స్త్రీలపై హింసను వ్యతిరేకిద్దాం

బోర సుభాశన్న యాదవ్‌
రాష్ట్రంలో కొద్దిరోజుల వ్యవధిలోనే మహిళలు, విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం దిగ్భ్రాంతికరం. జాతీయస్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన అమరావతి అనుమానాస్పదంగా మరణించింది. ఆ మరుసటిరోజే విల్లామేరీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అనూష ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే ఎల్‌బీ కాలేజ్‌లో బికాం మొదటి సంవత్సరం చదువుతున్న స్వర్ణలత ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రజాప్రతినిధుల వత్తిళ్లు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన వ్యవసాయాధికారిణి రాజేశ్వరి ఉదంతాన్ని పూర్తిగా మరువకమునుపే ఇవన్నీ జరగడం విషాదం. పైకి చూడ్డానికి ఈ సంఘటనలన్నీ వేటికవేగా వున్నా అన్నిట్లోనూ ఒత్తిళ్లు, వేధింపులు, అభద్రత ప్రధానాంశాలుగా వున్నాయి. మహిళా బాక్సర్‌ అమరావతి ఆకస్మిక మృతితో క్రీడాకారిణులపై వేధింపులు, అఘాయిత్యాల ఆరోపణలు తాజాగా చర్చనీయాంశమయ్యాయి. తోటివారిముందు కోచ్‌ వేధింపుల కారణంగానే మనస్తాపానికి గురై అమరావతి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యుల ఆరోపణ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆమె చదువులో రాణించకపోయినా బాక్సింగ్‌లో మాత్రం అసాధారణ ప్రతిభను కనబరిచింది. రాష్ట్రానికి పతకాలు సాధించిపెట్టింది. బాల్యంలో పేదరికాన్ని, బాక్సింగ్‌ ఎరీనాలో ప్రత్యర్థిని తన ముష్టిఘాతాలతో సునాయసంగా ఒడించింది. కానీ కోచ్‌ వేధింపులను మాత్రం భరించలేకపోయింది. తిప్పికొట్టలేకపోయింది. తనే అందనంత దూరం వెళ్లిపోయింది.
అమరావతి ఆత్మహత్య నేపథ్యంలో క్రీడారంగంలో వినిపిస్తున్న ఆరోపణలను పరిశీలించాల్సివుంది. ఇటీవలే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చాముండేశ్వరినాథ్‌ తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా క్రికెటర్లు ఆరోపించారు. అతగాడి వికృత చేష్టలు భరించలేక ఒక్కో సందర్భంలో ఆత్మహత్య ఆలోచన సైతం వచ్చిందన్నారు. తాజాగా ఆంధ్రా చెస్‌ ఆణిముత్యం కోనేరు హంపి కూడా చెస్‌ సమాఖ్య కార్యదర్శి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడంటూ మీడియా ముందు వాపోయింది. కీలకమైన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం వల్ల తన ర్యాంకింగ్స్‌ గణనీయంగా తగ్గాయని గోడు వెళ్లబోసుకుంది. కోచి బూచిగా మారితే పర్యవసానాలు ఇంతకంటే భిన్నంగా ఏముంటాయి? శిక్షణ దగ్గరనుంచి ఆటల్లో పాల్గొనే వరకు పక్షపాత ధోరణితో వ్యవహరించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం, అందుకు అంగీకరించనివారిని ప్రతిభావంతులైనా టీమ్‌లోకి తీసుకోకవడం, మానసిక క్షోభకు గురిచేయడం, పెదవివిప్పి చెప్పుకోలేని విధంగా బాధపెట్టడం వంటివెన్నో జరుగుతున్నాయి. ఈ కారణంగానే ఎందరో ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారులు ఫీల్డులో లేకుండా పోతున్నారు. రాత్రింబగళ్లు చదివి అత్యుత్తమ ర్యాంకులు, మార్కులు సాధిస్తున్న అమ్మాయిలు కూడా ఒత్తిళ్లకు తట్టుకోలేక బలవంతంగా తనువు చాలిస్తున్నారు. కానీ చావొక్కటే పరిష్కారమా? సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడకుండా పిరికిపందల్లా ప్రాణాలొదడమే మార్గమా? ఇలాంటి విషాదాలు… వికృతాలు ఇంకెంతకాలం చూడాలి? ఎందరు అమాయకపు ఆడపిల్లల్ని పోగొట్టుకోవాలి? వేధించి, వంచించి, పీడించి అన్నెంపున్నెం ఎరుగని అమ్మాయిల ఆత్మహత్యలకు కారణమైనవారిని పట్టి శిక్షించేదెన్నడు? మనసు మెలిపెడుతున్న ఈ ఆత్మహత్యలను చూసినప్పటికీ అధినేతలకు చీమకుట్టినట్టైనా లేదెందుకు? వంటి ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పవలసివుంది. పరిష్కారాలను చూపించవలసివుంది.
మృగాలు, ప్రేమ పేర ఉన్మాదులు, అహంభావుల దాడుల్లో మహిళలే బలవుతున్నారు. ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా ఆడపిల్లలకు ఆత్మరక్షణకోసం కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించాల్సిన ఆవశ్యకతను బల్లగుద్దిమరీ చెప్తుంటాం. కానీ గోదాలో ప్రత్యర్థులను తన ముష్టిఘాతాలతో మట్టికరిపించే సత్తావున్న జాతీయస్థాయి మహిళా బాక్సర్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడిందంటే ఏమనుకోవాలి? ఆత్మరక్షణ విద్యలతోపాటుగా వారికి నూరిపోయాల్సిన అంశాలు చాలానే వున్నాయని తెలుస్తోంది. సమస్య వచ్చినప్పుడు కుమిలిపోకుండా, వణికిపోకుండా తోటివారితో పంచుకునే అలవాటు నేర్పించాలి. భద్రతాయుతమైన సమాజ స్థాపనకోసం కృషి చేయాలి. కుటుంబం మొదలుకొని విద్యాసంస్థల్లోనూ పనిప్రాంతాల్లోనూ మా సమస్య ఇదీ అని చెప్పుకునేందుకు మహిళలకు అవకాశం, వాతావరణం వుండాలి. వారి సమస్యలను వినేందుకు చదువుకునే చోట మానసిక నిపుణులుండాలి. కనీసం నెలకోసారైనా వీరు కౌన్సిలింగ్‌ తరగతులు నిర్వహిస్తుండాలి. సమస్య  సృష్టించేవారి గురించి అమ్మానాన్నలకు, అధ్యాపకులకు, ప్రిన్సిపాళ్లకు, పై అధికారులకు నిర్భీతితో చెప్పగలగాలి. అక్కడ కూడా పరిష్కారం లభించకపోతే మరొక మార్గం వెతకాలి. పోలీసులు, ప్రభుత్వం, మీడియా వుండనే వుంది. అంతేకానీ సమస్యకు మరణమొక్కటే పరిష్కారమనుకోవడం పిచ్చితనమౌతుంది. ప్రధాన బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించి ప్రకటనలిచ్చి మిన్నకుండిపోక శాశ్వత పరిష్కారాలకోసం కృషి చేయాలి. కళాశాలల్లో, హాస్టళ్లల్లో గ్రీవెన్స్‌ సెల్‌, హెల్ప్‌ లైన్‌ వంటివి ఏర్పాటు చేసి ఓదార్పునివ్వగలగాలి.  విద్యార్థినుల పట్ల అసహ్యంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకుగాను బాధితులంతా కలిసి లూధరన్‌ జూనియర్‌ కళాశాల కరెస్పాండెంట్‌కి బుద్ధి చెప్పిన సంఘటన నుంచి బాధితులు స్ఫూర్తిపొందాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.