పసుపులేటి గీత
‘నా కళ ఒక ఆర్తగీతి. ఒక సహాయం కోసం.., ఒక నిర్ణయం కోసం.., మన సమస్యలన్నింటికీ ఒక తాత్విక పరిష్కారం కోసం ఉద్దేశితమైన గీతమది. అంతమాత్రం చేత నా కళాఖండాలు నిర్భాగ్యంగా, నిస్సహాయంగా వాపోవు. కేవలం రాజకీయ సమస్యలే కాదు, అన్ని వాస్తవిక సమస్యల్ని మూలాలతో సహా అధ్యయనం చేసి, సత్యాన్ని ఆవిష్కరించడమే నా అభిమతం.’
– షిరిన్ నెషత్
షిరిన్ నెషత్ ఫోటోగ్రాఫులు, మల్టీమీడియా ఇన్‌స్టలేషన్స్‌తో ప్రపంచంలో ఈ కాలపు కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న మహిళ. పాశ్చాత్య ప్రపంచం అమితంగా ఆదరించే పర్షియన్ కళాకారిణి నెషత్. ఆమె 26, మార్చి, 1957న ఇరాన్‌లోని క్వాజ్విన్‌లో జన్మించింది. ఇరాన్‌లో 1979ల నాటి ఇస్లామీయ విప్లవకాలంలో ఆమె లాస్‌ఏంజిలిస్‌లో ‘ఆర్ట్’ ను అభ్యసించింది. మాతృదేశం ఇరాన్ అయినప్పటికీ ఆమె ఇప్పుడు అమెరికాలో ప్రవాస జీవితాన్ని గడుపుతోంది. నెషత్ జీవితం మీద సంప్రదాయ ఇరాన్ సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం కలగలిసి కనబడుతుంది. ఆమె తండ్రి పాశ్చాత్య జీవన శైలిలోని స్వేచ్ఛాయుత భావజాలాన్ని అభిమానించి, జీవితంలో దాన్ని అమల్లో పెట్టిన ఫలితంగా నెషత్ బలమైన వ్యక్తిత్వానికి చిన్నతనంలోనే బీజం పడింది. ఇరాన్‌లో అడుగంటిన మానవ విలువలు, ముఖ్యంగా నానాటికీ తీసికట్టుగా మారిన మహిళల అస్తిత్వం నెషత్ చిత్రాల్లో మనకు కనిపిస్తాయి. మహిళలు బహిరంగంగా పాడడంపై అక్కడ నిషేధం ఉంది. ఆ పరిస్థితిని ప్రతిబింబిస్తూ ‘టర్బ్యులెంట్’ పేరిట ఆమె చిత్రీకరించిన వీడియో చూసి తీరాల్సిన కళాఖండం. ఒక పురుషుడు కెమెరా వైపు తిరిగి పాడుతుంటాడు (రూమీ గీతాన్ని ఆలపిస్తాడు). అతని బ్యాక్‌డ్రాప్‌లో పురుషులతో నిండిన ప్రేక్షక సమూహం ఉంటుంది. పక్కనే (ఒక విభజన రేఖ ఉంటుంది) ఒక మహిళ ఒక ఖాళీ ఆడిటోరియంలో కెమెరా వైపు వీపును ఉంచి బురఖాలో నిలబడి ఉంటుంది. పురుషుడి పాటకు ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటుతాయి. తరువాత మహిళ వైపు నుంచి ఒక విషాదగీతం సన్నగా మొదలవుతుంది. కెమెరా ఆ మహిళ చుట్టూ తిరుగుతుంది. అభినయంలోనే (మనకు ఆ భాష అర్థం కాకపోయినా) ఆ మహిళ తన మీద విధించిన నిషేధం తాలూకు వ్యథనంతా మన కళ్ళకు కడుతుంది. ఇదొక్కటే కాదు షిరిన్ నెషత్ కెమెరా నుంచి ‘రప్చర్’, ‘ఉమెన్ వితవుట్ మెన్’ (తొలిసారిగా నెషత్ చిత్రీకరించిన ఈ పూర్తి స్థాయి చలన చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా చలనచిత్రోత్సవాల్లో ఎన్నో మన్ననల్ని, అవార్డుల్ని గెలుచుకుంది). ‘ఉమెన్ ఆఫ్ అల్లా’ (నెషత్ తాను తీసిన ఫోటోగ్రాఫుల మీద ఇరాన్ మహిళల రచనల్ని అందంగా ముద్రించి, ఆవిష్కరించిన ఒక దృశ్యకావ్యమిది) తదితర కళాఖండాలు రూపొందాయి. వెనిస్ బైనెల్లే చిత్రోత్సవంలో నెషత్ చిత్రీకరించిన టర్బ్యులెంట్, రప్చర్ వీడియోలకు అవార్డులు లభించాయి. ఇరాన్ మహిళల మనోగతానికి అద్దం పడుతున్న నెషత్ కళాభినివేశం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆమె వీడియోలు కొన్ని ‘యుట్యూబ్’ లో లభ్యమవుతున్నాయి. తన కళ గురించి, తన లక్ష్యాల గురించి నెషత్ ఇలా చెబుతోంది.
‘ఇవాళ నేను మీతో పంచుకుంటున్న ఈ నా స్వీయ గాథ ఒక ఇరానియన్ కళాకారిణిగా, ప్రవాస జీవితాన్ని గడుపుతున్న ఒక ఇరానియన్ మహిళా కళాకారిణిగా నేను ఎదుర్కొన్న సవాళ్ళ సారాంశమే. ఇందులో మంచీ చెడులు రెండూ ఉండవచ్చు. చీకటి కోణాల్లో రాజకీయాలు నాలాంటి వాళ్ళని వేటాడుతుంటాయి. ఇరాన్‌లో పుట్టిన ప్రతి కళాకారుడూ ఏదో విధంగా రాజకీయానికి చెందిన వాడే. మా జీవితాల్ని రాజకీయాలు శాసిస్తాయి. మీరే కనుక ఇరాన్‌లో ఉన్నట్టయితే మీమీద సెన్సార్ నిబంధనలు, వేధింపులు, అరెస్టులు, హింస సర్వసామాన్యంగా జరుగుతుంటాయి. ఒక్కోసారి మరణదండన కూడా. నాలాగా మీరు ఇరాన్‌కు వెలుపల-ఒక ప్రవాసిగా జీవిస్తుంటే, మీ కుటుంబానికి, మీ ఆత్మీయులకు దూరంగా ఉండడం వల్ల కలిగే వేదనకు బలికావలసిందే.
నా జనంతో మాట్లాడడానికి, నా దేశంతో సంబంధం పెట్టుకోవడానికి నాకు ఎలాంటి వీలు లేదు. కానీ నా గురించి, నాలాంటి వాళ్ల గురించి, మా వ్యక్తిత్వాల గురించి, మా మహిళల గురించి, మా రాజకీయాల గురించి, మా మతం గురించి పాశ్చాత్య ప్రపంచం అనుమానంగానే చూస్తూంటుంది. మేము నిజంగా రెండు యుద్ధాల్ని చేస్తున్నాం. మాతృదేశంతో, ప్రవాసంతో! ఇరాన్ ప్రభుత్వం నుంచి మాలాంటి కళాకారులకు ప్రతిక్షణం ప్రాణగండం పొంచి ఉంది. మేం ప్రమాదంలో ఉన్నాం. కానీ ఇరాన్‌కు చెందిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సంభాషణకు మేము మాధ్యమంగా నిలిచాం. మేము ప్రవాసంలో ఉన్నామంటే, మా ప్రజలకు ప్రేరణను, స్ఫూర్తిని అందిస్తున్నామన్న మాటే.
ఒక కళాకారినిగా నా ప్రయాణం పూర్తిగా వైయక్తికమైందే. నేనిక్కడ ఇరాన్‌ను గురించిన రాజకీయ వ్యాఖ్యలు చేయబోవడం లేదు. నా మొదటి చిత్రం 1979ల్లో ఇరాన్ పర్షియన్ సంస్కృతి నుంచి బలవంతంగా దూరమై ఇస్లామీకరణకు గురైన వేదనను కళ్ళకు కడుతుంది. పన్నెండేళ్ళ ప్రవాసం తరువాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఇరాన్‌కు వచ్చినపుడు నేను నా వాళ్ళని కలుస్తానని ఎంతగానో ఆనందించాను. కానీ ఇరాన్ స్వభావం పూర్తిగా మారిపోయింది. ఆనాటి రాజకీయ పరిణామాల్ని జీవితంలోకి ఆహ్వానించాల్సిన అగత్యం ఇరాన్ మహిళల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిందో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో భగవంతుని పట్ల ప్రేమ, విశ్వాసం ఒక వైపు, హింస, నేరం, రాక్షసత్వం మరొకవైపు – ఈ రెండింటి మధ్య నిలబడి జీవనపోరాటం సాగించిన యోధులు నా దృష్టిని ఆకర్షించారు. కానీ నేను ప్రభుత్వాన్ని కానీ, ఇస్లామీయ విప్లవాన్ని కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేను. అయినప్పటికీ ఇదంతా నాకొక సొంతగొంతును ప్రసాదించింది. నా కత్తి మరింత పదునెక్కింది. నేను మొరాకో, టర్కీ, మెక్సికోల్లో పనిచేశాను. ఎక్కడికి వెళ్ళినా నేను నా ఇరాన్‌ను ప్రతిబింబించడానికే ప్రయత్నించాను. ఈ క్రమంలో భాగంగానే నేను ఇరాన్ చరిత్రను ప్రతిబింబించే ‘ఉమెన్ వితవుట్ మెన్’ అనే చలనచిత్రాన్ని నిర్మించాను. నా దేశం గురించి పాశ్చాత్యులకు తెలియజెప్పాల్సిన అవసరాన్ని నేను అనుభూతించాను, దాని ఫలితమే ఈ చిత్రనిర్మాణం. ఒక రాజకీయకథనాన్ని మహిళల వైపు నుంచి చెప్పే ప్రయత్నం చేశాను. ఆనాడు ఏ ప్రజాస్వామ్యంకోసం, సామాజిక న్యాయం కోసం ఇరాన్ కలవరించిందో, నేటికీ అలాంటి కొరతలోనే నా దేశం మగ్గడం దురదృష్టకరం. ఇస్లామీయ విప్లవం మహిళల్ని సొంతగొంతుక లేని, వ్యక్తిత్వంలేని వాళ్ళుగా చిత్రీకరిస్తే- ఇవాళ టెహరాన్‌లో మహిళలు అందుకు విరుద్ధమైన జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ విద్యావంతులైన మహిళలు, యువకులు కూడా సమష్టిగా తమ లైంగిక, సామాజిక వ్యక్తిత్వాల్ని నిర్భయంగా చాటుకుంటూ ఒక వినూత్న పోరాటంలో భాగస్వాములయ్యారు. అందుకే నాకు ఇరాన్ మహిళలు స్ఫూర్తి ప్రదాతలయ్యారు. అందుకే నేను ఇవాళ ఇరానియన్ మహిళగా జన్మించినందుకు, ఇరానియన్ కళాకారిణిని అయినందుకు గర్వపడుతున్నాను.’
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags