పుష్పయాగము

 మ. రుక్మిణీగోపాల్‌
ఈ మధ్య పేపర్లో చదివాను, ‘తిరుపతి వేంకటేశ్వర స్వామికి ‘పుష్పయాగము’ చేశారని దానికి కొన్ని టన్నుల (ఎన్ని టన్నులో రాశారు కాని ఆ సంఖ్య మర్చిపోయాను) పువ్వులను ఉపయోగించార’ని.
ఈ యాగం పర్యావరణ సంరక్షణ నిమిత్తమై చేశారని కూడా వ్రాశారు. ప్రకృతి కూడా పర్యావరణలో భాగమే కనుక పూలు, పండ్లు మొదలగునవి కూడా పర్యావరణలోకే వస్తాయని నా అభిప్రాయం. అందుచే దేవుడి పేరు చెప్పి కొన్ని టన్నుల పువ్వులను తెంపివెయ్యటం పర్యావరణ సంరక్షణలోకి వస్తుందా? మహాత్ముడు ‘కరుణశ్రీ’ వ్రాసిన ‘పుష్పవిలాపము’ అనే కవిత గుర్తుకు వచ్చింది. అందరూ ఆయనంత మృదుహృదయులు కాకపోవచ్చు. ఆయన కవితను మెచ్చుకున్నవారు చాలామందే ఉండొచ్చు. కాని ఆయన భావాల్ని ఆచరణలో పెట్టినవాళ్లు ఒక్కరు కూడా ఉండరేమో!
దేవుని పూలతో పూజించటం ఒక సాంప్రదాయంగా వస్తోంది. అలాగే దేవుని విగ్రహాలను, పటాలను పూలమాలలతో అలంకరించటం కూడా సాంప్రదాయమే. మాలలను కట్టి దేవుని అలంకరిస్తే పోనీ చూడటానికైనా అందంగా కనపడుతుంది. దేవుని పూజ చేసేటప్పుడు, సహస్రనామార్చన చేసినా పువ్వులతో పాటు పసుపు, కుంకుమ, అక్షతలు మొదలగువాటితో కూడా పూజ చేస్తాం కనుక పువ్వులు తక్కువే పడతాయి.
ఈ మధ్యనే పద్మావతీ అమ్మవారికి (తిరుచానూరు) బ్రహ్మోత్సవాలు జరిపి ఆఖరిరోజున పుష్పయాగవీ చేశారు. దీనిని టి.విలో ప్రత్యక్ష ప్రసారం చేశారు కనక నా కళ్లతో నేను చూశాను. ఆ పువ్వుల యొక్క తూకమెంతో నాకు తెలియదు. కాని బుట్టల, బుట్టల పువ్వులు ఉపయోగించారు. కొందరు బ్రాహ్మణులు కూర్చుని శ్లోకాలు (మంత్రాలు) చదువుతుండగా నలుగురైదుగురు బ్రాహ్మణులు అమ్మవారి విగ్రహానికి ఇరుప్రక్కల నిలబడి పూజ మొదలుపెట్టారు. మొదట కొద్దిసేపు (చాలాకొద్దిసేపు) పత్రితో పూజించారు. తరవాత ఆ పత్రిని కిందకు లాగేసి పూలతో ప్రారంభించారు. ఒకరు పూలబుట్టను పట్టుకుంటే ఇంకొకళ్లు ఆ పూలను రెండుచేతులతో తీసి అమ్మవారి మీదకు గిరవాటు వెయ్యటం ప్రారంభించారు (రెండువేపులనుంచి). ఇలా విసిరేటప్పుడు వాళ్ల ముఖాలలో  భక్తి కాని, శ్రద్ధ కాని నాకు కనపడలేదు. ఏదో రకంగా తెచ్చిన పూలనన్నిటినీ పూర్తిచెయ్యాలన్న భావమే వారిలో నాకు కనపడింది. నేను వారిని నిందించటం లేదు. ఆ పరిస్థితుల్లో మనముంటే మనం  అలాగే చేస్తామేమో! ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని ముగించుటయే మన ధ్యేయంగా ఉంటుంది. అమ్మవారి మీదకు గిరవాటువేసిన పూలను మధ్యమధ్య కిందకు లాగేసి మళ్లీ పూలను వేస్తున్నారు (అలా చెయ్యకపోతే అమ్మవారు పూర్తిగా పూలలో మునిగిపోయి ఆమె ముఖం కూడా ప్రేక్షకులకు కనిపించదు). ఇలా ఒక గంటపైగా జరిగింది. ఈ యాగం  చివరన రకరకాలైన పువ్వులు గుట్టగా అక్కడ పడి ఉన్నాయి. అమ్మవారి దయ పొందేందుకు ఇన్ని పూలు కావాలా!
ఈ పుష్పయాగం  గురించి అంతకుముందెప్పుడు నేను వినలేదు. మన ధార్మిక గ్రంథాలలో మిగతా యాగాలను గురించి ఉంది కాని దీనిని గురించి ఎక్కడా ప్రస్తావించినట్లు లేదు. అన్నమయ్య ఒక కీర్తనలో పుష్పయాగం అన్నమాటను ఉపయోగించాడు, కాని ఆ పాట నాకు రానందున దాని భావమేమో నాకు తెలియదు.  ఒక్క దేవుడి పేరు చెప్పే కాదు, రాజకీయనాయకులు, బాబాలు, అమ్మలు, పండితులు, ఇలా అందరికి పూలమాలలు వెయ్యటం ఆచారమయిపోయింది. ఒక మహాపండితుడిని ప్రవచనం ఇప్పించేందుకు పిలిపించారనుకోండి, పోనీ లాంఛనప్రాయంగా ఒక పూలమాల వేసి ఆయనను సత్కరిస్తే బాగానే ఉంటుంది. కాని ఆ సంస్థకు సంబంధించిన పెద్దలందరు ఒక్కొక్కరు ఒక్కొక్క పూలదండను ఆయన మెడలో వేస్తారు. ఇది అవసరమా? ఆయనను మాటలతో సత్కరిస్తే చాలదా? తరువాత ఆయన ఆ బరువును మొయ్యలేక తేలికగానున్న ఒక్క మాలను మాత్రం మెడలో ఉంచుకుని మిగతావి తీసి పక్కన పెడతారు. ఇంక రాజకీయనాయకులకు వేసే కొన్ని దండలు ఎంత పెద్దవి, బరువైనవి తయారుచేస్తున్నారంటే దానిని ఆ నాయకుడు మొయ్యలేడు. నలుగురైదుగురు దాన్ని పట్టుకుని ఆ మధ్యలో ఆయన్ని నిలబెడుతున్నారు! పువ్వులు అలంకారప్రాయమైనవి. వాటిని అవసరమైన మేరకే ఉపయోగిస్తూ మిగతావాటిని బతకనిస్తే బాగుంటుందేమో!
ఇదే సమయంలో ఇంకొక విషయం చెప్పకుండా ఉండలేక పోతున్నాను. అది దేవాలయాలలో దేవుడికి చేయించే పంచామృత స్నానాలు, పంచామృతాలు అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరినీళ్లు. వీటితో దేవునికి అభిషేకం చేస్తారు. ఇవి ఒక్కొక్కటి ఎన్ని లీటర్లు అభిషేకానికి ఉపయోగిస్తారో నాకు తెలియదు, కాని చాలా ఎక్కువగామట్టుకు ఉపయోగించటం చూస్తున్నాను (టి.వి. ప్రసారాలలో). ఇవి అతివిలువైన పోషకపదార్థాలు. బీదప్రజలకు అందుబాటులో లేనివి. దేవుని పేరు చెప్పి వీటినిలా నష్టపరచటం మంచిదా? వాటిని బీదవాళ్లకు పంచిపెడితే దేవుడు కోపిస్తాడా? పురాతనకాలంలో పాడిపంటలకు లోటుండేది కాదు. అప్పుడు దేశజనాభా కూడా చాలా తక్కువ. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జనాభా విపరీతంగా పెరిగిపోయింది. బీదవాళ్లే కాదు, మధ్యతరగతి కుటుంబీకులు కూడా సరియైన పోషకాహారాన్ని తినలేకపోతున్నారు, ధరలు అలా పెరిగిపోయాయి. కాలానుగుణ్యంగా మనం పూర్వపు ఆచారాల్ని, అనేకమైనవి మానేసుకున్నాం, లేదా నేటి పరిస్థితికి అనుగుణ్యంగా మార్చుకున్నాం. ఈ విషయంలో కూడా అలా ఎందుకు చెయ్యకూడదు? వాటిని భగవంతునికి నైవేద్యం పెట్టినట్లు అర్పించి ఆ తరవాత బీదపిల్లలకు పంచిపెట్టకూడదా? భగవంతుడు కేవలం ఈ స్నానాలతోటే సంతోషపడతాడు అనుకుంటే ప్రతి పంచామృత స్నానానంతరం మళ్లీ నీళ్లతో ఎందుకు స్నానం చేయించటం? ఆయన్ని వాటితో అలాగే ఉంచెయ్యవచ్చు కదా! అతివిలువైన ఆ ఆహారపదార్థాలన్నీ ఆ విగ్రహాల మీదనుంచి జారి కిందపడిపోతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ దృశ్యం చూస్తుంటే నాకు భక్తిభావం కలగటం లేదు. ‘అయ్యో ఎంత నష్టం (గీబిరీశిలి) అవుతోంది’ అనిపిస్తోంది. పోనీ అంత శాస్త్రప్రకారమే చెయ్యాలంటే ఒక చిన్నగిన్నెలో అన్నీ తలొక చెంచా పోసి కలిపి దానిని దేవుని మీద చిలకరించవచ్చు. ఆ మిశ్రమం ఇంకా గిన్నెలో మిగిలిపోతే ఎవరైనా తాగవచ్చు. ఇప్పుడు నీళ్లనే వృధాపరచకూడదంటున్నారు. ఇలా  వ్రాయటం ఇతరుల నమ్మకాల్ని విమర్శించాలని కాదు. కాని నా అభిప్రాయాన్ని బాహాటంగా చెప్పుకోవాలన్నదే నా ఆరాటం. నేను నాస్తికురాల్ని కాదు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.