స్వర్ణ ప్రభాతలక్ష్మి
”అత్తయ్యా ! మీరూ, మామయ్యగారూ కనీసం అమిత్ పుట్టినరోజు వరకైనా ఉంటారనుకున్నాను. పైగా మామయ్యగారికి బెర్త్ కూడా కన్‌ఫర్మ్ కాలేదు కదా!” అప్పటికి నాలుగోసారి ఇదే మాటలు అంది ముక్త.
”నిరంజన్ టి.సి. దగ్గరికి వెళ్ళాడుగా! ఎలాగోలా బెర్త్ సాధిస్తాడ్లే ! అమిత్ పుట్టిన రోజుకి మీరే అక్కడికి వచ్చేయండి.” నవ్వుతూ అన్నాడు సుదర్శన్.
”వాడు ఒక్కరోజు స్కూల్ మానేసినా అది మాకే శిక్ష. ఆ రోజు మిస్సయిన పాఠాలు వాడికి నేర్పించాల్సిరావడమే కాక వాళ్ళ ప్రిన్సిపాల్ చేతిలో చివాట్లు కూడా తినాలి. అంతకంటే వాణ్ణి ఎలాగోలా స్కూల్‌కి పంపడమే నయమనిపిస్తుంది.” నవ్వుతూ అంది ముక్త.
”సరేనమ్మా ! మీ అబ్బాయి యూనివర్సిటీకి శలవులు ఇచ్చినప్పుడే రండి” అంటూ మనవడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు సుదర్శన్.
”అనంత్ గారు మనింట్లో మంచికి చెడుకి తప్పకుండా వస్తారు. మరి వాళ్ళమ్మాయి పెళ్ళి హఠాత్తుగా కుదిరిందని పిలిస్తే వెళ్ళకపోతే బావుండదు కదా!” అంది రాజేశ్వరి.
”ముక్తా ! అసలు సంగతి వేరే ఉంది.. అనంత్‌కి మీ అత్తయ్య చెల్లెలి వరస. ఆడపడుచుకి వచ్చే మంచి చీర పోగొట్టుకో కూడదని మీ అత్తయ్య తొందర. ఏమిటో ! మా జేబులకి చిల్లులు, మీకు పట్టుచీరలు. ఈ రోజుల్లో ఫంక్షన్స్‌లో మగవాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు కలికాలం”. భార్యకేసి చూసి నవ్వుతూ అన్నాడు సుదర్శన్.
భర్తకి ఘాటుగా జవాబివ్వడానికి నోరు తెరిచిన రాజేశ్వరి చూపు దూరంగా చేతిలో చిన్న సూట్‌కేసు, భుజానికి చేతి సంచి తగిలించుకుని కంపార్టుమెంటులు చూసుకుంటూ చకచకా తమ వైపే వస్తున్న ఒక స్త్రీ మీద నిల్చిపోయింది. సన్నగా, పొడుగ్గా, అందంగా, హుందాగా నడి వయసు దాటుతున్నా యవ్వన ఛాయలు ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఆమె తమ కంపార్టుమెంటును సమీపిస్తుండగా రాజేశ్వరిలో కంపనం. అప్రయత్నంగా భర్త వైపు చూసింది. ఆయన మనవడ్ని ముద్దు చేస్తూ కోడలితో మాట్లాడు తున్నాడు. అప్పుడే ఆమె వాళ్ళ ఎదురుగా ఉన్న కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కింది.
సత్యనారాయణ మూర్తీ! ఆమె మా కూపే దాటి పోయేలా చూడు స్వామీ!” మనసులోనే ప్రార్థిస్తూ. రాజేశ్వరి ఓరకంట కిటికీలో నుండి లోపలికి దృష్టి సారించింది. ఆమె ఆ కూపే దాటి ముందుకు వెళ్ళింది.
”భగవంతుడు నా మొర ఆలకించాడు,” అనుకుంటూ భర్తకేసి చూసింది. ఊచలాగా సన్నగా పొడుగ్గా జీన్స్ పాంటు, టీ షర్ట్‌లో తుమ్మెద రెక్కల్లా నల్లగా నిగనిగలాడుతున్న జుట్టుతో ముఖం మీది ముడతల్ని కప్పుతూ అందంగా అమరి, హుందాతనాన్ని తెచ్చిపెడ్తున్న కళ్ళజోడులో సుదర్శన్ నిరంజన్‌కి అన్నయ్యలాగా ఉన్నాడు. రాజేశ్వరి మనసు మూలిగింది.
”ఏమిటోయ్ నీ పరధ్యానం? నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని ముక్త అంటోంది. వినబడ్డం లేదా?” అన్నాడు సుదర్శన్.
”ఆఁ! ఆఁ! అలాగే! వీలు చూసుకుని మీరు రండి” రాజేశ్వరి తనను తాను సంబాళించుకుంటూ అంది.
”నాన్నా! మీ బెర్త్ కూడా కన్‌ఫర్మ్ అయింది. నెంబరూ….” అప్పుడే వచ్చిన నిరంజన్ టికెట్టు చూస్తూ అన్నాడు.
”అది నేను చూసుకుంటాలే! నువ్వా ఇన్సూరెన్స్ సంగతి మర్చిపోకు” సుదర్శను కొడుకు దగ్గర్నుండి టిక్కెట్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ హెచ్చరించాడు. రైలు బయల్దేరడానికి సిద్ధమైంది రాజేశ్వరి, సుదర్శన్ హడావుడిగా కంపార్టుమెంట్‌లోకి ఎక్కారు. కదిలిన రైల్లోంచి కనిపించినంత వరకు కొడుకు, కోడలు, మనవడికి చేతులూపి లోపలికి వచ్చి కూర్చున్నారు.
”రాజీ! నా బెర్త్ ఎక్కడుందో చూసి, టి.సి. వచ్చేవరకు అక్కడే కూర్చుని, ఇక్కడికి మార్పించుకునే వీలుందేమో చూసుకుని వస్తాను” అంటూ లేచాడు సుదర్శన్.
”అలాగే!” అంటూ తల ఊగించిన రాజేశ్వరి మెరుపు కొట్టినట్టయి గుండె గుబగుబలాడగా వెళ్తున్న సుదర్శనాన్ని బేలగా చూసింది.
అరగంట గడిచింది. టి.సి. వచ్చి టిక్కెట్లు చెక్ చేసుకుని ముందుకి వెళ్ళిపోయాడు. మరో పావుగంట గడిచింది. రాజేశ్వరిలో విపరీతమైన ఉద్వేగం. సుదర్శనం వస్తున్నాడు. ఆమె అనుకున్నట్టే వెనకే అమృత కూడా వస్తోంది. రాజేశ్వరి మాన్పడిపోయింది.
”అనుకున్నంతా అయింది. ఆ దేవుడు కూడా మగవాడేగా, నా గోడు ఎందుకు పట్టించుకుంటాడు. ఇంక ఈ ప్రయాణం నా పాలిటి నరకం కాబోలు!” నిస్పృహగా అనుకుందామె.
రాజీ ! రెండు కూపేల అవతల నాది మిడిల్ బర్త్. అమృత అక్కడే కనిపించింది. తను కూడా హైద్రాబాద్‌కే వస్తోందిట. ఒంటరిగా ఎందుకని ఇక్కడికి రమ్మన్నాను” నవ్వుతూ చెప్తున్నాడు సుదర్శన్.
”బావున్నావా, రాజేశ్వరీ!” నవ్వుతూ పలకరించిందామె.
లోపల రగుల్తున్న మాటని కనబడనీయకుండా మొహానికి నవ్వు పులుముకుని ”ఆఁ! మీరెలా ఉన్నారు? రండి, కూర్చోండి!” అంటూ కిటికీవైపు జరిగి పక్కన చోటిచ్చింది. సుదర్శనం అమృతకి ఎదురుగా కూర్చున్నాడు.
”ఆయన మొహం వెలిగిపోతోంది. నలభై ఏళ్ళ క్రితం నా గుండెల్లో దిగబడిన ఈ ముల్లు అప్పుడప్పుడూ ఇలా సలుపుతూనే ఉంటుంది.” అనుకుంది రాజేశ్వరి.
”ఇక్కడ యూనివర్సిటీలో మూడ్రోజులు జాతీయ చారిత్రక సదస్సు జరిగింది దానికే వచ్చాను. నిరంజన్ ఇక్కడే ఉంటున్నాడని, మీరూ వచ్చారని నాకు తెలీదు. లేకపోతే, నిన్న అందరం సైట్ సీయింగ్‌కి వెళ్ళాం. దాని బదులు మీ దగ్గిరకే వచ్చి మీ కోడలిని, మనవణ్ణి చూసేదాన్ని” అంది అమృత.
”మమ్మల్ని పంపించడానికి వాళ్ళు కూడా స్టేషన్‌కి వచ్చారు. నేను నిన్ను చూడలేదు లేకపోతే పరిచయం చేసే వాణ్ణి.” అన్నాడు సుదర్శనం.
ఆ తర్వాత ఆమె కాన్ఫరెన్స్ విశేషాలు చెప్తుంటే, ఆమె మాటలు వినడమే తన జీవిత పరమావధి అన్నట్టు శ్రద్ధగా వింటున్న సుదర్శనాన్ని చూస్తే రాజేశ్వరికి ఒంటికి కారం రాసుకున్నట్టుంది. ఆమె ఓరగా అమృతకేసి చూసింది. చిన్న చిన్న నలుపు ఆకుపచ్చ గులాబి రంగు పూల డిజైన్ ఉన్న తెల్లటిపాల నురగ లాంటి సిల్కు చీరలో, తీరుగా ముడిలో ఇమిడిపోయిన వత్తైన జుట్టు, కొనతేరిన పొడుగాటి ముక్కుకి మెరుస్తున్న చిన్న వజ్రపు ముక్కు పుడక, సోగ కళ్ళు, ఒంపు తిరిగిన చిన్న చుబుకం, ఇంకా సన్నదనం పోగొట్టుకోని నడుము, పొట్టమీద అందంగా చిన్న మడత. కనుబొమల నడుమ చిన్న నల్లని బొట్టుతో పొందికగా, అందంగా ఉంది. యవ్వనానికి కూడా ఈవిణ్ణి వదిలి పోవాలనిపించటం లేదు కాబోలు! ఆమెకి హఠాత్తుగా తన పొట్టమీద కాన్పుల తాలూకు చారలు గుర్తొచ్చాయి. చటుక్కున జరీ నేత చీర కొంగు దగ్గరగా లాక్కుంటూ నిట్టూర్చింది.
”నైజీరియా నుండి మీరెప్పుడు వచ్చేశారు? విషయం తెలిసి మేం చాలా బాధ పడ్డాం”. వాళ్ళ సంభాషణలో కలగజేసుకుంటూ అడిగింది రాజేశ్వరి.
”ఎలా జరిగింది?” నెమ్మదిగా అడిగాడు సుదర్శన్.
”మూడ్రోజులు హై టెంపరేచర్‌తో జ్వరం వచ్చింది. అంతే! అంతా సడెన్‌గా జరిగిపోయింది. మన చేతుల్లో ఏం లేదుగా ! అందరం ఆ పైవాడు ఆడే చదరంగంలో పావులమే ! అవసరం తీరిందనుకున్నాడేమో ఆయన్ని తప్పించేశాను. నేను లాంగ్ లీవ్ మీద వెళ్ళానుగా ! మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరి అమ్మ దగ్గిరే ఉంటున్నాను.” అమృత పేలవంగా నవ్వింది.
కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి. తనని తాను సంబాళించుకుని ”ఆనందవల్లి ఎక్కడుంది?” అంది అమృత వల్లి.
ఎవరూ? మా ఆనందా? అదిప్పుడు యు.ఎస్. లో ఉంది. దాని కిద్దరు ఆడపిల్లలు. చురుగ్గా చూస్తూ అంది రాజేశ్వరి కూతురికి పేరు పెట్టేవేళ దాని పేరులో తన కిష్టం లేదని తెలిసీ ‘వల్లి’ చేర్చి ఆ పేరుతోనే భర్త కూతుర్ని పిలుస్తుంటే తనెంత క్షోభ పడిందీ గుర్తొచ్చి రాజేశ్వరి గొంతు ఆమె ప్రమేయం లేకుండానే పదును తేలింది.
”పిల్లలున్నప్పుడు బాధ్యతలు తప్పవుగా ! రెండు పురుళ్ళకి నేనే అక్కడికి వెళ్ళాను.” ఆమెకి లేని అదృష్టం తనకి దక్కిందని ధ్వనించాక రాజేశ్వరి మనసు కొంత శాంతించింది. వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.
”నీ పి.హెచ్.డి దేని మీద చేశావు?” సంభాషణ మారుస్తూ అడిగాడు సుదర్శన్.
‘ఆంధ్రదేశంలో బౌద్ధమతం’ మీద….”
అమరావతిలోను, నాగార్జున కొండ మీద, మొగల్రాజపురం గుహల దగ్గర తన అనుభవాలు, వాటికి సంబంధించిన చారిత్రక విషయాలు అమృత చెప్తుంటే సుదర్శన్ ఆసక్తిగా వింటున్నాడు. వెనక్కి వాలి వాళ్ళ సంభాషణ వింటూ కళ్ళు మూసుకున్న రాజేశ్వరికి తను కూడా బి.ఏ. లో చదివానని గుర్తొచ్చింది. రాజేశ్వరికి అమృత చెప్పే విషయాల్లో కొన్ని తెలిపినట్టే ఉన్నాయి. పెళ్ళి, సంసారం, పిల్లల పెంపకం, బాధ్యతలు, బరువుల మధ్య ఆ జ్ఞాపకాలన్నీ మాసిపోయి, వెలిసిపోయి గత జన్మ గుర్తులుగా లీలామాత్రంగా మిగిలిపోయాయి. ఆమె బలవంతంగా నిట్టూర్పుని ఆపుకుంది. హఠాత్తుగా అమృత రాజేశ్వరి వేపు తిరిగి ”రాజేశ్వరీ ! నీకు బోర్ కొట్టిస్తున్నానా?” అంది.
రాజేశ్వరికి వాళ్ళ సంభాషణలో పాలు పంచుకోవడం కన్నా నిద్ర నటించడం మేలనిపించింది.
”అదేం లేదులే ! ఆవిడకి బస్సు బొమ్మని రైలు బొమ్మని చూసినా సరే నిద్రొస్తుంది సుదర్శన్ నవ్వుతూ అంటున్నాడు.
రాజేశ్వరి కళ్ళు తెరిచి, అతని కేసు చురుక్కున చూసి
”నిన్న రాత్రి నిరంజన్ వాళ్ళతో మాట్లాడుతూ చాలా సేపు మేలుకున్నాం. అందుకే మాగన్నుగా నిద్ర పట్టింది. ఇప్పుడే వస్తాను” మొహానికి నవ్వు పులుముకుని అమృతతో అంటూ లేచింది రాజేశ్వరి. వాష్ బేసిన్ దగ్గర మొహం మీద దోసిళ్ళతో నీళ్ళు జల్లుకుంటూ తలెత్తింది. ఎదురుగా నలుపు, తెలుపు కలనేతగా జుట్టు, ముక్కుకి రెండు పక్కలా గడ్డం వరకు పాకిన రెండు చారల్లాంటి ముడతలు, కొంచెంగా జారి వడిలిన బుగ్గలు, కొద్దిగా వదులుగా కళ్ళ మీదికి వాలుతున్న కనుబొమ్మల క్రింది చర్మం… అద్దంలోని తన ప్రతిబింబం తనని చూసి వెక్కిరిస్తున్నట్టనిపించగా, మరి చూడలేక తల తిప్పుకుని తలుపు దగ్గిరకి జరిగింది. చల్లటి గాలి ఆమె మొహాన్ని ఓదార్పుగా నిమిరింది. ఇప్పటి వరకూ జారిపోతున్న వయసు గురించి ఎప్పుడూ చింతించలేదు. వయసులో ఉన్నప్పుడు అందరూ తను బావుంటుందనేవారు కానీ పెళ్ళై సంసారంలో పడిన తర్వాత తన రూపాన్ని గురించి పట్టించుకోలేదు. ఇదంతా సహజంగా జరిగే మార్పుగానే తేలిగ్గా తీసుకుంది. కానీ ఇవాళ ఎందుకో అలా అనుకోలేకపోతోంది. అలాగే ఆయన సహజంగా కలుపుగోలు స్వభావం కల మనిషవడంతో ఆడవాళ్ళతో కూడా చనువుగా మాట్లాడినా తనకెప్పుడూ అనుమానం కలగలేదు. బాధా పడలేదు. కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనబడేది చూస్తూ ఇదంతా తన మనసు చేసే గారడి అని సరిపుచ్చుకోవడం చేతకావడం లేదు. ఈ అమృత తన జీవితానికి రాహువులా దాపరించింది. కళ్ళలో చేరుతున్న నీటిని కనురెప్పల్లోనే అప్పళించుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకుంది రాజేశ్వరి.
‘మామ్మ గారూ ! పడిపోతారు. లోపలికొచ్చెయ్యండి”
రాజేశ్వరి తల తిప్పి వెనక్కి చూసింది. ఎవరో పదిహేడు, పద్దెనిమిదేళ్ళ కుర్రాడు ఆమె కేసి అక్కరగా చూస్తున్నాడు. అతని కేసి చూసి ఒక వెర్రి నవ్వు నవ్వేసి ఆమె వెనక్కి వచ్చేసింది.
”ఇదుగో, తీసుకో ! కాస్త రిఫ్రెషింగ్‌గా ఉంటుంది” అంటూ సుదర్శన్‌తో పాటు రాజేశ్వరికి కూడా కాఫీ కప్పు అందించాలని రాజేశ్వరి సుదర్శన్ వైపు చూసింది. ఆ కప్పుని అపురూపంగా పట్టుకుని అమృతాన్ని తాగుతున్నట్టు గుటకలేస్తున్నాడు. ఆ కాఫీ పట్ల కలిగిన కంపరాన్ని అణుచుకుంటూ బలవంతంగా గొంతులోకి దింపుకుంది. వాళ్ళిద్దరూ ఎవరెవరో బంధువుల్ని గుర్తు చేసుకుంటూ, పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నారు. మధ్య మధ్య ఆమెతో కూడా వాళ్ళు రెండు ముక్కలు మాట్లాడుతున్నా రాజేశ్వరికి వాళ్ళ సంభాషణలో తనకి చోటు లేదనిపించి తన జ్ఞాపకాల్లోకి జారిపోయింది.
పెళ్ళయిన తర్వాత మూడు నిద్రలకి అత్తవారింటికి వెళ్ళినప్పుడే అమృత పేరు మొదటిసారి విన్నది. అమృత తిరస్కరించటంతో సుదర్శన్ పెళ్ళే వద్దని చాలా ఏళ్ళు భీష్మించుకున్నాడని, తర్వాత తల్లి, అక్క చెల్లెళ్ళ పోరు తట్టుకోలేక తనతో పెళ్ళికి ఒప్పుకున్నాడని ఆడపడుచుల మాటల్లో గ్రహించి ‘ఈ అమృత ఎవరో?’ అనుకున్నది తాను ఉండబట్టలేక ఒకసారి సుదర్శన్‌ని అడిగేసింది. అతను అమృతను తను ఎంతగా అభిమానించింది, ఆమె తిరస్కృతి తనని ఎంత బాధించింది వివరంగా చెప్పినప్పుడు ఆ పరిస్థితిలో ఏ సాధారణ యువతికైనా కలిగే భావాలకి తనూ అతీతం కాలేకపోయింది. అటు తర్వాత బంధువుల ఇళ్ళలో జరిగే శుభకార్యాల్లో ఆమె కలిసినప్పుడు మాత్రమే కాక ఆమె ప్రస్థావన వచ్చినప్పుడు సైతం అతని కళ్ళలోని మెరుపు తన గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది. ఎవరి మనసు ఎప్పుడు మారుతుందోననే భయంతో ఆమె వస్తుందన్న అనుమానం ఉన్న ఇళ్ళలోని శుభ కార్యాలను తను మానేయడమే కాక ఆయన్ని కూడా వెళ్ళనీయని సందర్భాలు ఎన్నో !
అమృత డాక్టరేట్ చేసి, ఇంకా పెళ్ళి చేసుకోకుండా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిందని, ఆమెని పెళ్ళికి ఒప్పించలేక ఆ బెంగతోనే ఆమె తండ్రి మంచం పట్టి పోయాడని విన్నప్పుడు ఆమె త్వరగా పెళ్ళి చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంది. తర్వాత చాలా ఏళ్ళకి తల్లి బలవంతం మీద ఆమె పెళ్ళి చేసుకుందని తెలిసి ఆమె తల్లి కంటే తనకే ఎక్కువ సంతోషం ఆపైన ఆమె డాక్టరు భర్తతో నైజీరియా వెళ్ళిపోయిందని విన్నప్పుడు తన గుండెల మీద గాస్ స్టౌ దింపుకున్నంత నిశ్చింత. ఈ పదేళ్ళ కాలం చీకూ చింతా లేకుండా గడిచింది. ఇంత కాలానికి ఆమె కనిపించడమే కాక, ఇప్పటికే ఆయన కళ్ళలో ఆమెని చూసినప్పుడు అదే మెరుపు! తనకి దుర్భరమైపోతోంది. రాజేశ్వరి తల తిప్పి వాళ్ళకేసి చూసింది. ఆయన ఏదో అన్నట్టున్నారు. అమృత చిరునవ్వు నవ్వుతోంది. ఆమెకి కడుపులో ఆదుర్దా బయల్దేరింది.
ఈ ప్రయాణం తన భవిష్యత్‌కి ప్రాతిపదిక అవుతుందేమో ననిపించగా కల్లోలంగా ఉన్న మనసుని కుదుట పరచుకోలేక అస్థిమితంగా కిటికి కమ్మీలకు తల ఆనించి కళ్ళు మూసుకుంది. ”రాజీ! లే! భోజనం చేద్దాం! సుదర్శన్ పిలుపుతో కళ్ళు తెరిచింది. అప్పటికే అమృత మూడు పేపర్ ప్లేట్లలో తను తెచ్చిన చపాతీలు పెరుగన్నం సర్దుతోంది.
”తలనొప్పిగా ఉంది. నాకేం తినాలని లేదు. పడుకుంటాను” అసహనాన్ని అణుచుకునే ప్రయత్నం చెయ్యలేదు రాజేశ్వరి.
”నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు. కొంచెం పెరుగన్నం తిని పడుకుంటే నిద్ర పడుతుంది” స్నేహపూర్వకగా చూస్తూ అంది అమృత.
తన చూపులో కలిసిన సుదర్శన్ చూపులోని భావాన్ని గహ్రించి, అతని చేతిలోని బాగ్ అందుకుని పులిహోర టిఫిన్ బాక్స్ తెరిచి ప్లేట్లల్లో సర్ది తప్పనిసరిగా ఏదో తిన్నాననిపించింది.
అప్పటికే తోటి ప్రయాణీకులు పడక ఏర్పాట్లు చేసు కుంటున్నారు. ”ఇక్కడ్నించి మీ బెర్త్‌కి ఎవరైనా వెళ్తారేమో కనుక్కోండి” అంది రాజేశ్వరి. ”రాజేశ్వరీ! నేనిక్కడ పడుకుంటాను. నువ్వెళ్ళి నా బెర్త్ మీద అక్కడ పడుకో!” అంది అమృత.
”తనకి మోకాళ్ళ నొప్పులు. పైకి ఎక్కలేదు,” అన్నాడు సుదర్శన్ లేచి కూపే కలయ చూస్తూ.
అమృత తనకేసి జాలిగా చూస్తున్నట్టనిపించి కుంచించుకుపోయింది రాజేశ్వరి. తను అక్కడ ఉండి చేయగలిగింది ఏమీ లేదనిపించి అమృత తన బెర్త్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆలోచిస్తూ నిల్చున్న భర్తని విసుగ్గా మళ్ళీ హెచ్చరించింది రాజేశ్వరి. ఆమెకి ఎదురు బెర్త్‌లో ఒక యువతి పసిపిల్లతో పడుకుంది. ఆపైన మిడిల్ బెర్త్‌లో ఒక ముసలాయన మఫ్లర్ చుట్టుకుని నిద్రకి ఉపక్రమిస్తున్నాడు. ఆయనకి ఎదురు బెర్త్‌లో దుప్పటి పరుచుకుంటున్న ఆమెని అడిగింది రాజేశ్వరి.
”సారీ! ఆయన మా నాన్నగారు. రాత్రి ఆయన లేస్తే నా సాయం అవసరం” అందామె అప్పర్ బెర్త్‌లు రెండిటి మీద కొత్తగా పెళ్ళైన దంపతులు కాబోలు, ఎప్పుడు తిన్నారో, ఎప్పుడు ఎక్కారో ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళని పలకరించే పాపం చెయ్యలేదు సుదర్శన్. నడవలోని కింది బెర్త్‌మీద ఒక భారీ కాయం బద్ధకంగా జరుగుతోంది. అక్కడ అడగడానికి సుదర్శన్‌కి నోరు రాలేదు ఆపై బర్త్ అతను టాయిలెట్‌కి దగ్గరగా ఉండాలని ఆ బెర్త్ కోరి తీసుకున్నానని మారడం కుదరదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. రాజేశ్వరికి ప్రపంచం మొత్తం తన మీద కత్తికట్టినట్టనిపించింది. దాని మీద సుదర్శన్ కూడా, ”ఇక్కడైనా భయమేముంది? మనం దిగడానికి ముందే నేను ఇక్కడికి వస్తాను. షట్టర్ దింపేసి పడుకో!” అంటూ జాగ్రత్తలు చెప్పి పక్క బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజేశ్వరి అతను వెళ్ళిన వేపే చూస్తుండి పోయింది. రైలు కుదుపుకు ఉయ్యాల లూగుతున్న శరీరంతోపాటు ఆమె మనసూ ఉక్రోషంతో ఊగిపోతోంది.
”ఛీ! సంసారం పట్ల ఆడదానికున్న నిబద్ధత మగవాడికెలా ఉంటుంది. ఇప్పటి వరకు తన పట్ల, పిల్లల పట్ల ఆయన బాధ్యతగానే వ్యవహరించినా అది ఇక ముందు కూడా ఉంటుందన్న నమ్మకం ఆమెకి సడలిపోసాగింది. ఆ అమృత కూడా హైద్రాబాద్‌లో ఇటువంటి స్థితిలో ఉంటే వాళ్ళు కలుసుకోకుండా ఆపడం ఎవరి తరం? ఈ ప్రయాణం ఎక్కడికి దారి తీసి ఏ ప్రళయం సృష్టిస్తుందో! రాజేశ్వరికి రాబోయే రోజులు చీకటిమయంగా అనిపించాయి. ఇన్నేళ్లుగా ఆయన చుట్టూ అల్లుకున్న గూడు కుప్పకూలిపోతే తన గతేంటి? ఇన్నేళ్ళ అనుబంధానికి అర్థం లేకుండా పోతుందా? ఈ రాత్రి వాళ్ళ సాన్నిహిత్యం తన జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతోందో? ఈ వయసులో ఎవరికీ చెప్పుకోలేని ఈ బాధ నాకెందుకు కలిగించావు భగవంతుడా!” రాజేశ్వరి మనసు ఆక్రోశించింది. భయంతో, బెంగతో గొంతు ఎండిపోతోంది. కనుకొనల కుండి జరుగుతున్న కన్నీరు తలగడను తడుపుతుంటే ఆమె ముఖాన్ని దిండుకేసి బలంగా అదుముకుంది.
తన లోపలి అంతర్మధనాలతో తనకేమాత్రం సంబంధం లేనట్టు బతుకు బండిలా చీకటిని చీల్చుకుంటూ రైలు గమ్యం వేపు దూసుకుపోతోంది. ”రాజీ! సికింద్రాబాద్ వచ్చేస్తోంది, లే!” తెల్లవారుఝామున ఎప్పటికో అలసటతో కన్ను మూసిన రాజేశ్వరి ఉలికిపాటుతో లేచింది. సుదర్శన్ దుప్పటి దిండు సూట్కేస్‌లో సర్ది ఆమె పక్కన కూర్చున్నాడు. అమృత కూడా సూట్కేస్‌తో వచ్చి అతని పక్కనే కూర్చుంది. రాజేశ్వరి వాళ్ళిద్దర్ని మార్చి మార్చి చూస్తూ కూర్చుంది. రాత్రి వాళ్ల మధ్య ఏం మాటలు జరిగాయో ఆమెకి ఊహించడానికి కూడా భయమేసింది.
సుదర్శన్ లేచి టాయిలెట్ వేపు వెళ్ళాడు.
”’రాజేశ్వరీ! ఇకనుంచి అందరం ఒకే ఊళ్ళో ఉంటాం కాబట్టి తరుచు కలుస్తూండచ్చు. మీరొకసారి మా ఇంటికి రండి. అమ్మ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషపడ్తుంది. నేను సుదర్శన్‌కి కూడా చెప్తాను” అంటూ అమృత ఆమె భుజం మీద చెయ్యి వేసింది.
”అలాగేలే! నాకు చెప్పావుగా, నేను ఆయనకి చెప్తాలే! మళ్ళీ నువ్వు ఆయనకి చెప్పడం ఎందుకు?” ఆ స్పర్శ తాలూకు కంపరాన్ని అణచుకుంటూ అలవాటు లేని ఏక వచన ప్రయోగం చేస్తూ గబగబా అనేసింది రాజేశ్వరి. అమృత తనకేసి విచిత్రంగా చూడ్డం గమనించినా ఆమె పట్టించుకోలేదు.
స్టేషన్ బయట, ”అమృతా! మనం మళ్ళీ లుద్దాం.” అంటున్న సుదర్శన్‌ని చురుక్కున చూసి తల తిప్పుకుంది రాజేశ్వరి. అమృత చిరునవ్వుతో వాళ్ళ దగ్గర శలవు తీసుకుని వెళ్ళిపోయింది.
సెల్లార్‌లోని పోస్టు బాక్స్ తెరిచింది రాజేశ్వరి. టెలిఫోన్ బిల్లు, ఒక వార పత్రిక మధ్య ఉన్న కవర్ ఆమె దృష్టిని ఆకర్షించింది. దానికి మూలగా ‘అమృత వల్లి’ అన్న కుదురైన అక్షరాలు ఆమెని కుదిపేశాయి. గుండె ఆగినంత పనవగా, గబగబా ఫ్లాట్‌లోకి వచ్చిపడింది. ఆ కవర్ని పట్టుకుని చాలా సేపు తర్జన భర్జన పడి చివరికి ఏమైతే అదే అవుతుంది. ఉత్తరం చదివిన తర్వాత ఘాటుగా తనే ఆమెకు జవాబు రాయాలని నిర్ణయించుకున్నాక ఆమెకి కాస్త నెమ్మది చిక్కింది. పరుల ఉత్తరాలు చదవడం పరువైన పని కాదని గొణుగుతున్నది అంతరాత్మ. కొంపలు మునుగుతుంటే పరువా, గాడిద గుడ్డా!” అనుకుని దాని పీక గట్టిగా నొక్కేసి, ఒణుకుతున్న చేతుల్తో కవర్ తెరిచింది. ఆమె కళ్ళు ఉత్తరంలోని అక్షరాల వెంట పరుగులు తీశాయి. పూర్తిగా చదివేసి ఆ ఉత్తరంలోని వాక్యాలు మననం చేసుకుంటూ కూర్చుండిపోయింది. ”………..రాజేశ్వరి కళ్ళలో మెదిలిన భయం నేనెప్పటికీ మర్చిపోలేను. గతంలో చాలా సార్లు ఆమె నన్ను చూసి ఇబ్బంది పడి, నన్ను తప్పించుకోవాలని ప్రయత్నించడం నాకొక పజిల్‌లాగా ఉండేది. మా వారితో నా అనుబంధం కొంతకాలమే అయినా చాలా గాఢమైనది. అందుకే నువ్వు ప్రపోజ్ చేసిన విషయం నాకు ఎప్పుడూ గుర్తులేదు. మొన్న మన ప్రయాణంలో ఆమెతో ఎక్కువ సేపు గడిపే అవకాశం రావడం వలన కొంతవరకు ఆమె అనుమానాలు, భయాలు నాకు అర్థమైనాయి. ఈ వయసులో ఆమెలో అభద్రతా భావం చోటు చేసుకోవడం, దానికి నేనే కారణం కావడం నన్ను చాలా బాధిస్తోంది….. నువ్వు రచయితవి. చలంగారి అభిమానివి. ఇన్నేళ్ళుగా ఆమెకి సహచరుడివి. ఆమె మనసు నీకంటే బాగా తెలుసుకునే అవకాశం వేరెవరికి దొరుకుతుంది?….. ఇన్నేళ్ళ తర్వాత, జీవిత చరమాంకంలో ఇలాంటి ఉత్తరం నీకు రాయాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు……. ఇక ముందు మన బంధుత్వం, స్నేహం నిర్మలంగా కొనసాగించడం నీ చేతుల్లోనే ఉంది…….”
చెంపల మీదుగా కన్నీరు కారిపోతుండగా రాజేశ్వరి ఉత్తరాన్ని పట్టుకుని అలాగే కూర్చుండిపోయింది. చాలాసేపటి తర్వాత, దశాబ్దాలుగా పేరుకున్న వ్యధ కన్నీటి వరదలో కొట్టుకుపోగా, తేలిక పడ్డ మనసుతో లేచి ఆ ఉత్తరాన్ని ముక్కలుగా చించి ఫ్లష్ చేసి, ముఖం కడుక్కుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags