటిని రక్షణాధికారిద్వారా పొందే అవకాశం ఈ చట్టం కల్పించింది. రక్షణాధికారి కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత 60 రోజుల్లో తీర్పును వెలువరించాల్సిందిగా కోర్టులను కూడా నిర్దేశించింది. అయితే ఇన్ని ఉన్నత లక్ష్యాలతో బాధిత మహిళలకు అండగా ఉండే విధంగా రూపొందించిన గృహహింస నిరోధక చట్టం పకడ్భందిగా అమలు చేయడంలో ప్రభుత్వం మరింత నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం వుంది.
సమస్యలలో ఉన్న స్త్రీల కోసం హెల్ప్‌లైన్ నడుపుతున్న అనుభవంలోంచి, ప్రతిరోజు బాధిత మహిళల కష్టాల కడగండ్లను వింటున్న నేపథ్యంతో మేము గృహహింస నిరోధక చట్టం అమలు తీరుపై ఎన్నో సమావేశాలను నిర్వహించాం. దానిలో భాగంగా ఈ చట్టం అమలులో కీలక పాత్ర వహించాల్సి వున్న మహిళా, శిశు అభివృద్ధి శాఖ, ఉచిత న్యాయం స్త్రీలకు అందించాల్సిన లీగల్ సర్వీసెస్ అథారిటీ, బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించాల్సిన న్యాయమూర్తులతో, తమ వద్దకు వచ్చిన స్త్రీలకు గృహహింస చట్టం గురించి వివరించి రక్షణ కల్పించాల్సిన పోలీసులతోను చాలా సమావేశాలను నిర్వహించాం.
ఈ కార్యక్రమంలో భాగంగానే రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేసే సోషల్ వర్కర్స్, లీగల్ కౌన్సిలర్స్ మరియు సర్వీస్ ప్రొవైడర్స్ (బాధిత స్త్రీలకు తక్షణ సహాయం అందించేందుకు గాను ప్రభుత్వం 75 స్వచ్ఛంద సంస్థలను/సహాయ సంస్థలను నియమించింది.)తో రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించాం. మేము ఈ వర్క్‌షాప్ నిర్వహించే వరకు కౌన్సిలర్స్‌కు, సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఎలాంటి అనుసంధాన ప్రక్రియ చోటుచేసుకోలేదు. ఈ రెండు వ్యవస్థలని కలుపుతూ ప్రభుత్వం కూడా ఎలాంటి సమావేశం ఈ ఆరేళ్ళకాలంలో జరపలేదు. భూమిక ఆధ్వర్యంలో మొదటిసారి పెద్ద ఎత్తున ఈ సమావేశం జరిగింది. 23 జిల్లాలలో పనిచేస్తున్న కౌన్సిలర్స్, మేము ఎంపిక చేసిన సేవా సంస్థల బాధ్యులు ఈ రెండు రోజుల సమావేశాలకు హాజరయ్యారు. రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన రక్షణాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశాన్ని ప్రారంభిస్తూ ఈ రెండు రోజుల వర్క్‌షాప్ ద్వారా రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న కౌన్సిలర్లను, సర్వీస్ ప్రొవైడర్స్‌ని ఒకరినొకరికి పరిచయం చేయడం, బాధిత స్త్రీలకి అండగా నిలవటంలో కలిసికట్టుగా పనిచేయడం అనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని సత్యవతి తెలిపారు.
నిజానికి ఈ సమావేశాన్ని ప్రభుత్వం ఎపుడో ఏర్పాటు చేసి వుండాల్సిందని చెబుతూ, ఇంత పెద్ద స్థాయిలో ఇంత మందితో రెండురోజుల సమావేశ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఆక్స్‌ఫామ్ ఇండియా సహకారంతో పాటు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ వారు ఆర్ధికంగా సహకరించడం వల్లనే తాము దీనిని నిర్వహించగలుగుతున్నామని సత్యవతి తెలిపారు.
ఆ తర్వాత సిడబ్ల్యుఎస్ నుండి హాజరైన సుచరిత మాట్లాడుతూ కౌన్సిలర్‌లను, సర్వీస్ ప్రొవైడర్‌లను కలుపుతూ ఇలా సమావేశం నిర్వహించడం చాలా అవసరమని చెప్పారు. తమ సంస్థ 20 జిల్లాలలో గృహహింస చట్టం అమలు తీరుపై చేసిన అధ్యయనంలో డిఐఆర్ ఫైల్ చేసిన కేసులో 10 శాతం మందికి మాత్రమే న్యాయం దొరికిందని, మిగిలినవారి కేసులన్నీ పెండింగ్‌లో వున్నాయని తెలిపారు. ఈ చట్టం గురించి పెద్ద స్థాయిలో ప్రచారం చెయ్యాల్సి వుందని చెప్పారు సుచరిత.
తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రక్షణాధికారులైన ఇందిరగారు, లక్ష్మీదేవిగారు మాట్లాడారు. తమ మీద చాలా పని భారం వుందని, చాలా కేసులు కోర్టుల్లోనే ఆగిపోయాయని చెప్పారు.
శ్రీ సీతారామఅవధాని, అడిషనల్ డైరెక్టర్, ఎ.పి. జ్యూడిషియల్ అకాడమీ, శ్రీ శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.పి. జ్యుడిషియల్ అకాడమీగార్లు గృహహింస చట్టంలో పొందుపరిచిన కౌన్సిలర్ల, సర్వీస్ ప్రొవైడర్ల విధులు, బాధ్యతల గురించి వివరంగా మాట్లాడారు.
రెండోరోజు సమావేశంలో శ్రీ విద్యాప్రసాద్ విశ్రాంత సెక్రటరీ, లీగల్ సర్వీస్ ఆథారిటీ గృహహింసచట్టం అమలు తీరు గురించి వివరంగా మాట్లాడారు.
సర్వీస్ ప్రొవైడర్లుగా వున్న శివకుమారి, భానుజ, సూర్యకుమారి మొదలైనవారు తమకు ఈ చట్టం అమలులో ఎలాంటి ప్రాధాన్యతను యివ్వడంలేదని, రక్షాధికారులకు తమకు మధ్య ఎలాంటి అనుసంధానం వుండడం లేదని అన్నారు.
ఆ తర్వాత మహిళా, శిశు అభివృద్ధి శాఖ వారు తమ కౌన్సిలర్సతో గ్రూప్ డిస్కషన్ చేయించారు. రక్షాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న కౌన్సిలర్‌లు తమ సమస్యల గురించి చర్చిస్తూ తమకు సరిగా జీతాలు రావడంలేదని, ప్రయాణ భత్యం ఇవ్వడం లేదని తెలుపుతూ, తమకు సక్రమంగా ప్రతినెలా జీతాలు వచ్చేలా కృషిచేయ్యమని భూమికను కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారికి జీతాలు పెరిగాయని, తమకు పెంచడం లేదని ఈ విషయమై కూడా ప్రభుత్వంతో మాట్లాడమని కోరారు. ఇంతకు ముందు కూడా వారి జీతాల విషయంలో భూమిక చొరవతోనే త్వరగా విడుదలయ్యాయని, తాము తప్పక వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని సత్యవతి హామీ ఇచ్చారు.
రెండు రోజుల పాటు కలిసి వుండడం, చర్చించుకోవడంవల్ల కౌన్సిలర్లు, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య మంచి సుహృద్భావ సంబంధం ఏర్పడింది. ఇక ముందు జిల్లాల్లో తాము కలిసి పని చేస్తామని, బాధిత స్త్రీలకు అండగా వుంటామని సమావేశానంతరం అందరూ ప్రకటించడంతో భూమిక ఏ ఉద్దేశ్యంతో ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించిందో ఆ లక్ష్యం నెరవేరిందనే అశాభావం అందరిలోను వ్యక్తమైంది.
కొసమెరుపు : కౌన్సిలర్ల జీతాభత్యాల విషయమై సంబంధిత శాఖ స్పెషల్ సెక్రటరీ ఛాయారతన్‌గారికి భూమిక రిప్రజెంట్ చెయ్యడం, ఆవిడ చాలా పాజిటివ్‌గా స్పందించి ఆగిపోయిన వారి జీతాలను విడుదల చెయ్యడంతోపాటు, పెరిగిన జీతాలను కూడా వారికి వర్తించేలా జి.వో విడుదల చేయించడంలో ప్రముఖ పాత్ర వహించారు వారికి ధన్యవాదాలు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags