మీడియాలో మహిళగా నా అనుభవం

రెహనాబేగం
నేను ఆమెను అడిగాను కొండమీద నుంచి వెదురు చెట్లు అతను తీసుకువస్తే అప్పుడు మీరు వాటితో వెదురు బుట్టలు తయారుచేస్తారా అని. వారిద్దరూ నా వైపు తదేకంగా చూస్తున్నారు. నా భావం అర్థం కాలేదేమో అని నా మెదడు అదే ప్రశ్నను వారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అని చురుగ్గా ఆలోచిస్తోంది. నాలుగు సెకన్ల తర్వాత ఆమె సమాధానం విని నేను ఆమెను అర్థం చేసుకోనందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను తెచ్చుకోలేనా…నేనే చెట్టు కొడతాను, నేనే మోసుకు వస్తాను… బుట్టలు తయారు చేసి గుట్ట కింద సంతలో అమ్ముకుంటాను.. అదీ ఆమె నోటి వెంట వచ్చిన మాటలు.. ఎవరి పని వారిమే చేసుకుంటాం..ఆమె సమాధానానికి అతని కొనసాగింపు అది.
జాకెట్టు వేసుకోవటం కూడా తెలియని..అక్షరజ్ఞానం లేని..సిటీల్లో మనం క్లాస్‌గా చెప్పుకునే అనాగరిక సమాజం వారిది. సభ్య ప్రపంచానికి దూరంగా…కొండల మీద, నిండైన అడవుల్లో ఉండే ఓ గిరిజన మహిళ ఆమె. పేరు సుజాత.ఎంత ఆత్మవిశ్వాసం ఆమెలో. అతను ఆమె భర్త. కొండలు, గుట్టలు ఎక్కి మగవారు మాత్రమే చేయగలరు అని మనం భ్రమించే పనులను అవలీలగా చేసుకుని వెళ్ళిపోతున్న ఆ మగువలు ఈ అనాగరిక సమాజానికి మార్గదర్శకులు కదూ.. ఆ వెదురు బుట్టలు అమ్మగా వచ్చిన డబ్బులు ఏం చేస్తావంటే.. నాకు నచ్చినవి కొనుక్కుంటాను అంది ఆమె. ముచ్చటేసింది అమాయకమైన ఆ మోములో కనిపించిన ఆ ఆర్ధిక స్వావలంబన చూసి, ఆ సమాజం అక్కడి మహిళలను అలాగే తీర్చిదిద్దింది. పనులే కాదు సరదాలు అంతే.
పండగో పబ్బమో వస్తే అందరూ కలిసి ఇప్పసారా తాగుతారు. కబుర్లు చెప్పుకుంటారు. జీవితాన్ని ఆ పచ్చటి చెట్ల నీడన అస్వాదిస్తారు. ఎప్పుడూ మహిళ అనే వివక్ష ఉండదు. బాధ్యతలు, అధికారాలు సమానంగా పంచుకుంటారు.
ఇది నేను బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండిపోయిన గిరిజన తండాలపై రిపోర్డ్‌ చేయడానికి ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గరలోని అడవులకు వెళ్ళినపుడు ఎదురైన అనుభవం. మహిళల హక్కులు, ఆకాశంలో సగం, 33శాతం రిజర్వేషన్లు..ఇలాంటి పెద్ద పెద్ద మాటలు, విజ్ఞానవంతుల భావజాలం వారికే మాత్రం తెలియదు. తెలిసిందల్లా ఆడా, మగా, పిల్లా, పెద్దా అందరూ కలిసి కట్టుగా కష్టపడటం, వచ్చినదాన్ని అందరూ కలిసి పంచుకోవడం. కష్టం వస్తే ఊరనుకునే ఆ నాలుగైదు ఇళ్ళ వాళ్ళు తలా ఒక చెయ్యి వేయటం. అదే గిరిజనం.
సరే ఇప్పుడు హైదరాబాద్‌ రాష్ట్ర రాజధాని నగరానికి వద్దాం. మహిళా జర్నలిస్ట్‌గా నాకు ఎదరైన రెండు సంఘటనలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. నేను రాజకీయ వ్యవహారాలు చూసే పొలిటికల్‌ రిపోర్టర్‌ను. నా డ్యూటీలో భాగంగా పార్టీ కార్యాలయాలకు వెళ్ళుతుంటాను.
అక్కడే రాజకీయ నాయకులతో చిట్‌ఛాట్‌ జరుగుతుంటుంది. తాజా రాజకీయ పరిస్థితులు, గత సంఘటనలు లాంటివి వారు మాతో ఆఫ్‌ ది రికార్డ్‌, ఆన్‌ రికార్డ్‌ పంచుకుంటూ ఉంటారు. వాటి ఆధారంగా కొత్త కోణాలతో స్టోరీలు చేసే అవకాశం మాకు లభిస్తుంది. అలానే ఓ రోజు నేను, మరో పది పదిహేను మంది రిపోర్టర్లం, రాయలసీమకు చెందిన మాజీ మంత్రి, మరో ఇద్దరు ఇతర నేతలు ఆ గదిలో కూర్చుని ఉన్నాం. వారందరిలోకి నేను ఒక్కదాన్నే అమ్మాయిను. తెలంగాణావాదం, జగన్‌ ఎఫెక్ట్‌ ఇలా మాట్లాడుతూ మాటల మధ్య సదరు  మాజీ మంత్రిగారు హద్దులు దాటి మహిళలు ఉన్నప్పుడు మాట్లాడకూడని.. సరిగ్గా చెప్పాలంటే గౌరవప్రదమైన ఒక ప్రజాప్రతినిధి ఎవరి ముందైనా వాడకూడని పదజాలం వాడేశారు. హఠాత్తుగా ఆ మాటలు విని ఎలా స్పందించాలో నాకు తోచలేదు. బయటకు వెళ్ళిపోవాలా…అలా చేస్తే ఆ మాటలు నేను విని అర్థం చేసుకున్నట్లవుతుంది. అది కూడా ఇబ్బందికరంగా అనిపించింది. లేదా నేనేమీ విననట్లు నటిస్తూ ఉండిపోవాలా…మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. నేను తేరుకునే లోపే ఆ నేతే మరో అడుగు ముందుకు వేసి ”అమ్మా…నువ్వు బయటకు వెళ్ళిపో… మేము కాస్త మోతాదుకు మించి మాట్లాడుకోవాలి” అని అన్నారు. నా జెండర్‌ అక్కడ అందరిలో వేరుగా గుర్తించబడింది. జర్నలిస్ట్‌గా కంటే అమ్మాయిగా నేను అక్కడ ఉన్న మగవారి ముందు నిలబడినట్లయ్యింది.
అసెంబ్లీ లాబీలు కావచ్చు…గాంధీభవన్‌ కావచ్చు…లేదా మరో పార్టీ కార్యాలయం కావచ్చు.. నేతలు, రిపోర్టర్లు మాట్లాడకునే అనేక సందర్భాల్లో నేను ఉన్నప్పుడు ”ఇక్కడ ఈమె లేకపోతే ఇంకేదో చెప్పేవాడిని…” ఇలా తరచూ చాలామంది రాజకీయ నాయకులు వారి డైలాగును మూడు చుక్కలు పెట్టి ఆపటం. అంటే పరోక్షంగా అక్కడ నా అస్థిత్వం వారికి ఇబ్బందికరంగా ఉందని చెప్పటం…వాటిని విని ఏమి చేయలేక ప్రొఫెషనల్‌ రిపోర్టర్‌గా ఇటువంటివి పట్టించు కోకూడదని సర్దిచెప్పుకోవటం అలవాటైపోయింది.
ఇలాటి మరో సంఘటన అధికార పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో జరిగింది. అక్కడి కార్యాలయ సిబ్బంది గది అది. రిపోర్టర్లు అక్కడ ఉండే పేపర్లు తిరగేస్తూ, టివీల్లో అప్‌¦్‌ డేట్స్‌ చూస్తూ కాస్త సమయం గడుపుతారు. అది జూన్‌ 14 వ తేదీ. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు రోజు. శాసనమండలి ఛైర్మన్‌ జానీగారు, మచిలీపట్నం ఎమ్మెల్నే పేర్నినాని, నేను, మరికొంతమంది రిపోర్టర్లం కూర్చుని వున్నాం. ఇప్పుడు కూడా జెండర్‌ పరంగా నేను ఒక్కదాన్నే. ఆ మరుసటి రోజే ఫలితాలు కావటంతో మా చర్చంతా దానిపైనే నడుస్తోంది. అంతలో అనంతపురానికి చెందిన మంత్రిగారు ఒకరు అక్కడికి వచ్చారు. వారి జిల్లాలో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. అనంతపురం టౌన్‌లో కాంగ్రెస్‌ మైనారిటీ మహిళను బరిలో పెట్టింది. కాని ఆమెకు జిల్లా నేతలెవరూ సహకరించలేదని ఒక సమాచారం. దీన్నే ఒక రిపోర్టర్‌ మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చారు. ఆ ప్రశ్న వినటంతోనే సదరు మంత్రివర్యులకు కోపం నషాళానికి అంటింది. అంతే ”…ఆ మాట్లాడకు” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒక జర్నలిస్ట్‌ వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే తీరు అదేనా అనే అంశం కంటే మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి స్త్రీత్వాన్ని కించపరుస్తూ ఉపయోగించిన పదజాలం విని నాకు తలకొట్టేసినట్లయ్యింది. నేను దిగ్భ్రాంతిగా చూస్తున్నంతలో ఆయనే నా దగ్గరకు వచ్చి ”నువ్వు బయటకు వెళ్ళమ్మా… ఏమనుకోవద్దు…దయచేసి బయటకు వెళ్ళాల్సిందే”అని ఆదేశించారు.
అంతమందిలో స్త్రీత్వాన్ని కించపరుస్తూ మాట్లాడడం తప్పు. పైగా అది అతని సొంత ఇల్లో, డ్రాయింగ్‌్‌రూమో కాదు… నన్ను బయటకు పొమ్మనటానికి. రాజకీయ వ్యవస్థలో భాగమైన ఒక కార్యాలయం. ఒక జర్నలిస్ట్‌గా నా బాధ్యతల నిర్వహణలో భాగంగా నేను అక్కడ ఉన్నాను. అతనేదో స్వేచ్చగా బూతులు మాట్లాడుకోవటానికి నన్ను వెళ్ళమనే హక్కు మంత్రికి లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వామి అయిన మంత్రి, ప్రజాప్రతినిధిని అంటూ తెల్లచొక్కాలు వేసుకున్న వీరికి నలుగురిలో సభ్యతగా మాట్లాడటమే రాదు అని బాధపడాలా…లేక నేను ఆడదాన్ని అయిపోయానే అని మధన పడాలా…తెలియని, తేల్చుకోలేని స్థితిలో పడిపోయాను.
ఇక్కడ నన్ను కలిచివేసిన మరో అంశం.. నా తోటి సహచరుల స్పందన. ఒక మహిళా జర్నలిస్ట్‌ పట్ల రాజకీయ నేతల ఇటువంటి ప్రవర్తన చూసినప్పుడు..అదేమిటి.. మీరు అలా మాట్లాడటం పద్ధతిగా లేదు.. ఆమె మా సహ జర్నలిస్ట్‌ అని మద్దతుగా నిలబడిన ఒక్క గొంతూ ఎప్పుడూ వినిపించలేదు.
ఎంత తేడా…గిరిజనానికి…నాగరికానికి..

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.