రమాదేవి చేలూరు
భండారు అచ్చమాంబ సచ్చర్రిత పుస్తకాన్ని కొండవీటి సత్యవతి రాశారు. సత్యవతి స్త్రీవాది, జర్నలిస్ట్, రైటరు. రెండు కథా సంపుటాలను వెలువరించారు. ‘భూమిక’ పత్రిక సంపాదకురాలు. సంపాదకీయాలు,ప్రయాణ అనుభవాలు సంకలనాలు రాశారు. సజీవనదీ ప్రవాహంలా ‘భూమిక’నే ఆలంబనగా నిరంతరం, స్త్రీవాదిగా, స్త్రీ జనోద్ధరణ కార్యక్రమాలతో జీవనం కొనసాగిస్తూనే మనకీ మంచి పుస్తకాన్నందించారు. అందుకు అభినందనలు. ఎపుడో వందా పది సంవత్సరాలు క్రితం బతికిన స్త్రీమూర్తి గూర్చి మనకు నేడు తెలియచేశారంటే, దానివెనుకంత గట్టి కృషి వుండి వుంటుందో మనమూహించవచ్చు. సేకరించిన సమాచారాన్ని వివిధ వ్యక్తులు వ్యక్తీకరించిన అబిప్రాయాలు, అచ్చమాంబ చేసిన ఉపన్యాసాలు,రచనలు, స్త్రీ సమాజస్థాపన వీటన్నింటినీ క్రమపద్ధతిలో అలంకరించి, రంగరించి,ఒక సంపూర్ణ వెలువెత్తు జ్ఞాన అచ్చమాంబని ఆవిష్కరించి చూపారు మనకు రచయిత్రి. అచ్చమాంబ పది సంవత్సరాల వయసులో అక్షరజ్ఞానాన్ని అలవర్చుకొని, కరుడుగట్టిన సనాతన సంప్రదాయాల్ని, స్త్రీలు తూచ తప్పక ఆచరిస్తున్న కాలంలో, తన తమ్ముడందించిన చిన్న చిటికెన వేలంది పుచ్చుకొని, ఆతని ప్రోత్సాహంతో అత్యంత వేగంగా సమస్త భారతావని మీద అచ్చమాంబ తిష్టవేసి, సూయించిన సాహితీ సుగంధ కుసుమాల్ని రచయిత్రి ఆర్థిగా ఏరుకొని, గుది గుచ్చిన హారాన్ని అలవోకగా మనకందించారు, ఆహ్వానించడమే ఆలస్యం. అచ్చమాంబ 12 కథల్ని, వ్యాసాల్ని, అబలా సచ్చిరిత్ర రత్నమాల గ్రంథాన్ని రాశాను. బహుభాషాకోవిదులు. స్త్రీలకోసం ‘బృందావన సమాజా’న్ని స్థాపించారు. తన సాహితీ ప్రక్రియలన్నింటి ద్వారా స్త్రీవిద్యకోసం పాటుపడ్డారు. బాల్యవివాహాల వ్యతిరేకిస్తూ, శాస్త్రసమ్మతమైన వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు. అందుకు వేదాల్లోని శ్లోకాల్ని ఉదహరించారు. అచ్చమాంబ కథల్ని, వ్యాసాల్ని రచయిత్రి మనకి పరిచయం చేశారు. మనదేశంలోని వివిధ ప్రాంతాలకి సంబంధించిన, శౌర్యం, సాహసం, జ్ఞానం, సేవాగుణాలు కల్గిన వీరనారీమణులగూర్చిన గ్రంథమే ‘అలా సచ్చరిత్ర రత్నమాల’. ఈ గ్రంథాన్ని రచయిత్రి మనకు పరిచయం చేశారు. 1902లో అచ్చమాంబ రాసిన ‘ధనత్రయోదళి’ కథ తొలితెలుగుకథగా నేటి పురుషాధిక్య సాహితీ ప్రపంచం ఒప్పుకోవటం లేదని, రచయిత్రి తన బాధను వ్యక్తీకరించారు. ‘అనుబంధం’ శీర్షిక అచ్చమాంబ ఉపన్యాసాల్ని చదువుతుంటే గొప్ప సంస్కర్తగా స్త్రీ పక్షపాతిగా రెండు తరాలు ముందే పుట్టిందనిపిస్తుంది. ఆ వ్యాసాల్లో ‘గ్రాంథిక భాష’ చదవటంవల్ల ముందు తరాల వాళ్ళకి భాషాపరిణామం గ్రహించగల్గుతారు. అంతేకాక వందేళ్ళక్రితం హిందూసుందరీ, తెలుగు జనానా, తెలుగు తల్లి, సావిత్రి మొదలైన పత్రికలుండేవని తెలుస్తుంది. అచ్చమాంబ- స్త్రీవిద్యకోసం గట్టివాదనల్ని వినిపించారు. స్త్రీవిద్యకోసం పురుషులు తోడ్పడాలని, కేవలం లోహపు నగల్ని అలకరింపచేసి ఆనందించక, విద్యాభూషణాలచే స్త్రీ అలంకరింపబడితే బాగుండునని ఆవేదన వ్యక్తీకరించారు. స్త్రీని ఇంటిగదులకే పరిమితం చేస్తే దేశం బాగుపడలేదని, పురుషుని తమ అహంకారాన్ని వదలి, స్త్రీని అన్ని రకాల అభివృద్ధి చెందేలా తోడ్పడాలని అన్నారు. జబ్బుపడ్డవారికి సేవచేస్తూ తను జబ్బు తెచ్చుకొని ముఫ్ఫై సంవత్సరాలకే అచ్చమాంబ మరణించి వుండకపోతే, ఎంతో సాహితీకృషి, తద్వారా స్త్రీజనోద్ధారణ జరిగుండేదని నా నమ్మకం. ఈ పుస్తకం అందరూ తప్పక చదివి తీరాల్సిందే, అచ్చమాంబ అడుగుజాడల్లో నడిచితీర్సాందే. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు అమితాశ్చర్యాలు, ఆసక్తిని రేకెత్తించి, ఇటువంటి పరిపూర్ణ మహిళా సచ్చరిత్రను మనకందించిన రచయిత్రికి అభినందన మందరమాలల్ని అందిస్తూనే వుంటాం. అంతేకాక ‘భూమిక’ ఆలంబనగా వేలాది మంది అచ్చమాంబల్ని తయారు చేస్తే తప్పా, మన సమాజంలో స్త్రీ పరిస్థితి మెరుగవ్వదు. వెల. రూ.50, ప్రచురణ : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఫ్లాట్‌నెం.85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 6 ఫోన్.23521849