లకుమ
మనకు, కవిత్వాన్ని ఉద్యమంగా భావించి రాసిన కవితలూ వున్నాయి. ఉద్యమ కవిత్వమూ వుంది. ఈ పుస్తకంలో వుంది ఆ రెండోదే. అందుకే అరసవిల్లి కృష్ణను ఉద్యమం నెలబాలుడంటున్నది.
ఆయన కళ్ళలో తడి, గుంటల్లో తడి. గొంతులో తడి. కవితల్లోనూ తడి. అందుకే ఎప్పటికీ ‘తడి ఆరని నేల’ను మనకందిస్తున్నాడు అదీ మొదటి ప్రయత్నంలోనే.
ఆయనే ‘ నా కవిత్వ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూస్తే జీవన విధ్వంసం తాలుకూ శకలాలు కన్పిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ జీవన విధ్వంస మూలాలు ఇంకా కనుల ముందు నీడల్లా తారాడుతుంటాయి. వెచ్చని కన్నీళ్ళు నా లోపల సుడులు తిరుగుతంటాయి’ అంటారు తన మాటగా. తొమ్మిదో తరగతిలో ఆ చదువు ఆగిపోయినా, నానాటికీ ధ్వంసమై పోతున్న ప్రపంచాన్ని చదవడం, అందునా చదువులలో మర్మమెల్లి చదవటం, ఓ నదీ, సముద్రం తన వెంట వుండటంతో క్రమేపీ ఇట్లా కవిత్వమైంది.
తన ముందు మాటలో గుడిపాటి వెంకటా చలాన్ని గుర్తు చేసిన గుడిపాటిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. కవిత్వం తూచేరాళ్ళు ఈ గుడిపాటి వద్దా వున్నాయని ఆయన యోగ్యతా పత్రమే చెప్తోంది.
‘గదిలోపకి వెళ్ళాక’ మనకూ, ఒక్కసారికే బతుకు సూత్రం తెలుస్తుంది. ‘పగిలిన కుండ’ లో కుండా మనిషి వేరు కాదన్న జీవన సూత్రాన్నీ, ‘నడుస్తున్నపుడు’ సంచికని ఆవిష్కరించిన తీరూ, దాన్లోనే ఓ సముద్రం, ఒక జీవనదినీ చూపిన వైనం బాగుంది. సంచి మీద వచ్చిన తొలి కవితనుకుంటాను ఇది. ‘మరణం’లో ‘చనిపోయిన వారంతా నాలో బతుకుతున్నారు’ అనటంతో శ్రీ శ్రీ ‘చల్లారిన సంసారాలూ, మరణించిన జన సందోహం’ పంక్తులు గుర్తుకొస్తాయి. ‘ఖండిత దేహాలను మోసి మోసి చాలా బరువెక్కాను.’ అన్నప్పుుడు కవే కాదు, మనమూ బరువెక్కి పోతాం. ‘మరణం సామూహిక విషాదం’ కావటంతో వెక్కి వెక్కి ఏడుస్తాం. ఎంతైనా మరణం కదా!
‘ అన్నం పెట్టేవాడి అసహజ మరణం దేశానికి క్షేమం కాదు’ అని పాలకుల్ని హెచ్చరిస్తున్నాడు. ఒక జాతి వెన్నుముకకు ఇరువైపులా నిలుస్తున్నాడు. ‘కిసాన్ బతికుంటేనే సరిహద్దుల్లో జవాన్ అయినా’ అని చెప్పకనే చెప్తున్నాడు.
‘ముగ్గురు బానిసలు’లో శ్రమైక జీవన సౌందర్యం ఆవిష్కరించబడింది. ‘బాలకార్మిక వ్యవస్థ’ ఇంకా వున్నందుకు పాలకులు సిగ్గు పడక పోవడం ఈ దేశ దౌర్భాగ్యాల్లో ఒకటి, మొదటిదీ. కోట్లాది బాలలకు పౌష్టికాహారం లేనందుకు ఆవేదన చెందుతున్నానని ఒక దేశ ప్రధాని అనటం ఈ దేశ ప్రజల్ని మొత్తంగా మోసం చేయటమే. ‘నిర్భందోచిత విద్య’ ఏ ఆదేశిక సూత్రాల ఆటకెక్కిందో, ఎప్పటికీ దిగుతుందో ఆప్రధానమంత్రే చెప్పాలి. ఒక్క 2010లోనే 6 లక్షల మంది మన పిల్లలు పిట్టల్లా రాలిపోయారు, అదీ డయేరియో, న్యూమోనియో కారణంగా. పిల్లలు జాతీయ సంపద కదా!’ వేచి చూస్తుంది కాలం’ లో తను దీర్ఘ కవితను సైతం సమర్థవంతంగా రాయగలనని నిరూపించుకున్నాడు అరసవిల్లి. ఆయన్నుంచి ఒక దీర్ఘ కవితకోసం నాలాగే ‘వేచి చూస్తుంది కాలమూ’!
‘ఓ షెహనాయ్ దు:ఖం’ లో ఎంతో యిచ్చిన కళాకారులకు ఈ ‘దేశం ఏమిచ్చిందన్న’ ప్రశ్నను సంధిస్తున్నాడు కృష్ణుడు, కవులూ కళాకారుల పక్షాన.
బూటకపు ఎన్‌కౌెంటర్ల విషయంలో ‘ఒక తల్లి’ని (మహాశ్వేతానవల) జప్ఞికి తెస్తారు కవి. ‘మొదటి వాక్యం’ లో చివర్లో ఆమె దగ్గర ఇవ్వటానికి ఏదీ లేదు.
‘ఆమె శరీరంలో త్రిశూలం వుంది’ అనటంద్వారా మతరక్కసి వికట్టాహాసాన్ని ఖండించారు. కవిత్వీకరించారు. ‘గాయాలపాట’లో చేనేత బతుకు వెతల పాటను వేనవేల డెసిబెల్ సౌండ్‌తో వినిపించారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 55 డెసిబుల్ మించరాదు. మన పాలకులెంత బధిరులో ఆ మోతాదులోనే వినిపించారు అరసవిల్లి.
‘గోధుమరంగు కనకాంబరం’ను మేధాపాట్కర్‌లో దర్శించటం కవి పార్యవరణ చూపుకు నిదర్శనం. అయిదు కోట్ల మందిని నిరాశ్రయుల్ని చేయటం, చిచ్చగాళ్ళను చేయటం (దాదాపు ఒక రాష్ట్ర జనాభాను) అభివృద్ధే కదా! ఈ మొదటి దశాబ్దంలో వచ్చిన ఒక గొప్ప కవిత ఇది. ‘పుత్తడి బొమ్మ’ లో పూర్ణమ్మను చూపుతారు. అది అగ్రహారం. ఇది ఆశ్రమ పాఠశాల. ఆహుతిలో తేడా అంటే ‘కన్నీళ్ళు రావాల్సిన వారికి రానంతకాలం’ ఈ దుస్థితేనంటాడు. కన్నీళ్ళ పర్యంతమంటాడు.
కృష్ణ బతుకులోని కదలికే రచనలోకి వచ్చింది. అది రచనను ‘రసన’ చేసింది. మొత్తం 48 కవితల్లో నేను నలభై శాతం ప్రస్తావించాను. ఆ అరవై శాతమూ ఈ నలభైకేం తీసిపోవు. కొంతమంది సమీక్షకులకోసం కొన్నైనా మిగల్చాలి కదా! అట్లాగే పాఠకుల విచక్షణకూ. కొందరు కవిత ప్రియుల కోసం రాస్తారు. మరి కొందరు కవుల కోసం రాస్తారు. ఆ మరికొందరులో కృష్ణ ఒకరు. అందుకే ఓ కవిగా నాలుగు మాటలు రాయకుండా వుండలేకనే.
కవిత్వం ద్వారా ప్రజల జీవన విధానం మారాలనీ, పాలక వర్గం దృష్టికోణంలో మార్పు రావాలనీ కృష్ణలాగా నేను బలంగా ఆకాంక్షిస్తున్నాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags