కమలమ్మ (వరంగల్‌)

మా పుట్టిన ఊరు మైనాల గ్రామం. మానికోట తాలూకా. మా అత్తగారిది రాంపురం. మాదొక బానిస కుటుంబం. మా జీవితం గురించి చెప్పాలంటే కాస్త బాధనిపిస్తది. మాతల్లి కట్టుబానిసగా కొంతమంది దొరల ఇళ్ళలో చేసింది. తరతరాల నుండీ కూడా మా తల్లిగారి వైపంతా దొరల ఇండ్లలో బానిసలుగా బతికేది. అయితే అప్పటికి మూడుతరాలు గడిచిపోయినయి. మా తల్లిగారు, మా అమ్మమ్మ, మా అమ్మమ్మ తల్లి కూడా ఒక్క దొర ఇంట్లోనే బానిసలుగా ఉండే. మా అమ్మమ్మ పేరేదో వెంకటమ్మ అంటరుగాని నేను మాత్రం చూడలేదు. మా పెద్దమ్మ కూడా ఆ దొర ఇంట్లనే ఉన్నది. ఆ తర్వాత అక్కడనే జరిగిపోయింది. వాళ్ళకి పెండ్లిండ్లు లేవు. చిన్నప్పట్నించీ కూడా పెండ్లిడ్లులేవు. మా తల్లి వాళ్ళ కుటుంబాలు తెలగాలవాళ్ళు. వెనకట ఎప్పుడో వాళ్ళకి తిండి కరువొచ్చి మా అమ్మమ్మ తల్లిని అమ్ముకొని పోయిన్రట. ఒక మానెడు సోలెడు బియ్యానికి ఒక రూపాయికి ఒక బ్రాహ్మని ఇంట్ల అమ్ముకొని పోతే ఇగ ఆ దొరలకే బానిసలుగ ఉంటూ వాళ్ళింట్లనే పనిచేసుకొంటూ ఆదొరలే ఎవరో ఒకరు వాళ్ళనుంచుకుంటూ, అట్ల కాలం గడుపుకుంటు వచ్చి ఉన్నరన్నమాట. అయిన తర్వాత మా నాయనగారికి పెళ్ళి జరగలేదు. మా అమ్మకి కూడా పెళ్ళి జరగలేదు. మా నాయనగారి అన్నగారు – అంటే మా నాయనగారి తల్లి ఆయన అన్న గారి తల్లి ఇద్దరు అక్కచెల్లెళ్ళన్నట్టు. అయితే నాయనగారి తల్లి పేదరాయిలయితే అక్కడ మా నాయనగారి అన్న దగ్గర వచ్చి ఉంటుండె. ఆయన పట్వారిగిరి చేసేది. ఆయన పట్వారిగిరి చూసుకుంటూ మా నాయన అక్కడే ఉండేది. మా అమ్మ ఆ ఇంట్లనే పనిచేస్తుండె. ఆమెకు కన్నెవయస్సు వచ్చింది, కన్నెపిల్ల. మా అమ్మను చూసి అతనుంచుకుంటానన్నడు. పెళ్ళే అనుకోండి ఉంచుకునుడే అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇగ వాళ్ళట్లే ఉండిపోయిన్రు. మమ్మల్నందర్ని కన్నరు. మా అమ్మ పధ్నాలుగు మందినికంటే అందరూ జరిగిపోయిన్రు. మేం మాత్రం అయిదుగురమే మిగిల్నం ఇప్పటికి. ఆ తర్వాత నా వయసు పదిహేను సంవత్సరాలుండే వరకు మా నాయన చనిపోయిండు. అప్పటికే పోరాటం వచ్చేసింది. మా అక్క ఒకామె ఉండె. మా పెద్దన్న తర్వాత ఆమె. ఆమెని కూడా పెళ్ళి చేయకుండ మా పెదనాయినగారి భార్య ఉంచుకున్నది. ఆమె బిడ్డలతోటి కట్టుబానిసగా పంపటానికి, మా కుటుంబాల్లో ఇదే చరిత్ర ఉండె. ఆ రోజుల్లో సమర్తలు ముట్లయినంక పిల్లలని పెండ్లి చేసుకునే వాళ్లు కాదు. ఇదెంత తప్పు చేసిందో దీన్నెందుకు చేసుకోవాలన్నట్లుగా భావించి చేసుకోకపోయేది. కట్టుబానిసలయినా అంతే. మా అక్క ఈడేరిన తర్వాత మా పెదనాయనగారి మేనల్లుడొకాయన ఆమె కన్నెరికం చెడగొట్టిండు. చెడగొడితే ఆమె గర్భిణీ అయింది. చెడగొట్టడం వరకే చూసిండు కానీ, ఆమె పోషణకూ ఇవ్వలేదు, ఇల్లివ్వలేదు. ఏమాత్రం పెట్టలేదు. అట్లనే ఆమె జీవితం నిరర్ధకమైపోయింది. ఆమెని బిడ్డతోటి పంపకుండనే మా పెదనాయినగారి భార్యకూడ చచ్చిపోయింది. కొంతకాలానికి మా అక్క కూడా జరిగిపోయింది. ఇగమాకు మంచిసంబంధాలు దొరకాలంటే దొరకవు కదా. మరి అట్ల పనిచేసేవాళ్లు దొరికితేనే పెండ్లిండ్లయినయి మాకు. నా పెండ్లయేప్పటికి నాకెనిమిది సంవత్సరాలు. ఇప్పటికి 49 సంవత్సరాలకింద ముచ్చట. అప్పట్ల కట్నాల మాటలేదు. మా పిల్లకి నువ్వేం పెడతవనే అడిగేది. ఆ రోజుల్ల హాయిగ నెత్తిదువ్వుకొని బజారుపొంటపోతే ఏదొర కండ్లల్లన్నపడితే వదిలిపెట్టలే. మా ఊళ్ళె ఒక కౌసలామె ముండమోసి ఉన్నది. ఒక దొర స్నేహితుడు గవుండ్లాయనుండె నడియీడు మనిషి. ఈమెకాస్త 30, 35 సంవత్సరాల మనిషి. ముండరాలు. ఒక కొడుకు పుట్టినంక భర్త చచ్చిపోయిండు. మంచిగ ఉండె మనిషి. ఈ మనిషి వాళ్ళింటికి కుందెనకో, గడ్డపారకో పోయిందట. గవుండ్లాయన రమ్మని ఆమె చేయపట్టి గుంజిండట. గుంజితే ఈమె ఏమీ అనలేదు. ఏంటంటే దొరల పాలన ఆనాడు. ఆయన దొరకు స్నేహితుడు. ఈమె బయటికి వచ్చి భార్యకి చెప్పిందట నీ భర్తిట్లన్నడని. ”నువు నా భార్యకి చెప్తవా ఈ ముచ్చట” అని ఆయినపోయి దొరకి చెప్పిండు. ఆ దొర నలుగురయిదుగురు లంబడోళ్ళని పిలిపించి ఆమె నాగం చెయ్యండని చెప్పి పంపిండు. ఆమె చెల్లెలుండే ఊరు రెండు మైళ్లుంటది. చెల్లెలి దగ్గరికి పోతున్నది. మధ్యన తాళ్లున్నయి. ఆ తాళ్ళలో ఈ నలుగురు లంబడోళ్ళు తాగి ఆమెను ఇష్టమొచ్చినట్టు ఆగం చేసి నానా అవస్థపెట్టిన్రు. మానంలో ఇసుక పోసిన్రు. తర్వాతెవరో ఇంటికి తీసుకొచ్చిన్రు ఆమెను. ఆమె చచ్చిపోలేదుగానీ ఇంత దొడ్డువాస్తే కాపిన్రు చేసిన్రు. ఇగొ ఇట్లాటి బాధలన్నిటికి తట్టుకోలేకనే పోరాటంలో కొచ్చినం. ఇంక మా నాయనగారు ఇంకో భార్యని పెళ్ళిజేసుకోలేదని చెప్పినగదా మాతోటే కాలంగడుపుకుంట వచ్చిండు. ఆయన బ్రాహ్మణ పుట్టుకయినా కూడా మాతోటే వచ్చిండు మాతోటే ఉన్నడు. ఎందుకంటే ఆయనకు కొంచెం అభ్యుదయ భావాలున్నయి. వాళ్ళ జీవితాలెందుకు ఖరాబు చెయ్యాలె వాళ్ళను కొంచెం ప్రయోజకుల్ని చెయ్యాలె అని నాకు, మాచెల్లెలికి, చిన్నన్నకు, పెద్దన్నకు అందరికి చదువులు చెప్పించిండు. అప్పుడు నైజాంకాలంలో ఆడవాళ్ళ కెక్కువ చదువులేడున్నయి? నాలుగోతరగతి కంటే ఎక్కువచదువులేదు, ఉర్దూ, తెలుగు అప్పుడు ఇంగ్లీషు లేదు, హిందీ లేదు మా చెల్లి కూడ నాలుగు చదివింది కానీ ఆమెది వట్టిగనేపోయింది, అక్కడికి తనకొక రెండెకరాల పొలం సంపాదించుకున్నది ఉంటే అది అమ్ముకున్నడు దాన్ని. ఆస్తి కాబట్టుకున్నడు వచ్చిండు. ఆ తర్వాత నేను ములుగు తాలూకా పసర గ్రామంలో ఉంటి. ఆ పోరాటం ఆగిన తర్వాత నా దగ్గరికి పసరకు వచ్చి అక్కడనే చచ్చిపోయిండు. ఆయన కొడుకులు దగ్గరలేకపోతే నా కొడుకే తలకొరివిపెట్టిండు. అప్పుడు మా కుటుంబాలల్లో అంతగా తల్లిదండ్రులు చూసిన వాళ్లెవరు లేరు. తినడానికి తిండిలేక, కట్టుబట్టలేక ఉండడానికి ఇల్లు ఇయ్యకుండా వయసునంత మింగి, రక్తమాంసాలు పీల్చి వదిలిపెట్టితే నిరర్థకమైపోయిన ఆడవాళ్ళు ఎందరో ఉన్నరు. మా అత్త జీవితం కూడా అట్లనే ఉండె. నా భర్త కూడా వాండ్ల ఇళ్ళల్లనే పనిచేసేది. రుసుంగల రెడ్డిదొరలు వాళ్ళు. మేం బ్రాహ్మలతో ఉండబట్టి వంట చేసిపెట్టలే. ఊడ్చుడు, అలుకుడుకాడనే మిగిలిపోయినం. ఆయనక్కడ వంట చేసి పెట్టాల్సివచ్చేది. ఆ దొర పేరేదో ఉండె రావుల రామిరెడ్డి. మునివోలు తాలూకా రాంపురం నా మగడ్ని వయసువాడైనా ఆసాముల దొరసాని కొట్టేది. కొట్టుకుంటనే పని చెప్పిన్రు. వాళ్ళు మాంసం తింటే మాకు రాత్రికి ఇంతపులుసు పోసేది కూడా కష్టమే. కట్టుబానిసంటే మరిగట్లనే, బర్రెల గాయమంటే కాసేది. పెండతియ్యమంటే తీసేది. బువ్వొండి పెట్టమంటే వండిపెట్టేది. ఆ ఊరుకుపోయి ఫలానా దొరని తీసుకరమ్మంటే తీసుకొచ్చేది. పోయి వాణ్ణి తన్నుపో అంటే తన్నేది. గుండాగా కూడా ఉపయోగపడ్డడు నా మగడు. నా జీవితంలో లేదు కానీ ఆయన జీవితం అట్లాకూడా కష్టపడ్డది… నేను చేయలేదు కానీ మా అమ్మ చేసింది, అక్కచేసింది, మా అన్న చేసిండు. దొరసాన్లు నన్ను, మా చెల్లినీ, చిన్నన్నని కూడా బానిసలు చేసేందుకు ప్రయత్నించిన్రు కానీ, మా నాయన గారుంచనీయలేదు. అప్పుడు దొరసాన్లు దొరసాన్లే. వాళ్ళు కుర్చీల మీదనే, మంచాల మీదనే, మేం మంచాల కిందనే, పియ్యెత్తి పోయడమూ, కక్కుడెత్తి పొయ్యటమూ అన్నీ చేయటం. నాకేదో కమ్యూనిస్ట్‌ పార్టీ. బువ్వపెట్టింది కనుక, ఆ ఇంత తింటూ, ఇంతో అంతో నేర్చుకుంటే ఈమాత్రం జీవిస్తున్న….కానీ, మా చెల్లికయితే ఆ చదువు కూడా వట్టిగనే పోయింది. అప్పుడు ఈ పోరాటమొకటి వచ్చింది. ఇగ యీ పోరాటమే మాకు కాస్త మార్గం చూపింది. యిందులోకి మొట్టమొదట మా అన్న వచ్చిండు మా పెద్దన్న. నైజాం రోజుల్లో 20 మందితో ఉన్న దళానికి దళకమాండరుగ వుండె. నైజాం ప్రభుత్వం లెవీలు పోసుకపోతా వుంటే మా అన్నదళం పోయి అడ్డం తిరిగింది. ఆ లెవీ బండ్లని తగలపెట్టటానికి ప్రయత్నం చేసిన్రు. ప్రయత్నిస్తే అప్పుడు బాగ రజాకార్లు పోలీసుల సిబ్బంది మా తల్లిగారి వూరిమీదపడి ఇండ్లన్నీ కాలబెట్టిపోయిన్రు. ఆ వూళ్ళెనే ఎనమండుగురు కామ్రేడ్స్‌ ఉండిరి. అప్పుడు నా పెద్దకొడుకు మూడు నెలల పిలగాడు. నేను పదిహేను పద్దెనిమిది సంవత్సరాలదాన్ని. ఇగ ఆతర్వాత వీళ్ళకి నిరాధారమైపోయింది. ఎక్కడ ఉండలేకపోయిన్రు. అట్లనే నా భర్తకు కూడా నిర్బంధం ఎక్కువైపోయింది…పోలీసులది… రజాకార్లది. అప్పుడు ఈదొరల బాధలు ఊళ్లల్లో యీ పోలీసుల బాధలు ఇవన్నీ చూడలేక నా భర్త కూడా ఈయనతో పాటే ఇందులో కొచ్చేసిండు…. ఈయనొచ్చిన తర్వాత కూడా నా కొడుకు పదినెలల వాడయ్యే వరకు నేనురాలే. అప్పుడు నేను పడుచుదాన్ని కదా! ఇగ ఈ ఊళ్లమీద జరిగేటువంటి దోపిడులూ, కాలవెట్టుడులూ, చంపుళ్లు నానా బీభత్సం చేస్తున్నరుకదా ఏం బాగలేదు. ఇగ నన్నేం చేస్తరో అనే భయాందోళనమీద నేను అండ్లనే పోతనని వచ్చేసిన. ఒక్క కొడుకయిపాయె. ఆయనను మా అన్నలు, మా నాయన పోషించిన్రు కొంతకాలం. మా చిన్నన్న…. రజాకార్లప్పుడే దొరికిండాయన. తుపాకి మందు సామాను తీసుకురమ్మని బెజవాడ పొమ్మనిచెప్పి మా పెద్దన్న డబ్బిచ్చి పంపిండు. ఈయనబోయి గానుగ బండలో పట్టుబడ్డడు. అప్పుడాయనను కొట్టి తీసుకుపోయి గుల్బర్గాజైలులో ఐదున్నర నెలలుంచిన్రు. స్వాతంత్ర పింఛను వస్తుంది. మా పెద్దన్నయితే యూనియన్‌ సైన్యాలొచ్చిన తర్వాతనే అరెస్టు యిండు. ఆయనకయితే ఆ పింఛన్‌ కూడా లేదు. నేను కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరిన తర్వాత వైజ్ఞానికదళంలో పనిచేసేది, నా కంఠం బాగుంటుంది జర. కథలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ కొన్నాళ్లు తిరిగిన. తర్వాత ఏరియా కమిటీ సెంటర్లలో, ప్రాంతీయ కమిటీ సెంటర్లలో సర్క్యులర్‌లవీ రాసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత పోరాటం విస్తృతమై పోయింది. ప్రతిగ్రామానికీ పోలీసు కాంపులయిపోయినయి. కామ్రేడ్స్‌ తిరగడానికి వీల్లేక పోయింది. కనబడ్డోళ్ళు కనబడ్డట్టే కాల్చేస్తున్నరు. అటువంటప్పుడు ప్రజలు కూడా మనల్ని దగ్గరకి రానిచ్చే పరిస్థితి లేకుండాపోయేటప్పటికి అప్పుడు మేమొక దళంగ తయారయి వైజ్ఞానికంగ పనిచేస్తూ బయల్దేరినం గ్రామాలమీద. కోయజనం ఎటువంటి జ్ఞానం లేకుండ ఉన్నరు. మగవాడు కట్టుకుంటే చిన్నపంచ కట్టుకునేది. ఆడదానికి లోపల గుడ్డగోచీ చుట్టు ఒక చిన్న గుడ్డ చుట్టుకునేవాళ్ళు. మనం పోయిన తర్వాతనే నాగరికత నేర్చుకున్నరు. ఆడది బట్టకట్టుకోవడం నేర్చుకున్నది. ఆడదానికి అంతో ఇంతో చీమూనెత్తురు ఉన్నాయనేది గుర్తించిన్రు. ఆనాటినుంచే వచ్చింది మార్పేదైనా. తెలివి నేర్చుకోవడం కొంచెం ముందుకురావడం. ఏ గవర్నమెంటూ పట్టిచ్చుకోలేదు అడివిజనాన్ని. నైజాం ప్రభుత్వం, న కాంగ్రెసు గవర్నమెంటు చూడలేదు. పోరాటం ఎఫ్పుడయితే విస్తృతమయిందో అప్పుడే ఆ జనంలో జొరబడ్డం. ఇగట్ల నేను వైజ్ఞానకంగనే ఎక్కువ పనిచేసిన. ఆస్పిటల్‌ సెంటర్లలో ఉన్న. ఇంజక్షన్లు, ప్రాథమిక చికిత్స కొంతనేర్చుకున్న. డాక్టరే క్లాసులిచ్చిన్రు. కాని ఎక్కువ వైజ్ఞానికంగనే పనిచేసిన. మానికోట తాలూకాలో పనిచేసిన. ఖమ్మం ప్రాంతం తిరిగిన. గార్ల జాగీరు తిరిగిన. మొత్తం అవన్నీ అడివి ప్రాంతాలుండె. తర్వాత మంథెన మాధవపూర్‌ పోయిన. సూర్యాపేట్‌ మాత్రం పోలే. తర్వాత నేను, స్వరాజ్యం, తుమ్మల శేషయ్య భార్య అచ్చమాంబ అందరం అడివిల్నే కలుసుకున్నం. సూర్యాపేట ఒక గ్రామంలో డాక్టరు క్లాసిస్తున్నడు. అప్పటికి మా పెద పిల్లగాడు పదినెల్లోడు. క్లాసులో అందరం ఆడవాళ్ళం మగవాళ్లం కూర్చోని వింటున్నం. వాడు ఏడ్చుడు మొదలుపెట్టిండు. ఏడిస్తే నాక్కొంచెం బాధనిపించింది. ఇంతమంది కూర్చోనుంటే వీడిట్ల ఏడుస్తున్నడు అనిచెప్పి బాధపడుతున్న. డాక్టరేమో ‘నువ్వేం అనొద్దమ్మ పిల్లగాణ్ని వాడిదే భవిష్యత్తమ్మా’ అని సముదాయిస్తున్నడు. నా మనసాగక ఏంచేసిన మా ఊరినుంచి ఒక గడ్డం పుల్లయ్యని కామ్రేడ్‌ వస్తే పిలగాణ్ణిచ్చి తీస్కపోయి మా ఆడబిడ్డ కియ్యమని చెప్పి పంపిచ్చిన. నాకు పాలు తగ్గిపోయినయి. ఆమెకొక బిడ్డ పుట్టి చచ్చిపోయిండు. ఆమెనే పాలిచ్చింది, ఆమెనే సాకింది. ఇంతలో ఇక్కడకూడా దాడులెక్కువయినయి. యూనియన్‌ సైన్యాలొచ్చినయి. కమ్యూనిస్టుల వేట మొదలయింది. మొన్నటిదాకా ఆ శత్రువు మీద పోరాడినం. ఇప్పుడీ శత్రువు తాకింది. అదంటే ఇగ చిన్న శత్రువు. ఇది పెద్దశత్రువయేటట్లున్నదని మళ్ళా పార్టీ పిలుపిచ్చింది. ఇక్కడుంటే బాగుండదని, యూనియన్‌ సైన్యాలొచ్చి మనల్ని బతకనియ్యవు, మనం అడివిలోకి రిట్రీట్‌ అయిపోవాలె అని రిట్రీట్‌ అయిపోయినం. అప్పుడెళ్ళి పోయేటప్పుడు కూడా నేనెందుకంత అడివిలోకి అని కొంచెం ఎనక ముందు ఆడిన. అప్పుడు నా భర్త పిలిచి ‘నేను ఒంటరిగ వెళ్ళిపోతే, నువు ఇక్కడే ఉంటే నిన్ను చంపుతరు. నేనొక్కడ్నే కాకుండా చచ్చిపోతే ఇద్దరం ఒకేచోట చచ్చిపోదాం ఒక్క దిక్కున్నే ఉందాం’ అని ఆయన కొంచెం నా మనసుని కరగదీసిండు. ఇగ ఆయనెంటనే ఎళ్ళిన. నేను కూడా ఎందుకెనడాన్నింటే, పోయిన వాళ్ళంతా బతికొచ్చేది నమ్మకం లేదు. ఇగ నేను కూడా పోయి ఆ కష్టాలల్ల ఎటైతనో అనేది వెనకపీకుతుండె. ఎట్లయిన అప్పుడు వయసు చిన్నదికదా నేనందులోకి ఏం పోవాలె అనేది బాధ. ప్రభుత్వం మీద అభిమానం ఉండి కాదు. అభిమానంతో వెనకకు మర్లుదామనుకోలేదు. ఉన్నదున్నట్టే చెవుతాన్న. కాకపోతే ఆ కష్టాలేం తట్టుకోగల్గుతనా అనేటువంటిది బాధ. అయితే ఆయన నా మనసు మార్చి తీస్కపోయిండు. వెళ్ళిపోయినంక నేను ఆరునెలలు వాళ్ళతోపాటు అడివిలో తిరిగిన. తర్వాత అబ్బాయిని ఒక్కసారి చూసొస్త నన్ను పంపించండి అని అడిగిన. సరే అని చెప్పి నన్ను పంపిన్రు. నేనక్కడికి బయల్దేరిన రాత్రే అడివి మొత్తం చుట్టేస్తదట యూనియన్‌ గవర్నమెంటు అనేటువంటి సమాచారం తెల్సింది. రాత్రిపూట ఆడదానివి ఉరకలేవు ఒక్కదానికి ఉంటే దబుక్కున పట్టుబడితే చంపుతరు. నువ్వెళ్ళిపో ఈ రాత్రి అని పార్టీవాళ్ళు నాయకులు ఎన్నో చెప్పిన్రు. అదేరాత్రి బయల్దేరి తెల్లారిన దాకా నడిచీ నడిచి ఎనక్కి అడివిలోకొచ్చి చేరుకున్న. తెల్లారిన తర్వాత మనోళ్ళమీద దాడైతే ఎట్లనో తప్పుకొని ఎనకకొచ్చిచేరిన్రు. ఒక ఏడాది యాణ్ణర్థం అయిన తర్వాత మళ్ళీ గర్భిణీ వచ్చింది. అట్లానే వాళ్ళతోటి తిరుక్కుంటూ చేరిన. ఇగ నీళ్ళాడే టైమయింది, అప్పుడే చుట్టుపక్కల పది గ్రామాలవాళ్ళను తీస్కబోయి కాంగ్రెసు గవర్నమెంటు ఒక కాంపు కింద పెడుతున్నది. మాకు రక్షణ లేదక్కడ. మంత్రసాని దొరికేటట్లు లేదు. నేను నీళ్ళాడేదెట్ట – అనెటువంటి పెద్ద ఆందోళన నా కడుపుల ఉండె. అక్కడొక సాంపేట అనే గ్రామం ఉండె. దాన్ని మాత్రం కాంపుల పెట్టలే ఎందుకో. అక్కడొక ముసలమ్మ మంత్రసాని చేస్తదంటే ఆమెను తీస్కొచ్చిన్రు. ఆ రాత్రి నాకు నొప్పులొస్తుంటే ఒక పొద కింద ఉంటే ఆమెను తీసుకొచ్చి కాన్పు చేయించి తెల్లారకముందే ఆమెను వెళ్ళగొట్టిన్రు. ఇగ ఆ పిలగాణ్ణి ఆరు నెలలదాకా పార్టీలో ఉండి పనులు చేసుకుంటనేసాకిన. ఆరునెలలయిన తర్వాత మన ఏరియా కమిటీ నాయకులు ఏం చేసిన్రంటే ‘కమలమ్మా! ఈ పిల్లగాణ్ణి ఎవరికైనా ఇయ్యాలె లేదా నువ్వయినా పోయి ఊళ్ళో పిలగాణ్ణి పెట్టుకోని ఉండాలె’ అని చెప్పిన్రు. చెప్పినవాళ్ళలో ఓంకార్‌ ఉన్నడు. కొండేటి వాసు దేవరావు ఉన్నడు. విన్నరా! మరి తిరుమలరావు ఉన్నడు. వాళ్లందరికిందా ఉన్నటువంటిదాన్ని. ‘ఈ పిలగాడు ఆరునెలల పిలగాడయ్యెటప్పటికి ఎట్లయిన ఏడుస్తడు. మేమందరం అడివిల ఉంటం. పెద్దపెద్ద నాయకులందరు మనచుట్టే ఉంటరు కద! ఒక పిలగాడు చెయ్యబట్టే ఇంతమంది ప్రాణాలు పోతయ్యి. రెండోది మేమొక్కొక్కళ్ళం కొన్నివేలమంది సేవ చేసేవాళ్ళం. నీ ఒక్క కొడుకిప్పుడు ఏం పనిచెయ్యలేనటువంటివాడు. ఎంత మందికో తొడ్పడ్తడనే ఆశ తోటి మనం పెంచేటట్లులేదు. వాణ్ణి నువ్వెక్కడనయినా ఇవ్వాలె, లేదా నువు వాణ్ణి తీస్కపోయి ఎక్కడనయినా ఉండాలె’ అంటూనే వెంటనే ఎనకమర్ల ఏమన్నరంటే ‘నువు వెళ్ళినవంటే నిన్ను కత్తికొక కండచేస్తరు, కారం పెడతరు, నిన్ను చంపుతరు, ఆగం చేస్తరు. నీ ఇష్టం నువ్వు ఆలోచించుకో’ అనన్నరు. అప్పుడు అప్పన్నగారు కూడ నా దగ్గరలేరు. ఆయన మంథెన మాధవపూర్‌ పోయిన్రు. ఇంక నేనొక్కదాన్నే వీళ్ళ చుట్టు ఉన్న కద! ఇగ నువ్వే నిర్ణయించుకో అంటే నేను బాగ ఆలోచించుకున్న. నేను పోయేటట్టులేదు. కొంచెం ఎనకముందు కడుపుల భయమైతున్నది. చచ్చిపోతే వాళ్ళతోటే చచ్చిపోత. మళ్ళ పిల్లగాడి కోసం ఊళ్ళల్లోబోయి ఉండుడేందని చెప్పి పిల్లగాణ్ణి ఇవ్వడానికే నిర్ణయించుకున్న. అయితే తీసుకునేందుకు ఎవ్వరూ ఒప్పుకోలే. పిల్లగాణ్ణి చూస్తే తెల్లగ బట్టల్లో కలిసిపోయేటట్లుండె. ఆ కోయవాళ్ళని ఎవర్ని తీసుకోమన్నాగానీ ‘ఈ పిలగాడా అమ్మో! నా ఇంట్లో ఎక్కడ కమ్ముతడక్కా! వాళ్ళు మమ్ముల్నే అడుగుతరక్కా! వాళ్ళు మమ్ములను చంపుతరు అక్కా! మేం దీసుకోం అక్కా’ అనె. అప్పుడు పార్టీ ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం కూడా ఓంకార్‌ సాబే ఇచ్చిండు. ఈ పిలగాణ్ణి తీసుకునిపోయి బొగ్గుట్టకు పెద్ద తాళ్ళగడ్డ దగ్గర ఉంది. ఆ బొగ్గుట్ట ఊళ్ళోకిపోయి పిలగాని మెళ్ళో ‘మేం ‘సాకలేక వెళ్ళిపోతున్నము’ అని చెప్పి ఒక చిట్టిరాసి కట్టి పోలీసు గస్తీ తిరిగే స్తళాలల్ల పిల్లగాణ్ణి పండపెట్టి సప్పుడు చేయకరా’ అని నిర్ణయం చేసిన్రు. ఏ తల్లికైనా సాహసిస్తదా! అప్పుడు నేను కొంచెం ఏడ్చిన, ఏడ్చి ‘నేను పోలేను. ఎట్లైనా అప్పన్నగారిని పిలవండి చూపించుదాము’ అన్న. అంటే ఓంకార్‌ గారు ఏమన్నరంటే, ఇది కార్మిక వర్గానికి తగ్గ చైతన్యం కాదమ్మా! అన్నరు. ఆ మాట అనేప్పటికి నా తలకాయ తిరిగిపోయింది. ఇంతమాట నేనెందుకన్పించుకోవాలె! నేను బతకడానికి రాలే ఈ పోరాటంలోకి. ఏదో కొంతో ఇంతో సేవచేసి చచ్చిపోవడానికేవచ్చిన, మళ్ళా బతికిపోతమని ఆశలు లేవు. అయినా ఈ గుడ్డు కోసం నేను తాపత్రయపడడమేందని చెప్పి నా మనసు మారి సరే పండబెట్టి వస్తనన్నయ్య అని చెప్పిన. అప్పుడు ఒక కామ్రేడ్‌ని నా వెంట పంపిస్తే గార్ల జాగీరు కొచ్చినం. రెండు రోజులు నడిచినం. గార్ల జాగీరుకు వచ్చినంక ఆర్గనైజరుగా పనిచేసే ఆయన ఒకాయన కల్సిండు. కల్సి, ఎవరు చెప్పిన్రు ఈ నిర్ణయం! నువ్వెందుకు పారేస్తానికి వచ్చినవమ్మ! ఇక్కడెవరికన్నా చెప్పి ఇప్పిద్దాము అని అన్నడు. అక్కడ జనం కొంతమందెట్లున్నరంటే కాంపుల కిందకి జనాన్ని తీస్కపోతా ఉంటే, మన దళాలతోటి తప్పుకొని, మన కుటుంబాలతోటి తప్పుకొని మన కామ్రేడ్స్‌ తోటి తప్పుకొని అడవిలో ఉన్న కుటుంబాలు కొన్ని ఉండె. బొగ్గు బాయిల పనిచేస్తడట ఒకాయన. ఆయనకు ముగ్గురు మొగపిల్లలు పుట్టి చచ్చిపోయిన్రట. ‘ఈ పిల్లగాణ్ణి నువు తీసుకోరాదే అన్న’ అంటే సరే అన్నడు. ఇగ పిలగాణ్ణి ఆయన చేతిలో పెట్టి నేనెళ్ళిపోయిన. అంతవరకే కానీ, నా శరీరం నా చేతులలేదు. నా మనసు నా చేతిలలేదు. నా కళ్ళు నా చేతిలలేవు. కంటికి మంటికి ఒకటే ధార. మళ్ళీ మన కామ్రేడ్సున్న స్థలానికి పోయేవరకు రెండురోజులు పట్టింది. ఇంక ఆ పిలగాడేమయ్యిండో ఇప్పటికి 36 సంవత్సరాలయింది. ఇప్పటికీ నాకు తెలియదు. ఒకసారి విప్లవ కమ్యూనిస్టులు వచ్చి నా జీవితచరిత్ర అడిగినప్పుడు దుఃఖం వచ్చింది. నా కొడుకు గురించి దుఃఖం. నిజంగా నేను చేసినత్యాగం నాది నేను చెప్పొద్దు కానీ, చచ్చిపోయిన తీగల సత్యనారాయణరావు అన్నడుగదా ‘కమలమ్మా! దేశదేశాల చరిరతలు చదువుతున్నాం. మనం నువ్విప్పుడు మనదేశంలో, మన తెలంగాణాలో ఆదర్శవంతురాలైన మహిళవమ్మా! నువ్వెందుకు భయపడతాన్నవు? ఎందుకు బాధపడతాన్నవు? పిలగాణ్ణి దానం చేసినానని బాధపడకు. నీది ఒక చరిత్రవుతం’దని అన్నడు. అట్లతృప్తి పరిశిన్రు నన్ను. కానీ కడుపుతీపి ఎక్కడ పోతుంది నాకు? ఒకసారి ఈ ఇచ్చేసినబ్బాయిని కడుపులో ఉన్నప్పుడు ఏరియా కమిటీ సెంటర్లో ఉన్నం. అప్పన్నగారు ఈ బయట ప్రాంతానికి ఆర్గనైజేషన్‌కి వచ్చిన్రిటు. సెంటర్లో నేను, స్వరాజ్యం, తిరుమలరావు, ఇంక కొంతమంది కామ్రేడ్స్‌ – అందరం ఉంటిమి. మాక్కావాల్సిన సామాన్లు తేవడానికి ఒక కామ్రేడ్‌కి కొంత డబ్బు ఇచ్చి ఏరియా కమిటీ పంపింది. పోయిన తర్వాత ఏమయిందో ఏమో అన్న తేదీకి, టైముకి ఆయన తిరిగిరాలేదు. రాకపోయేవరకు మాకందరికీ అనుమానం వచ్చేసింది. అక్కణ్ణుంచి స్థలం మార్చాలనుకున్నం. మధ్యలో ఒక గుట్ట ఉంటే ఆ గుట్టమీదుగా దిగిపోయి అవతలిపక్కకు పోయినం. క్రమశిక్షణ పాటించక అందరూ ఒకేదోవలో కలిసి పోయేవరకు అడుగులు ఏర్పడ్డయ్యక్కడ. ఆ తర్వాత బాషా అని ఒక కామ్రేడ్‌ని ఊళ్ళల్ల వార్తలేంటి తెలుసుకోవటానికి లంబాడీగూడెం పంపినం. అప్పుడు నాకు వేవిళ్ళు. నేను పడుకుని ఉన్న, ఒక కామ్రేడ్‌ వంటచేసేకాడున్నడు. రామనర్సయ్యనీ ఆయన పార్టీ సర్క్యులర్లు గిట్ల రాసేది. ఆయన తర్వాత నక్సలైట్‌ పార్టీలోకి పోయినంకనే పట్టుబడి కాల్చివేయబడ్డడు. ఆయనరాస్తున్నడు. ఈ బాషా అనే కామ్రేడు 3.03 (తుపాకి) చంక నేసుకున్నడు. వార్తలకి బోయిండు. ఈ సామాన్ల కోసంపోయిన కామ్రేడక్కడ పట్టుబడ్డడు. పట్టుబడి పోలీసుల్ని మేమున్న స్థలం కాడికి తీసుకొచ్చిండు. అక్కడ మేం లేం. ఇటొచ్చినంకదా! అడుగులు పడ్డయి. ఇతను గెరిల్లాకదా! ఇతనికి తెలుసు ఆ పోలీసుల్నెంటబెట్టుకుని మా సెంటరు మీదికే వస్తున్నడు. వస్తుంటే మధ్యలో బాషా కనబడ్డడు. ఒక ఫర్లాంగు దూరం బోయిండో లేదో బాషాను చూసి ఒకటే పరారు. ఎంట పోలీసులు. వాళ్ళు అతని మీద కాల్పులు చేసిన్రు. మేమదివిని చచ్చిండు మనోడంటు, ఇటు నేను, అటు రామనర్సయ్య, అటు సూర్యాపేట కామ్రేడ్‌ రాములని ఉండె, అందరం లేచి ఇగ ఉరుకుతనే ఉన్నం. ఎక్కడివక్కడ పారేసిపోయినం. నాలుగైదు ఫర్లాంగులురికినం అట్ల, నేను చాతకాక ఉన్న కదా! ఆయాసం వచ్చేసింది. ఈ బాషా ఏం చేసిండు? సెంటరు కురికొచ్చి ఉన్న సామాన్లు తీసి పుస్తకాలే సర్దిదాచిపెట్టిండు. నా ఎనకొచ్చి కమలక్క ఆగు అన్నడు. అన్నా గానీ పోలీసోడు వస్తున్నడేమో ఎనకంబడి అని నేను మాట్లాడకుండ ఉరుకుతునే ఉన్న. నేను బాషాని అనగానే ఆగి అతన్ని కలుపుకుని మనకామ్రేడ్స్‌ందర్ని కలుపుకొని మనదళాల దగ్గరికి పోయినం. మా దళంలోనే వెంకటమ్మ అనే కోయామె ఒక కామ్రేడుండె. ఆయుధం పట్టుకున్నది. దళకమాండరుగా ఉన్నదామె. ఆమెకూడా బర్మారుపట్టుకొని తిరిగింది. లింగాల కొత్తగూడెం ఆమె ఇప్పుడు లేదు చచ్చిపోయింది. మంచి కామ్రేడ్‌. ఒకసారి అడవిలో మేమిద్దరమే ఉంటె. పొద్దు గూకింది. కామ్రేడ్స్‌ ఎవరూలేరు సెంటర్లో. మేం ఉన్నచోట ఉండకూడదు. పడుకోకూడదు. అక్కణ్ణుంచి బయల్దేరి రెండు మైళ్ళు నడిచిపోవాలి మేము. అయితే ఆరాత్రే బయల్దేరి రెండుమైళ్ళు నడిచి నిలువెత్తు గడ్డిలో పొదజేసి అందులో పండుకున్నం. మంచి ధైర్యం గలదామె. ఒకసారి మంథెన మాధవపూర్‌ దగ్గర ఊళ్ళో పెత్తందార్లు మన ఆర్గనైజర్‌ను ఒకాయనను పట్టుకొని చంపేసిన్రు. అప్పుడు మన దళాలు ఆ ఊరును చుట్టుముట్టి ఊర్లో మన కామ్రేడ్‌ని చంపినవాళ్ళుంటరుకద ఆయన్ను పట్టుకొని చంపేసిన్రు. ఆ దాడిలో వెంకటమ్మ కూడా పాల్గొన్నది. ఆయుధం చంకనేసుకుని ఆడమనిషి అని బయటపడకుండా మగడ్రెస్‌ వేసుకుని వాళ్ళతో కల్సిపోయింది. ఆ ఊరిపేరు ఆళ్ళపల్లి. ఆళ్ళపల్లి గడిలో పోలీసుకాంప్‌ ఉండేది. ఆ కాంపులోకి చుట్టుపక్కల పల్లెప్రజలందర్ని సమీకరించుకున్నారు. సమీకరించుకుని జనం బయటకు రాకుండా హోమ్‌గార్డ్సుని కాంపుచుట్టూ పెట్టిన్రు. అయితే ఆ కాంపుని ఆక్రమించుకున్న గుండాలను హోమ్‌గార్డులను దొరికితే తన్నడమో, కాంపులను కాలబెట్టడమో చెయ్యాలని దళాలకు ప్లాన్‌ ఇచ్చింది పార్టీ. దళాలు దాని ప్రకారమే వెళ్ళిన్రు. వెళ్తే ఈ వెంకటమ్మ ఉండే దళంకూడా పోయింది. పోయి ఆ కాంపును చుట్టేసిన్రు. ఆ హోమ్‌గార్డ్సు గుడిశలల్లో పందిళ్ళల్లో పడుకొని ఉన్నరు. మన వాళ్ళు ఆ కాంపుని చుట్టేసి దానికి నిప్పంటించిన్రు. అంటిస్తుంటే ఒక హోమ్‌గార్డు వచ్చి ఈమెని పట్టుకునేందుకు ప్రయత్నం చేసిండన్నమాట. ప్రయత్నం చేస్తే ఈ తుపాకీ మడమతోని అతన్ని గుద్ది పారిపోయి ఇక్కడొచ్చేసింది. ఇంకా మాటుకాసి కొట్టే దాడులల్లో చాలావాటిల్లో పాల్గొన్నదామె. దాడులల్లో పోయొచ్చిన తర్వాత అందరం కూర్చున్నపుడు సరదాగా మాట్లాడుకుంటూ ఇదిగో నేనట్ల బోయిన్నే నేనిట్లబోయిన్నే అని చెప్పుకునే వాళ్ళమన్నమాట. వైజ్ఞానిక దళంలో పనిచేసినప్పుడు నేను శాంతమ్మ ఇద్దరం ఉంటిమి. ఆస్పితాల్‌ సెంటర్లో పని చేస్తున్నపుడు మోహనరావు భార్య అచ్చమాంబ అని ఆమె నేను ఇద్దరం ఉన్నం తర్వాత ఏరియా కమిటీ సెంటర్లో ఉన్నపుడు నేనూ స్వరాజ్యం ఇద్దరం ఉన్నం. మేము వైజ్ఞానికంగా అడవిలో తిరగటం మొదలు పెట్టినంక కోయ కామ్రేడ్స్‌ చాలామంది ఆడవాళ్లు వచ్చిన్రు. మనతోపాటే ఉన్నరు. కాని నేను అచ్చమాంబ ఎప్పుడూ ఆయుధాలు పట్టుకోలేదు. ఎందుకంటే కాస్తో కూస్తో చదువుకున్నం. నలుగురికి నచ్చచెప్పేటట్లు ఉన్నం అని పార్టీ చూసింది. కొద్దోగొప్పో ఉన్న ఆడవాళ్లలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు, తెలివిగల వాళ్ళు లేరు. అంతా కోయ కామ్రేడ్సేనాయె. ఒకసారి మా దళాలు మేమంతా కూడా చిట్యాల అనేటువంటి గ్రామంలో ఉన్నాం. అడవిలో ఇచ్చేసిన పిలగాడు ఐపోయినంక మళ్ళ గర్భిణీ అయిందినాకు. 51 వెళ్ళి 52 మొదట్లో మాట ఇంక కొద్దినెలలయితే పోరాటం ఆగిపోతది. అయితే ఏమయింది చిట్యాల అనే ఆ గ్రామంలో ప్రజలు ఎవరో ఒక కొత్తతను వచ్చిండని చెప్పి మా దళానికొచ్చి చెప్పిన్రు. చెప్పేసరికి మనోళ్ళే పోయి పట్టుకొచ్చిన్రు. అతనికి మన మాటరాదు. హిందీ మాట్లాడుతడు. మా దగ్గర పలక ఉంటే ఆ పలక బలపం చేతికిచ్చి రాయమని చెప్తే హిందీయే రాస్తున్నడు కానీ ఇంకేం రాస్తలేడు.ఒకటే ఏడుస్తున్నడు. ఏడ్సుడు ఏడ్సుడు పొద్దునదాకా ఏడ్వపట్టిండు. ఇంక నేను నిండునెలలతో ఉన్న. మా దళానికి అప్పన్నగారే దళనాయకుడు. ఇంక కామ్రేడ్సందరూ వాడెవడో సి.ఐ.డి. గానే వచ్చిండు వాణ్ని చంపాలె అని అంటున్నరు. నాకు మాత్రం రక్తం బాధిస్తుంది. ఆయన ఏడుపు చూస్తే నాకెందుకో బాధ కాబట్టింది. ఇది పద్ధతి కాదు ‘ఈయన ఎక్కడినుంచొచ్చిండో ఏ ఊరో’ అని ఈయనతో నేను పక్కవాటుగా అనటం మొదలుపెట్టిన. భర్త కదా అని కొంచెం చొరవ. ‘నాకెందుకో ఆయనను చంపాలంటే మనస్కరించటం లేదు’ అని పొద్దునదాకా గొడవ పెట్టిన. సరే ఈయన నా మాటలకే అనుకోండి, ఆయన ఏడ్పుకే అనుకోండి. ఎక్కడో కొంచెం మానవతతో ప్రవర్తించిండు. సాయంకాలం దాకా అతన్ని మా దగ్గర ఉంచుకున్నం. తర్వాత వదిలిపెట్టినం. వదిలిపెట్టినంక వాడెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినంక తెల్లారే పోలీస్‌కాంపు. పోలీసులు విపరీతంగా వచ్చి ఆ ఊరంతా తగలపెట్టి పారేసిన్రు. ఇంక వాళ్ళముందంటే నన్ను బతకనీయరని చాటుగుండా ఎన్నో విమర్శలు పెట్టిన్రు ఈయన. ఇగ ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీ పిలుపిచ్చింది పోరాటం ఆపెయ్యమని. పోరాటం ఆగిపోయినప్పుడు చాలబాధ అన్పించింది. కామ్రేడ్స్‌ ఆయుధాలు కింద పెట్టం అన్నారు. ఆయుధాలు అప్పగించడమంటే మా ప్రాణాలు మేము తీసుకోవడమే అన్నారు. మా ఆయుధాలు మీరే తీసుకోని కాల్చేయండన్నరు కామ్రేడ్సందరూ. మాంసం, కూర, బువ్వ ఏంలేకుండా ఒక లోటడు గంజి జావకాచుకుని పన్నెండు మందిమి తాగి ఆపెయ్యాలంటే ఎట్లుంటది? చాలా కష్టమయ్యింది. మరి ఆయుధాలు ఇంద పెట్టడమంటే వాళ్ళకి లొంగిపోవటమేకదా. అప్పటికి మా తెలంగాణ కామ్రేడ్స్‌కి నచ్చజెప్పటానికి కేరళ నుంచి వచ్చిన్రు, బెంగాల్‌ నించి వచ్చిన్రు. పెద్దపెద్ద నాయకులే వచ్చిన్రు. మొత్తం ఆలిండియా పార్టీ అంతా తెలంగాణా పోరాటం ఆపటానికి సర్వవిధాలా కృషి చేసింది ఆపకపోతే నిజంగా అది విస్తృతమౌనో లేక నామరూపాలు లేకుండా పోదుమో చెప్పలేము. ఆయుధాలు కిందపెట్టినంక కూడా కాంగ్రెసు గవర్నమెంటు మన కామ్రేడ్స్‌ ఇద్దరు ముగ్గురిని కాల్చేసింది. అప్పుడు కూడా కామ్రేడ్స్‌ చాలా బాధపడ్డారు. అది గవర్నమెంటు దాని దగ్గర నీతి ఉండదని మనకి ఎరికేకద! అయినా కూడా ఈ ప్రభుత్వం మనమీద సానుభూతి చూపదని మనకి ముందే తెలుసు. గవర్నమెంటు రాకముందే మన పార్టీ పాటలు, కథలు రాయలేదా! మేంపాడేది ఆ రోజుల్లో వద్దురా మనకొద్దు రైతన్న కాంగ్రెసురాజ్యం వద్దురా మనకొద్దు కూలన్న! పుట్టినను చచ్చినను పన్నులు పచ్చిబూతులు ముచ్చెతన్నులు పట్టికొట్టుట, కాల్చిచంపుట వడ్డినరకము, బానిసత్వము వద్దురా మనకొద్దు రైతన్నా కాంగ్రెసురాజ్యం వద్దురా మనకొద్దు కూలన్న! ఇగ పోరాటం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు జీవితం అంటూ పెట్టినప్పుడు పనిచేసుకోవడానికి స్థిరాస్థి ఏం లేకుండె. ఇటు తల్లిదండ్రులకులేదు. అటు అత్తగారికంతకంటేలేదు. మాకు పార్టీయే మనిషికొక్క దున్నపోతును, పేరుతోటి 120 రూ||లను ఇచ్చింది. కొన్ని కుటుంబాలకు ఇగ ఇంత బిందె ఒక కడవ అట్ల ఇచ్చిన్రు. నాకరవయి, ఆయన కరవయి ఇచ్చిన్రు. ఆ రోజుల్లో 60రూ||కి దున్నపోతు దొరుకుతుండె. ఒక అరకగట్టుకోవచ్చు. భూమి మాత్రం జానానికి పంచిఇచ్చినం. మేమంత కామ్రేడ్లమేనాయె పనిచేసే వాళ్ళమేనాయె. ఇగ ఆ తర్వాత మాదీ ఒక నిరుపేద కుటుంబమే. తర్వాత నాగిరెడ్డి నక్సలైట్‌ పార్టీతో ఈయన కూడా చేరిండు. నాగిరెడ్డి కుట్రకేసులో నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఈయన జైలులో ఉండె. ఉన్న ఇక ఇల్లు అమ్ముకోని బతకమని ఉత్తరం రాశిన్రు ఆయన. ఈ పిల్లలందరు నా మెడకే ఉండె. నేను కొంగుపట్టుకొని బిచ్చం అడుక్కొచ్చి వాళ్ళను సాకిన. మనిషికి కష్టాలనేవి వస్తయ్యి. ఆస్తి ముఖ్యంకాదు. మననిబ్బరంలో ఉంది. అటువంటి నిబ్బరం నాలో ఉన్నది. ఇప్పటిదాకా మేం పార్టీని వదిలిపెట్టలే. అందుల్నే గడిచిపోతున్నది. ఇక్కడనే కాదు. మన ఆంధ్రప్రాంతం అంతా తిరిగొస్తూనే ఉన్న అప్పుడప్పుడు. మొన్నటి దాకా కూడా గొల్లసుద్దులు చెప్పిన. కథలు చెప్పినం. పైవాళ్ళతో డ్రామాలు, బాగోతాలు వేయించినం. ఉద్యమం తలదించిపోతే మేం మానికొండ తాలూకా, ములుగు తాలూకా ఇవన్నీ తిరిగినం. ఈ మధ్యనే రెండు సంవత్సరాలబట్టి చాతనయితలేదు. ఇంక తిరుగుతలేను. (మనకు తెలియని మన చరిత్ర)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.