ఓల్గా
నూటయాభై సంవత్సరాల క్రితం పుట్టిన ఒక కవి కవిత్వాన్ని ఇవాళ మళ్ళీ చదువుకుని ప్రేరణ పొందటానికేమైనా ఉంటుందా? ఉంటే అది ఆ కవి, ఆ జాతి అదృష్టమా, దురదృష్టమా? గొప్ప కవులను మళ్ళీ మళ్ళీ చదువుకుని ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు. కానీ ఒక సామాజిక అవసరంగా వారి కవిత్వం నూరేళ్ళ తర్వాత కూడా చదవతగినదిగా ఉందంటే అది ఆశ్చర్యమే – సామాజిక సందర్భం మారలేదంటే విషాదమే. అలాగే ఆ కవి చూపు పైపై పొరల మీద కాకుండా పునాది లోపలకు వెళ్ళి చూచినందువల్లే ఆ కవితలకు ఈ సజీవత్వమన్నపుడు ఆ కవి అవగాహనకు అబ్బురపడవలసిందే.
1862లో పుట్టిన గురజాడ 1909లో కన్యాశుల్కం రెండవ కూర్పు ముగించి ఒక అద్భుతమైన నాటకాన్ని తెలుగు ప్రజలకు ఇచ్చాడు. 1910 నుంచి ఆయన ఆధునిక కవిత్వ రచనకు పూనుకున్నాడు. కవిత్వ రచన ఆయనకు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచీ అలవాటే. విద్యార్థి దశలో ఆంగ్లంలో కవిత్వం రాశాడు. సారంగధర ఇతివృత్తంగా రాశాడు. ఆ ఆంగ్ల పద్యకావ్యం బెంగాల్ నుంచి వచ్చే పత్రికలో ప్రచురితమైంది. 1884లో ఆ పత్రిక సంపాదకుడు శంభుచంద్ర ముఖర్జీ గురజాడకు ఒక ఉత్తరం రాస్తూ ”మీరు రాద్దామనుకున్న రాజకీయ పద్య కావ్యాన్ని ప్రారంభించారా?” అని అడిగారు. రాజకీయ కావ్యాలను గురజాడ రాయలేదనే ఇప్పటివరకూ చాలామంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ గురించి ఆయన రాసిన కవితనే రాజకీయ కవిత్వంగా షెట్టి ఈశ్వరరావు గారు అన్నారు. కానీ గురజాడ రాసిన ‘కన్యక’, ‘పూర్నమ్మ’, ‘లవణరాజు కల’ – ఇవి రాజకీయ కవితలు. ‘కన్యక’ ‘పూర్నమ్మ’ స్త్రీలకు సంబంధించిన రాజకీయ కావ్యాలు వీటిని రాజకీయ కావ్యాలుగా గురజాడ అనుకున్నాడో లేదో మనకు తెలియదు. అనుకుని ఉండవచ్చు. వ్యవహారిక భాషతో రైతులలో చైతన్యం తేవచ్చని గ్రహించిన క్రాంతదర్మి, స్త్రీల అణచివేతను, వారి లైంగికత్వం, శ్రమల దోపిడిని కన్యాశుల్కం నాటకంలో ఎంతో వివరంగా, సృజనాత్మకంగా రాసిన సాంఘిక శాస్త్రవేత్త అయిన గురజాడ, స్త్రీల లైంగిక అణచివేత మీద స్త్రీలే తిరగబడి యుద్ధ ప్రకటన చెయ్యాలనే సందేశం ఇవ్వటం రాజకీయమేనని, అది రాజకీయ కవిత్వమని భావించి ఉంటే ఆశ్చర్యపోవలసినది ఏమీ లేదు. కానీ ఆయన సునిశితమైన, భిన్నమైన చూపు గురించి ఆశ్చర్యపోవాలి.
గురజాడ కన్యాశుల్కం నాటకం, ఆ తర్వాత కన్యక పూర్నమ్మ అనే కథా కావ్యాలు రాస్తున్న కాలంలో భారతదేశపు సంస్కర్తలు, జాతీయోద్యమ నిర్మాతలు కూడా స్త్రీల గురించి ఆలోచిస్తున్నారు. భారతీయతకు ప్రతీకగా స్త్రీని నిర్వచించటానికీ, ఒక ఆదర్శ స్త్రీ నమూనాని ఆధునికత సంప్రదాయాల మేళవింపుతో తయారు చేయటానికి వారు అనేక వాదనలతో ఆలోచనలతో సతమతమవుతున్నారు. భారత స్త్రీని నిర్వచించటం, ఆదర్శీకరించటం అనేది ఆనాటి జాతీయోద్యమ, సంస్కరణోద్యమ నాయకుల ముందున్న అత్యవసరమైన పని. భారతజాతి అస్తిత్వం గురించి వారు వలస పాలకులతో వాదించవలసినపుడల్లా వారికి ఈ భారతీయ స్త్రీ ఒక పెద్ద అడ్డుగా, వైరుధ్యంగా ఉంటూ వస్తోంది. ఎందుకంటే అప్పటి జాతీయోద్యమ నాయకులకు, భారత జాతీయతకు ఉన్న ప్రధాన సమస్య భారతదేశాన్ని పాశ్చాత్య పద్ధతుల్లో ఆధునీకరిస్తూ అదే సమయంలో అతి కీలకమైన జాతీయ అస్తిత్వాన్ని మిగుల్చుకోవటం అదే లేకపోతే ఇక మేము, మా దేశం, ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక అస్తిత్వం అనే వాటి గురించి రాజకీయంగా వాదించి అడిగే అవకాశం, అవసరం లేకుండా పోతుంది. అందువల్ల వాళ్ళు ఆ అస్తిత్వాన్ని ప్రైవేట్ ప్రాంతమైన గృహం లోని స్త్రీలలో గుర్తించారు. పబ్లిక్ ప్రాంతంలో ఆధునీకరణ జరిగేందుకు అనువైన మార్పులు కోరుతూ ప్రైవేట్ ప్రాంతమైన ఇంటిలో అక్కడి స్త్రీ పురుష అస్తిత్వ నిర్వచనాలలో తమ ప్రత్యేక జాతీయ అస్తిత్వాన్ని చూపదల్చుకున్నారు. చూడదల్చుకున్నారు. అతి పవిత్రంగా భావించే కుటుంబాన్ని, దానిలోని అధికార సంబంధాల సారాంశాన్ని రక్షించే కర్తవ్యం స్త్రీల మీద వేసి భారత జాతీయత సారాంశ మూర్తిమత్వం అంతా స్త్రీలలో చూడమన్నారు. తిలక్ వాదనలలో, బంకించంద్రుని రచనలలో మనం ఈ క్రమాన్నంతా చూడవచ్చు. భారతీయ సంస్కృతిని అంచనా వేయటానికి కొలమానంగా స్త్రీని వాడుకున్నారు. బాల్య వివాహాల నిషేధం గురించి, లైంగిక జీవిత సమ్మతి వయసు గురించి జరిగిన చర్చలలో బాల్య వివాహాలు ఏ చారిత్రక, భౌతిక కారణాల వల్ల జరుగుతున్నాయో చర్చించే పని పెట్టుకోకుండా, అది భారతీయ సంస్కృతిలోని విశిష్టతగా కొందరూ, మచ్చగా మరికొందరూ వాదించారు. ఈ పనితో వారు స్త్రీని, స్త్రీల సమస్యలనూ సంస్కృతి అనే పెద్ద కలగూరగంపలో పడేశారు. ఆ గంపనుంచి స్త్రీలు ఇప్పటికీ బైటపడలేకపోతున్నారు.
ఇలాంటి సమయంలో గురజాడ ఒక సృజనాత్మక రచయితగా, అనేక సామాజిక సమస్యల గురించి ఆలోచించిన సామాజిక తత్త్వవేత్తగా భారతీయ స్త్రీని చూసిన తీరు చాలా భిన్నంగా ఉంది. భారత స్త్రీని ఆయన గృహ నిర్బంధంలో, సామాజిక సంకెళ్ళతో తన కోసం తను తిరుగుబాటుకి సిద్ధంగా ఉన్న శక్తిగా గుర్తించాడు. ఆమెకు లేనిపోని పవిత్రతను ఆపాదించి అతిలోక మూర్తిగానో, కేవలం మాతృమూర్తిగానో, వందేమాతరం ప్రతీకగానో నిలపదల్చుకోలేదు. మధ్యతరగతి భద్రలోకపు మహిళను ఆదర్శ స్త్రీగా సృష్టించదల్చుకోలేదు. ఆయన భారత స్త్రీ వాస్తవ దర్శనాన్ని మధురవాణిలో, బుచ్చెమ్మలో, వెంకమ్మలో, సుబ్బిలో, మీనాక్షిలో, పూటకూళ్ళమ్మలో, యోగినిలో చేసి – తిరుగుబాటుకి సంసిద్ధులవుతున్న స్త్రీల ప్రతీకలుగా ‘కన్యక’ ను ‘పూర్నమ్మ’ ను సృష్టించాడు. ఈ ఇద్దరు అమ్మాయిలూ అమూర్తమైన భారతజాతి గౌరవం కోసం తిరుగుబాటు చెయ్యలేదు. చాలా ప్రత్యక్షంగా తమ మీద అమలవుతున్న భారతీయ పితృస్వామ్య రాజ్యపు అణచివేతమీద తమ ధిక్కారం ప్రకటించారు. ‘పూర్నమ్మ’ కేవలం ఒక బాల్య వివాహపు బలిపశువు కాదు. తన మీద జరుగుతున్న అణచివేతను ఎంతో కొంత అర్థం చేసుకుని నవ్వుతూ, ఏడుస్తూ తన నిరసనను తెలియజేసిన ధీరురాలిగా మనమిపుడు అర్థం చేసుకోగలం. ‘కన్యక’ ప్రత్యక్ష తిరుగుబాటు తేలికగానే అర్థమవుతుంది. ఒకసారి ఆ రెండు కావ్యాలనూ పరామర్శించుకుని వర్తమాన పరిస్థితిలో వాటి రెలవెన్సును సమీక్షించుకోవటం గురజాడ 150వ జయంతి సందర్భంలో చేయదగిన పని.
‘పూర్నమ్మ’ ‘కన్యక’ ఈ రెండు కథా కావ్యాలను గురజాడ ముత్యాల సరాలలో రాశాడు. ముత్యాల సరాలు అప్పటికి కొత్త ఛందోరీతి. ఈ రూప నవ్యతే కాకుండా ఈ రెండు కావ్యాలలో కథాంశమూ, కథను నిర్వహించిన తీరు, కథా సారాంశం అన్నీ కొత్తవే. ‘పూర్నమ్మ’ కథ ఆనాటి సమాజంలో అనేకమంది ఆడపిల్లల కథ. ‘కన్యక’ కథకు ప్రాచీన చారిత్రక, జానపద ఆధారాలుంటే ఉండొచ్చు. రెండు కావ్యాలలో ఇద్దరు కథానాయికలూ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇద్దరూ ఆత్మాహుతి చేసుకున్నారు. కారణాలు వేరు. కారణాలు వేరవటం వలన వాళ్ళు ఆత్మాహుతి చేసుకునే ముందు వారి మనోస్థితి, వారి మాటలు కూడా వేరుగా ఉన్నాయి. ఇద్దరి మనసులలో దుఃఖం, కోపం, నిరసన, తిరుగుబాటు ఉన్నాయి. కన్యకది రాజ్యం మీది తిరుగుబాటు. పూర్నమ్మది పితృస్వామ్యం మీది తిరుగుబాటు. రాజ్యం కూడా పితృస్వామ్య రాజ్యమే. రాజ్యంలోని పితృస్వామ్యం కనపడినట్టు, పితృస్వామ్యంలోని రాజ్యం అన్నిసార్లూ కనపడకపోవచ్చు. కానీ రెండూ ఒకదానికొకటి అల్లుకుని బలపడినవే. ఒకదానినుంచి మరొకటి విడివడనివే. ఇద్దరు కథానాయికలు అగ్రకులాలకు చెందినవాళ్ళు. పూర్నమ్మ బ్రాహ్మణ పిల్ల. కన్యక వైశ్య కన్య. పూర్నమ్మ 19వ శతాబ్దానికి చెందినది. కన్యక రాచరికపు కాలానికి చెందినది.
ఈ ఇద్దరమ్మాయిల లైంగికత్వం మీద ఒక దాడి, బలవంతం, అత్యాచారం జరగబోతోంది. దానిని మీరంగీకరించదల్చలేదు. లొంగదల్చుకోలేదు. కన్యక మీద జరగబోతున్న దాడి రాజ్యం ప్రత్యక్షంగా చేస్తున్నది. రాజ్యం స్త్రీల లైంగికత్వం మీద చేసే దాడిలో ఎలాంటి ముసుగూ, వెరపూ లేదు. అది లోకానికంతా స్పష్టం. లోకం రాజ్యానికున్న ఆ అధికారాన్ని ఆమోదించింది. నడివీధిలో కన్యకను చూసి కామించిన రాజు తన కోరికను మొరటుగా వ్యక్తం చేస్తాడు. రాజుకి అలా కోరే హక్కు ఉందని కన్యక తండ్రి కూడా ఒప్పుకున్నాడు.
పట్టమేలే రాజ – బలిమిని
పట్టవలెనా? నీదు సొమ్మే
కాద కన్నియ? నీవు కోరుట
కన్న మరి కలదా
వైశ్య జాతికి వన్నె
అని రాజుగారికి తానడ్డు రాననీ, కన్యకకు తండ్రి రక్షణ లేదనీ చెప్పాడు. ఐతే తండ్రిగా తన కూతురికి అగ్నిసాక్షిగా పెళ్ళి చేసి కన్యాదాన ఫలం కూడా పొందుదామనుకున్నాడు. దానికి కట్న కానుకలు కూడా ఇస్తానన్నాడు. అది కుల ధర్మాన్ని అనుసరించటమవుతుంది. బంధువులు, కుల పెద్దలను సంప్రదిస్తే గౌరవం అని విన్నవించుకున్నాడు. కానీ రాజుకి రాజ్యాధికారం బాగా తలకెక్కింది.
రాజు తలచిందేను ధర్మం
రాజు చెప్పిందెల్ల శాస్త్రం
రాజులకు పేరైన పద్ధతి
కాద గాంధర్వం
అన్నాడు. ఇష్టం ఉన్నా లేకున్నా వెంటనే నీ కూతురు నా సొత్తవ్వాలి. ఇక మీ ఇంటికి రాదా అమ్మాయి అని చెప్పాడు. అంతకు ముందే తండ్రి తనను రక్షించలేడని, కులపెద్దలు రక్షించలేరని, తన రక్షణ తన గౌరవం తనే చూసుకోవాలని కన్యకకు అర్థమైంది. తనను తాను కాచుకునే మార్గం ఆలోచించుకున్నది.
”ముట్టబోకుడు; దేవకార్యం
తీర్చివచ్చెద. నీవు పట్ణం
యేలు రాజువు, సెట్టి కూతుర
నెటకు పోనేర్తునే” అని కొంత వ్యవధి తీసుకుంది. తండ్రి కూడా దైవదర్శనం చేసిన తర్వాత తన కుమార్తెను అప్పగిస్తానన్నాడు. కన్యక గుడికి వెళ్ళి అక్కడ మండే అగ్ని గుండంలో పడి ప్రాణత్యాగం చేసింది. గుండంలో పడే ముందు అక్కడున్న తన బంధువులతో ఒక ఆవేశపూరితమైన, ఆలోచించ వలసిన ప్రసంగం చేసింది. ఆలుబిడ్డలను రక్షించుకునే ఆశ పౌరుషం లేవా అని అడిగింది. చదువు, యుద్ధ విద్యలు నేర్చుకోకుండా ఊరికే డబ్బుందనుకుంటే చాలదు, బుద్ధిబలం, బాహుబలం పెంచుకోమని బోధించింది. ఆ తర్వాత రాజుని చాలా ధైర్యంగా ప్రతిఘటించింది. పట్టుకో చూద్దామని సవాలు విసిరి అగ్నిగుండం లోకి దూకింది. రాజుకి అపజయం, అపకీర్తి మిగిల్చి, తాను గెలిచి కీర్తి సంపాదించింది. ‘కన్యక’ విషాదాంత కథా కావ్యమే అయినా ఆ విషాదంలో ఒక ధీమా ఉంది. ఒక సాహసం, ప్రత్యక్ష ప్రతిఘటన, ఆశ, పరోక్ష విజయం ఇవన్నీ ఉన్నాయి. నేరుగా రాజ్యంతో పోరాడటం ప్రతిఘటించటం అంత కష్టం కాదు. శత్రువు ఎవరో తెలుస్తుంది. విజయం వరించక పోయినా వీరమరణం వరిస్తుంది. భావి తరాలకు సూటిమైన ఆశామార్గం కనిపిస్తుంది. ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ప్రేరణనిస్తుంది. కన్యక పాత్రను అర్థం చేసుకోవటంలో కష్టం ఉండదు.
కానీ పూర్నమ్మ కథా అలా కాదు. పూర్నమ్మ మీద అమలవుతున్నది పితృస్వామ్య అధికారం. అది ఎప్పుడో ఒకరోజు హఠాత్తుగా ప్రత్యక్షమై దాడి చేసే శత్రువు కాదు. ‘ప్రేమ’, ‘బంధం’ ‘బాధ్యత’, ‘ధర్మం’, ‘కర్తవ్యం’ అనే కనిపించని పాశాలతో నిత్యం తోలుబొమ్మని ఆడించినట్లు ఆడించే ఒక వికటాధికారం. ఈ పితృస్వామ్యపు కంట్రోలుని అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. పితృస్వామ్య అధికారంలో అమ్మాయిలు పూర్తి నిస్సహాయలు. ఎవరితో యుద్ధం చెయ్యాలో, ఎవరిని ప్రతిఘటించాలో, ఎవరిమీద సవాలు విసరాలో తెలియని అయోమయం వారిది. పూర్నమ్మ విషయమే చూద్దాం. కన్నతండ్రి. తలపెట్టినది శుభకార్యం. దానివల్ల డబ్బులొచ్చి కుటుంబం బాగుపడుతుందనే ఆశ. తండ్రిని ఎదిరించే వారెవరూ లేరు. తండ్రి కుటుంబ పెద్ద. అతని మాట మీరకుండా ఉండటం, అతనిచ్చిన మాట నెరవేర్చటం ధర్మమనుకునే కుటుంబ సభ్యులు, ఆ ధర్మాన్నే తనూ నమ్మిన పసిమనసు. కానీ తన లైంగికత్వం మీద బలవంతపు కంట్రోలుని ఆమోదించలేని స్థితి. స్నేహితులు ”పూర్నమ్మ మొగుడు తాత” అని ఎగతాళి చేస్తుంటే భరించలేని తనం. దాని కారణంగా స్నేహితులు, ఆటపాటలూ కూడా లేవు. బాల్యం లేకుండా పోయింది. దైవం తప్ప దిక్కు లేదు. చనిపోవాలని అనుకుంది. మనసు లోపల చాలా కోపం ఉంది. కానీ ఆ కోపాన్ని ఎలా ఎవరిమీద చూపాలో తెలియదు. ఎలా చూపాలో తెలియని ఆ పిల్ల కోపాన్ని గురజాడ చూపించిన తీరు ఎంత సహజంగా, ఎంత రసాత్మకంగా ధ్వని పూరితంగా ఉందో చెప్పలేం. గురజాడ వంటి కవులు ఎందరున్నారు అని లెక్కపెట్టాల్సినంత గొప్ప కవితా సందర్భం అది. పూర్నమ్మను ముసలివాడికిచ్చి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపుతూ తల్లీ తండ్రీ దీవించారు. ఏమని దీవించారో గురజాడ చెప్పలేదు గానీ మనందరికీ తెలుసు దీర్ఘ సుమంగళీభవ అనే దీవించి ఉంటారు. తనను రేపోమాపో చావటానికి సిద్ధంగా ఉన్న ముసలాడికి కట్టబెట్టి ఇలా దీవించటంలో ఉన్న కర్కశత్వం పూర్నమ్మకు అర్థమైంది.
”దీవెన వింటూ ఫక్కున నవ్వెను
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ”
ఆ నవ్వుకే శక్తి ఉంటే అది ఆ తండ్రిని అక్కడే దహించి వేసేది. అంతా కోపాన్ని నవ్వుగా మార్చుకోటానికి ఒకమ్మాయికి ఎంత శక్తి కావాలో! పితృస్వామ్యాన్ని ఎదిరించే క్రమంలోనే ఆ అమ్మాయికి ఆ శక్తి వస్తుంది. తల్లిదండ్రుల దీవెన విని నవ్వినప్పుడే పూర్నమ్మ ఒక శక్తిని, ధైర్యాన్ని, సాహసాన్ని సంపాదించింది. ఆ సాహసంతోనే ప్రాణత్యాగం చేసింది.
ఐతే ప్రాణం తీసుకునేటపుడు తనను ఆ స్థితిలోకి నెట్టిన వ్యవస్థ మీద కనీసపు నిష్టూరమైనా ప్రకటించలేదు పూర్నమ్మ. కారణం పితృస్వామిక మాయాజాలపు అల్లిక. తన శత్రువెవరో, తనకీ ద్రోహం ఎందుకు జరిగిందో తెలుసుకోనివ్వని చీకటి పితృస్వామ్యం. బలమైన కుటుంబ బంధాల, బంధనాల వల. ఛేదించలేని బలమైన వల. అది వల అని తెలుసుకోలేనంత సన్ననైన వల. తన ప్రాణ త్యాగంతో నిరసన తెలియ జేసింది పూర్నమ్మ చివరి మాటలుగా కన్యకలో రగిలిన కోపం, ప్రబోధం పూర్నమ్మలో కనపడవు. కనిపించగ పోగా
”అన్నల్లారా తమ్ముల్లారా
అమ్మను అయ్యను కానండి” అని తన దుర్గతికి కారణమైన తండ్రి క్షేమాన్ని కోరటం తప్ప పూర్నమ్మకు మరో మార్గం లేదు. మరో ఆలోచన తెలియదు. దుర్గను పూజించమని చెప్పింది. ఆ తర్వాత
నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొకపరి తలవండి
మీ మీ కన్నబిడ్డల నొకతెకు
ప్రేమకు నా పేరివ్వండి”
అని మనల్ని గుండెలవిసేలా ఏడ్పించి, తానూ కన్నీరు కార్చి, ఆ కన్నీరు తుడుచుకుని, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకేమో మళ్ళీ
”కన్నులు తుడుచుకు కలకల నవ్వింది”.
దుర్గ గుడికి వెళ్ళింది. తిరిగి రాలేదు. దుర్గలో కలిసింది.
కన్యక దుర్గ గుడిలోనే, పూర్నమ్మ దుర్గ గుడిలోనే. ఇద్దరూ దుర్గలోనే ఐక్యమయ్యారు. ఇదొక ప్రతీకగా చెప్పాడా గురజాడ.
కన్యాశుల్కంలో మధురవాణికి భగవద్గీత ఇచ్చాడు. ఆ తర్వాత కథా కావ్యాలలో ఇద్దరమ్మాయిలను దుర్గలో ఐక్యం చేశాడు. స్త్రీలు దుర్గలవందే, యుద్ధం చేయందే పితృస్వామ్యం రాజ్యం కూలిపోవనే సందేశాన్ని కవితా ప్రతీక ద్వారా ఇచ్చాడా? దుర్గ ‘శక్తి’ అనే మాట పూర్నమ్మ నోటినుంచే చెప్పిస్తాడు.
”ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ
భక్తిని తెచ్చీ శక్తికి ఇవ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ”
దుర్గ శక్తి అయితే ఆ శక్తిలో ఐక్యమైన పూర్నమ్మల వంటి స్త్రీల శక్తి సమూహాన్ని సమరాయత్తం కమ్మని గురజాడ చెబుతున్నా డనుకోవాలి.
కన్యకలో చివరి ప్రాణత్యాగ సన్నీవేశం భయం గొలిపేలా ఉంటుంది.
నాడు గుడిలో మండె గుండం
మంట మింటిని ముట్టి యాడగ
కన్న నరపతి గుండె దిగులై
పట్టు విడజొచ్చెన్
రాజుకే భయం గొలిపేలా గుండం మండుతోంది.
భక్తి పరవశమైన మనసున
దుర్గనప్పుడు కొలిచి, కన్యక
ముక్తి వేడుచు వూడ్చి నగలను
శక్తి కర్పించెన్
మళ్ళీ శక్తి అనే పదప్రయోగం చేశాడు.
దుర్గ కొలనున గ్రుంకి పిమ్మట
రక్త గంధం రక్త మాల్యం
దాల్చి గుండం చుట్టు నిలిచిన
జనుల కిట్లనియెన్
అచ్చం యుద్ధానికి సిద్ధమైన దుర్గాదేవి, మహిషాసుర మర్దని గుర్తొస్తుంది కానీ పూర్నమ్మ దగ్గర ఈ యుద్ధ వాతావరణం లేదు. అంతా నిశ్శబ్ద సౌందర్యాత్మక హింసే, ఆ హింసకు ప్రతిహింస అనే తలపే పితృస్వామ్యంలో స్త్రీలకు రాదు. ఆ కాలంలో అసలే లేదు. మన తండ్రులపై, భర్తలపై, అన్నదమ్ములపై, కొడుకులపై యుద్ధం చేయటం ఎంత కష్టం! ఎందుకు చెయ్యాలి? చేసి ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకటానికే స్త్రీల శక్తంతా సరిపోతుంది.
అందుకే రాజ్యంపై యుద్ధం చేసినంత తేలిక కాదు. నిగూఢమైన సాంఘిక, సాంస్కృతిక సంబంధాల అల్లిక అయిన పితృస్వామ్యంపై యుద్ధం. అలాంటి పితృస్వామ్యంపై రాజ్యంపై నిరసనతో ప్రతిఘటనతో మొదలైంది తెలుగు ఆధునిక కవిత. స్పష్టమైన రాజకీయ కవితలు. శంభుమిత్ర ముఖర్జీ గారూ – మీకు తెలుసో లేదో గురజాడ గారు రాజకీయ పద్య కావ్యాలు నాలుగు రాశారు. రెండు ఇవి అయితే దేశభక్తి గేయం, లవణ రాజు కల మిగిలిన రెండూ – వాటి గురించి మరోసారి.
ఇప్పుడు వర్తమానంలో ‘కన్యక’ ‘పూర్నమ్మ’ కావ్యాల రెలవెన్సు చూద్దాం. ‘పూర్నమ్మ’ కథలో బాల్యవివాహం, పిల్లలను అమ్ముకునే ఆచారం, చిన్న పిల్లలకు ముసలివాళ్ళతో వివాహం అనే మూడు తాళ్ళతో ‘పూర్నమ్మ’ లైంగికత్వాన్ని పితృస్వామ్యం కట్టివేసింది. ఈ కవిత రాసిన వందేళ్ళ తర్వాత, దేశంలో అనేక సామాజిక, రాజకీయ మార్పులు వచ్చాక, స్త్రీలకు అనుకూలమని చెప్పబడే కొన్ని చట్టాలు వచ్చాక, రాజ్యాంగంలో లింగ వివక్ష చూపరాదని రాసుకున్నాక వర్తమాన కాలంలో బాలికల పరిస్థితి పరిశీలిద్దాం. రాజకీయ పోరాటాల చైతన్యంతో రాటుదేలిన ప్రాంతమని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌లో బాల్యవివాహాల సంఖ్య ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెరిగింది. మన రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 56 శాతం వివాహాలు 18 ఏళ్ళ లోపు బాలికలకు జరుగుతున్నాయి. బాల్య వివాహాలు అధికంగా జరిగే రాష్ట్రాలకు పోటీపెడితే అందులో మన రాష్ట్రం 4 వ స్థానానికి ఎగబాకి గర్వంగా నిలబడింది. 19వ శతాబ్దపు వలస పాలన కాలపు బాల్య వివాహ కారణాలకు ఇప్పుడు ప్రపంచీకరణ ముసుగులో సాగుతున్న వలస పాలన కారణాలు తోడయ్యాయి. పేదరికం, జీవనం కోసం కొత్త ప్రాంతాలకు వలస పోవాల్సిన దుస్థితి, అక్కడి అభద్రతా వాతావరణం, ఆడపిల్లలకు ఇంటితో సహా ఎక్కడా రక్షణలేని స్థితి, బాలికలు చదువుకునేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవటం, మారని ఆచార వ్యవహారాలు ఇలా లక్షా తొంభై కారణాల వల్ల బాలికలకు 18 ఏళ్ళ లోపు పెళ్ళి, గర్భధారణ, ప్రసవం, ప్రసవ సమయంలో మరణం, చిన్న వయసులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, గర్భసంచీ తొలగించే ఆపరేషన్లు – మొత్తం మీద స్త్రీగా ఆనందించవలసిన ప్రతి అనుభవమూ బాధాకరమూ, హింసాపూరితమూ అయిపోతుంది. పాతికేళ్ళకు మొదలవ్వాల్సిన జీవితం అప్పటికి ముగిసిపోతోంది. గురజాడ మొదలుపెట్టిన సాహిత్య పోరాటం ఎంత రాజకీయమైందంటే బాల్య వివాహాలు ఆపగలిగితే, బాల్య వివాహాలు జరగకపోతే దేశం అభివృద్ధి చెందినట్లే అనేంతగా ! పెళ్ళిలో ఆడపిల్లల లైంగికత్వాన్ని, శ్రమను అమ్మటం, కొనటం హోల్‌సేల్‌గా (సామూహిక వివాహాలు – ప్రభుత్వం పనిగట్టుకు చేయిస్తోంది) రిటేయిల్‌గా జోరైన వ్యాపారంగా సాగుతోంది.
ఇక ‘కన్యక’ లో గురజాడ రాసిన రాజ్య అత్యాచారాన్ని గురించి రాస్తే, వందేళ్ళ తర్వాత రాజే కాదు వీధిలో కొచ్చిన స్త్రీ మీద అత్యాచారం చేసే అధికారం తమకుందనే పురుషుల సంఖ్య పెరిగిపోతోంది. ‘కన్యక’ లో గురజాడ వర్ణించిన ఒక వర్ణన చూస్తే మొన్న అస్సాంలో నడిరోడ్డు మీద ఒక యువతిని చుట్టుముట్టిన పురుష కిరాతక బృందం గుర్తొస్తుంది, ఆ రాజు కన్యకను చూసి
”నాల నడుమను నట్టి వీధిని
దుష్ట మంత్రులు తాను పెండెం
గట్టి కన్నెను చుట్టి నరపతి
పట్ట నుంకించెన్” అస్సాంలో, దేశం అనేక చోట్ల ఈ సన్నివేశం ప్రతి పది నిమిషాలకూ జరుగుతోంది.
ఇంకోచోట
”డేగ పిట్టను పట్టి విడచున
కన్నె ఇంటికి మరలి నడచున”
అనే పాదాలు ఇవాళ స్త్రీలకు భద్రత లేని పితృస్వామ్య రాజ్య వాతావరణాన్ని తలపిస్తాయి. రాజ్యం ఇవాళ ప్రత్యక్షంగా, పరోక్షంగా స్త్రీల మీద అత్యాచారాలు జరిగేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తూ పోతున్నది. ఇంటా బైటా అంతులేకుండా పెరుగుతున్న లైంగిక హింస రాజ్యం బలమైన మద్ధతు లేకుండా సాధ్యం కాదు. స్త్రీలంటే లెక్కలేనితనాన్ని, అగౌరవాన్ని పెంచి పోషిస్తోంది రాజ్యం. స్త్రీల లైంగికత్వం మీద అంతులేని అధికారం ఉందనుకునే పితృస్వామ్యపు పునాదిపై లేచిన రాజ్యంలో ఈ హింస కొత్త కొత్త రూపాలను ధరిస్తోంది.
దీనికి పరిష్కారం ఏమిటనే ప్రశ్న ఇవాళ స్త్రీలందరినీ వేధిస్తోంది. ‘పూర్మమ్మ’ లు ‘కన్యక’ లు మళ్ళీ మళ్ళీ ప్రాణాలు అర్పించాల్సిందేనా? లేదంటే ఏం చెయ్యాలి. స్త్రీలు తమ లైంగికత్వంపై తాము అధికారం పొందగలగాలి. స్త్రీల లైంగికత్వం చుట్టూ అల్లుకున్న అక్రమ, సక్రమ, శీల, అశ్లీల భావజాలపు మాయపొరలన్నీ ఛేదించబడాలి. స్త్రీలు చరిత్ర పరిణామ క్రమంలో తాము కోల్పోయిన తల్లి హక్కును తిరిగి పొందగలగాలి. చరిత్రను గురజాడ చెప్పినట్లు పునర్లిఖించాలి. అధికారం అంటే పీడన, దోపిడి, అణచివేత అనే అర్థాలను మార్చి శాంతి, సహకారం, పరస్పర ప్రేమ, అంగీకారంతో కూడిన లైంగిక సంబంధాలు అనే అర్థాన్ని స్త్రీలు పూనుకొని కల్పించాలి. బాలికలకు, పిల్లలకు, స్త్రీలకూ, ఏ హక్కులూ, అధికారాలు లేని, ఏ భద్రతా కల్పించలేని కుటుంబ వ్యవస్థ సమూలంగా మారాలి. ఇంత జరగాలంటే స్త్రీలు పితృస్వామ్యపు అణచివేతను గుర్తించి దానిపై యుద్ధానికి సిద్ధమవాలి. ఆ యుద్ధం ద్వారా తమ మీద తాము అధికారాన్ని పొందగలగాలి. గురజాడ వందేళ్ళ క్రితం రాసిన ‘కన్యక’ ‘పూర్నమ్మ’ కథా కావ్యాల సాహిత్య రాజకీయ ప్రయోజనం ఇదే!
ఈ వ్యాసంలో ‘కన్యక’ ‘పూర్నమ్మ’ కావ్యాలలోని శిల్పరీతులను, లోతులను చూపే ప్రయత్నం చేయలేదు. అది మరోసారి!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags