మల్లవరపు విజయ
కాలం నవ్వుతున్నది…..
నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుతున్నది
పసుపు కుంకుమ…… పూలు గాజులు
నిత్యవసంతంలా ఉన్న నీ జీవితాన్ని చూసి
కాలం నవ్వుతున్నది….
ఎంతకాలం నీకీ వైభోగమంటూ….
అతనిలో నీవై…. నీలో అతనై….
పాలు, తేనెలా కలిసిపోయి
అతని మమతల కౌగిలిలో ఒదిగిపోవాలని…..
తన కనురెప్పల నీడలలో నిలిచిపోవాలని….
కలలు కంటున్న నిన్ను జూచి
రెప్పపాటిదే నీ జీవితమంటూ…
కాలం నన్ను జూచి నవ్వుతున్నది…..
కాని…. కాలానుగతాన…..
అస్తమించే సూర్యునిలా…..
నీ నుదుటి కుంకుమ చెరిగిపోయి
నీలో అర్థభాగమనుకున్న….
నీ ఆశాదీపం ఆరిపోయి
నీవు కన్న కలలన్నీ కాలి బూడిదయినందుకు
కాలం నవ్వలేక నవ్వుతున్నది
మరణించే హక్కులేని ఈ జీవనయానంలో
నీ బ్రతుకే భారంగా సాగుతున్న
జాలిలేని ఈ లోకంలో…
ఈసడింపులతో గుండెను తూట్లు పొడుస్తున్న
ఈ సమాజాన్ని చూసి….
కాలం బాధగా నవ్వుతున్నది….
కాటికి కాళ్ళు చాచిన
మూడుకాళ్ళ ముదుసలికి సహిత
వైధవ్యమొందిన ఆడదంటే అలుసై
భార్యపాత్ర నటించమంటాడు
నిర్ఘాంతపోయి నీ స్థితిని మరిచి
పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తూ…..
మృగంలా కోరలు చాస్తుంటే…..
నిన్ను నీవు కాపాడుకోలేని బేల తనాన్ని చూసి
ఈ కాలం జాలిగా నవ్వుతున్నది…..
స్త్రీకి కలలుండకూడదా? కన్నీరు తప్ప…..
హృదయం ఉండకూడదా? గాయాలు తప్ప….
ఆశల పల్లకీ తిరుగబడిన వేళ….
బ్రతుకున చీకటి ముసిరిన వేళ….
గుండె గూటిలో ధైర్య దీప్తిని వెలిగించుకుంటూ…
మనోస్థైర్యాన్ని హృదయానికి
పులుముకుంటూన్న నిన్ను చూసి
కాలం నవ్వుతున్నది చిలిపిగా
యుద్ధనేల
ఉదయమిత్ర
అక్కడ
పాదం మోపితే చాలు…
భూప్రకంపనలు నీ గుండెనుతాకి
విద్యుత్తును ప్రవహింపజేస్తాయి-
నిరంతర నిరసనల పదఘట్టనలకింద
పైకి లేచిన ధూళి మాలయై
నిన్ను నిలువునా అలంకరిస్తుంది-
నిరక్షరాస్యులైన స్త్రీలు
వరకట్న దురాచారానికీ
కుటుంబహింసకీ బలైన స్త్రీలు
ఒక్క పిడికిలిగ లేచి
తమ యుద్ధనేలకు
మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తారు-
కాంగ్లా కోట ముందు
నగ్న దేహాల్నిపర్చి
‘సైనికులారా! రేప్ చేయండి
మా రక్త మాంసాల రుచిచూడండి”
అని సవాల్ విసిరి
ప్రపంచపు గుండెల్లో
ప్రకంపనలు పుట్టించిన స్త్రీలు
ముందువరుసలో నిలబడి
కరచాలనం చేస్తారు..
దుర్భర సైనిక చట్టాలకు వ్యతిరేకంగా
పదేళ్ల నిరవధిక నిరాహార దీక్షలో
చిక్కి శల్యమైన షర్మీలా
ఒక చదువవల్సిన కావ్యమై
నిన్ను ఉత్తేజితం చేస్తుంది..
”తల్లుల సంఘం”
నిన్ను గడప గడపకూ తిప్పి
సైనికుల బాయొనెట్లకు చిక్కిన
జీవన అవశేషాల్నిపట్టి చూయిస్తుంది
లక్షలాది గొంతులు పిక్కటిల్లిన వేళ
ఢిల్లీ గొంతులో దాగిన
కాలకూట విషాన్ని ఎత్తిచూపిస్తారు-
అనాధలు, అశాంతులు, అభాగ్యులు
ఆకాశంలో సగమైన వాళ్లు
హక్కులకోసం భగ్గునమండుతూ ఉంటే
అన్ని మలినాలూ కరిగి
చెమ్మగిల్లిన నయనాలతో
నువ్వాయుద్ధనేలను ముద్దాడుతావు..
చెదరని విశ్వాసాల్ని మూటగట్టుకొని వెనుదిరుగుతావు.
(షర్మిలాకు అంకితం)
పజ్రలు గెలుస్తారు
కోటం చంద్రశేఖర్
ప్రజలు గెలుస్తారు
ప్రజలు గెలుస్తారు
పాలకులు కాదు; చిరస్థాయిగా
ప్రజలే నిలుస్తారు-
ప్రజల ప్రతినిధి
ప్రజల పెన్నిధి అంగ్‌సాన్-
మిలటరీ పాలకులకి
జవాబుగా, సవాలుగా
నిలిచి, పోరాడి-
బలిదానాల చరిత్రలో
బందిఖానా కాలేదు
తండ్రికి తగ్గ తనయ
కదిలే స్వాతంత్య్రోదయ-
అణచివేతలోంచి; మయన్మార్
గుండె కోతల్లోంచి
ఎగిసి, ఎదిగి
అకృతాల్ని ఖండిస్తూ అన్యాయాల్ని నిరసిస్తూ
పాలనకు అర్థం పీడనకాదని గొంతెత్తుతూ-
భిన్న రాజకీయ వర్గాల్లో ఏకీభావం అంగ్‌సాన్-
ప్రజాతంత్ర పాలనకై
సాగే ప్రస్థానం అంగ్‌సాన్
అణువణువు దోపిడిలో పదునెక్కిన ఖడ్గశైలి అంగ్‌సాన్-
అనుక్షణపు రాపిడిలో ఎరుపెక్కిన శౌర్యశాలి అంగ్‌సాన్-
అహేతుక విధానాల పోరాటగాత్రం అంగ్‌సాన్-
సంక్షోభ సంద్రపు ఆటుపోట్లలో సుస్థిర ప్రగతి కృషిలో
నోబెల్ శాంతి చిత్రం అంగ్‌సాన్-
వోణీలు
లకుమ
మీసాలెందరు-
మెలేస్తేనేం?
తెలుగున ‘రామాయణం’-
మొల్లదే!
ఒక బహుముఖ ప్రజ్ఞాశాలినితో
కరచాలనం!
‘నాలో
నేను!
నేటికీ-
ఓ చారిత్ర కావసరం?
‘పరాయి పాలనను ఎదిరించిన
ఝాన్సీ!
భార్యాభర్తలు
స్నేహితుల్లానూ వుండొచ్చు!
ఒకే ఒక-
‘స్వీట్‌హోమ్’ లో!
ఇద్దరు యువతులు!
వేర్వేరు మార్గాలు!!
సహితస్య హితం-
‘మరీచిక’.
లేచిపోయినా నంటే-
నాకెంతో కష్టంగా వుంటుంది!
ప్రారంభమే అంత-
‘మైదానం’.
‘నివురు’ కప్పిన
నిప్పులా…?
నాలుగు దశాబ్దాల
నిర్మల కవిత!
‘అమ్మ’ దేశదిమ్మరిగా
ఊరూరా…?
ఎర్ర సాహిత్యాన్ని
భుజాలకెత్తుకుని!
స్త్రీని చవక చేయడం లేదు!
బూతు లేదు!!
ఇతి-
‘యాజ్ఞసేని’.
ఎన్నో చీకటి కోణాల్ని
ఆవిష్కరిస్తూ?
‘ఒక సెక్స్‌వర్కర్ ఆత్మకథ!
‘మాకథ’
అంటుంది గానీ-
దొమి’ తిలా-
పాపం తలా పిడికెడు!
ఇది ‘ఒక తల్లి’ కథ-
కాదు కాదు కాదు?
భరతమాత
గర్భశోకమే!
బ్రోచే-
వారెవరురా?
ఒక్క ‘బెంగుళూరు
నాగరత్నమ్మ’ కే చెల్లు!
స్త్రీ అస్తిత్వవాదానికి-
ప్రతీక?
‘సత్య’ ప్రమాణకంగా
ఈ ‘భూమిక!’
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags