శివరాణీ దేవి ప్రేమ్‌చంద్ అనువాదం : ఆర్. శాంతసుందరి
(గత సంచిక తరువాయి)
”ఆ సంగతి నువ్వే చూసుకోవాలి. నీకూ, నాకూ ఉన్నంత శ్రద్ధ మిగతావాళ్ళకి ఎందుకుంటుంది? చెదలు పట్టాయంటే పుస్తకాలన్నీ పాడైపోతాయి!” అన్నారు.
”సరే, చూసుకుంటూనే ఉన్నాలెండి,” అని అక్కణ్ణించి ఆయన గదిలోకెళ్ళి చూద్దును కదా, పుస్తకాలన్నీ గోడకి ఆనించి పెడుతూ ఉండటం కనిపించింది. ”అలా ఎందుకు గోడకి ఆనించి పెడుతున్నారు?” అని అడిగాను సర్దుతున్న మనుషులని, నా మాటలు ఆయనకి వినిపించినట్టున్నాయి, ”నే చెప్పానా? అలా ఎవరికీ పని అప్పజెప్పేసి కూర్చోకూడదు. మన పని సరిగ్గా జరుగుతోందా లేదా అని మనమే చూసుకోవాలి,” అన్నారు.
”సరిగ్గా పెడతారు లెండి,” అన్నాను.
”లోకరీతి అది, పట్టించుకోరు. మనం చూడకపోతే లోకం మనని తెలివితక్కువవాళ్ళ కింద జమ కడుతుంది. పైగా బోలెడంత నష్టం కూడా మనకే!” అన్నారు.
ఇంకా పాతింటినించి సామాను వస్తూనే ఉంది. కొంత వచ్చింది. కొంత రావలసి ఉంది. ఇంతలో ఇంటి యజమానికీ ధున్నూకీ వాగ్వివాదం మొదలైంది. యజమాని ఇంటికి తాళం వేసేసి సామాన్లు తియ్యనివ్వకుండా అడ్డుకున్నాడు. ధున్నూ కూలీలతో వెళ్ళి తాళం పగలగొట్టించటానికి ప్రయత్నించాడు. అంతే పెద్ద కొట్లాట జరిగింది. ధున్నూ, ఇంటి యజమానీ గొడవ పడుతున్నారన్న సంగతి మా ఆయనకి తెలిసింది. అప్పుడు మా అల్లుడు మా ఇంటికొచ్చి కొన్నాళ్ళయింది. అతనితో, ”బాబూ, నువ్వెళ్ళి కాస్త ఆ సామాను ఇక్కడికి తీసుకొచ్చే పనిచూడు!” అన్నారు. అతను వెళ్ళగానే నాతో, ”నేనిక్కడ మంచం పట్టాను, అలాంటప్పుడు వీడు ఈ గొడవలు పెట్టుకున్నాడేమిటి?” అన్నారు.
”తప్పు వాళ్ళదే. సామాను లోపల పెట్టి తాళం వెయ్యటం ఏమైనా బావుందా? ఇద్దరూ వయసులో ఉన్న కుర్రాళ్ళాయె! అయినా మనం అక్కడుండగా ఆ యజమాని కొడుకు మీతో కూడా ఎప్పుడూ పోట్లాడేవాడు, గుర్తులేదా? ఏదో చిన్న కుర్రాడులే అని మనం ఏమీ అనేవాళ్ళం కాదు. కానీ ధున్నూ కూడా చిన్నవాడే కదా?” అన్నాను.
”ఇప్పుడు ఎవరిది తప్పని కాదు ఆలోచించాల్సింది. శాంతంగా ఆలోచించి పని జరిపించుకోవాలి. అయినా ఇంత పెద్ద కొట్లాట ఎందుకయింది?”
”వాడు నీళ్ళు ఖర్చు చేసినందుకు డబ్బులడుగుతున్నాడు, నీళ్ళంతా మనమే వాడుకున్నాం అంటున్నాడు. ఆ డబ్బులెవరిస్తారు అంటూ గొడవ మొదలుపెట్టాడు. కొత్త ఇల్లు కడుతున్నప్పుడు నువ్వు ఇక్కణ్ణించే నీళ్ళు మోసుకెళ్ళావు, అందుకే అన్ని నీళ్ళు ఖర్చయాయి” అని ధున్నూ అంటున్నాడు.
”ఆ డబ్బు నువ్వే ఇచ్చేద్దూ, ఏం ఫరవాలేదు! గూండాలతో సమానంగా మనమూ పోట్లాడితే ఏమీ లాభం ఉండదు. అతన్ని పిలిచి డబ్బులిచ్చి పంపెయ్యి,” అన్నారు. ఆయనే చివరికి యజమాని కొడుకుని పిలిపించి, ”నిన్న గొడవపడ్డారుట, ఎందుకు?” అని అడిగారు.
”మీవాడే గొడవపెట్టుకున్నాడు. నీళ్ళ టాక్సు మీరే కట్టుకోవాలి కదా?” అన్నాడు ఆ కుర్రాడు.
”మీరు నలుగురూ ధున్నూకన్నా పెద్దవాళ్ళు, అయినా మాతో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఒకసారి ఇల్లు మాకు అద్దెకిచ్చాక, ఆ ఇంట్లో నీళ్ళు వాడుకునే హక్కు లేదు కదా?” అన్నాను.
”మీ అల్లుడే రాకపోతే పరిస్థితి ఎలా పరిణమించేదో! ఆయన చాలా మర్యాద తెలిసిన మనిషి!” అన్నాడు కుర్రాడు.
”అసలు గొడవ మొదలుపెట్టింది నువ్వు. స్థాన బలిమి నీదయిపోయింది! అందుకే ధున్నూ కూడా తిరగబడ్డాడు!” అన్నాను.
”అరె, ఇప్పుడు నువ్వు గొడవపెట్టుకుంటావా ఏమిటి?” అని నన్ను మందలించి, అతనితో ”చెప్పు బాబూ, ఎంత డబ్బు కట్టాలి?” అన్నారు మా ఆయన.
”పద్ధెనిమిది రూపాయలు,” అన్నాడా కుర్రాడు.
”ఇచ్చెయ్యి, రాణీ!” అని నాకు చెప్పి, అతనితో, ”ఈవిడ ఇస్తుంది తీసుకెళ్ళు. అసలు నువ్వు నేరుగా నా దగ్గరకే రాలేకపోయావా? డబ్బు ఇచ్చేవాణ్ణి, ఈ గొడవ ఉండేది కాదు. ఇంకా చిన్నవాడివి. కాస్త జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంకేమీ బాకీలేం కదా? అద్దెలో ఏమైనా మిగిలుందా?” అని అడిగారు.
”లేదండీ, అద్దె మొత్తం చెల్లించేశారు,” అన్నాడా కుర్రాడు.
”ఈయన ఆ అబ్బాయికి బుద్ధి చెపుతూ, ”చూడు, చిన్న చిన్న విషయాలకి రాద్ధాంతం చెయ్యకూడదు. నిజాయితీగా నడుచుకో, కొంత లౌక్యం అలవాటు చేసుకో. గోరంత విషయానికి మర్యాద పోగొట్టుకోవద్దు. దానివల్ల నువ్వు అవమానం పాలవటమేగాక, ఎదుటివారిని కూడా అవమానించినట్టవుతుంది. ఇవన్నీ అంత ముఖ్యం కాదు. రోజూ మనకెదురయే సమస్యలని నిజాయితీగా, లౌక్యంగా ఎదుర్కోవాలి!” అన్నారు.
ఆయన మాటల్లో పెద్దమనిషిగా చిన్నవాళ్ళకి సలహా ఇవ్వటం అనేదే కాక ఆ కుర్రాడి పట్ల ప్రేమ కూడా ధ్వనించింది. అలా బుద్ధి చెప్పటం వల్ల అవతలి వ్యక్తికి తానేంటో తెలిసివచ్చే అవకాశం ఉంది.
జ జ జ
అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు ఒకరోజు రాత్రి ఆయనకి ఎంతకీ నిద్రపట్టటం లేదు. నేను ఆయన్ని నిద్ర పుచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. రాత్రి ఒంటిగంటయింది. అప్పుడు ఆయన నాతో, ”నేను జబ్బు పడటం కాదు కానీ నీకు తిండీ నిద్రా కరువయాయి! అన్నారు.
నేనాయన తల ఒత్తుతూ ఏమీ మాట్లాడకపోయేసరికి నా చెయ్యి పట్టుకుని, ”ఇలా నా పక్క మీద వచ్చి కూర్చో. నిద్రెలాగూ పట్టటం లేదు, ఏవైనా కబుర్లు చెప్పుకుందాం,” అన్నారు.
”వద్దండి, మీరు నిద్రపోండి, అర్ధరాత్రి దాటింది,” అన్నాను.
”ఎన్ని గంటలుగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నానో చూడు. నేను నిద్రపోతేగాని నువ్వు పడుకోవు! కానీ నిద్ర రాదే. అందుకే నీకొక నిజం చెప్పాలి…నేను చేసిన దొంగతనం గురించి. కానీ నా నోటితోనే చెప్పటానికి కొంచెం సిగ్గు పడుతున్నాను!” అన్నారు.
”దొంగతనమా?”
”ఆ బెంగాలీ యువకుడికి నేను డబ్బిచ్చానని నీకు తెలుసు. అతని భార్యకి నగలూ, బట్టలూ కూడా నేను అప్పుగా ఇప్పించాను. ఆ డబ్బు నీ దగ్గర దొంగిలించి అప్పు తీర్చాను!”
”అలా ఎలా ఇచ్చారు?”
”నీకు తెలీకుండా దొంగతనంగా కథలు రాసి సంపాదించిన డబ్బంతా అతనికే ఇస్తూ వచ్చాను. నీ దగ్గర ఆ సంగతి దాచాను. వేరేదారి లేకపోయింది. ఏ జన్మలోనో అతనికి రుణపడ్డానేమో! అంతకన్న ఏం చెప్పను?”
”లేదు లెండి, నాకవన్నీ తెలుసు, కానీ ఏమీ అనలేదు.”
”అన్నీ నీకు తెలుసా? ఎలా తెలిసిందో చెప్పవా?”
”నగల వ్యాపారి, బట్టల దుకాణం అతనూ మిమ్మల్ని కలిసేందుకు రావటం చాలాసార్లు గమనించాను. అప్పుడే గ్రహించాను.”
”నన్నెప్పుడూ అడగలేదేం?”
”ఏం అడుగుతాను? మీరు దొంగతనంగా ఇస్తున్నారని తెలిశాక అడగటం ఎందుకు? అయినా ఒకసారి మోసపోయాక ఇవ్వవలసిందేగా?”
”సరే, దొంగతనంగా మరో పాడుపని కూడా చేశాను. దాని గురించి చెపుతాను విను! నా మొదటి భార్యతో ఉన్నప్పుడే నాకు మరో స్త్రీతో సంబంధం ఉండేది. నిన్ను చేసుకున్నాక కూడా ఆ సంబంధాన్ని కొనసాగించాను.”
”నాకు తెలుసు.”
నేనలా అనగానే ఆయన రెప్పవెయ్యకుండా నాకేసి చూస్తూ ఉండిపోయారు. నా మొహంలోని భావాలని చదవాలని ప్రయత్నిస్తున్నారా, అనిపించింది నాకు. ఆయన చాలా సూటిగా చూస్తూ ఉండేసరికి నేనే కళ్ళు దించుకున్నాను. చాలాసేపటివరకూ ఆయన గంభీరంగా నావైపు చూస్తూ ఉండిపోయారు. నేను సిగ్గుపడి తల పైకి ఎత్తలేదు. కానీ, ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు చెపుతున్నారు, అనే అనుమానం మాత్రం కలిగింది.
కొంతసేపటికి ఆయనే, ”నువ్వు నాకన్నా పెద్దదానివి!” అన్నారు.
ఆయన అలా ఎందుకన్నారో నాకు అసలు అంతుపట్టలేదు, ”ఇవాళ మీకేమైంది? నేను మీకన్నా పెద్దదాన్నెలా అవుతాను?” అని అడిగాను.
ఆయన నవ్వుతూ, ”నీ మనసు విషయం చెపుతున్నాను. అది చాలా పెద్దది, గొప్పది! ఇన్నేళ్ళు నాతో కాపురం చేస్తూ కూడా ఎన్నడూ ఆ విషయం ఎత్తనేలేదే నువ్వు?”
నేను వెంటనే చేత్తో ఆయన నోరు మూసి, ”ఆ విషయం నాకు వినాలని లేదు,” అన్నాను. కానీ నా మనసులో మాత్రం అదే సందేహం, ఇన్నేళ్ళు గడిచాక, గతంలోని ఆ విషయాల గురించి ఇప్పుడు ఈయన ఎందుకిలా మాట్లాడుతున్నారు? అలా అనుకోగానే నాకు చెప్పలేనంత నీరసం ముంచుకొచ్చింది.
ఆయన తనలో తాను పలవరిస్తున్నట్టు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు, ”భగవంతుడా! ఈ రోజు నిన్నొక కోరిక కోరుతున్నాను. కొన్నాళ్ళు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు!” అలా ఆయన అంటూంటే నేను మంచానికి తల ఆనించి ఏడవసాగాను. ఆయన పలవరింత ఆపలేదు, ”నా మాట వినిపించుకోవా? నిజంగా నువ్వు ఎక్కడైనా ఉంటే నామాట వినిపించుకోవాల్సిందే! నాకింకేమీ అక్కర్లేదు, ప్రభూ! ఈ ఒక్కసారి నా జబ్బు నయం కావాలి, అంతే. నిష్కపటంగా నాకు సేవలు చేస్తున్న ఈవిడ కోసం… కేవలం ఈవిడ కోసమే నాకు ఆరోగ్యం ప్రసాదించు… నన్ను బ్రతికించు! భగవాన్! నా ఈ ప్రార్థన నీ చెవులకి వినిపించకపోతే, కనీసం వచ్చే జన్మలో నేనూ ఈవిడా కలిసి జీవించేటట్టు చెయ్యి. అలా చెయ్యక పోయినట్టయితే నా జన్మ వృథా అనుకోవాల్సి వస్తుంది!”
అలా ఆయన మాటలు వింటూ నేను రాయిలా మారిపోయి నట్టనిపించింది. నా గొంతు పూడుకుపోయింది. కన్నీళ్ళు ఉబికాయి. కన్నీళ్ళు కార్చకుండా ఆపుకోవాలన్న నా ప్రయత్నం ఫలించలేదు. ఆపుకునే ప్రయత్నం చేసినకొద్దీ ధారగా కారసాగాయి. ఒకపక్క ఈయనకి నేను ఏడుస్తున్నట్టు తెలిసిపోతుందేమోననే భయం, కానీ నేను ఏమీ చెయ్యలేని స్థితి అది. నేనూ మనిషినే, ఆ సమయంలో అసహాయురాలైన ఒక ఆడదాన్ని అనిపించింది. అంత ప్రేమించిన మనిషి దూరమైపోతూంటే ఎవరు మాత్రం నిబ్బరంగా ఉండగలరు? కొంతసేపటికి పాయిఖానాలోకెళ్ళి వచ్చి, డాబామీద పచార్లు చెయ్యటం మొదలుపెట్టారు. నేను నెమ్మదిగా లేచి మొహం కడుక్కుని వచ్చాను. గొంతు సవరించుకున్నాను. ఇంతలో ఆయన వచ్చి మంచంమీద పడుకున్నారు. నేను మేలుకుని ఉండటం చూసి, ”చాలారోజులుగా నా విషయాలన్నీ నీకు చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను,” అన్నారు.
”నాకు అవన్నీ వినాలని లేదు” అన్నాను.
”ఇంకొకప్పుడైతే నేను చెప్పేవాణ్ణి కాదేమో! కానీ ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీ గురించి ఆలోచించినకొద్దీ, నాకు బాధ ఎక్కువవుతోంది. నువ్వు నా పక్కనే ఉండాలనీ, ఒక్క క్షణంసేపు కూడా నిన్ను వదిలి ఉండలేననీ అనిపిస్తోంది. కొన్నేళ్ళుగా నాకేమైందో తెలీదు, నువ్వెటైనా వెళ్తే నాకేమీ తోచటం లేదు!”
”అసలు నేనెక్కడికెళ్తున్నానని?”
”అయితే నేనిలా ఎందుకు తపిస్తున్నాను? నాకేమైంది?”
”ఇంట్లో ఉన్నది మనిద్దరమే కదా! ఒకరు ఎటైనా వెళ్తే అంతా శూన్యం అయిపోయినట్టు ఉండటంలో ఆశ్చర్యమేముంది?”
”లేదు, రాణీ? నాకేమీ అర్థమవటం లేదు. అందరికీ ఇలానే అనిపిస్తుందా, మనకి మాత్రమేనా?”
ఆయన ఎప్పుడూ ఇంతే. ఒంట్లో బాగా లేకపోతే నన్ను ఎటూ కదలనిచ్చేవారు కాదు.
జ జ జ
మనిషి తనే అందరికన్న తెలివైనవాడిననీ, శక్తిమంతుడిననీ అనుకుంటాడు. తను ప్రేమికుడిననీ, తనది సున్నితమైన మనసనీ అనుకుంటాడు. కానీ జరిగేది మాత్రం వేరు. అతని తెలివితేటలు శరీరం లోపల ఏం జరుగుతోందో తెలుసుకోలేవు. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఇక ఎంత శక్తిమంతుడైనా కళ్ళెదురుగా జరిగేవాటినే అదుపు చెయ్యలేడు. చేతులు ముడుచుకు కూర్చోవలసిందే! బుర్ర కూడా పనిచెయ్యటం మానేస్తుంది. ఇక సున్నితమైన మనసు విషయానికొస్తే ఎంత భయంకరమైన బాధనైనా సరే, మౌనంగా భరించాల్సిందే తప్ప చేసేదేమీ ఉండదు! పరిస్థితుల ముందు ఎవరైనాసరే తలవంచక తప్పదనిపిస్తుంది. తను కూడా చనిపోయేందుకు సిద్ధమైతే తప్ప విషమ పరిస్థితులని మనిషి ఎదుర్కోలేడు.
ఆ విషయాలన్నీ ఇప్పుడు తల్చుకుంటే నేనొక పెద్ద నీచురాలిని, పిరికిపందనని అనిపిస్తుంది. ఒక్కరోజు కూడా నన్ను విడిచి ఉండలేని నా భర్త, నన్ను విడిచి వెళ్ళిపోయాక కూడా మునుపటిలాగే, ఏ మార్పూ లేకుండా, అదే వేగంతో నా జీవితం వెళ్ళిపోతోంది. ఇంతకన్నా నీచత్వం, పిరికితనం ఇంకేముంటుంది? ఇలాంటి స్పందనలు లేనివాళ్ళయితే పరవాలేదు. కానీ స్పందనలు ఉండి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే అది నీచత్వం కాదూ? ఇది ఒకటి రెండు రోజులకి సంబంధించినది కాదే! భరించవలసిన బాధనంతా భరించటం పూర్తయాక, ఇక ఆ మనిషి జీవితంలో మిగిలిందేమిటి?
ఆ మహనీయుడి గొప్పతనాన్ని నేనసలు గుర్తించలేక పోయాను. అటువంటి మహాత్ములని గుర్తించేందుకు ముందు మనలో కొంత శక్తిసామర్థ్యాలుండాలి. కానీ నాలో ఆ శక్తి ఎక్కణ్ణించి వస్తుంది? ఎలా గుర్తించగలిగేదాన్నని అనిపిస్తుంది. నేను పిచ్చిదానిలా ఆయన నా సొత్తు అనుకున్నాను. కానీ ఆయన నన్ను తన సొంతం అనుకోకపోతే ఎందుకు భయపడ్డట్టు? నా దగ్గర దాచి రహస్యంగా ఏమైనా చెయ్యవలసిన అవసరమెందుకు వచ్చింది? అసలు ఆయన ముందు నేనెంతదాన్ని? ఆయనతో సమానంగా తూగగలనా? కానీ నాకు ద్రోహం జరిగిపోయింది. నా కళ్ళు ఇప్పుడు తెరుచుకుని మాత్రం లాభమేమిటి? తన మనసులోని మాటలన్నీ ఒక్కటి దాచకుండా చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా నేనాయన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడింకేం మిగిలింది? చీకటిరాత్రి…దారీతెన్నూ తెలియక తిరగటం! నా తలరాతని తిట్టుకోవటం… అంతే!
జ జ జ
కొత్త ఇంట్లోకి మారాక ఆయనకి తరచు కడుపునొప్పి రావటం మొదలైంది.
”వేడి నీళ్ళతో కాపడం పెట్టనా?” అని అడిగాను.
”అలాగే, దాంతో కొంత తగ్గుతుందేమో చూద్దాం” అన్నారు.
వేడినీళ్ళు తెప్పించి కాపడం పెట్టసాగాను. నాపక్కనే నా తోడికోడలు కూడా ఉంది.
ఆయన నావైపు చూసి, ”నువ్వే కాపడం పెట్టు!” అన్నారు.
”నేనే పెడుతున్నాను, ఇంకెవరున్నారిక్కడ?” అన్నాను.
”వదినని ఎందుకు ఇబ్బందిపెడుతున్నావు?” అన్నారు విసుగ్గా.
ఆయనకి కోపం వచ్చేలోపల ఆవిణ్ణి పంపేశాను. ఆవిడ వెళ్ళగానే, ”తలుపు మూసెయ్యి,” అన్నారు. నేను తలుపు మూశాను.
”నా పనులన్నీ ఇక మీదట నువ్వే చెయ్యి,” అన్నారు.
”నేనే చేస్తున్నాగా?”
”ఎవరికీ రుణపడటం నాకిష్టం ఉండదు. నీ సంగతి వేరు, నీకు రుణపడ్డా పరవాలేదు,” అన్నారు.
”ఇందులో రుణపడటం ప్రసక్తి ఎందుకు?”
”సేవ చేసేవాళ్ళు సేవ చేయించుకోరా?”
”సొంతవాళ్ళ మధ్య అలాంటివి ఉండవు!”
నేనలా అనగానే ఆయన కళ్ళు చెమర్చాయి.
”ఏమిటండీ ఇదీ?” అన్నాను.
”ఏమీ లేదు, నీకు మాత్రం రుణపడాలనుకుంటున్నాను, ఇంకెవరికీ కాదు. నువ్వు నాకెంత సేవ చేసినా నాకు సంతోషమే. ఎందుకంటే, ఈ జన్మలోనే కాదు, పై జన్మలో కూడా సుఖంగా ఉంటుంది!” అన్నారు.
నాకు కళ్ళనీళ్ళు తిరిగాయి, కానీ ఆయనకి కనిపించకూడదని వెంటనే బాత్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాను. తను అంత బాధలో ఉన్నా ఆయనకి నా గురించే ఆలోచన అనుకోగానే ఇక ఏడుపు ఆపుకోలేకపోయాను. కానీ నాకు మనసారా ఏడ్చేందుకు కూడా వీలులేదు! ఆయన ఎదురుగా ఏడిస్తే తను మరింత గాభరాపడతారని భయం. బైటికొచ్చి ఏడిస్తే పిల్లలు చూస్తారేమోనన్న సంకోచం. ఇంట్లో అందరూ ఆ మాత్రం ధైర్యంగా ఉండటానికి నేనే కారణం. అందరికీ ధైర్యం చెప్పే నేనే నీరుకారిపోతే ఎలా అనేది నా బాధ! రాత్రి ఆయనకి మళ్ళీ బాగా కడుపునొప్పి వచ్చింది. ఈసారి కాపడంతో కూడా తగ్గలేదు. ఒంట్లో లేచేంత శక్తి లేకపోయినా, కష్టపడి లేచి కూర్చున్నారు. నేనేం చేసినా ఆయన బాధని తగ్గించలేని పరిస్థితి, నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నేనొక్కదాన్నీ మేలుకుని ఆయన పొట్టరాస్తూ, విసురుతూ కూర్చున్నాను. నొప్పి తగ్గి కాస్త మాట్లాడే ఓపిక రాగానే, ”రాణీ! నేనింక బతకను…!” అన్నారు.
”ఎందుకలా…ఏమైంది?” అన్నాను గాభరాపడుతూ.
”నా పరిస్థితి చూస్తూ కూడా అలా అడుగుతావేం?”
”డాక్టర్ ఏం పరవాలేదన్నాడుగా? అధైర్యపడకండి.”
”అధైర్యపడకుండా ఎలా ఉండటం?”
”గాభరా పడితే ఏమవుతుంది, చెప్పండి?”
”రాత్రనక పగలనక నాకు సేవచేస్తూ నువ్వెంత నలిగిపోతున్నావో!”
”మీకు బాగయితే అంతే చాలు!”
”ఒకవేళ బాగవకపోతేనో?”
”అలా అనకండి, నేను వినలేను.”
”చివరకి…”
”మీకేమైనా అయేలోపల నాకు చావు రావాలని కోరుకుంటున్నాను.”
”చూడూ, నువ్వు ముందెళ్ళిపోతే నాకు కూడా నీలాగే బాధగా ఉండదా? కానీ ఒకసారి ఆలోచించు, అప్పుడు నువ్వు చెయ్యాల్సిన పనుల బాధ్యత కూడా నామీద వేసుకుంటాను కదూ? అలాగే నువ్వు కూడా చెయ్యాలి. నేను వెళ్ళిపోతే బన్నూని జాగ్రత్తగా చూసుకో, వాడిని నిజాయితీపరుడుగా, మంచి మనిషిగా తీర్చిదిద్దే బాధ్యత నీదే. ఇప్పుడు కూడా నువ్వు నీకోసం బతకటం లేదు. తరవాత కూడా బతకవు. నువ్వుమాత్రం శాశ్వతంగా బతికుంటావా? ఏదో ఒకరోజున అందరం పోవలసినవాళ్ళమేగా!” ఆయన మాటలకి జవాబు చెప్పే శక్తి అప్పుడు నాకు లేకపోయింది. నేను రాయిలా ఉండిపోయాను. ఆయన తన ధోరణిలో ఏదో చెపుతూపోయారు. ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా నా ఆశ చావలేదు. నేను మాట్లాడకపోయేసరికి, నిద్ర పోయాననుకున్నారు కాబోలు, ఏదో కవితాపంక్తులు పైకే ఉచ్చరించసాగారు. ప్రపంచం బాగుండాలని కోరుతూ, తను ప్రయాణమయేందుకు సిద్ధమయే ప్రయత్నం చేస్తూ, అంతలోనే, ”ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది, కానీ నేనుండను!” అన్నారు హఠాత్తుగా.
ఈ మాటలన్నీ విని నా గుండె పగిలిపోతుందనిపించింది. లేచివెళ్ళి పెరటి తలుపు తీసి రాత్రి చిమ్మచీకట్లో బైట నిలబడి ఏడవసాగాను. తనివితీరా ఏడ్చాక, నేనింకా ఎందుకు బతికున్నానా అనిపించింది. నా అంతరాత్మ ఇంకా ఎంత బాధ అనుభవిస్తావ్ అంటూ గోలపెడుతున్నట్టనిపించి, ఆ చీకట్లోనే బావివైపు నడిచాను. తీరా బావి గట్టు ఎక్కి నిలబడ్డాక, ”సరే, నువ్వు బావిలో దూకి చనిపోతావు, ఆ తరవాత ఆయన్ని ఎవరు చూసుకుంటారు?” అని మనసు నిలదీసింది. ఇది ప్రేమ కాదు, ప్రేమే ఉంటే బాధల్ని దిగమింగుతూ బతకాలి. ఆయనకి నయమైతే అంతా సుఖమే కదా! అనిపించింది. కాళ్ళకి బేడీలు పడ్డట్టు ఆగిపోయాను. ఆ ఆశ నన్ను చావనివ్వలేదు.
ఇంతలో ఆయన లేచారు, ”ఇలా వచ్చి కాస్త విసురుతావా?” అని పిలిచారు. నేను లోపలికెళ్ళి విసరటం మొదలుపెట్టాను. నేను ఏడవటం ఆయనకి కనిపించినట్టు లేదు, కానీ బహుశా అందుకే బైటికెళ్ళానని గ్రహించినట్టున్నారు, నా చేతిని తన చేతిలోకి తీసుకుని, ”నువ్వు నీరసంగా ఉంటే నాకు కంగారు పుడుతుంది. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను, బతకలేను. ఒకవేళ ఆరోగ్యం కుదుటపడే యోగం ఉన్నా, నీకు బాగాలేకపోతే నేను కోలుకోను!” అన్నారు.
”నా ఆరోగ్యానికేమొచ్చింది? అందర్ని సుఖంగా ఉంచేందుకు ప్రయత్నించేవాళ్ళే జబ్బుపడతారు. నాలాంటివాళ్ళకి జబ్బులేవీ రావు,” అన్నాను.
నా బుగ్గని సుతారంగా చేత్తో తట్టి, ”నువ్వు జబ్బు పడితే ఇక నా గతి అధోగతే! మిగతావాళ్ళకి నువ్వు అక్కర్లేకపోవచ్చేమో కానీ, నాకు మాత్రం నువ్వే సర్వస్వం!” అన్నారు.
ఈయనకి నేనంటే ఎంత ప్రేమ! మనిషికి ఇంకే అవసరమూ లేకపోయినా ప్రేమ మాత్రం చాలా అవసరం. ప్రేమా ఆప్యాయతా సంపాదించుకునేందుకు మనిషి దేన్నైనా పణంగా పెట్టగలడు!” అని అనుకున్నాను.
ఆయన జబ్బుగా ఉన్న ఆ రోజుల్లోనే ఒకసారి బొంబాయినించి నాథూరాం ప్రేమీ ఆయన్ని చూసేందుకు వచ్చాడు. ‘హంస్’ కోసం చేసిన అప్పు కూడా తీర్చవలసి ఉంది.
”హంస్ కోసం తీసుకున్న అప్పు తీర్చెయ్యి” అన్నారు నాతో.
”మీరు బాగయాక అన్నీ తీరుద్దాం, కంగారేం లేదు,” అన్నాను.
”రాణీ, నేను ఉన్నా, లేకున్నా ‘హంస్ మాత్రం అచ్చవ్వాల్సిందే!” అన్నారు. అది విని నేనింకేమీ అనకుండా, ”రేపు కట్టేస్తా లెండి” అన్నాను.
ప్రేమీ గారు చాలారోజులు మా ఇంట్లోనే ఉండిపోయారు. అలహాబాద్‌నించి మరో పెద్దమనిషి కూడా ఈయన్ని చూసేందుకు వచ్చాడు. ఆయన మా అన్న స్నేహితుడు. వాళ్ళిద్దరూ నేనెక్కడ జబ్బుపడతానో అని గాభరాపడ్డారు. వాళ్ళు మా మరిదితో, ”ఈవిడ రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని మేలుకుంటోంది. ఈవిడ పడకవేసిందంటే ఇంక చెప్పక్కర్లేదు!” అన్నారు.
”ఆవిడ ఊ అంటే ఏ పనైనా చేసేందుకు నేను సిద్ధమే” అన్నాడు మా మరిది.
ప్రేమీ గారు నాతో నెమ్మదిగా, ”అతన్ని రాత్రిళ్ళు మేలుకోమని చెప్పండి” అన్నాడు.
”నేనెందుకు చెప్పాలి? పైగా నాలాగ ఇంకొకరు ఆయనకి సపర్యలు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు!” అన్నాను.
నేనన్న మాటలు ఆయనకి ఎలా వినిపించాయో తెలీదు, నన్ను లోపలికి రమ్మని పిలిచారు. ప్రేమీ ఏమంటున్నారని అడిగారు.
”మీకెలా వినిపించింది?” అని అడిగాను.
”అసలేమిటి సంగతి? నేను ఇంకెవరిచేతా నా పనులు చేయించుకోను. నువ్వు మాత్రమే నా దగ్గరుండు, చాలు!” అన్నారు.
”నాకే చెపుతున్నారా? మీరు పంపమంటేనే కదా మీ మరదల్ని మీ కాళ్ళు పట్టేందుకు పంపుతున్నాను? వద్దంటే మానేస్తాను!”
”నా అంతట నేనడగడం లేదు. ఆవిడ ఇష్టంగా నాకు సపర్యలు చేస్తానంటే వద్దనటం ఎందుకు?”
”బైటివాళ్ళు మీకు సపర్యలు చెయ్యటం నాకూ నచ్చదు. మన పిల్లలు చేస్తే అది వేరు. వద్దంటే వాళ్ళని కూడా మానెయ్యమంటాను.”
”అక్కర్లేదు, వాళ్ళు కన్నబిడ్డలే కదా!”
మర్నాడు ఉదయం మా మరిది భార్య ఆయన కాళ్ళు పడుతూ కూర్చుంది. నేను వెళ్ళి ఆమె పక్కనే నిలబడ్డాను. మా అమ్మాయి దిగాలుపడి నేల మీద నిస్త్రాణగా కూలబడింది. మరిది భార్య ఎర్రరంగు చీర కట్టుకునుంది. నాకు సైగ చేసి, ”చీర చాలా బావుంది” అన్నారు. ”ఇవాళ తదియ అనుకుంటాను!” అన్నారు మళ్ళీ.
”అమ్మాయికి చీర కొనలేదు” అన్నాను.
”నన్ను కోలుకోనీ, ఎన్ని చీరలు కావాలన్నా కొని తెస్తాలే!”
నేనేమీ అనకపోయేసరికి, ”అయినా నువ్వు పొరపాటు చేశావు, వీళ్ళిద్దరికీ చీరలు కొనాల్సింది!” అన్నారు.
అమ్మాయీ, నా చిన్న తోడికోడలూ ఒకేసారి, ”ముందు మీరు కోలుకోండి, ఖరీదైన చీరలు కొనిద్దురుగాని” అన్నారు.
”కొంత ఓపిక పట్టండి, మంచి మంచి చీరలు కొనిస్తాను” అన్నారు.
కానీ అందరం ఇవాళ శాశ్వతంగా నిరాశలో కూరుకుపోయి ఉన్నాం. ఆయన మాటల్లో ఎంత ప్రేమ దాగి ఉండేది!
చాలారోజులు మా ఇంట్లోనే గడిపిన తరవాత, ఒకరోజు రాత్రి రెండుగంటల రైలుకి ప్రేమీ గారు బయలుదేరారు. నాకు బహుశా కునుకుపట్టినట్టుంది. ఈయన నన్ను లేపి, ”రాణీ, ప్రేమీ గార్ని దిగబెట్టిరా!” అన్నారు.
”వద్దు, లేపకండి, పడుకోనివ్వండి” అన్నారు ప్రేమీ గారు.
నాకప్పటికే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. ”చెప్పండి, ఏమిటి?” అన్నాను.
”ప్రేమీ గారు వెళ్తున్నారు. ఆయన్ని కొంతదూరం దిగబెట్టిరా” అన్నారు.
నేనాయన్ని దిగబెట్టేందుకు వెళ్ళాను. కానీ మా ఆయన ఎప్పుడో అన్న మాట, ”నా డ్యూటీ నువ్వే పూర్తి చెయ్యాలి!” నా మనసుని వేధించసాగింది. తనే స్వయంగా ఆహ్వానించేవారు. దిగబెట్టేవారు. స్నేహితులంటే ఆయనకి ప్రాణం. వాళ్ళతో కూర్చుంటే నిద్రాహారాలు కూడా గుర్తుకి వచ్చేవి కావు. మున్షీ దయానారాయణ్ వచ్చినప్పుడు కూడా నాకు కళ్ళతోనే సైగ చేసి ఆయన సంగతి చూడమని చెప్పారు. అది పైపై మర్యాదలకోసం కాదు. ఆయనకి వాళ్ళ మీద ప్రేమ. ఆ ప్రేమవల్ల వచ్చిన అలవాటు. ఎవరు కలవటానికి వచ్చినా నవ్వు మొహంతో ఆహ్వానించేవారు. ఈ రోజు అదంతా నా బాధ్యత. దేవుడా! ఈయన్ని ఎంత నిస్సహాయకుడిగా చేశావు! మునుపు ఎవర్నీ ఏ పనీ చెయ్యనిచ్చేవారు కాదు. ప్రేమీ గార్ని దిగబెట్టి ఇంటికి వచ్చాక భోరుమని ఏడవాలనిపించింది, కానీ నాకు ఏడ్చే వీలుకూడా లేదు! పళ్ళ మధ్య నాలుకలాగ ఎన్నో బరువుబాధ్యతల మధ్య ఇరుక్కుపోయాను. అన్నీ భరించేందుకు నన్ను సిద్ధం చేసుకున్నాను, కానీ ఆయన బాధ పడితే మాత్రం చూడలేకపోయేదాన్ని. మాటిమాటికీ ఆయన కోలుకుంటారులే అనే నమ్మకం పెంచుకుంటూ ఉండేదాన్ని.
కానీ నా ఆశ నిరాశే అయింది. ఆయన్ని పోగొట్టుకున్నాను. ఆయన ఆశల్నీ, నమ్మకాలనీ కూడా వమ్ముచేశాను. ఆయన లేకపోయాక జీవితంలో అంధకారం తప్ప ఏమీ మిగల్లేదు. ఇంతకన్నా ఏం చెప్పను?
జ జ జ
ఒక పాత సంఘటన గుర్తుకొస్తోంది…
ప్రెస్ తెరిచారు. ఈయనే స్వయంగా అందులో పనిచేసేవారు. చలికాలం వచ్చింది. ఆయన వేసుకునే నూలుబట్టలు నాకు ఎంతమాత్రం నచ్చలేదు. బతిమాలి బామాలి ఉన్నిదుస్తులు కొనుక్కోమని రెండుసార్లు నలభైయేసి రూపాయలిచ్చాను. కానీ రెండుసార్లూ ఆయన ఆ డబ్బుని పనివాళ్ళకి ఇచ్చేశారు. ”కొత్త బట్టలేవీ?” అని ఇంటి దగ్గర నేనడిగితే, నవ్వుతూ, ”బట్టలేమిటి? ఆ రూపాయలు నేను పనివాళ్ళకి ఇచ్చేశాను. ఈపాటికి వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కునుంటారు,” అన్నారు.
అది విని నాకు కోపం వచ్చింది.
కానీ ఆయన ఏమీ జరగనట్టు మామూలుగా, ”రాణీ, రోజంతా మన ప్రెస్‌లో కష్టపడి పనిచేసేవాళ్ళు ఆకలితో అలమటిస్తుంటే నేను వెచ్చగా సూటు వేసుకుని తిరగనా? అదేం బావుంటుంది చెప్పు?” అన్నారు.
ఆయన వాదన విని నాకు చిర్రెత్తుకొచ్చింది, ”మీ ప్రెస్‌తో నాకేం సంబంధం లేదు!” అన్నాను.
దానికాయన పగలబడి నవ్వుతూ, ”నాతో నువ్వు సంబంధం పెట్టుకున్నాక, ఇక నాదంటూ ఏమీ లేదుగా? అంతా నీదే. ఇక మనిద్దరం ఒకే నావలో ప్రయాణం చేస్తున్నాం. నీ కర్తవ్యం, నా కర్తవ్యం వేరువేరు ఎలా అవుతాయి? నన్ను నేను నీకే అర్పించుకున్నాక ఇక నావన్నీ కూడా నీవే కదా?” అన్నారు.
”నేనలా అనుకోవటం లేదు!” అన్నాను. అప్పుడాయన ఎనలేని ప్రేమతో నావైపు చూసి, ”నువ్వొట్టి పిచ్చిదానివి!” అన్నారు.
ఈయన నా మాట ఇక వినరని తెలిశాక నేను మా బావగారికి డబ్బిచ్చి ఈయనకి ఊలుబట్టలు కొనితెమ్మని అడిగాను. ఆయన కొనిపెట్టాక అతికష్టం మీద అన్నగారి మాట కాదనలేక, ఆ బట్టలు తొడుక్కుని నా దగ్గరకొచ్చారు. ”నీకు సలాం చేస్తున్నాను, నీ ఆజ్ఞ పాటించాను, చూశావా?” అన్నారు. నేను కూడా నవ్వుతూ, ”ఆ భగవంతుడు నీకు సుఖసంతోషాలు ప్రసాదించుగాక! ఇక ప్రతీ ఏడాదీ కొత్తబట్టలు ధరించుదువుగాక!” అని నాటకీయ ధోరణిలో అని, కొంచెం ఆగాక, ”సలాంలూ, నమస్కారాలూ తమకన్నా వయస్సులో పెద్దవాళ్ళకి పెడతారు. నేను మీకన్నా వయసులో, పదవిలో, చివరికి మన ఇద్దరికీ ఉన్న భార్యాభర్తల సంబంధంలో కూడా పెద్దదాన్ని కాను. మరి నాకు సలాం పెడతారేం?” అన్నాను.
”నువ్వు చెప్పే వయసూ, పదవీ, సంబంధం ఏవీ లెక్కలోకి రావు. నేను చూసేది హృదయాన్ని. నీది మాతృహృదయం. తల్లి పిల్లలకి అన్నీ అమర్చి ఆనందం పొందినట్టే నా అవసరాలన్నీ తీరిస్తే నీకు తృప్తి దొరుకుతుంది. అందుకే ఇకనుంచీ ఎప్పుడూ నీకు సలాం చేస్తూనే ఉంటాను!” అన్నారు.
1936 మే నెలలో ఆయన స్నానం చేసి కొత్త బనీను తొడుక్కుని నాకు సలాం చేశారు – అదే ఆయన చేసిన చివరి సలాం!
జ జ జ
చివరి రోజులు:
ఒకరోజు స్పృహలోకి వచ్చాక, ”శివప్రసాద్ గుప్తా గారు మాతృ మందిరం ఒకటి కట్టించారు. గాంధీమహాత్ముడు దానికి ప్రారంభోత్సవం చేస్తారు. అది చూసేందుకు కొన్ని లక్షల మంది అక్కడికి వస్తారు,” అన్నారు.
”అప్పటికి మీ ఆరోగ్యం బాగుపడితే మీతోబాటు నేనూ అక్కడికి వస్తాను,” అన్నాను.
ఆయన నవ్వి, ”రాణీ, నీ మాటలు నిజమవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కానీ ఈ జన్మకి నీ తపస్సు ఫలించేటట్టు నాకు కనిపించటం లేదు, రాణీ!” అన్నారు.
”ఎందుకలా నిరాశపడతారు? మనం ఎవరికీ చెడుపు చెయ్యలేదు. దేవుడు మన ప్రార్థన వింటాడు.”
”రాణీ, నువ్వు నన్నొదిలి ఎటూ వెళ్ళకు. నువ్వు దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నిన్న నువ్వు వండిన మాంసం తిన్నాను, అది అరగలేదు. అలాంటి పదార్థాలు నాకెందుకు పెడతావు?”
”డాక్టర్ గారి సలహా విని అది వండాను. ఆయన మాట విననా, మీ మాట విననా?”
”డాక్టర్‌కి జబ్బు లేదు కదా, జబ్బున్నది నాకు!” అన్నారు నవ్వుతూ.
”తినటంవల్ల ఇప్పుడు ఇబ్బందేమొచ్చింది?”
”చూస్తూనే ఉన్నావుగా, రాణీ, ఎంత పెద్ద విరోచనం అయిందో!”
”అది మంచిదేగా, పొట్టలో పేరుకున్న నీరంతా బైటికిపోయింది!”
ఆయన దిగులుగా, ”నీళ్ళతోబాటు సమస్తం వెళ్ళిపోతోంది, రాణీ!” అన్నారు.
ఆ మాటలు విని నాకు ఏడుపొచ్చింది. కన్నీళ్ళు ఆగలేదు. ఎంత ప్రయత్నించి ఆయన ఎదుట ఏడవకూడదనుకున్నా ఈసారి మాత్రం నావల్ల కాలేదు. నా ధైర్యం సడలిపోయింది.
మర్నాడు ఆయనకి మళ్ళీ స్పృహ తప్పింది. పెద్ద విరోచనం కూడా అయింది. ఆయన బట్టలూ, పక్కబట్టలూ శుభ్రం చేసేందుకు వెళ్ళబోతుంటే మా అన్నయ్య నా చెయ్యి పట్టుకుని ఆపి, ”ఎక్కడికెళ్తున్నావు? ఆయన వెళ్ళిపోయారమ్మా!” అన్నాడు.
నేను భోరుమని తనివితీరా ఏడ్చాను. అప్పట్నించీ ఈరోజు వరకూ ఏడుస్తూనే ఉన్నాను.
ఇక నేనెవరికి భయపడాలి? పాఠకులారా, ఇక రాయటం నావల్ల కాదు. ఇక జీవితాంతం నాకు మిగిలింది దుఃఖమే!
నేనేమీ పెద్ద రచయిత్రినీ కాను, కళాకారిణినీ కాను. ఈ నా రచనవల్ల పాఠకులకి వీసమెత్తు ప్రయోజనం కలిగినా నా జన్మ ధన్యమైందని అనుకుంటాను.
(అయిపోయింది)
మా అమ్మమ్మ
శివరాణిదేవి దాదాపు రోజూ తను రాసిన ఈ పుస్తకంలోని కొన్ని పుటలు నా చేత చదివించుకుని వింటూ, మధ్య మధ్య నన్ను ఆగమని అక్కడో మాట, ఇక్కడో వాక్యం మార్చమని చెప్పేది. ఒక్కొసారి ఈ మార్పులు ఎంతో ఎక్కువగా ఉండి, పూర్తి పుటంతా నేను మళ్ళీ రాయవలసి వచ్చేది. ఈ రెండో ప్రచురణలో ఆ మార్పులు చేర్చబడ్డాయా లేదా అన్న విషయం నాకు తెలీదు. ఒకవేళ ఎప్పుడైనా తెలిసినా యాభైఏళ్ళకు పైగా గడిచిపోయాక, ఆ రోజుల్లో నేను పడ్డ శ్రమ వృధా అయిందని ఈ రోజు నేను బాధపడతానని అనుకోను.
ఆవిడ పిలవగానే పుస్తకం పట్టుకుని వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చునేవాణ్ణి. ఒకటో, ఆరో పుట చదివేలోపలే ఆవిడకి ఇంకేదో పని గుర్తుకొచ్చేది. దాంతో ఈ పని వాయిదా పడేది. అసలు కారణం ఏదైనప్పటికీ, తను రాసిన పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించడం ఆవిడకి ఇష్టం లేదనే నాకనిపించేది. అందుకే ఏదో ఒక సాకుతో పని వాయిదా వేసేది. అంతేకాదు, ఆవిడ కావాలనే కుంటిసాకులు చెప్పి వాయిదా వేస్తోందన్న సంగతి సులభంగా తెలిసిపోయేట్టు ఉండేది.
పుస్తకంలో తన కూతురు (మా అమ్మ కమలా దేవి) ప్రస్తావన వస్తే చాలు, వెంటనే పని ఆపించి, తన కూతురికి పెద్ద ఉత్తరం రాసేపని నాకు అప్పగించేది. ఆ ఉత్తరంలో కూతురి ఇంటిల్లిపాది క్షేమసమాచారాలు విచారించి,దగ్గర్లో హోళీ కాని దీపావళి కాని ఉంటే బెనారెస్‌కి రమ్మని పిలిచేది.
మా అమ్మ ఆవిడకి మొదటి సంతానం. మున్షీప్రేమ్‌చంద్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు మా అమ్మమ్మకి సాయంగా ఉండేందుకు మా అమ్మ, నన్ను, మా అన్నయ్య వినోద్‌కుమార్ నీ వెంట బెట్టుకుని పుట్టింటికి వచ్చింది. ఇంట్లో పిలిచే ముద్దుపేరు ఏదైనప్పటికీ నాకు పేరు పెట్టింది మున్షీప్రేమ్‌చందేనని, శివరాణిదేవి నాకు చాలాసార్లు చెప్పింది. ఈ విషయం ఎక్కడో అక్కడ తన పుస్తకంలో రాసి ఉంటే సంతోషించేవాణ్ణి. రెండేళ్ళలోపు పిల్లవాడిగా మా తాత ఆరోగ్యం గురించి నేనన్న మాటలు ఈ పుస్తకంలో వేయించేందుకు తన కూతురు, మనవల ఫోటో, విడిగా నాతోనూ, అన్నయ్యతోనూ తన ఫోటో తీయించుకోవాలనుకుంది ఆవిడ. రెండో ఫోటో తీయించుకున్నాక రిక్షాలో ఇంటికొస్తున్నపుడు, ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్డు మీద కిందికి దిగుతున్నప్పుడు, రిక్షా బోల్తా పడింది. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ, ఆ రోజు దెబ్బలు శివరాణి దేవికి మాత్రమే తగిలాయి. కానీ అవి ఎలాటివో, ఎంత పెద్దవో చెప్పగల వాళ్ళెవరూ ఈ రోజు జీవించి లేరు.
ఇక చివరిగా, శివరాణిదేవి అసాధారణ వ్యక్తిత్వాన్ని తెలిపే సంఘటనలు ఈ పుస్తకంలోనే ఎన్నో ఉన్నప్పటికీ, నేను ప్రత్యక్షంగా చూసిన ఒక సంఘటన గురించి చెప్పాలి. గాంధీ మహాత్ముడు చనిపోయినప్పుడు బెనారస్‌లో ఒక సంస్మరణ సభ జరిగింది. శివరాణిదేవితో బాటు నేను కూడా ఆ సభకి వెళ్ళాను. ఆవిడతో బాటు వేదికమీద కూడా కూర్చున్నాను. ఆ రోజుల్లో గొప్పనాయకులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో ఒకరైన శ్రీ కమలాపతి త్రిపాఠీ కూడా వేదికమీద ఉన్నారు. ఎవరో ఉపన్యాసం ఇస్తున్నారు. త్రిపాఠిగారు తమలపాకులు నములుతూ తన పక్కన కూర్చున్న వాళ్ళతో నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నారు. ఆయన అలా అమర్యాదగా ప్రవర్తించడం శివరాణిదేవి భరించలేకపోయింది. వెంటనే ఆయన్ని గదమాయించి, ముందు ఆ తాంబూలాన్ని ఉమ్మేసి రమ్మంది. త్రిపాఠిగారికి బహుశా తన తప్పు తెలిసివచ్చినట్టుంది, ఎందుకంటే మరుక్షణం ఆయన నోరు కడుక్కుని వచ్చేందుకు వేదిక దిగి వెళ్ళారు. శివరాణిదేవితో పది పన్నెండేళ్ళు గడిపాక కూడా నేనిక్కడ కొన్ని విషయాలనే ప్రస్తావించానంటే దానికి కారణం, ఈ పుస్తకంతో ముడిపడి ఉన్న విషయాలవరకే నేను నా దృష్టిిని పరిమితం చెయ్యటమే!
ఈ రకంగా మా అమ్మమ్మని ఒకసారి తలుచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రచురణకర్తలకి నా ధన్యవాదాలు.
ప్రభోద్‌కుమార్
( ప్రభోద్‌కుమార్ ముందు మాటలో నుంచి)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags