రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

మల్లీశ్వరి
‘లేచిపోయినా’ నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో ఉంటుంది అని కదా అన్నావు రాజేశ్వరీ! ఎపుడో 1927లో నువ్వట్లా నీతివర్తనుల్లోంచీ, మర్యాదస్థుల లోంచే బైట పడి, దినం తర్వాత దినం నువ్వు పొందాలనుకున్న వివిధ వర్ణరాగ సుందరానుభవాల కోసం అమీర్‌తో కలిసి మైదానంలో పరుగులు తీస్తుంటే నిన్ను చూడవచ్చిన మీ మావయ్య ”పశువులు-కుక్కలన్నా నయం. నీతీ జాతీ విచక్షణలు లేక కళ్ళు కమ్మి, వొళ్ళు కొవ్వి, ఇట్లా బట్టలు విప్పుకుని యీ అడవుల్లో పరిగెత్తుతో, సిగ్గు విడిచి…” అని కదూ అన్నాడు!
ఎనభై అయిదేళ్ళు గడిచాయి. లోకం చాలా మారిపోయింది రాజేశ్వరీ! కానీ రాజేశ్వరుల గురించి లోకం అంచనాలు ఏ మాత్రం మారలేదని ఇపుడు ‘దమయంతి కూతురు’ చెపుతోంది.
పి. సత్యవతి సొగసైన, గడుసరి కథకురాలు కదా! రాజేశ్వరికి పిల్లలు లేరు కదాని అంతో యింతో సరిపెట్టుకున్న విశాల హృదయాలని సవాల్‌ చేస్తూ దమయంతికి ఒక కూతురినీ, ఆ కూతురికి తల్లిలేని శూన్యాన్నీ, ఆ పిల్ల ఎదుగుతూ అనుభవించిన వేదనని కూడా కథలోకి తెచ్చారు. ఇపుడిక ముత్యాల్లాంటి పిల్లల్నీ, మంచి భర్తనీ, లక్షణమయిన, భద్రమయిన సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయిన దమయంతి గురించి బుగ్గలు నొక్కుకోవడమే లోకం పని.
ఆ పనిని మౌత్‌వాష్‌తో, బ్రూట్‌ పరిమళాల సంతోష్‌ ఫ్రమ్‌ సామర్లకోట కూడా చేశాడు. ఎంక్వయిరీ అవీ అయ్యాక పెళ్ళి చేసుకోడానికి దమయంతి కూతురు వచ్చింది గానీ దమయంతి చచ్చిపోయిందా? లేచిపోయిందా? అనేదే తల్లి వంకన సమస్య అతనికి.
”నీ మొహాన పెళ్ళి బొట్టుతో పాటు ఒక తల్లి మచ్చ కూడా పెట్టేసి ఆ మచ్చని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడు. నువ్వు నీ జీవితాంతం అతనికి కృతజ్ఞతా బద్ధురాలవై ఉంటావు. ఎపుడయినా నీ చదువూ, నీ తెలివీ, నీ ఉద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరి పడితే ఆ తల్లి మచ్చ ఒక పేపర్‌ వెయిట్‌లా పనిచేస్తుంది” అంటూ సంతోష్‌ ఫ్రమ్‌ సామర్లకోటని ఎందుకు తిరస్కరించాలో దమయంతి కొడుకు చెల్లికి చెపుతాడు.
కథలో ఎక్కడా దమయంతి కూతురు తప్ప దమయంతి రాలేదు. కానీ దమయంతి లేకుండా కథే లేదు. ఈ టెక్నిక్‌ ద్వారా కథని నడపడంలో రచయిత్రి స్త్రీల నిర్ణయాధికారం, మాతృత్వం భావన అనే రెండు ప్రధానమయిన అంశాలను సమాంతరంగా చర్చకి పెట్టగలిగారు. స్త్రీలు అన్ని సంకెళ్ళను తెంచుకుని నచ్చిన వ్యక్తి కోసం వెళ్ళిపోవడమనేది సాహిత్యానికి కొత్త వస్తువు కాకపోవచ్చు. కానీ ఆ వెళ్ళిపోవడమనేది అనేక సందర్భాల్లో స్త్రీల లైంగికతతో ముడిపెట్టి చూడబడుతుంది. తద్వారా స్త్రీల లైంగికత స్వేచ్ఛపై నలిగిపోయిన వారిలో వాదోపవాదాలు మొదలవుతాయి. అలాంటి పాత చూపుని బ్రేక్‌ చేసింది ఈ కథ.
దమయంతి కూతురు పెద్దయ్యాక ‘అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందని వాళ్ళ నాన్నని అడిగినపుడు ”నేను భూలోకపు మనిషినమ్మా, ఆమె ఊర్ధ్వలోకపు మనిషి. అందుకే ఈ లోకంలో ఉండలేక వెళ్ళిపోయింది” అని చెపుతాడు. దమయంతి వెళ్ళిపోయిన చాలా ఏళ్ళ తర్వాత ఆమె భర్త నుంచి ఈ సహనంతో కూడిన సమాధానం రాబట్టడంలోనే రచయిత కథా వస్తువు పట్ల చూపిన పరిణితి కనిపిస్తుంది.
స్త్రీలు నచ్చిన వ్యక్తి కోసం వెళ్ళిపోయినపుడు అనివార్యంగా పురుషుడు చెడ్డవాడు కాక తప్పని దుస్థితి నుంచి స్త్రీవాద కథని ఈ కథ ద్వారా రక్షించగలిగారు పి. సత్యవతి.
సమాజంలో భూలోకపు మనుషులతో పాటు అరుదుగానయినా ఊర్థ్వలోకపు మనుషులుంటారనీ ‘ఆయియే ఆప్‌కో సితారోఁ మే లే చెలూ!’ అంటూ తెగింపునీ సాహసాన్నీ కావలించుకుని నక్షత్ర వీధిలోకి ఒకరినొకరు నడిపించుకు వెళతారనీ, తప్పొప్పుల తూకాలు అక్కడ చెల్లవనీ, అర్థం చేసుకోవడమూ, అవగాహనలోకి తెచ్చుకోవడమనే కొత్త దృష్టే పరిష్కారంగా ప్రతిపాదించారు రచయిత.
ఈ కథని తళుక్కుమనిపించిన మరో అంశం మాతృత్వం బాధ్యతల మీద ఉండే అదనపు బరువుని తొలగించే ప్రయత్నం… ఒకవైపు పితృస్వామిక వ్యవస్థ కల్పించిన మాతృత్వపు మిత్‌ని బద్దలు కొడుతూనే మరోవైపు మాతృత్వానికి దానంతట దానికి సహజంగా ఉండే విలువనూ గుర్తించారు రచయిత. అందుకే దమయంతి కూతురు, తల్లిలేని పిల్లగా ఉండటంలోని వెల్తిని స్వంత కూతురిలాగా పెంచిన అత్తయ్య ద్వారా కానీ, రెండో తల్లి ద్వారా కానీ పూరించు కోలేకపోయింది.
పిల్లల్ని పెంచడం అనేది తల్లిదండ్రులిద్దరి సమాన బాధ్యతగా గుర్తిస్తూనే, నచ్చినట్లుగా జీవితాన్ని మలుచుకునే హక్కు స్త్రీలకి ఉంటుందని అలవి మాలిన త్యాగాలు స్త్రీలకి అంటగట్టుకూడదన్న సూచనా కథలో ధ్వనించింది.
కథని ముగిస్తూ- ”మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?” అంటుంది దమయంతి కూతురు.
”బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?” అంటాడు దమయంతి కొడుకు.
కూతురు దగ్గర జవాబు లేదు.
దమయంతి దగ్గర జవాబు ఉంటుందనుకోలేదు.
మరి మన దగ్గరేం జవాబు ఉందో?!
(పి. సత్యవతి యిటీవల రాసిన ‘దమయంతి కూతురు’ కథ చదివి…)

Share
This entry was posted in లోగిలి. Bookmark the permalink.

One Response to రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

  1. Pingback: రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ… | జాజిమల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.