పరుచూరి జమున
ఆంధ్రప్రదేశ్‌లోని అందరి నోళ్ళలో నానుతున్న లక్ష్మీపేట విశాఖపట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో, రాజాంకి 35 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉంది.
నాగరిక సమాజాన్ని అవహేళన చేస్తూ యావత్ సమాజం తలదించుకునేలా లక్ష్మీపేటలో జూన్ 12వ తేదీ తెల్లవారింది. అగ్రవర్ణాల అహంకారం దళితుల కాలనీపై వొళ్ళు విరుచుకొని కత్తులు దూసింది. గొడ్డళ్ళు, బరిసెలు, బండరాళ్ళతో వేటాడింది. పసిపిల్లలను భయభ్రాంతులను చేస్తూ వీరవిహారం చేసింది. ముసలి తల్లులు, తండ్రుల బక్కచచ్చిన తనం, ఆడవారి ఆక్రందనల మధ్య పళ్ళు తోమింది. దళితుల రక్తంతో ముఖం కడుక్కొంది. మానవ సమాజంలో మరో హేయమైన రోజును ముద్రించింది.
ఇంటింటికీ పదిమంది గుంపు వెళ్ళింది. ఇళ్ళలో చొరబడి మందిని చావగొట్టింది. ఊచకోతలో అడ్డమొచ్చిన వాళ్ళనల్లా కర్రలతో చావబాదింది. బరిసెలతో కళ్ళమీద, కాళ్ళమీద కుళ్ళ బొడిచింది. బండరాళ్ళతో గుండెల మీద మోదింది. ప్రొద్దున్నే చద్దన్నం తింటున్న మనిషిని, తినేచేయి కడుగుతోన్న వ్యక్తిని, పాలు తాగుతున్న పసిపిల్లను, బయట ఊరులో పనికి పోయి అపుడే వచ్చి నడుంవాల్చిన వాడిని ఎవరినీ వదిలిపెట్టలేదు. వెతికి వెతికి పట్టుకొని కొట్టారు.
ఫలితంగా బురాడ సుందరరావు, నివర్తి వెంకటిలు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. చిత్తం అప్పడు, నివర్తి సంగమేసులు రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్తుంటే మార్గమధ్యంలోనే మృతి చెందారు. పాపయ్య విశాఖ ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయాడు.
ఈ దాడికన్నా ముందే భవిరి రాముడమ్మ కూడా అగ్రవర్ణం దాష్టీకాలకి బలైపోయింది. భవిరి రాముడమ్మ వ్యవసాయ కూలీగా పనిచేసేది. ఆమెకు ముగ్గురు కూతుళ్ళు. దుర్గాదేవి పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరింది. సంఘాల మీటింగులు సక్రమంగా జరుపుకొనేలా చూసింది. పొదుపులు సక్రమంగా కట్టుకొనేలా అందరికీ అవగాహన కల్పించింది. ఆమెను గ్రామసంఘం అధ్యక్షురాలిగా కూడా ఎన్నుకున్నారు. భవిరి రాముడమ్మ పైన కూడా గత డిశంబరు నెలలో ఊరిలోని అగ్రవర్ణంవారు కర్రలతో కొట్టి దాడి చేశారు.
ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేయవలసిందిగా ఆమె పోలీసు స్టేషను చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేయలేదు. కోలుకోలేని దెబ్బలతో మంచానపడి జనవరి మాసంలో సంక్రాంతి పండుగ ముందు రోజు చనిపోయింది. రాముడమ్మ మంచి నాయకురాలు. గ్రామంలోని స్వయంసహాయక సంఘాలన్ని ఆమె నాయకత్వాన బాగా నడిచాయి. ఆమె బి.సి.లను కూడా కలుపుకొని ముందుకు సాగింది. కానీ ఆమెను గ్రామ సంఘం నాయకత్వం నుంచి కిందికి దించేశారు. ఇందిరా క్రాంతి పథం పథకంలో సంస్థల నిర్మాణం నాయకత్వ బాధ్యతల నిర్వహణ మూల సూత్రాల ప్రకారం ఏ సంఘంలోనైనా, సమాఖ్యలోనైనా ఆఫీసు బేరర్లుగా ఉన్న ప్రెసిడెంటు, వైస్ ప్రసిడెంట్, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి పదవుల్లో మూడు పదవులు ఎస్.సి, ఎస్.టిలకు ఇవ్వవలసిందిగా చెబుతారు. కానీ ఈ నియమాలను, నీతిని కూడా తుంగలో తొక్కి బి.సి వర్గానికి సంబంధించిన వారే అన్ని పదవులలోకి వచ్చారు. రాముడమ్మ కాలంలో చక్కగా నడచిన పాలసేకరణ కేంద్రాన్ని మూసేశారు. ఎస్.సి.ల చేనేత పొదుపులు కట్టించడం మానేశారు. వారి సంఘాలన్నింటిని మూత పెట్టారు.
రాముడమ్మ కూతుళ్ళలో ఒకరైన చిత్తిరి శ్రీదేవి భర్త చిత్తిరి అప్పడిని, తండ్రి నిమర్తి వెంకటిని 12వ తేదీన జరిగిన మారణకాండలో చంపేశారు. అప్పడి అన్న గంగులు మాజీ సర్పంచ్. అతని తర్వాత అతని భార్య సర్పంచ్‌గా పనిచేసింది. గంగులు, అప్పడు ఒకే ఇంట్లో ఉంటారు. గంగులుపై గురి పెట్టినవారికి ఆయన దొరకకపోవడంతో అప్పడిని చంపేశారు.
చిత్తరి శ్రీదేవి తన కూతుర్ని కూడా అంతకు ముందు సరైన వైద్యం చేయించలేక పోగొట్టుకుంది. అనారోగ్యంతో పాప మరణించింది.
లక్ష్మీపేటలో బిసి ల కుటుంబాలు 105, ఎస్.సిల కుటుంబాలు 88 ఉన్నాయి. ఈ గ్రామం మిడ్డు వలన రిజర్వాయరు ప్రాజెక్టు క్రింద ముంపు గ్రామం. పదేళ్ళ క్రితం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. పూరింటికి ఆరువేల రూపాయలు, పక్కా ఇంటికి పాతిక వేల రూపాయలు చొప్పున ఇచ్చింది. ఎస్.సి లకు ఇళ్ళ స్థలాలు కేటాయించింది. ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్ళు కట్టుకున్నారు. ఎస్.సిలు వచ్చిన రెండేళ్ళ తరువాత మరికొందరు బి.సిలు కూడా అక్కడికి చేరుకొన్నారు. వీరు ఇళ్ళు కొన్నారు. ఒకే రోడ్డుకి ఒకవైపున బి.సిలు, మరోవైపున ఎస్.సిలు నివసిస్తున్నారు.
ప్రభుత్వం రిజర్వాయరు నిర్మాణానికి సేకరించిన భూముల్లో 250 ఎకరాల భూమి ముంపుకి గురికాలేదు. ఆ భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమి పక్క ఊరు దేశరివాడకు చెందిన బి.సి.లవి. భూములకు నష్ట పరిహారం తీసుకున్న వారు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. వేరే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
లక్ష్మీపేటలోని బి.సిలలో చాలా మంది భూములకు నష్టపరి హారం తీసుకున్నారు. ఉద్యోగాలు కూడా పొందారు. వారిలో ఉద్యో గస్తుడైన ఒకరు నాయకత్వం వహించి లక్ష్మీపేట దళితులను దేవరివాడ భూమిలో సాగు చేసుకోవలసిందిగా ప్రోత్సహించారు. ముందు ఎస్.సి.లు భూములను సాగుచేస్తే ప్రభుత్వం పట్టించుకోదనే తలంపుతో వారిని ఎరలుగా వాడారు. ఆ విధంగా 60 ఎకరాల భూమిపై దళితుల సాగు మొదలైంది. తరువాత మిగిలిన 190 ఎకరాలను బి.సి.లు తమ ఆధీనంలోకి తీసుకొని సాగుచేసుకోవడం మొదలు పెట్టారు. గత అయిదేళ్ళుగా ఉభయులూ కలసి వ్యవసాయం చేస్తున్నారు. ఈ పొలాల్లో ఏడాదికి మూడు పంటలు పండేవి. వరి, శనగ, కంది పంటలన్నీ వేసేవారు. బంగారంలాంటి భూమి చదునుగా ఒకటే కక్కగా, కంటికి ఇంపుగా కనిపిస్తుంది. దళితులు తలా 50 సెంట్ల భూమి చేస్తున్నప్పటికీ మంచి పంట రావడంతో అదే జీవనాధారంగా ఉండేది.
అయితే బి.సి. నాయకులకు 190 ఎకరాలతో ఆశ తీరలేదు. ఇంకా దళితులను పిండి డబ్బు చేసుకోవాలనే దురాశ మొదలైంది. ఈ అరవై ఎకరాలు మా బంధువుల భూమే. దీనికి తలా లక్ష రూపాయలు కట్టాలన్నారు. ఒక సమావేశం పెట్టి మరీ ఈ విషయాన్ని వారికి చెప్పారు. దళితులు డబ్బులు కట్టలేమన్నారు. చివరికి మనిషికి 8 వేలయినా కట్టమని బేరసారాలు నడిపించారు. ఎస్.సి.లు ఇది ప్రభుత్వ భూమి, మా దగ్గర డబ్బులేదు అని చెప్పడంతో మొత్తం వ్యవహారం ఏడాదిన్నర క్రితం తగాదాగా మారింది.
అప్పటినుంచి బి.సి.లు అదనుకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయిన దానికి కాని దానికి తగాదా పడుతూనే ఉన్నారు. దళితులను కులం పేరు పెట్టి తిడుతూనే ఉన్నారు. ఒకసారి చిత్తరి అప్పడిని తమ పొలంలోకి మేకలు తోలాడని చితక బాదారు. అప్పడు అప్పుడు చచ్చి బతికాడు. ఎస్సీలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు వీరినే పిలిపించి సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ కూర్చోపెట్టుకొని తిట్టి పంపేశారు. కేసు పెట్టలేదు. దళితులు కలెక్టరు గార్కి, ఆర్.డి.వో గార్కి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఉభయ పక్షాలను పిలిచి కూర్చోపెట్టి మాట్లాడించారు. తగాదా పరిష్కారం చేయలేదు.
మళ్ళీ కొద్ది రోజులకు ముగ్గురు దళిత మహిళలు గడ్డికి వెళ్ళి వస్తుంటే బిసిలు వాళ్ళని కొట్టారు. ఆ ముగ్గురిలో భవిరి రాముడమ్మ ఒకరు. ఆ ముగ్గురు మహిళలు పోలీసుల దగ్గర కేసు పెట్టడానికి వెళ్ళారు. కొట్టిన వాళ్ళమీద మళ్ళీ కేసు చేయలేదు. యధావిధిగా సాయంత్రం పిలిచి అర్థరాత్రి దాకా కూర్చోపెట్టి పంపేశారు. దళితులంతా మళ్ళీ అధికారులకు తమ భూమి సమస్య గురించి దరఖాస్తులు పెట్టుకొన్నారు. ప్రభుత్వం ఎవరూ ఈ భూమిమీద పంట పెట్టకూడదని స్టే విధించింది. గ్రామంలో పోలీసు పికెట్ పెట్టారు. లక్ష్మీపేట దళితులు ఈ ఏడాది కాలంలో నాలుగు సార్లు రెవెన్యూ అధికార్లకు, కలెక్టరుకి, మూడుసార్లు పోలీసు స్టేషనులో దరఖాస్తులు పెట్టినా ఏ చర్యలు లేవు. ఉపాధి హామీ పనులు ఆపు జేశారు. దళితులకు ఇచ్చే ఫించన్లు ఆపు జేశారు. సంఘాలను సరిగా నడపలేదు. కూలి పనులు లేక వారు కూడా పొదుపు కట్టలేకపోయారు. దాంతో సంఘాలు నడవడం లేదని రుణాలు ఇవ్వలేదు. పావలా వడ్డీలు ఆగిపోయాయి. అన్ని రకాల దళితులను ఎండగడితే ఆకలికి అలమటిస్తూ పుట్టకొకరు చెట్టుకొకరుగా వారు చెదరిపోతారనే ఆలోచనలు సాగాయి. అలా కాకపోయేసరికి పథకం ప్రకారం వారిని వెళ్ళ గొట్టేందుకు బిసిలు దాడి చేశారు.
జూన్ 12వ తేదీన ఉపఎన్నికల సందర్భంగా పోలీసు పికెటులో ఉన్న వారిని ఎన్నికల డ్యూటీ మీద పంపేశారు. 11వ తేదీ సాయంత్రమే పక్క ఊరినుంచి దాడిలో అండదండగా ఉండే బంధు వర్గాన్ని రప్పించుకున్నారు. ఆటోల్లో మంది దిగుతుంటే మళ్ళీ ఏదో జరగబోతోందని ఎస్సీలు అనుమానించారు. అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేశారు. డ్యూటీలో ఇద్దరే ఉన్నారు. సరైన ప్రతిస్పందన లేదు. పోలీసును గ్రామానికి పంపారు.
తెల్లారింది. అందరూ చద్ది అన్నం తిని పనులకు వెళ్ళిపోవాలనుకున్నారు. కొందరు తింటున్నారు. కొందరు అపుడే తిని చేయికడుగుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇంటింటి మీద పది, ఇరవైమంది గుంపు కర్రలతో, బరిసెలతో దాడి మొదలు పెట్టింది. ఏడుగంటలకు మొదలైన దాడి పదింటి దాకా కొనసాగింది. చంపొద్దని అడ్డొచ్చిన భార్యలను, పిల్లలను కూడా వదలలేదు. పసిపిల్లలను ఎత్తి పొదల్లోకి విసిరేశారు. భార్యలను చితక బాదారు. తమ కొడుకులు చనిపోతుంటే చివరిసారిగా పెదవులు తడపబోయిన తల్లులను లాగి విసిరేశారు. రక్తం మడుగుల్లో పడి ఉన్నవారిని మళ్ళీ మళ్ళీ బరిసెలతో పొడిచారు. తల్లితండ్రులను కొడుకుల ఆచూకీ చెప్పమని బండబూతులు తిట్టారు, కొట్టారు. మనుషులు కనపడకపోతే ఇళ్ళలో చొరబడి తలుపులు పగలొట్టారు. టీవీలు పగలగొట్టారు. డోలక్కులు పగులగొట్టారు. సామానంతా చిందర వందర చేశారు.
ఆడవాళ్ళు, పిల్లలు భయానికి కాలనీకి అనుకొని ఉన్న కొట్టిశ గ్రామానికి పారిపోయి దాక్కున్నారు. యువకులు, పురుషులు చెట్టు కొకరు, పుట్టకొకరుగా పారిపోయారు. పారిపోతున్న వారిని కూడా పట్టుకొని గొడ్డలితో నరికారు. దళిత గ్రామం అరుపులు ఆర్తనాదాలతో హోరెత్తిపోయింది. రక్తంతో భూమంతా తడిసి ముద్దయింది. వారం రోజుల వరకూ పిల్లలు ఏడుపులు ఆపలేదు. రక్తాన్ని చూడలేక ముసలి ప్రాణాలు వణికి పోయాయి. చాలామంది వృద్ధులు దిగులుతో, భయంతో బిక్క చచ్చిపోయి మంచాన పడ్డారు. దుఃఖంతో గుండెనొప్పి తో బాధ పడ్డారు. తమ కళ్ళెదుటే తండ్రులను చంపడాన్ని చూచిన పిల్లల గుండెల్లో కసి రగులుతోంది. మరోవైపు భయంతో పిడచకట్టుకు పోతున్నారు. ఘటన జరిగి నెలగడిచినా ఒక్కరూ రాత్రివేళ నిద్రపోవడం లేదు. నిద్ర రావడం లేదు. ఎవరిని కదిపినా గుండె గొంతుకలోనే కొట్టుకుంటోంది. దుఃఖం పెల్లుబుకు తూనే ఉంది. ఏడ్చి ఏడ్చి ఆవిటిల్లి పోతున్నారు.(పైన పేర్కొన్న అంశా లన్ని బాధిత కుటుంబాలు ఇచ్చిన సమాచారం ప్రకారమే రాయడం జరిగింది)
సోషల్ యాక్షన్ కమిటీల పరిశీలన :
కృష్ణా జిల్లా నుంచి 10 మంది, గుంటూరు జిల్లా నుంచి 10 మంది చిత్తూరు జిల్లా నుంచి 10 మంది మొత్తం 30 మంది సోషల్ యాక్షన్ కమిటీలో సభ్యులు లక్ష్మీపేట గ్రామం వెళ్ళారు. ఇద్దరిద్దరు ఒక్కొక్క టీముగా తయారై ప్రతి ఇంటికి వెళ్ళి రోజంతా కూర్చొని బాధితులకు కౌన్సిలింగ్ చేశారు. వారు కూడా ఈ దాడికి భూమి ప్రధాన కారణం, దానికి కుల వివక్షత తోడైంది అంటున్నారు. ఇంకా తమ పరిశీలనలో వెల్లడైన దాడి వెనుక ఉన్న ఆలోచనలను ఇలా చెబుతున్నారు.
1. దళితులు ఆస్తిపరులు కాకూడదు.
2. దళితుల పిల్లలు చదివితే దొరతనం సాగదు. వారి హక్కులు వారికి తెలుస్తాయి. అందుకని వారు చదువుకోకూడదు.
3. భూమి ఇస్తే దళితులు పెద్ద కులాల వాళ్ళ పనులకు వెళ్ళరు. బానిసత్వం ఉండదు.
4. దళితుల ఇళ్ళు తమ ఇళ్ళ ప్రక్కనే ఉండటం కూడా సహించరాని విషయంగానే ఉండింది.
5. దళితుల్ని కొందరిని చంపితే మిగిలిన వాళ్ళు భయంతో బానిసల్లా పడి ఉంటారనే ఆలోచన
6. మగదిక్కు లేకుండా చేస్తే ఆడవాళ్ళు కూడా బానిసల్లా పడి ఉంటారనే ఆలోచన సాగింది.
7. అధికార్లు ఏమాత్రం పట్టించుకోకుండా, అన్ని స్థాయిల్లో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది బి.సి లకే అండగా పరిణమించింది.
కులవివక్ష :
లక్ష్మింపేట చుట్టుప్రక్క గ్రామాల్లో ఇంకా రెండు గ్లాసుల పద్ధతే అమలులో ఉంది. ఊరిలో ఏ పండగ పబ్బం అయినా విందు భోజనాలలోను ముందు భోజనం అగ్రవర్ణాలకే. బిసిలు అందరూ పైన టేబుల్‌మీద భోంచేస్తారు. వారి భోజనాలయ్యాక దూరంగా విడిగా నేలమీద ఆకువేసి ఎస్.సి. లకు భోజనం పెడతారు. ఎస్.సిల ఇళ్ళలో భోజనాలకు వచ్చే బి.సిలు కూడా వారే వంట చేయించి వారు తినేసి వెళ్ళిపోతారు. తరువాత ఎస్.సిలు భోంచేస్తారు.
మధ్యాహ్న భోజనం పథకం క్రింద కూడా ఎస్సీలు వంట చేస్తుంటే బిసిల పిల్లలు తినలేదు. చివరికి ఎస్సీ ఆమెను మాన్పించి బి.సి. ఆమెను వంట చేయమన్నారు. ఊరిలో మంచినీళ్ళు లేవు. పంపుల్లో నీళ్ళలో ఫ్లోరిన్ ఉంది. అసలు కాలనీ నిర్మాణం చేసేటపుడు ముందు భూమిని నీటిని పరీక్షలకు పంపి నిర్మించాలి. అలాంటిదేమీ జరగలేదు. మంచినీళ్ళు కావాలంటే ప్రక్కనున్న గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం బిందెతో నడిచి వెళ్ళి తెచ్చుకోవాలి. ఊర్లోకి ఎపుడైనా మొక్కుబడిగా టాంకరు వచ్చినా ముందు బి.సిలు పట్టుకొన్న తరువాతనే ఎస్సీ మహిళలు నీళ్ళు పట్టుకోవాలి.
గ్రామంలో మామూలు నీటి వాడకానికి కూడా బోరింగు దగ్గర నీళ్ళు కొట్టుకొని తెచ్చుకోవాలన్నా ఇదే బాధ. బి.సి. లకే ప్రాధాన్యం. వీరు నీళ్ళు కొట్టుకుని వెళ్ళాక ఎస్సీలు నీళ్ళు తీసుకోవాలి. పనులకు పోయే ఎస్సీ మహిళలు అంతకాలం వేచి ఉండలేక అలాగే నీళ్ళు లేకుండానే అరకొర పనులు ముగించుకొని పొలాలకు పోయే వాళ్ళు. ”ఎంతో కష్టపడి సాయంత్రానికి ఇంటికి చేరుకొంటే తాగడానికి గుక్కెడు నీళ్ళుండవు పిల్లలు ఆకలికి ఆవురావురు మంటుంటే అపుడు బిందె పుచ్చుకొని పక్కవూరికి వెళ్ళాలి.” అని చాలా మంది మహిళలు ఎంతో బాధతో వివరించారు.
స్వయం సహాయక సంఘాలు చేపట్టిన చర్యలు :
తక్షణ ఆర్థిక సహాయం :
మృతుల కుటుంబాలకు 30 వేల రూపాయల చొప్పున భీమా సొమ్మును అందించారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 19 మందికి 10 వేల రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు.
బాలబడి
పిల్లలు భయభ్రాంతులకు గురై ఉన్నందున వారికి ఆటపాటలతో దుర్ఘటన నుంచి వారి మనస్సును మరల్చేందుకు, భయాన్ని పోగొట్టేందుకు బాలబడి ప్రారంభించారు.
వృద్ధులకు భోజన కేంద్రం :
విపరీత ఆందోళనకు గురయి ఏంచేయాలో తోచనిస్థితికి గురయి దుఃఖంతో మంచాన పడ్డ వృద్ధులందరికీ కౌన్సిలింగ్ చేశారు. వారికి ప్రత్యేకంగా మధ్యాహ్నభోజన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇంటింటికి ఓదార్పు :
ఊరంతా దాడికి గురైనపుడు ప్రతి గుండెకు గాయమైంది. ప్రతి వ్యక్తికి విడివిడిగా ఓదార్పు అవసరం. 30 మంది మహిళలు ఇంటింటికి వెళ్ళి పదిరోజులపాటు 88 కుటుంబాలకు విడివిడిగా ఓదార్పు చేసారు.
విద్య :
పిల్లలకు విడిగా కౌన్సిలింగ్ చేశారు. సాంఘిక సంక్షేమశాఖ సహాయంతో ఆరుగురు విద్యార్థులను జూనియర్ కాలేజికి, ఏడుగురి పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలకు పంపారు.
ఆరోగ్య శిబిరం :
చాలామంది దెబ్బలుతిన్న మహిళలు ఇళ్ళలోనే ఉండిపోయారు. ఆస్పత్రులకు వెళ్ళలేదు. ఇంటింటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్న సందర్భంలో చాలా మంది మహిళలు తమ వీపులమీద, తొడలమీద తేలిన వాతలను దెబ్బలను చూపించారు. విపరీతమైన నొప్పులతో వీరు కోలుకోలేకుండా ఉన్నారు. అందుకని గ్రామంలోనే తక్షణం మహిళా డాక్టర్లతో కూడిన వైద్యబృందంతో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.
ఆహార భద్రత :
ప్రతి ఇంటికి అవసరమైన ఆహార దినుసులను అందించేందుకు ఆహార భద్రత ప్రణాళికను తయారుచేసి జాయింట్ కలెక్టరు గారికి అందించారు. ఒక నెలకు సరిపడిన బియ్యాన్ని సరుకులను తక్షణం అందించారు. ప్రతి వ్యక్తికి నాలుగు జతల బట్టలను, చీరలు, పంచెలు, లుంగీలు మొదలైనవన్నీ అందించారు.
తక్షణ జీవనోపాధి :
ఇపుడు అక్కడ పనులు లేవు. పనులకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కానీ ఏదో ఒకపని చేసుకోక తప్పని స్థితి గూడా ఉంది. సంఘాలు ఈ విషయాన్ని గమనించి అక్కడ ఉన్న అన్ని కుటుంబాలవారికి వీలుగా ఉండేలా అయిదు పాల ప్రగతి కేంద్రాలను నూరు శాతం సబ్సిడీతో ఏర్పాటు చేసుకొనే విధంగా నిరుపేదల నిధి నుంచి మంజూరు చేయించారు.
నూతన సంఘం ఏర్పాటు :
సంఘంలోని నిరుపేదలను 12 మందిని ఒక దగ్గర చేర్చి కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘంతో కలసి దళితుల కాలనీలో ఆరు స్వయం సహాయక సంఘాలున్నాయి.
కలెక్టరు సందర్శన:
దాడి జరిగిన సందర్భంలో ఉన్న కలెక్టరు బాధితుల పట్ల సరిగా స్పందించలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కలెక్టరును బదిలీ చేసింది. కొత్తగా నియమితులైన కలెక్టరు అదేరోజున లక్ష్మింపేట సందర్శించారు. వారు ప్రతి ఇంటిలోపలికి వెళ్ళి బాధితులను పరామర్శించి చాలామంది బాధిత మహిళలు ఉద్యోగాలు, భూములతో తమ గృహాలను కూడా సక్రమంగా నిర్మించుకునే అవకాశం కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ మరుగుదొడ్డిని మంజూరు చేసి నిర్మించాలన్నారు. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇవ్వాలని కోరారు.
జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ :
జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి లతా ప్రేమ కుమార్ కూడా లక్ష్మింపేట గ్రామం సందర్శించారు. ఈ దుర్ఘటన జరగటానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన వారికి సరైన పునరావాసం కల్పించకపోవడం, ఎస్.సి., ఎస్.టి చట్టాన్ని అవగాహన చేసుకొని అమలు చేయకపోవడం ప్రధాన కారణాలుగా పలువురు కమీషన్‌కు వివరిం చారు.
బాధితులకు అండగా వివిధ సంఘాలు :
బాధితుల అండగా వివిధ దళిత సంఘాలు వారి డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతూ పోరాడుతున్నాయి.
1. లక్ష్మిపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, దళితుల హత్యలకు కారణమైన వారందరిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి. 2. ఈ నరమేధానికి కారణమైన భూమి 250 ఎకరాలను ఎస్సీలకు ఇవ్వాలి. 3. కారంచేడు, చుండూరు బాధితులకు ఇచ్చిన విధంగానే ఒక ప్రత్యేక ప్యాకేజీని లక్ష్మింపేట బాధితులకు కూడా ప్రభుత్వం ప్రకటించాలి. 4. లక్ష్మింపేటలో చదువుకున్న ప్రతి దళితుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
దళితుల పోరాటాలు దళితులే చేయాలా? మానవ సమాజం మొత్తంగా ఈ రకమైన హింసను వ్యతిరేకించాలి. ప్రజాస్వామిక వాదులంతా మేలుకొనాలి. లేకుంటే బానిసకొక బానిస కొక బానిస అంతంలేని అనంతమైన బానిస సమాజమే మిగులుతుంది. మానవత్వం స్థానంలో బానిసత్వమే విస్తరిల్లుతుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags