సిహెచ్. మధు
స్త్రీవాద సాహిత్యాన్ని విమర్శించటానికి ఈ వ్యాసం కాదు. మారిన పరిస్థితుల దృష్ట్యా స్త్రీవాద సాహిత్యం ఎలా వుంటే బావుంటుందో అభిప్రాయం చెప్పటానికే వ్యాసం.
అస్తిత్వ వాద సాహిత్యంకు ఒక మార్గం ఒక గమ్యం లక్ష్యం ఉంటుంది. స్త్రీవాద సాహిత్యానికి కూడా ఒక మార్గం, ఒక గమ్యం, ఒక లక్ష్యం తప్పక వుంటుంది. ఆ మార్గంలో వెళ్ళతున్నారా లేదా? గమ్యం చేరుతారా లేదా? అది వేరే సంగతి. మార్గం, గమ్యం, లక్ష్యం దృష్టిలో పెట్టుకొని స్త్రీవాద సాహిత్యం ఎలా వుంటే బాగుంటుందో చెప్పటం కష్టమే! అలా చెప్పటం కూడా బాగుండదు. సాహిత్యం అనేది ఎంత సృజనాత్మకతతో కూడుకున్నదయినా వాస్తవం, కల్పనతో కూడుకున్న ఊహాభరిత విన్యాసంగా ఉంటుంది. అంత మాత్రాన గాలిలో మేడలు కట్టలేం! దారం లేకుండా గాలిపటాలను ఎగిరేయలేం. అందులో స్త్రీవాద సాహిత్యానికి ఒక లక్ష్యం వుంది. తరతరాలుగా స్త్రీలు ఎదుర్కొంటున్న పురుషాధిక్య దోపిడికి వ్యతిరేకంగా పిడికిలెత్తేది స్త్రీవాద సాహిత్యం. స్త్రీవాద సాహిత్యానికి మరిన్ని లక్ష్యాలు వుండవచ్చు. అన్నీ పురుషాధిక్య దోపిడీ క్రిందికే రావచ్చు. ఏమైనా స్త్రీవాద సాహిత్యంలో మార్పు ఆశించవల్సిన అవసరం వుందా లేదా? ఆధునిక యుగంలో ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీ అనుభవిస్తున్న కష్టాలెన్ని?- స్త్రీ సమస్యలలో మార్పు వచ్చిందా? స్త్రీ కన్నీళ్లు పెరిగాయా? తగ్గాయా? పాత కష్టాలకు కొత్త కష్టాలకు తేడా ఏమిటీ? అన్నిటికీ పురుషాధిక్యతే కారణమా? ప్రపంచీకరణ కారణమా? ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు కనుమరుగయిన సమాజంలో స్త్రీ ఎన్ని రకాలుగా ధ్వంసం అవుతుందో మనం గుర్తించగలిగామా? అన్నిటికీ అమృతాంజనం ఒకటే మందన్నట్టుగా, ‘పురుషాధిక్యత’ .. ‘పురుషాధిక్యత’ వేళ్లు పట్టుకొని కూర్చున్నామా?
వీటన్నిటి దృష్ట్యా స్త్రీవాద సాహిత్య ఆకాశాన్ని విశాలం చేసుకోవల్సిన అవసరం వుందా లేదా? – ఈ చర్చ చాలా అవసరం చాలా లోతుల లోకి వెళ్లాలి. ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగయిన ఈ నేపథ్యంలో స్త్రీవాద సాహిత్యంలో సమకాలిక మార్పులు అవసరమున్నాయా? లేదా? –
నేను స్త్రీవాద సాహిత్య సృష్టికర్తను కాదు. ‘చలం’ ను అంగీకరించినట్టుగా ఎవరు ఏమి వ్రాసినా ఇతరులను స్త్రీ వాదులు అంగీకరించకపోవచ్చు. చలం ఏమిటి?- అనే ప్రశ్న కూడా రేపు తలెత్తుతుంది. స్త్రీకి స్వేచ్ఛ చాలా? భద్రత అవసరం లేదా? అనే ప్రశ్న కూడా వస్తుంది. ‘భద్రత’ పేరుతో ఆ ముసుగులో పురుషాధిక్యతను కూడా అంగీకరించలేం! ‘స్వేచ్ఛ’ అంటే అర్థమేమిటో తేలాల్సిన అవసరముంది. అందుకే నేను మొదటే చెప్పాను. నేను స్త్రీవాద సాహిత్య సృష్టి కర్తను కాదు. నేను ఒడ్డు మీద కూర్చుని కన్నీళ్లు కారుస్తున్న వాన్ని. గాలం వేస్తున్న వాన్ని. అంతే!
ఒక స్త్రీ కన్నీళ్లు గూర్చి కవిత, కథ ఏదో వ్రాసి నేను ‘స్త్రీవాది’ నని చెప్పుకోవటం గొప్పకాదు. స్త్రీవాదం అనేది చాలా విశాలమైనది. ఆకాశంలో సగం కాదు ఆకాశమంత విశాలంగా స్త్రీవాద సాహిత్యం వుండాలి.
వర్తమాన సమాజం, మారుతున్న సమాజానికనుగుణంగా స్త్రీవాద సాహిత్యం కొత్త రూపంతో, కొత్త పోరాటంతో రావాలి. ఆ అవసరముంది అంటే పదే పదే సమీక్షించుకోవల్సిన అవసరముంది.
స్త్రీ పోరాడి సాధించుకున్న హక్కులు తక్కువేమీ కాదు. స్త్రీ పోరాటాన్ని తక్కువ అంచనా వేయలేం. ఆకాశంలో సగం భూమిలో సగంగా భావించిన స్త్రీ సగం కంటే ఎక్కువగానే ఎదిగింది విద్యలో, ఉద్యోగాలలో, ప్రతిభలో, రాజకీయాలలో సంఖ్యా రీత్యా కాకున్నా మగవారితో సమానంగా ఎదిగింది అన్ని రంగాలలో స్త్రీ దూసుక పోతూవుంది. ”మీకంటే మేము తక్కువ కాదు” అని మగవారితో సవాల్‌గా నిల్చిన స్త్రీ గెల్చిన మాట నిజం అయితే ఈ గెలుపు- స్త్రీ ‘కన్నీళ్లు’ ఆపగలిగాయా? ఇంకోమాట ఈ సమాజంలో పురుషునికున్న భద్రత స్త్రీకి వుందా?- రాత్రి పూట పురుషుని లాగా స్త్రీ తిరుగ గలుగుతుందా?- అంతెందుకూ? పురుషుని లాగా స్త్రీ ఒంటరిగా వుండగలుగుతుందా? ఎందుకు వుండలేకపోతుంది?- అయితే స్త్రీ స్వాతంత్య్రానికి అర్థమేమిటో?
ఈ వ్యాసం వ్రాయటానికి కారణమైన అంతరంగిక దుఃఖం గూర్చి మొదట ప్రస్తావించాలి. అది అవసరం. ఇరువది సంవత్సరాల క్రితంకు, ఇప్పటి పది సంవత్సరాల క్రితంకు ఇప్పటికీ రకరకాలుగా స్త్రీ హత్యలు పెరిగాయి. ఆత్మహత్యలు పెరిగాయి. స్త్రీలపై చిత్రహింసలు, ప్రేమోన్మాద హత్యలు. హింస పెరిగింది. ఇది నేను వ్రాయటం కాదు. పత్రికలు వ్రాస్తున్నాయి. ఇప్పుడు ఏ జిల్లాలో ఏమి జరుగుతుందో మిగతా జిల్లాలకు తెలియదు. జిల్లా ఎడిషన్‌లు వచ్చిన తర్వాత ఒక జిల్లా కష్టాలు మరో జిల్లాకు తెలియని పరిస్థితి. మేన్ ఎడిషన్‌లలో ‘రాజకీయాలు’ మాత్రమే వ్రాస్తారు. ప్రజా సమస్యలు ప్రజల కన్నీరు, ప్రజా పోరాటాలు మేన్ ఎడిషన్‌లలో అసలు రావు. ‘మన్మోహన్ ఇలా అన్నారు’ ‘అన్నాహజారే’ ఇలా’… ‘చంద్రబాబు అలా’… ‘జగన్ ఇలా’… చెస్ వీరుడు ఆనంద్‌కు రెండు కోట్లు (ఎవడి సొమ్ము), సచిన్‌కు రాజ్యసభ…., జయలలిత శశికళ కల్సిపోయారు, ఐశ్వర్య లావెక్కింది. ఇలా చెత్తంతా వ్రాస్తారు కానీ ప్రజల సమస్యలు వ్రాయరు? పాలమూరి కూలీలు కడుపు చేతబట్టుకొని తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? కనగిరి స్త్రీలు కూలీలుగా రెండు రోజులు ప్రయాణం చేసి నిజామాబాద్‌కు ఎందుకు వస్తున్నారు? లక్షలాది యువకులు పొట్టకొరకు మస్కట్, దుబాయ్‌కు ఎందుకు వెలుతున్నారు? వారి భార్య పిల్లలు ఏళ్ల తరబడి ఎలా బ్రతుక గలుగుతున్నారు?- ఇదంతా వ్రాయరు. జిల్లా ఎడిషన్‌లలో ఒక శాతం జనం సమస్యలు-కన్నీళ్లు వ్రాస్తారు. అదీ తప్పని సరి అయి! ఒక జిల్లా సమస్యలు మరో జిల్లాకు తెలియవు. ఇది పూర్తిగా ప్రపంచీకరణ ప్రభావం. ఒక జిల్లా సమస్యలు మరో జిల్లాకు అందవు. ఒక జిల్లాలోని ప్రజల పోరాటం మరో జిల్లాకు దక్కదు. సమస్యలు సమన్వయ రూపం తీసుకోవు. పోరాటాలు సమిష్టి వేదిక కాలేవు. జిల్లా ఎడిషన్‌లు ప్రజల మధ్య కనిపించని గీతలు గీస్తున్నాయి – అయినా నిజామాబాద్ జిల్లా ఎడిషన్‌లు ప్రతిదినం చూస్తుంటాను. ప్రతిదినం జిల్లా ఎడిషన్‌లో స్త్రీల మరణాలు, స్త్రీలపై చిత్రహింసలు ఎన్నో కనిపిస్తాయి. మగని చేతిలో హత్య, మగని బాధలు భరించలేక ఆత్మహత్య, వరకట్నం హత్య ప్రతిదినం ఇలా ఎన్నో కనిపిస్తాయి. పేపర్‌కు వచ్చేవి కేవలం పోలీసు కేసులు మాత్రమే! జర్నలిస్టుల స్వచ్ఛంధ పరిశోధనలు కావు. హత్యలు సరే నమోదు కావచ్చు. స్త్రీల ఆత్మహత్యల సంగతేమిటీ? – స్త్రీల ఆత్మహత్యలకు కారణం పూర్తిగా మగవారే! హత్యలు ఆత్మహత్యలుగా మారుతున్నాయి. పేపర్‌కు రానివి తొంబది శాతం వున్నాయి. ఇటీవల ఈ పది – ఇరువది సంవత్సరాలలో ఆడవాళ్లపై మగవాళ్ల చిత్రహింసలు విపరీతంగా పెరిగాయి. ‘ప్రపంచీకరణ’ పుణ్యమాని మగవాడు త్రాగుడు, జూదం, విలాసవంతమైన జీవితం – వీటి కొరకు డబ్బు – ఈ డబ్బుకు భార్యపై, అత్తవారిపై ఆధారపడటం, వారిని హింసించటం ఈ హింసలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడటం – వీటినెన్నిటినో పత్రికలలో చదువుతున్నాను. వాస్తవంగా చూస్తున్నాను. వీటిని చూచిన తర్వాత ఎంతో బాధ ఎంతో దుఃఖం అనుభవించి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. ‘ప్రపంచీకరణ’ పుణ్యమా అని మగవాడి అధికారం కొత్త ఆధునికతను సంతరించుకుంది. చిత్రహంసలు సాంకేతికంగా కొత్తరూపం తీసుకున్నాయి. అన్ని సంబంధాలలో డబ్బు ప్రధానం కావటంతో భార్యపై పెత్తనానికి, మగవాడి అహంకారానికి, ఈ హత్యలకు, చిత్రహింసలకు ‘డబ్బు’ ప్రధాన వస్తువుగా మారింది. ఆధునిక సమాజం నీడలో స్త్రీ కొత్త సమస్యలను, కొత్త కన్నీళ్లను స్త్రీవాద సాహిత్యం గుర్తించిందా? – ఏమి చేయగలిగింది? దీనికి తోడు కొత్తగా పుట్టుకొచ్చినవి ప్రేమోన్మాద హత్యలు చిత్రహింసలు – ఎన్నో జరుగుతున్నాయి. ప్రేమిస్తున్నామని మగవాడు వెంటబడటం, ప్రేమించాలని వేధించటం, ప్రేమించకపోతే, కత్తిపోట్లు, హత్యలు, యాసిడ్ పోయటం… మగవాడు దుర్మార్గంగా పరమకిరాతకంగా తయారయ్యాడు. ఈ కొత్త చిత్రహింసలను కొత్త కిరాతకత్వాన్ని స్త్రీవాద సాహిత్యం గుర్తించగలిగిందా? – స్త్రీవాద సాహిత్యం – సాహిత్యసృష్టికి పరిమితమవుతుంది. కన్నీళ్లను కష్టాలను, సమస్యలను వ్రాయగలుగుతుంది. ఈ కన్నీళ్లతో వ్యతిరేకంగా పోరాడేది ఎవరు? – స్త్రీవిముక్తి పేరుతో ఎన్నో సంస్థలున్నాయి. కమ్యూనిజం, అభ్యుదయ భావజాలం గలిగిన సంస్థలున్నాయి. స్త్రీ సమానత్వం కొరకు పోరాడుతామంటున్న ఎన్నో సంస్థలు గల్లీనుండి ఢిల్లీ వరకు కనిపిస్తాయి. ఈ సంస్థలు ఈ వ్యవస్థ దగాకు, క్రూరత్వానికి మగవాడి అహంకారానికి బలి అవుతున్న స్త్రీల గూర్చి ఎందుకు పోరాటం చేయటం లేదు? నినాదాలు, పత్రికా ప్రకటనలు గంభీరోపన్యాసాలు పోరాట రూపాలు కావు. ప్రజలను సమీకరించలేని పోరాటం పోరాటం కాదు. మాటలు పోరాటం కాదు. మాటలతో పోరాటం రాదు. దగాపడుతున్న స్త్రీలకు, మగవాడి దౌర్జన్యానికి బలి అవుతున్న స్త్రీలకు ఒక ‘రక్షణ’ వుందనే నమ్మకం ఒక బాసట వుందనే నమ్మకం. ఈ మహిళా సంఘాలు కల్గించగలిగాయా? ఈ సంఘాలెందుకూ?
మహిళా సంఘాల కంటే స్త్రీవాద సాహిత్యం చాలా గొప్పది. గొప్పగా వుండాలి. సాహిత్యమంటే – భవిష్యత్తును దర్శించగలగాలి. భవిష్యత్తును సృష్టించగలగాలి. స్త్రీవాద సాహిత్యం ప్రజాసాహిత్యంలో ఒక భాగం. ప్రజాసాహిత్యం ప్రజల సమస్యలను కన్నీళ్లను సృష్టించటమే కాదు. పోరాటం ఎందుకు చేయాలో చెప్పగలగాలి. ఏ పోరాటం ఎలా చేయాలో చెప్పాలి. స్త్రీల కన్నీళ్లు ఎలా తగ్గుతాయో చెప్పగలగాలి. అది స్త్రీవాద సాహిత్యం. స్త్రీవాద సాహిత్యంలో ఈ మార్పు ఈ కోణంలో చాలా అవసరం.
స్త్రీకి స్వేచ్ఛ స్త్రీకి సమానత్వం ఈ పడికట్టు పదాలను దాటి స్త్రీవాద సాహిత్యం బయటకు రావాలి. స్త్రీవాద సాహిత్యమంటే మగవాడు లేకుండా బ్రతుకుతానని సవాల్ విసరటం కాదు. మగవాడి దౌర్జన్యాన్ని ధిక్కరిస్తానని నమ్మకం కల్గించటం! మగవాడి అహంకారాన్ని సమూలంగా నాశనం చేయటానికి రచనలు చేయటం! పురుషాధిక్య సమాజ మూలాలు ఎక్కడ వున్నాయో తెల్సుకొని ఆ మూలాల పైన దెబ్బతీయటం! మారిన సమాజంలో అన్నిటిలో అర్ధభాగం స్త్రీలదే పెత్తనం అంటూనే, పరోక్షంగా అన్ని రంగాలలో వున్న మగవాడి పెత్తనంపై సవాల్ విసరటం.
‘స్త్రీలకు అధికారాలు వచ్చాయి. ఇపుడు స్త్రీ ఆకాశంలో సగం భూమిలో సగం’ ఇది చెప్పటానికి బాగానే కనిపిస్తుంది. అంతటా స్త్రీలు చొచ్చుకపోయిన మాట నిజం. తామెందుకు మగవాడి కంటే తక్కువ చాలెంజ్‌గా తీసుకున్న స్త్రీ- ప్రతిభ విషయంలో మగవాడిని ఎప్పుడో దాటిపోయింది. మగవాడు లేకుండా బ్రతుకలేమనే (భద్రతా రీత్యా) దుగ్ధ స్త్రీకి ఎంత వుందో అంతే- అంతర్లీనంగా మగవాడి పట్ల అసహ్యం కూడా ఉన్నట్టుగా వుంది. తాను బందీ పైగా పెద్దరికం… ఇదంతా స్త్రీవాద సాహిత్యం గుర్తిస్తుందా? మగవారితో సమానంగా అన్నీ సాధించామని సంతృప్తిపడుతుందా?- స్త్రీలు కన్నీరు కార్చని వ్యవస్థ కావాలి. అది స్త్రీకి సమానత్వం వస్తే సరిపోదు. భద్రత ఎలా పొసుగుతుంది? లైంగిక హింస, అత్యాచారాలు, రేప్‌్, స్త్రీని విలాసవస్తువుగా చూచే సంస్కృతి- వీటికి కారణాలేమిటో స్త్రీవాద సాహిత్యం లోతులలోకి వెళ్లాల్సిన అవసరముంది. అన్ని రంగాలలో స్త్రీలు బాగానేవుంది మాట.. రాజకీయ రంగాన్ని స్త్రీలను ముందుపెట్టి మగవారు ఏలుతున్నారు. పేరుకు ఎం.ఎల్.ఏ ఆమె- అంతా ఆయనే… భార్యాభర్తలు సమాన హోదాలో పనిచేస్తూ – సమానంగా జీతం తెస్తున్నా- ఇంటికి రాగానే స్త్రీ వంటింటిలోకి వెళ్లాలి. పిల్లల ఆలనా పాలనా చూడాలి. మగపక్షి బయట సిగిరెట్టు కాలుస్తూ నిల్చోవాలి. ఇది పరిస్థితి.
స్త్రీవాద సాహిత్యమనేది పైపై మెరుగులను పురుగులను చిత్రీకరించటం కాదు. స్త్రీ మనసులోని కెళ్లాలి. స్త్రీ అంతరంతరాల కెళ్లాలి. అంతరంతరాలలోవున్న గోడును చీకట్లను తడుమాలి. కనుల వెనుకనున్న కన్నీరును పసిగట్టాలి. ఇంటికి ఆడవాళ్ల పేర్లుంటాయి. ఇంట్లో మగవాళ్ల పెత్తనముంటుంది. ఇలావుంది పరిస్థితి.
ఒక విషయం ప్రస్తావిస్తాను. ఈ సమాజంలో మగవాడు స్త్రీని కొడితే తప్పులేదు. స్త్రీ మగవాన్ని కొడితే పెద్ద తప్పు. ఆత్మరక్షణ కోసం కొట్టినా పెద్ద తప్పు. స్త్రీవాద సాహిత్యం వీటికి పరిష్కారం చూపించాలి. ఏమిటి పరిష్కారం?- ‘వ్యవస్థ’ పూర్తిగా మారాలని నాలాంటి వాళ్లం అంటే- అస్తిత్వవాద సాహిత్యాన్ని చిన్నచూపు చూస్తున్నారని ఎగిసిపడతారు. ఒక్క స్త్రీవాద సాహిత్యమే కాదు. ఎన్నో అస్తిత్వవాద సాహిత్యాలు వస్తున్నాయి. వాటి గూర్చి ఈ వ్యాసంలో ప్రస్తావించాలని లేదు.
‘స్త్రీకి స్వేచ్ఛ సమానత్వం’- స్త్రీవాద సాహిత్యం ఎంచుకున్న అంకిత భావంగా కనిపిస్తుంది. ప్రపంచీకరణ తర్వాత పూర్తిగా మారిన ప్రపంచంలో ఇది చాలా?- ‘ప్రపంచీకరణ’ అన్ని వర్గాలను అస్తవ్యస్తం చేసినట్టుగానే మహిళా ప్రపంచాన్ని కూడా అస్తవ్యస్తం చేసింది. మహిళల సమస్యలు పెంచింది. కన్నీళ్లు పెంచింది. గిరిగీసుకున్న స్త్రీవాద సాహిత్యం మారుతున్న ప్రపంచంలో స్త్రీల కన్నీళ్లను కూడా చూడాలి. కన్నీళ్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించాలి. సామాజిక కలం ఎప్పుడూ ఖడ్గంగా వుండాలి.
‘స్వేచ్ఛ-సమానత్వం’ అనేవి బోగస్ పదాలుగా మారి పోయాయి. ఈ పదాల మూలంగా లాభపడుతున్నది ప్రజలు కాదు. దోపిడీ శక్తులే. ఈ పదాల చాటునే దోపిడి శక్తులు సమాజాన్ని వంచిస్తున్నాయి. ప్రజలను మోసం చేస్తున్నాయి. మగవారు దోపిడి శక్తులలో ఒక భాగం. మనం ఈ విషయం మర్చిపోకూడదు. ‘స్వేచ్ఛ’ యివ్వటం ఆంక్షలు విధించటం, ‘సమానత్వం’ యివ్వటం తలమీద బరువు పెంచటం – వీటికి వేరే ఉదాహరణలు అక్కర్లేదు. మన భారత ప్రజాస్వామ్యం చాలు. ఇది నిజమైన ప్రజాస్వామ్యం అనేవారితో వాదించాలని నాకు లేదు. శ్రీశ్రీ చిన్నగా చెప్పాడు. ”దొంగనోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా?” డబ్బు కొరకు రోగులకు ప్రాణం పోస్తానని – ప్రాణం తీసినట్టు ‘డాక్టర్’ బోర్డు పెట్టుకోగానే ‘డాక్టర్’ అయిపోడు. ఈ ‘ప్రజాస్వామ్యం’ సంగతి అంతే – ఇది ప్రజాస్వామ్యమేనా? – ఇవి ఎన్నికలేనా? – స్వేచ్ఛ ఎక్కడుంది? స్వాతంత్య్రం ఎక్కడుంది? డబ్బు దోచుకునేవాడికి స్వేచ్ఛ వుంది. వేలకోట్లు సంపాదించవచ్చు. స్వాతంత్య్రం ఎవరికుంది? – ‘హక్కుల’ కొరకు పోరాడే స్వాతంత్య్రం లేదు. పోరాడేవారిని కాల్చిచంపే స్వాతంత్య్రం మాత్రం వుంది. ఇప్పుడున్న స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్య్రం కూడా ఇలాంటివే!
ఇటీవల స్త్రీ విషయంలో రెండు ప్రమాదాలు పెరిగాయి ఒకటి వరకట్నం. ‘వరకట్నం’ స్త్రీలను కట్టుబానిసలుగా మార్చింది. వేలనుండి లక్షలకు, కోట్లకు ఎగబాకింది. ‘వరకట్నం’ కోసం మహిళల చిత్రహింసలు, హత్యలు ఎన్నో జరుగుతున్నాయి. ‘వరకట్నం’కు వ్యతిరేకంగా స్త్రీవాద సాహిత్యం పెద్దగా తడిమినట్టు లేదు. పైగా చాలామంది స్త్రీలు ఈ వరకట్నాన్ని సమర్ధిస్తున్నారు. డిమాండ్ చేస్తున్నారు. స్త్రీవాద సాహిత్యం ‘వరకట్నం’ స్త్రీల సమస్యగా భావిస్తున్నట్టు లేదు. అమ్మాయిల కన్నతండ్రి సమస్యగా భావిస్తున్నట్టుగా వుంది.
రెండు – ప్రేమిస్తున్నాననే వంచన, ప్రేమోన్మాదం, పెళ్లి చేసుకుంటానని మోసం చేయటం, ప్రేమించమని వెంటబడటం ప్రేమించకపోతే కొట్టటం, నరకటం, చంపటం. ఇది ఇటీవల పెరిగిన పెద్దరోగం. వీటికి వ్యతిరేకంగా, పరిష్కారంగా స్త్రీవాద సాహిత్యం కొత్తదారిలో పయనించాల్సిన అవసరముంది. ఇది మగవాడి అహంకారానికి ప్రతీక. చాలా పెద్ద ఉదాహరణే యిస్తాను. నయనతార దేశంలో పేరున్న నటి. ప్రభుదేవా పేరున్న నటుడు. ఇద్దరి ప్రేమాయణం అందరికీ తెల్సిందే! ప్రభుదేవా నయనతారని మోసం చేసాడని ఆర్థికంగా దెబ్బతీసాడని కొందరంటున్నారు. నిజం తెలియదు. ఏమైనా మోసగించినవాడు మగవాడు. మోసపోయింది ఒక స్త్రీ – ఒక స్త్రీ కాదు ఇద్దరు స్త్రీలు. భార్య వుండగా ప్రభుదేవా ‘నయనతార’తో చెట్టాపట్టాలేసుకు తిరిగాడు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యమేమిటీ? – మగవాడు మోసం చేయగలడు. స్త్రీ మోసపోతుంది. ‘స్త్రీ’ ఇలాగే మోసపోవాలా? – ఇటువంటి విషయాలలో అంతరంతరా లలో పురుషాధిక్య సమాజపు అహంకారం కనిపిస్తుంది. ”మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు” – ఈ అహంకారానికి విరుగుడు కనిపెట్టా ల్సిన బాధ్యత స్త్రీవాద సాహిత్యంపై వుంది.
నేను పైన చెప్పిన రెండూ పురుషాహంకారానికి పురుషా ధిక్యతకు నిదర్శనమైన విషయాలే. ఇక స్త్రీకి స్వేచ్ఛ యిచ్చి లాభమేమిటీ?
స్త్రీవాద సాహిత్యం పట్నం మహిళలు – విద్యాధిక మహిళలను దాటి బయటకు రావటంలేదు. భారతదేశంలోవున్న లక్షలాది పల్లెలకు రండి! అక్కడ మహిళలు పడుతున్న బాధలు చూడండి! కన్నీళ్లు చూడండి! పట్నం మహిళలు – విద్యాధిక మహిళలు – ఉద్యోగ మహిళలుగా కాదు. పల్లె మహిళలు ధిక్కరిస్తున్నారు. సమాజం పట్టును తమ గుప్పిట్లో వుంచుకోవాలని పోరాడుతున్నారు.
ఈ వ్యవస్థ తాగుబోతుల వ్యవస్థ. తాగుబోతులను పెంచి పోషిస్తున్న వ్యవస్థ. ఎవరు ఎక్కువగా త్రాగుతారు? మగమహారాజులు! బాగా తాగిన పురుషులు – మహిళలపై జరుపుతున్న చిత్రహింసలవైపు స్త్రీవాదసాహిత్యం దృష్టి సారిస్తుందా?
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags