ప్రతిబింబాల్ని ద్వేషించే భావ దాస్యం

కొండేపూడి నిర్మల
మీ పిండాన్ని ఎప్పుడు బడిలో జేర్పిస్తున్నారు…?
ఇలా అడిగితే ఏదోలా వుంది కదూ, పోనీ మీ గర్భస్థ పిండాన్ని ఏ బడిలో చదివిస్తున్నారు….? ఇదీ బాలేదా….? సరే అయితే కాస్త గంభీరంగా, అర్థవంతంగా వున్నట్టున్నాయి.
నెల తప్పి నలభైైరోజులయిందా, అయినా గర్భం నిలబడుతుందో లేదో తేలడానికి సాంకేతికంగా ఇంకా కొంత ఎదురుచూపు వుంది…? ప్రస్తుతం వాంతులతో, కళ్లుతిరగాడాలతో బోలెడంత అలసటగా వుండచ్చు…? అంతమాత్రాన ఆగకండి. ముందుకే ఉరకండి. తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు పిండం ముదిరితే వాళ్ల అయ్య పోలికలోకో, అమ్మపోలికలోకో దిగిపోవచ్చు. మీ పిల్లలు మీ ఆకారంతోనూ, తెలివి తేటలతో పుట్టేస్తే ఎలా? పక్కింటి ఆయన లాగానో హ్యూమన్‌ పొటేన్షియల్‌ నిపుణుల్ని నమ్ముకోండి. వాళ్లే దారి చూపిస్తారు. నెల తప్పినట్టు మీ ఇంట్లో వాళ్లకి చెప్పినా చెప్పకపోయినా ఏం కాదు. వీరికి కబురు చేస్తే చాలుట. ఇరవై కేజీల పుస్తకాలు, సిడీలు వి.పి.పిలో పంపుతారు. ఆ క్షణం నుంచే మీరు, కాదు మీ కడుపులోని పిండం వారి విద్యార్థుల జాబితాలోకి చేరిపోతుంది. ఎటొచ్చి పిండం బైటి వాతావరణంలో బతకడం కష్టం కాబట్టి పదినెల్లపాటు మీరే గర్భాన్ని మోసుకుంటూ క్లాసులకి వెళ్లాల్సి వుంటుంది. పిల్లతో బాటు తల్లికీ పండగ డిస్కౌంట్‌ లాంటిది దొరికి పోతుంది. ఇంత గొప్ప సదుపాయాల్ని అందించడానికి ఇవాళ లిటిల్‌ జెమ్స్‌, సూపర్‌ కిడ్స్‌ కాలనీ వాళ్లు బొంబాయిలో బోర్డులు తగిలించుకున్నారు. త్వరలోనే మీ గల్లీలోనూ బోర్డులు లేవచ్చు. రెండో నెలనుంచీ పదో నెల దాకా గర్భస్థ పిండానికి అనేక దశలుంటాయి కదా. అన్నిటికంటే మెదడు మొదట నిర్మాణమవుతుందని డాక్టర్లు అంటున్నారు. శరీరంలోని అన్ని అవయవాల్ని మెదడే నియంత్రించాలి. తీరా ఆ మెదడుని రూపుదిద్దుకుంటున్న దశలోనే ఈ కంపెనీలు నియంత్రించబోతున్నాయన్నమాట. రెండో నెల నుంచీ ఈ శిక్షణ మొదలవుతుందంటేనే ఆలోచించండి. రెండో నెల గుడ్డు చిటికిన వేలంత వుంటుంది కదా. మరి దాని మెదడు చింత గింజంత అయినా వుంటుందో లేదో. నోరులేని పిండానికున్న ఆ చిన్నమెదడులో మనకి కావలసిన ప్రోగ్రాం చిప్‌ని తగిలిస్తున్నామన్నమాట. వినడానికి బాధగా లేదూ. చివరికి పోటీ ప్రపంచం మనల్ని ఎలా తయారుచేసిందో చూశారా…? పుట్టని పిండాల్ని కూడా పోటీ ఎరీనాలోకి లాగుతున్నాం.
లోగడ మంజులా పద్మనాభం రాసిన హార్వస్ట్‌ నాటకం ఒకటి గుర్తుకు వస్తోంది, అందులో  ఓం ప్రకాష్‌ అనే పేద యువకుడి అవయవాల్ని గిన్ని అనే ఐశ్వర్యవంతురాలు కొంటుంది. సర్జరీ అయ్యేలోపు తను కొనుగోలు చేసిన అతని శరీరానికి గొప్పవసతులు ఇచ్చి అతను నచ్చిన తిండి తినకుండా, మనసనేదే లేకుండా, మెదడుతో ఏది ఆలోచించాలన్నా యజమానురాలి అనుమతి కోరుతూ చివరికి మొత్తం అంతా శూన్యమయిపోతాడు. ఇందులో ఇంకా ఇతర పాత్రలూ వున్నాయి. హైటెక్‌ రాకెట్‌లో వున్న బాడి ఆర్గాన్స్‌ వ్యాపారీకరణను పూర్తి స్థాయి బ్లాక్‌ మ్యాజిక్‌ సాయంతో ఇక్కడ రవీంద్రభారతిలోనే ప్రదర్శించారు. తెలుగులో చదవాలంటే పి. సత్యవతిని అడగండి. తను ఆహ్వానం పత్రికలో సమీక్ష రాసింది.
రాజులు పక్కరాజ్యపు ప్రజల మీద అధిపత్యం సాధించడానికి యుద్ధాలు చెయ్యడం పాత పద్ధతి. ఇప్పుడు రాజ్యంలోని సైంటిస్టులు సైన్సు సాయంతో మెదడుమీద పట్టు సాధించడమెలాగో నేర్పడం కొత్త పద్ధతి. దీని వల్ల అందరూ ఒకే మూసలో తేలుతారు. చక్రవర్తి నీలి కళ్లతోనే పిల్లల్ని కనాలనే నిబంధన మోసిన బార్బేరియన్‌ బానిస జాతి లాగా గర్భవతులందరూ ఆ సూపర్‌ కిడ్‌ కంపెనీలో చేరిపోతారు. ఇటువంటి విపరీత చికిత్సలు డబ్బున్న వారికే సాధ్యమవుతాయి కాబట్టి ఇక గొప్ప మేధావులందరూ ఒకే వర్గానికి సంబంధించిన వాళ్లయి వుంటారు. అందరి మెదడు మీద ఒకే మార్కెట్‌ చదువుల రబ్బరు స్టాంపు కొట్టబడుతుంది కాబట్టి కొత్త విద్యలూ, ప్రతిభలూ చచ్చినా వెలుగులోకి రావు.
ఇప్పటికే ఈ దేశంలోని తల్లులు గర్భాలతో బాటు అనేక వివక్షలు మోస్తున్నారు.
ఓ పక్క కడుపులో వున్న పిండం మగబిడ్డ అవునో కాదో అని ఒక భయం, ఇంకోపక్క కడుపులో వున్న పిండం నల్లగానో ఛామనచాయగానో పుడుతుందేమో అని భయంతో  సంప్రదాయక కుంకుమపువ్వు మరియు ఆధునిక మెలనిన్‌ మాత్రలు పనిచేస్తాయోలేదో అనేది ఒక భయం., సర్రోగేట్‌ మదర్స్‌గా గుడ్డు ఒకరిది, జ్యూస్‌ ఒకరిది కాగా వారి గర్భసంచినీ కూరగాయల సంచిలా నింపడానికి, దులపడానికి కిరాయి బేరం దొరుకుతుందో లేదో అనే భయం, ఇప్పుడు కొత్తగా కడుపులో పిండానికి తీసుకున్న క్లాసులు నిజంగా పనికొస్తాయోలేదో, అలా పనికిరాకపోతే ఆ నిందనీ, ఇంటిల్లిపాది అసంతృప్తినీ భరించడమెలాగో తెలీని భయం….
వెట్టి చాకిరీ తప్పు అని, బాల్యాన్ని కాజేసే హక్కు ఎవరికీ లేదని అంటున్నాం. మరి పుట్టే పిండాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిజైన్‌ చేసుకోవచ్చా…? తల్లులారా మీ కడుపు ఇప్పుడు ఒక చదరంగం బోర్డుగా మారబోతోంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పావులు కదుపుతారు. మానవ నాగరికత ఇంకా పెరుగుతున్న కొద్దీ మనుషులు భావ దరిద్రంలో పడి కొట్టుకుంటూనే వుంటారు….?

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.