డియర్ మున్నీ, బాగున్నావా?
నువ్వెప్పుడూ ‘నీ గొంతుకు దండమే..నిన్ను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఎన్ని బాధలున్నా నీఒళ్ళో పడుకొని నీ పాటవింటే చాలు బాధలు మర్చిపోయి బ్రతికే అదృష్టం ఎవరికుందో ”అంటూ వుండేదానివి. నా పాటలు విని ఎంతమంది వెర్రివాళ్ళు నా వెంట పడ్డారు! నన్ను పెళ్ళి చేసుకుంటానని ఎన్నెన్ని అప్లికేషన్లు! అన్నీ తిరస్కరించానే.
ఒకరోజు స్టేజీపైన రెండు రకాల పాటలు. లలితగేయాలు, ఒక వైపు, ప్రజల పాటలు మరొక వైపు బతుకు పాటలు…పోరు పాటలు..చైతన్యగీతాలు,నేను పాడే లలిత గీతాలను వాళ్ళ పోరాటపాటలతో పోల్చుకున్నాను.వాళ్ళ పాటల్లో నా జీవితాన్నిచూసుకున్నాను. పాట పాటకీ మధ్య పరిచయ వాక్యాలు చెపుతూ, మధ్య మధ్యలో తానూ పాడుతూ అడుగులు వేస్తూ ఆడుతూ, పాడుతూ ప్రేక్షకుల్ని పరవశింపజేస్తున్నాడు. గొంతు గొప్పగా లేకపోయినా భావయుక్తంగా పాడుతోంటే జనం ఉత్తేజితులయ్యారు. ప్రోగ్రామ్ అంతా పూర్తయ్యాక వెళ్ళి అతన్ని పలుకరిద్దామనుకున్నాను. ఏదో అహం అడ్డొచ్చింది. మళ్ళీ మా కాలేజీకి యానివర్సరీ రోజూ వాళ్ళ టీం వాళ్ళు రాగానే అంతకు ముందు అనుకున్న కార్యక్రమాలను కొన్నింటిని ప్రదర్శించకుండానే ఆపేశారు.
అతను నన్ను చూశాడు. నేనూ చూశాను. పలకరింతల నవ్వు కురిసింది. ప్రోగ్రామ్ అంతా అయ్యాక ”మీ గొంతు బాగుందండీ” అన్నాడు. నేను సంతోషపడ్డాను. ‘సమాజానికుపయోగపడే పాటలు పాడితే చరిత్రలో నిలిచిపోతారు’ అన్నాడు. తనుపాడే స్త్రీల గీతాలు నా గొంతుతో వినాలన్నాడు. అతని మీద, అతని ఆశయాల మీద మక్కువతో ఆ పాటలన్నీ నేర్చుకుని వాళ్ళ టీంలో ఒక సభ్యురాలినయ్యాను. పాత రాగాలకు స్వస్తి చెప్పాను. ఇలా మొదలైన మా స్నేహం ఒకరిని విడిచి మరొకరు ఉండలేని యుగళ గీతంలా మారింది. కాలేజీ క్లాసులెగ్గొట్టి అతనితో పిచ్చాపాటీ, సినిమాలకు, షికార్లకు తిరగడం మొదలుపెట్టాను.
మున్నీ..మా క్లాస్‌మేట్ రత్న తెలుసుకదా!
మేమిద్దరం కలిసి ఒకసారి ఓడరేవుకు బస్సులో వెళ్తుంటే చూసింది. అతను నా కోసం తరచుగా క్లాసు రూముకి రావడం చూసింది. ఒకరోజు నన్ను పిలిచి తను నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా కాకపోయినా నా మేలు కోరే వ్యక్తిగా చెప్తున్న మాటలు వినమన్నది. అతను ఆడుతూ పాడుతూ ఆశయాలను ప్రకటించి అమ్మాయిల్ని ఆకర్షిస్తాడనీ తనకు తెలిసిన ఒకమ్మాయిని గర్భవతిని చేసి వదిలేశాడనీ చెప్పింది. నేను అవాక్కయ్యాను. ఇది నిజం కాకూడదనుకున్నాను. నేను మనసారా కోరుకున్న వ్యక్తిపైన ఈ అపవాదు అబద్ధం కావాలనుకున్నాను. నేనతితో పొందుతున్న వర్ణించలేనంత ఆనందాన్ని కొట్టి వేయలేకపోయాను.
గుండె దిటవు చేసుకొని అతన్ని సంగతి అడిగాను. అతను నిజం కాదన్నాడు. తన స్నేహితుడు చేసిందానికి తన పైన నింద వచ్చిందన్నాడు. నువ్వు కూడా నన్ను నమ్మవా!అని జాలిగా అడిగాడు. నేను నమ్మాను. మనసు తేలికయ్యింది. నాతోనే జీవితాంతం గడపాలని ప్రమానాలు తీసుకున్నాను. రెండేళ్ళు కరిగిపోయాయి. పెళ్ళి ప్రస్తావన తీసుకొస్తే తొందరేంటి అంటాడు. ఒక్కొక్కసారి చాలాకాలం కనిపించేవాడుకాడు. ఏంటి ఎక్కడికెళ్ళావు అనడిగితే ఆర్గనైజేషన్ పనిమీద అని చెప్పేవాడు. ఒకసారి అతని స్నేహితుణ్ణి అతనేడని అడిగాను. వాళ్ళ పార్టీ వాళ్ళు నన్ను పెళ్ళి చేసుకోవాలనీ లేదా నాతో సంబంధాలు మానుకోవాలనీ రెండు మూడు సార్లు హెచ్చరించారని అతను చెప్పాడు. నాకింకా కొంత సమయమివ్వండి.ఆ అమ్మాయి నాతో పాటు ఉద్యమంలో పనిచేస్తుందో లేదో చూడాలి కదా అన్నాడట! ఇంతవరకు పరిశీలించింది చాలు పెళ్ళి చేసుకోమన్నారట. మరోసారి వాళ్ళు గట్టిగా మాట్లాడటంతో అతను నన్ను చేసుకోడానికి సిద్ధపడ్డాడని ఆ అబ్బాయేచెప్పాడు. వెంటనే నిజమేనా అని అతన్నడిగాను. అందుకు జవాడుగా ఉద్యమాల్లో వచ్చే కష్టనష్టాల గురించి వివరించాడు. ఆ బాధల్ని నీవు అనుభవించడానికి సిద్ధమేనా అని అప్పుడడిగాడు. అతనితో ఎటువంటి జీవితమైనా నాకిష్టమేనని చెప్పాను. ఏ కష్టమైనా అనుభవిస్తానన్నాను.
పెళ్ళి తంతు ముగిసింది.
మున్నీ!
అతనిలో కొత్త వ్యక్తిని అప్పుడు చూశాను.
నవ్వితే కవ్విస్తావేంటి అంటాడు.
అందరిముందూ పళ్ళికిలించడం మానుకో అంటాడు. మాట్లాడితే అందరూ నీవేసే చూడాలనా అంత పెద్దగా మాట్లాడతావ్ అంటావ్. శుభ్రంగా తలంటుకొని పూలు పెట్టుకుంటే అచ్చం భోగం దానిలా వున్నావు. ఇలా నువ్ రోడ్డు మీద నిలబడితే బేరాలకొస్తారు అంటాడు. ఎవరైనా మనుషులొస్తే మధ్యలో మసలొద్దు.వంటగదిలో వుండమంటాడు. పెళ్ళికాకముందు ఈ నవ్వుకోసమే పడి చస్తున్నానన్నాడు. అంతేనా..ఎదురు మాట్లాడితే చెంపదెబ్బలు రుచి చూసే స్థాయికి వచ్చాడు. కారంచేడు సంస్మరణసభ, నినాదాల సందోహం.నేను పాటు పాడతానన్నాను,. నీకన్నా బాగా పాడే వాళ్ళు చాలామంది వున్నారులే. నిన్ను దలదన్నే వాళ్ళున్నారు నీ మొగుడిని శ్రద్ధగా చూసుకో చాలు అన్నాడు.
ఒక రోజు అతని స్నేహితుడు వచ్చాడు. కాఫీ ఇచ్చాను. ఒక పాట పాడాలని అడిగితే పాడాను. ఇక అంతే నా మూతి వాచిపోయేలా కొట్టాడు. నేను లేనప్పుడు పక్కలోకి కూడా తెచ్చుకుంటావే నువ్వు అని నా గూబ గుయ్యిమనిపించింది. దిమ్మెరపోయాను. మరొక్కసారి మా మామయ్య కొడుకుతో మాట్లాడానని కడుపుతో వున్నానన్న కనికరం లేకుండా నా పొత్తి కడుపు మీద కొడితే నకు గర్భస్రావం అయ్యింది. తను రహస్య సమావేశాల్లో పాల్గొనాలంటూ నన్ను వాళ్ళమ్మ వాళ్ళింట్లో రెండు నెల్లు వుంచాడు. ఈ రెండు నెలలూ నరకం అంటే ఏంటో చూశాను. చేసే ప్రతి పనికీ మాలపని అని పేరు పెట్టేది వాళ్ళమ్మ. మాల చేష్టలు చేయొద్దని కూడా అనేది. రోజుకి పదిసార్లయినా మాల మాదిగ కులం పేరు జపించనిదే ఆమెకు పొద్దు గడిచేది కాదు. కులం తక్కువ పనులు అనేది, అప్పుడు నాకనిపించేది గుణం తక్కువ కులం మీది అనాలని, చాలాసార్లు ఓర్చుకుని ఓర్చుకుని ఒక రోజు అనేశాను. చిన్నా పెద్దా లేకుండా ఎదురు తిరుగుతవా అని అతనికి చెప్పి అతని ముందే నా జుట్టు పట్టుకుని యీడ్చి తన్నింది మా అత్త ఎదురు తిరిగాను. నా తల్లికి ఎదురు తిరుగుతావా అని అతను నన్ను గొడ్డును బాదినట్లు బాదాడు. ఇంటి పనంతా చేసి ఆకలయితే కుండలు తాకరాని పరిస్థితి నాది. వాళ్ళు పెట్టినప్పుడే తినాలి. ఆకలి తట్టుకోలేక కొన్నిసార్లు వాతలు పెట్టుకున్నాను. కాలమంతా ఏడుస్తూనే గడిపాను. మా అత్తగారికి వాళ్ళ కులం కోడలు కావాలి. నా భర్తకు కులం భార్య కావాలి. వాళ్ళు నన్ను మాలకాకిని తరిమినట్టు తరుముతుంటే నేను శాంతి పావురంలాగా ఉండక బంధనాలను తెంచుకొని వచ్చేశాను.
మున్నీ!
నీ…కోరిక నా కోరికో ఎవరిదైతేనేం విఫలమయ్యింది. కొత్త కోరికలతో మిగిలిన జీవితం మానవతకు అంకితమిస్తున్నా మళ్ళీ గొంతు విప్పుతున్నా…పాట పాడుతా…మనసుపాట పాడుతా…బతుకుపాట పాడుతా…
రగులుతున్న గుండెలో పాట పదునెక్కుతుంది
నీ
చంద్ర
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags