పసుపులేటి గీత
‘గంటల పర్యంతం నేనే ఆకాశంలో చుక్కల్ని చూస్తూ గడిపేసే దాన్ని, అక్కడేముంది? ఒక్కోసారి నాకు చాలా విచిత్రమైన ఆలోచన తట్టేది…., ఎక్కడో ఒక చోట, మరో గ్రహం మీద నాలాంటి మరో అమ్మాయి నాలాగే ఆలోచిస్తూ, నాలాగే చుక్కలకి చూపులనతికించి తిరుగుతుంటుందేమో కదా?!’
సరిగ్గా ఇప్పటికి ఆరేళ్ళ క్రితం సెప్టెంబరు ఒకటి, 2006న అనౌషే అన్సారి సాహసోపేతమైన ఖగోళయాత్రకు సిద్ధపడుతూ చెప్పిన మాటలివి.
అనౌషే అన్సారీ ప్రపంచంలో నాలుగవ వ్యోమ పర్యాటకురాలు, మొట్టమొదటి ఇరానియన్ మహిళా వ్యోమగామి. అనౌషే అందరిలాంటి వ్యక్తి మాత్రమే కాదు, అందరి గురించి ఆలోచించే మహిళ కూడా. ముఖ్యంగా భవిష్యత్తు మీద, యువత మీద ఆమెకు నమ్మకం మెండు. ‘మార్పు’ మీద కూడా అనౌషేకి అపారమైన నమ్మకం ఉంది. ‘మార్పు – అది ఎంత చిన్నదైనా, ఎంత అల్పమైనదైనా సరే అది మార్పే. మార్పు గురించే ఆలోచించడమెందు కంటారా? నిజమే, జీవితం ఇప్పుడున్నట్టు ఉంటే చాలానే బావుంటుంది. ఇలాంటపుడు మార్పు ఎందుకు అని మీరు అడగవచ్చు. ఏదైనా ప్రయోగించి చూస్తేనే కదా, అది మంచిదో, కాదో తెలిసేది. మార్పు మంచిదో, కాదో తెలుసుకోవాలంటే మారి తీరడం కన్నా మరో మార్గం లేదు. మార్పు వల్ల ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటాం. ఒక కొత్త అనుభవాన్ని సంతరించుకుంటాం. సరికొత్తగా మళ్ళీ మళ్ళీ ఎదుగుతాం. మారి తీరాలన్న సకల్పం కన్నా ఆ మార్పు వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమంత పెద్దది కాదు. మార్పు మిమ్మల్ని వైఫల్యం దిశగా నడిపిస్తే, మనిషిగా మీరు విలువైన పాఠాన్నే నేర్చుకుంటారు. ఈవిడేంటి మార్పు గురించి ఇంతగా మాట్లాడుతోంది అంటూ విసుక్కోకండి. నేనే వ్యోమయాత్రకు వెళ్ళినపుడు నా ఇరానియన్ యువకులు, యువతులు నా బ్లాగ్ ద్వారా నాకు శుభాకాంక్షలందించారు. వాటిని చదివినప్పుడు, వాళ్ళంతా భవిష్యత్తు పట్ల ఎంతో ఆశావహంగా ఉన్నారని నాకు అర్థమైంది. అమెరికా కానీ, యూరప్ కానీ, ఎక్కడైనా సరే యువత ప్రతిరోజు పాఠశాలల్లో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్న ఆశతోనే మేల్కొంటోంది. ఒక మంచి కుటుంబం కోసం ఆశ, ఒక విజయం సాధించడం కోసం ఆశ, ఒక శాంతియుత జీవితం కోసం ఆశ…, ఈ ఆశనే వాళ్ళు నా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆశిస్తున్నారు. నేను వారి ఆకాంక్షను కొనసాగిస్తాను’ అంటుంది అనౌషే.
అనౌషే ఇరాన్‌లోని మషద్‌లో 12, సెప్టెంబర్, 1966న జన్మించింది. ఆమె కుటుంబం అటు తరువాత టెహ్రాన్‌కు మకాం మార్చింది. స్వదేశంలో 1979లో చెలరేగిన ఇరాన్ విప్లవాన్ని ఆమె కళ్ళారా చూసింది. అనౌషే 1984లో అమెరికాకి వలస వెళ్ళింది. టీనేజర్‌గా ఆ దేశంలో అడుగుపెట్టినపుడు ఆమెకు ఒక్కముక్క కూడా ఆంగ్లభాష రాదు. అటు తరువాత ఆమె ఒక్క ఇంగ్లిష్‌లోనే కాకుండా, ఫ్రెంచ్, రష్యన్ భాషల్లో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించింది.
వర్జీనియాలోని జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో అనౌషే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌ల్లో డిగ్రీని పూర్తి చేసింది. తరువాత జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందింది. ఎంసిఐ సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆమెకు హమీద్ అన్సారీతో పరిచయం ఏర్పడింది. తరువాత వాళ్ళు 1991లో వివాహం చేసుకున్నారు. భర్త సోదరుడు అమీర్ అన్సారీతో పాటు హమీద్‌ను కూడా ఒప్పించి ఆమె 1993లో టెలికం టెక్నాలజీస్ సంస్థను స్థాపించింది.
వ్యోమ యాత్రను గురించిన తన కలల్ని కొనసాగిస్తూనే అనౌషే వాణిజ్య రంగంలో కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. అటు తరువాత ఆమె 2006లో ‘ప్రొడియో సిస్టమ్స్’ అనే కంపెనీని స్థాపించింది. ఆ కంపెనీని ఇప్పుడామె సిఇవో కూడా. వినియోగదారులకు ఇంటర్నెట్ సౌలభ్యాన్ని చవకగా, విస్తృతంగా అందించడంలో ఈ కంపెనీ చరిత్రను నెలకొల్పింది. అనౌషే ‘ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్’కు చెందిన విజన్ సర్కిల్‌లో సభ్యురాలైంది.
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యపరమైన వ్యోమయాత్రల్ని ప్రోత్సహించే దిశగా ప్రొడియో సిస్టమ్స్‌తో కలిసి ఆమె కుటుంబం మరో ఖగోళ వాణిజ్య సంస్థను నెలకొల్పింది. దీని ద్వారా ఖగోళ యాత్ర పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకుల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సందర్శనకు తీసుకువెళ్ళేందుకు అనౌషే కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె 2006న వ్యోమయాత్రకు పయనమైంది. అంతర్జాతీయ ఖగోళ కేంద్రానికి వెళ్ళే సోయుజ్ (రష్యన్) వ్యోమనౌకలో ప్రయాణం చేయాల్సిన దాయ్‌సూకె ఎనొమోటో అనే వ్యోమగామి అనారోగ్యానికి గురికావడంతో, వ్యోమయాత్రలో శిక్షణ పొందుతున్న అనౌషేని అతని స్థానే ఖగోళానికి పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ‘నేను ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగాను, మధ్యప్రాచ్యదేశాల్లోను ఉన్న యువతకు, మహిళలకు, యువతులకు నేను ప్రేరణగా మారాలనుకుంటున్నాను. ఎక్కడైతే మహిళలకు పురుషులతో సమానమైన అవకాశాలు లభించడం లేదో, అక్కడి మహిళలకు నా అనుభవం ఒక ఉత్ప్రేరకం కావాలనుకుంటున్నాను. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా వాళ్ళు తమ కలల్ని సాకారం చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష’ అంటుందామె.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో అనౌషే పలు పరిశోధనల్లో కూడా పాలు పంచుకుంది. రక్తహీనతకు సంబంధించిన కారణాల్ని, స్పేస్ స్టేషన్‌లోని వ్యక్తులపై మైక్రోబ్స్ ప్రభావాన్ని ఆమె పరిశోధించింది. కలల్ని సాకారం చేసుకోవడం అంత సులభం కాదు, అందుకు కఠోరమైన పరిశ్రమ కావాలి. అనౌషే పట్టుదలను చూసిన వారికెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది.
జార్జి మేసన్ యూనివర్శిటీ ఎంటర్‌ప్రెన్యువల్ ఎక్స్‌లెన్స్ అవార్డు, జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీ డిస్టింగ్విష్‌డ్ అల్యూమిని అచీవ్‌మెంట్ అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ అవార్డుల్ని ఆమె సొంతం చేసుకుంది. సామాజిక సేవలకు గాను ఆమెకు 2010లో ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ లభించింది. అనౌషే 2009లో క్రిస్టియన్ ఫ్రీ అనే స్విట్జర్లాండ్ చలనచిత్ర నిర్మాతతో కలిసి ‘స్పేస్ టూరిస్ట్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా నిర్మించింది.
‘నేను నా జీవితంలో సోదరిగా, భార్యగా, స్నేహితురాలిగా, వాణిజ్యవేత్తగా, వ్యోమయాత్రికురాలిగా ఎన్నో పాత్రల్ని పోషించాను. నేను ఇరానియన్‌ని, అమెరికన్‌ని కూడా, నేనే మహిళను, నేనే ముస్లింను. రచయితను, ఇంజినీర్‌ను, ఎన్ని పాత్రల్ని పోషించినా నా చిరునామా పూర్తిగా వాటికే పరిమితమైంది కాదు. ప్రాథమికంగా నేను మనిషిని. ఇవన్నీ ఎవరికి వాళ్ళుగా ఈ ప్రపంచం నాకు తగిలించిన బిరుదులే. ఇన్ని పాత్రల్ని పోషిస్తూ నేను నా జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాను. కొన్ని సార్లు నేను గొప్ప విజయాల్ని సాధించాను. మరికొన్నిసార్లు పూర్తిగా ఓడిపోయాను. ఏది ఏమైనా నేను పోషించిన ప్రతి పాత్రను ప్రేమతోనే పోషించాను. నేనెవరిని అంటే, జీవితాన్ని పరిపూర్ణంగా ప్రేమించే మనిషిని మాత్రమే అని చెబుతాను. నేను మనిషిని మాత్రమే’ అంటుంది ఈ నిగర్వి. ‘మై డ్రీమ్ ఆఫ్ స్టార్స్ : ఫ్రమ్ డాటర్ ఆఫ్ ఇరాన్ టు స్పేస్ పయొనీర్’ అన్న తన కొత్త పుస్తకంలో అనౌషే ఒక వ్యోమ పర్యాటకురాలిగా తన అనుభవాల్ని వివరించింది.
‘రెక్కలున్న వాళ్ళకే హద్దుల్లేని ఆకాశం దక్కుతుంది’ అని అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత బాబ్ బెల్లో అంటాడు. నిజమే, ఈ అక్షరాలకు ప్రాణం వస్తే అచ్చం అనౌషే అన్సారీలా ఉంటుంది. అనౌషే అన్సారీ ఒక రెక్కలున్న పిల్ల.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags