కొండేపూడి నిర్మల
ఈ మధ్య దినపత్రికలో ”యోని ముద్ర” అనే వ్యాయామం గర్భవతులకి ఎంత అవసరమో, సుఖప్రసవానికి అది ఎలా తోడ్పడుతుందో చెబుతున్న వివరం చూశాను. రెండు అరచేతులూ విశాలం చేసి చూపుడు, బొటన వేళ్ళు తాకిస్తూ అద్భుతంగా ఆకారాన్ని నిర్మించింది ఆ వ్యాయామ ఉపాధ్యాయిని. చాలాసేపు ఆసక్తిగా చూస్తూ వుండిపోయాను.
అప్పుడే గుర్తొచ్చింది. స్కూళ్లలో జరిగిన జీవన నైపుణ్యాలు (లైఫ్ స్కిల్సు) రిపోర్టు చెయ్యడానికి వెళ్ళినప్పుడు అక్కడి చార్టు మీద తమ శరీర అవయవాలు గియ్యాల్సి వచ్చినపుడు ఎంత ఇబ్బంది పడ్డారో….. సగం తెలీని తనం, మిగతా సగం సిగ్గు, మరికొంత తెలిసినట్టుగా వుంటే ఏమి అనుకుంటారో అనే సంకోచం వెరసి అందరూ తెల్లమొహం వేశారు. ఇక అవయవాల పేర్లు రాయాల్సి వచ్చినప్పుడు కేవలం కొన్ని తిట్లు, బూతులు రాశారు. కన్ను, ముక్కు, నోరు, మెడ, భుజాల తరవాత మిగిలిన కేవలం శరీరమంతా చీకటి, అజ్ఞానం అందుకు కారణం మనమే.
”తమ్ముడెలా పుడతాడమ్మా?” అనడిగితే, దేవుడిచ్చాడు అని చెప్పడం ద్వారా, చెడ్డీ లేకుండా ఎప్పుడు కనిపించినా కొంపలు మునిగినట్టు ఖంగారు పడుతూ గౌను తొడిగెయ్యడం ద్వారా, సందర్భం వచ్చి మాట్లాడుకుంటున్న సమయంలో కూడా ”పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో, వెళ్ళు, చదువుకో” అంటూ తరిమెయ్యడం ద్వారా వాళ్ళ ఆసక్తులమీద నీళ్ళు చల్లాం. శరీరం అనేది ఎప్పటికీ ఎవరికీ చూపించకూడదని, మాట్లాడుకోకూడదని ఒక చీకటి పదార్థం అని నమ్మబలికాం.
స్నానం చేస్తున్నప్పుడు కూడా తన శరీరం తను చూసుకోవడం పాపం అనే భావజాలం మనకుంది. ఈ కారణంగానే ఆడవాళ్ళు కూచునే స్నానం చేస్తారు. అంతెందుకు వయసులో వున్న కూతురో, కొడుకో కొంచెం ఎక్కువసేపు స్నానాల గదిలో వుంటే లోపల ఏం చేస్తున్నారో అని భయపడి తలుపులు బాదే తల్లిదండ్రులు నాకు తెలుసు.
ప్రపంచం గురించి, అంతరిక్షం గురించి, ఎంత విజ్ఞానం వుంటే అంత సంతోషిస్తాం. పబ్బుల్లోనూ, రేసు కార్లతోనూ ఎంత చొరవగా వుంటే అంత ఆధునికమని నమ్ముతాం. శరీరం గురించి, జీవన నైపుణ్యాల గురించి ఏ ఇంట్లోనూ సంభాషణ వుండదు.
క్లాసు పుస్తకంలో ప్రత్యుత్పత్తి అవయవాల గురించిన ఒక పాఠం వాయిదా వేసి, వేసి, అందరం గొడవ చేస్తే అప్పుడు ఒక ముసలి మాస్టార్ని పిలవడం ఇప్పటికి నాకు గుర్తుంది, రోజూ వచ్చే లేడీ టీచరు అది చెప్పను పొమ్మంటే, ఆయన వచ్చాడు. ఆయన కూడా అర్థం అయ్యేలా ఏమీ చెప్పలేదు. కేవలం ఆ పేజీలు ఆదరా బాదరా చదివీ వెళ్ళిపోయాడంతే…
కాబట్టి అటువంటి ప్రశ్నలు పరీక్షలు రాయాల్సి వస్తే చాయిస్సులో వదిలేసే వాళ్ళం. ఆ సలహా మాకు టీచర్లే ఇచ్చారు. ఇప్పుడు స్కూల్లో మొదలు పెట్టిన జీవన నైపుణ్యాలకు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, కర్నాటక ప్రభుత్వాల నుంచి తీవ్ర అభ్యంతరం వచ్చింది. ఓ పక్క డేటింగు కల్చరూ, మరో పక్క అధ్యయనానికి కూడా వీల్లేని తనం కలిసి పిల్లల్ని గందరగోళంలో వదిలింది. ఆ గోళంలో పిల్లలకు దుర్మార్గమైన తలుపులు తెరచుకున్నాయి. అవాస్తవ, భీభత్స, హింసల్తో కూడిన శరీర హింసకు పిల్లలు ఎర అయిపోతున్నారు.
బోస్టను నగరంలో విమెనుహెల్తు కలెక్టివు అనే కొందరు మహిళలు ”అవరు బాడిసు, అవరు సెల్యుసు” అనే పుస్తకాన్నీ 1971 లోనే ప్రచురించింది. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండానే అది అప్పట్లో 2,50,000 కాపీలు అమ్ముడు పోయింది. ఇప్పుడు నాలుగు మిలియన్లకు దాటింది. మనం పుట్టినప్పటినుంచి, వృద్ధాప్యంలోపు వచ్చే శారీరక, లైంగిక, మానసిక సమస్యలన్నింటికి సరళమైన భాషలో సమాధానాలున్నాయి. అది 20 భాషల్లోకి తర్జుమా కూడా అయిందట. అమెరికాలోని జెర్రీ ఫాల్వెల అనే సంప్రదాయ పెద్దల బృందం దీనిమీద నిప్పులు కురిపించింది. ”కడుపులోపల ఏం జరుగుతోందో కనిపెట్టి నియంత్రిస్తున్న సాంకేతికత అందుబాటులో వున్న చోట, తన కడుపు పైన ఎలా వుంటుందో తెలీక పోవడం విచిత్రం” అని మాస్కోలోని యువ శాస్త్రవేత్త రూజ్వెల్టు రాచెలు కామెంటు చేశాడు. అశ్లీలత శరీర అవయవాల్లో లేదు. అది వక్రీకరించే దోపిడీలో వుంది. కేవలం ఇది తెలీక పోవడమే వల్లనే మన జాతి శిశువులు మరణాంతక రోగాల బారిన పడుతున్నారు. (టు గెదరు వెబ్సైటులో కల్పనా శర్మ వ్యాసం చదివి….)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags