డా. రోష్ని
28 జూలై, 2012న ప్రముఖ రచయిత్రి కొండేపూడి నిర్మల రచించిన ”కొండేపూడి నిర్మల కవిత్వం”, ”నివురు” పుస్తకాల ఆవిష్కరణ సభ సుందరయ్య కళానిలయం, దొడ్డి కొమరయ్య హాలులో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు గ్రహీత కె. శివారెడ్డి అధ్యక్షత వహించారు. సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు చేకూరి రామారావు ముఖ్య అతిధిగా హాజరయి పుస్తకాలను ఆవిష్కరించారు.
ఆనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అద్భుత రచయిత్రి కొండేపూడి నిర్మల అన్నారు. ఈ కార్యక్రమంలో నందిని సిదారెడ్డి, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్, సునీతారాణి, విమల ఈ పుస్తకాలలోని వివిధ అంశాలను గురించి వివరిస్తూ చక్కటి విశ్లేషణను అందించారు. కె. శివరెడ్డి మాట్లాడుతూ సామాజికపరంగా తాత్వికతలోను, భావ వ్యక్తీకరణలోను, రచనలు చేయడం ఆమెకే సొంతమని; ఇంట్లో నిత్యం జరిగే సన్నివేశాలను చిన్నచిన్న అంశాలను అందరిని ఆకట్టుకునేలా నిర్మల తన కవిత్వంలో తీర్చిదిద్దారని అన్నారు. కొండేపూడి నిర్మల స్పందనతో ఆనాటి సభ ముగిసింది. తన కవిత్వంలోని కొన్ని పంక్తులు తీసుకొని నిర్మల స్వయంగా డిజైన్ చేసిన పోస్టర్లు భావయుక్తంగా వుండి సభలో అందరి దృష్టిని ఆకర్షించాయి.