జూపాక సుభద్ర
సచివాలయంలో ఆ మధ్య నల్లపోచమ్మ గుడిని ‘జయదుర్గ గుడి’గా పేరు మార్చడం పెద్దలొల్లైంది. వూరినుంచి మా దోస్తు ఒకామె ఫోను జేసి రాష్ట్రానికి ఆర్డర్లిచ్చి నడిపిచ్చే సెక్రటేరియట్‌ల అసలు గుడి ఎట్లా కట్టారు అని అమాయకంగా అడిగింది.
సెక్రటేరియట్‌లో యిదివరకు అసలు గుడి లేకుండె కాని ప్రతి డిపార్ట్‌మెంటులో సాయి భజనలు ప్రతి గురువారం జరుగుతుంటాయి. తీర్థ ప్రసాదాలు ఆఫీసర్లకాంచి పంచుతుంటరు. 10.30 నుంచి 12.30 దాకా జరుగుతంటయి. ఆ రోజు ఎంత అర్జంటు ఫైల్లున్నా ఆ టైమ్‌దాకా కదలవు. ఆ ఉద్యోగ భక్తుల్ని కూడా ఆఫీసర్లు ఏమి అనకుండా గౌరవంగా గొప్పగానే చూస్తుంటరు. యిదేదో బాగుందని భక్తులు కానోల్లు కూడా ఆ రోజు భక్తులుగా నటిస్తుంటరు ఆఫీసరు కోసం. క్రిస్టయన్‌లు, ముస్లిమ్స్, దేవుడ్ని నమ్మనివాల్లు ఆ రోజు హింస పడాల్సిందే ఆ భజనలు, హారతులు ప్రసాదాలు లొల్లి భరించలేక ఎటన్నా తిరగబొతుంటరు. ఆ భజన భక్తి కార్యక్రమంకోసం చందాల వసూలు కూడా బాగానే జరుగుతుంటయి. వీటన్నింటిలో మగవాల్లు దళిత ఆడవాల్లు కనిపించరు. ఆధిపత్యకులాల, బీసి కులాల ఆడవాళ్లే యిదంతా చేస్తుంటరు.
ఇది ఒక ఆఫీసు, దీనిలో అనేక మతాలవాల్లు ఉద్యోగులుగా వున్నారు. హిందూ మతం మెజారిటీ అని మాదే అగ్రమని, గొప్పదని యిష్టారాజ్యంగా ఆఫీసుల్ని గుడులుగా చేసే యీ తతంగాన్ని అడ్డుకునే మా ప్రయత్నాలు విఫలమయ్యాయి. సెక్రటరీని ‘సార్ యిది ఆఫీసు యిక్కడ దేవుడి భజనలు యీ తతంగం అప్రజాస్వామికం సార్ దీన్ని మానిపించండి’ అని అడిగితే దానివల్ల మీకొచ్చే నష్టమేంటి? వారానికి ఒక రెండు గంటలు. ఎంత టైమ్ వేస్ట్ చెయ్యట్లేదు మీరు 10.30 నుంచి 5.గల దాక పంజేస్తున్నే వున్నారా’ అని దృష్టికి తీసుకొచ్చినోల్లనే దుర్మార్గులుగా చేసి పంపిండు. సరే అని కనీసం మీడియా ఛానల్స్‌కి చెప్పినా ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలే. సెక్రటేరియట్‌లో ఒక మూలకు మసీదున్నది. యీ సెక్రటేరియట్ నిజామ్ నవాబు కట్టిచ్చినది (యిప్పుడు దాన్ని కూల్చి వేరే బిల్డింగులు కట్టించింది సీమాంధ్ర గవర్నమెంట్) దీనిలో మసీదు కూడా వుంది. అది కూల్చితే ముస్లిమ్ ఉద్యోగలునుంచి యిబ్బందులొస్తాయని అట్లనే వుంచి యింకా కొంచెం బాగా కట్టించారు. బైటకు కనిపించదు. ఒక మూలకు. తర్వాత క్రిస్టియన్లక్కూడ ఒక పక్కకు ప్రార్థన హాలుగా ఒక మూలనున్న రూమ్‌లో హాలు కేటాయించారు. కాని యిప్పుడు సెక్రటేరియట్ ఆఫీసు నడిబొడ్డున సి.ఎం ఆఫీసు ఎదురుగా పెద్దగుడి వెలిసింది. దానికి యగ్న యాగాదులు ఒక వారం రోజులు చేసి ఆఫీసును న్యూసెన్స్ చేసిండ్రు. ఉద్యోగులు సరిగ్గా పనులు చేసుకోలేక అనేక యిబ్బందులు పడిండ్రు. ఆ ధ్వని కాలుష్యం, హిందూ మత కాలుష్యం ఆఫీసు వాతావరణాన్ని చెరిపి గుడి ఆవరణం చేసి పెట్టారు. యీ గుడి నిర్మాణం జరిగిపోయింది. నిజానికి యిఫ్పుడున్న యీ గుడి స్థానం నాలుగో తరగతి ఉద్యోగులు సైకిల్లు బెట్టుకునే సైకిల్‌స్టాండ్. ఆ స్థలంలో వీరు కలవడం, మీటింగులు పెట్టుకోవడం చేసేవారు. తర్వాత్తర్వాత 4వ తరగతి ఉద్యోగినులు ఒక చిన్న రాయి బెట్టి దానికి పసుపు కుంకుమ బెట్టి దీపమ్నుట్టివ్వడం మొదలుబెట్టిండ్రు. తర్వాత ఆ రాయి చుట్టు యిటుకలు బెట్టి మెక్కుకునేవాల్లు. సమావేశమయేవాల్లు లంచ్‌లు తినేవాల్లు. క్లాస్ ఫోర్ మహిళలకు యిదొక అడ్డ అయిపోయింది. తర్వాత ఆ రాయిచుట్టూ అర్థగజం చిన్న సిమెంట్ గోడలేచింది. అక్కడికి క్లర్కులు, ఆఫీసర్లు ఎవరూ వెళ్ళకపోయేది. మొదట్లో ఏంటిది యీ బుజ్జిగుడి అని అడిగితే ఓ సారి ఎల్లమ్మనీ, యింకోసారి ఓషమ్మ అని చెప్పేవారు. ఎక్కువగా మహిళా అటెండర్లు, స్వీపర్లు, తోటమాలీలు ఆ స్థలంలో చెెట్టు నీడకు కూర్చునేవాల్లు ఎందుకంటే వారికంటూ సీట్లు ఆఫీసుల్లో వుండవుకాబట్టి. ఆ స్థలాన్ని వీళ్ళే శుభ్రం చేసుకుని వాడుకునే వాల్లు. పసుపు బొట్టుపెట్టి అప్పుడప్పుడు దీపం బెట్టేవాల్లు.
ఒక సీమాంధ్ర పైరవీకారుడికి అచ్చొచ్చిందనీ మొక్కు తీర్చాలనీ పాలిస్ బండ వేయించి రెండు మీటర్ల ఎత్తు బెంచి కట్టించిండు. అట్లా బైట పైరవీకారులక్కూడ వచ్చి కూర్చునే అడ్డాగుడి అయింది. సిఎమ్ బిల్డింగ్ ఎదురుగానే వుంది గనుక వైఎస్‌ఆర్, సిఎమ్ అయినపుడు యీ గుడిని సందర్శించడం పూర్ణకుంభం స్వాగతాలు అన్నీ యీ గుడినుంచే జరిగినయి. విషాదమేమంటే ఎప్పుడైతే చిన్నరాయిగా వుండిన పోచమ్మగుడి స్థాయి ఎదగడంతో క్లాస్‌ఫోర్ ఉద్యోగినులు రూపొందించిన స్థలంలోకి వారినే రానియ్యక పోవడం హిందూ దుర్మార్గం. బ్రాహ్మడు ధూపదీపనైవేద్యాలు, మంత్రాలు, హుండీ మొత్తం హిందూ ఆలయంచేసి ఆ మహిళలకు అప్రకటిత నిషేధాలు చేసినారు. యిప్పుడు క్లాస్‌పోర్ ఉద్యోగులకు, ఉద్యోగినులకు ఆ గుడి పరిసరాలు వెళ్ళగూడని, కూర్చోగూడని స్థలమైంది. నల్లపోచమ్మ గుడిని ‘విజయదుర్గ’ ఆలయంగా పేరు మార్పు చేయగా తెలంగాణ ఉద్యోగులు పేరు మార్చడమ్మీదనే లొల్లి చేసిండ్రుగానీ లౌకిక ప్రజాస్వామ్యాలు దెబ్బతినేట్లుగా ఏర్పాటైన మత కట్టడాన్ని వ్యతిరేకించక పోవడం, ఆఫీసుల్లో ఏ మత కట్టడాలుండొద్దు వున్న వాటిని కూల్చాలి అని అనకపోవడం విచారకరం.
-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags