మీ హ్యాండ్‌ బ్యాంగ్‌లో ఏం వుంది..?

కొండేపూడి నిర్మల
”నీ సెకండ్‌ స్కిన్‌ ఇదిగో…?”
కుర్చీలో వున్న నా హ్యాండ్‌ బ్యాగ్‌ తీసి అందిస్తూ అన్నాడు మా కజిన్‌.
అంటే నేనేమైనా సర్పాన్నా, చర్మాలూ కుబుసాలు విడవడానికి, అని నవ్వి, అయినా ఆ పేరు మీద పేటెంట్‌ హక్కులు నీకు లేవులే. ఎందుకంటే ఇప్పటికే ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ వుంది అన్నాను. అందరూ నవ్వారు.
”అసలు ఏదో ఒక కాంప్లెక్స్‌ వుండటం వల్లనే అదే పనిగా షాపింగులు చేస్తారు.” ఇంకెవరో బాణం వేశారు. అప్పుడే బజారు నుంచి వచ్చిన వదినలిద్దరూ ఎర్రగా చూశారు. అందరూ కలిస్తే అంతే వాక్బాణాల వర్షం వద్దన్నా కురుస్తూనే వుంటుంది.
పిన్నీ వాళ్ళింట్లో జరుగుతున్న ఒక ఫంక్షన్‌ కోసం నేనూ వచ్చాను. రాత్రి భోజనాలయిపోయాయి కనక హాల్లో వాల్చిన పరుపులమీద నడుంవాల్చి అందరి కబుర్లూ వింటున్నాను. ఫోన్‌ మోగిన చప్పుడు ఎక్కడిదా అని ఆలోచించేలోపల టేబుల్‌ మీదున్న నా బ్యాగ్‌ తీసి అందిస్తూ ఈ చలోక్తి విసిరాడు నా కజిన్‌ మోహన్‌. వెంటనే ఇద్దరు ముగ్గురు కిసుక్కున నవ్వారు కూడా.
”అవునూ ఎందుకే అంతబరువుంటుంది నీ బ్యాగ్‌,” మా మేనత్త అడిగింది. అప్పటికే ఆవిడ ఒక రెండుసార్లు కుర్చీలోంచి అలమరలోకో, అక్కడినుంచీ నా దగ్గరికో దాన్ని మోసి మోసి వుందనుకుంటాను.
”ఆలోచనలమ్మా ఆలోచనలు… రచయిత్రా మజాకా…?” మా తమ్ముడు తన ధోరణిలో వెక్కిరించాడు. ”అమ్మో, రాయకముందే అంత బరువుగా వుంటే మరి రాశాక చదివేవాళ్ళెలా మోస్తారే…” మా చిన్న మేనత్త ఆశ్చర్యం.
లాభంలేదు వీళ్ల తిక్క కుదర్చడానికయినా నేన ఈ బ్యాగ్‌ దులిపి చూపించాలి అనుకున్నాను. వెంటనే బ్యాగ్‌కున్న మూడు జిప్పులూ తీసి అందరి మధ్యా బోర్లించాను. మొదట ఇంటి తాళం చెవి పడింది. ఆ తర్వాత జలుబు ముక్కు తుడవటానికి పెట్టుకున్న రుమాలు, ఐ డ్రాప్స్‌, ఇన్‌ హేలర్‌, టైలర్‌ బిల్లు, సెల్‌ ఫోను చిప్పు, రెఫరెన్సు కోసం దాచుకున్న ఒక వ్యాసం మ్కు, కొన్ని పదుల విజిటింగ్‌ కార్డులు, కిందటిసారి వచ్చినప్పుడు పుట్టింటి పెరటి నుంచి పెల్లగించి తీసి మర్చిపోయిన మామిడి అల్లం ముక్క, లైబ్రరీలో ఇవ్వడం మర్చిపోయిన రెండు బరువయిన పుస్తకాలు, వచ్చే వారం వెళ్ళాల్సిన గరీభ్‌రథ్‌ రైల్వే రిజర్వేషను టిక్కెట్టు, విరసం వారి కరపత్రం, హ్యాండిల్‌ విరిగిపోయిన చిన్న అద్దం ముక్కా, కొన్ని పాస్‌పోర్టు ఫోటోలు, దూరాభారానికి రాసిన మూడు కొరియర్‌ కవర్లు, అడ్రస్‌ ప్రూఫ్‌ కాగితాలు, పాస్‌బుక్‌, సెల్‌ ఫోను, దాని కవరూ విడివిడిగా, అయిదారు క్యాప్‌ లేని పెన్నులు, అవి అన్నీ మొండికేస్తే పనికొస్తుందని దాచుకున్న ఒక పొడుగాటి పెన్సిలు ముక్కా. ఎప్పటిదో కానీ ఒక చిరిగిపోయిన సినిమా టిక్కెట్టు పీలికా, విశాఖ వెళ్ళినప్పుడు మురిపెంతో తెచ్చుకున్న కొన్ని శంఖాలు గవ్వలూ,…. ఇంకా ఇలా ఇల్లంతా పర్చుకున్న నా సెకండ్‌ స్కిన్‌ బరువుని మా వాళ్లంతా మూర్చపోయినట్టు చూశారు. అందులో ఏది ముఖ్యం? ఏది కాదు అంటే నేనసలు చెప్పలేను. అదేదో రుణానుబంధం మాదిరి ఈ బరువుని నేను మోస్తూనే వుంటాను. ఆ తర్వాత నన్ను మానేసీ మా అక్కకూతురు శ్రీలతని ర్యాగింగ్‌ చెయ్యడం మొదలుపెట్టారు. తను కాల్‌ సెంటర్లో పనిచేస్తోంది. కాబట్టీ మ్యాకప్‌ సామగ్రి వుండచ్చు. సానిటరీ ప్యాడ్స్‌ వుడచ్చు. ఇంకేవో వుండచ్చు. ఎంత అడిగినా బ్యాగ్‌ తీసి చూపించలేదు. దటీజ్‌ నన్‌ ఆఫ్‌ యువర్‌ బిజినెస్‌ అట. గట్టిగానే చెప్పింది. నా కంటే నయమే. మన షాపింగులమీదా, పక్కింటి వాళ్లతో చెప్పిన కబుర్లమీదా, హ్యాండ్‌ బ్యాగ్‌లమీదా పడి కొన్ని దశాబ్దాల పాఠకులు, వీక్షకులు పగలబడి నవ్వుకున్నారు. (లోపల్లోపల ఏడ్చుకున్నారు.) మగాళ్ల జేబుల మీదా, జిప్పుల మీదా మనమెప్పుడూ అంత అనుచితంగా మాట్లాడుకోలేదు. ఇంతకీ ఎవరి సెకండ్‌ స్కిన్‌ అయినా అది వారి జీవన సరళిని సూచిస్తుంది. వారికి కావలసిన, భరించాల్సిన ప్రపంచాన్ని మూటకడుతుంది. ఒకవేళ నేను మెకానిక్‌ని అయితే ఇందాకా గుమ్మరించిన వస్తువులన్నిటితో బాటు సుత్తీ శానా కూడా వుండేవి. వంటలక్కని అయితే బూందీ, కారప్పూసలు దూసే గరిటెలు వుండేవి. చాలామంది ఆడవాళ్ల భుజాల నొప్పికి ఈ బ్యాగులే ప్రధాన కారణమంటున్నారు డాక్టర్లు. కాని ఇల్లు మారినప్పుడల్లా అత్యంత ముఖ్యమనుకున్న ఇంటిల్లిపాది వస్తువులూ చేరిపోయేది ఇంటావిడ మోసే బ్యాగ్‌లోకే.
చాల్రోజుల క్రితం హిందూలోనో ఎక్కడో ఒక వ్యాసం చదివాను. లేడీస్‌ హ్యాండ్‌ బ్యాగుల్లో ప్రస్తుతం గన్స్‌ చోటు చేసుకుంటున్నాయట. ఇది అభివృద్ధా…? అరాచకమా అనే డిబేట్‌ కూడా జరిగింది. రైతు బజార్‌లో వొంగుని కూరగాయలు కొనుక్కుంటున్న ఆడవాళ్లని సెల్‌ ఫోనులో ఫోటోలు తీసే వాళ్ళున్నప్పుడు, ఆత్మరక్షణ కోసం ఒక రివాల్వర్‌ కావాలనిపించడంలో తప్పు వుందా…? తప్పే కనక వున్నట్టయితే ఇంటికి వచ్చిన సినీ నిర్మాతని పిట్టని కాల్చినట్టు కాల్చేసి, చట్టాన్నించి విడిపించుకుని అపోలో ఆస్పత్రికి చేరి కూచుని, ”తుపాకీని చూస్తే మతి పోతుంది, మతి పోయినప్పుడల్లా నా చేతులు వాటికవే ట్రిగ్గర్‌ మీద చేతులేసి నొక్కేస్తాయి.” అని మీడియాకి బహు చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చిన మన బాలయ్యగారి లైసెన్సు రద్దుచేశారా? మగవాడ్ని తాగించి, ఆడదాన్ని ఆమె పిల్లల్నీ ఏడిపించడం ద్వారానే రెవెన్యూ సంపాయించుకోవాల్సిన దిక్కుమాలిన ప్రభుత్వాలకు ఓటు వేస్తున్న, వెయ్యడమే మానేస్తున్న మనకి ఆయుధం ఆసరా కాదా…? అది అరాచకమెలా అవుతుంది? ఈ మాటే అంటున్నారు జాతీయ తుపాకీ హక్కుల సంస్థ అధ్యక్షురాలు రాహుల్‌ రాయ్‌. ఆమె చెప్పినదాన్ని బట్టి స్త్రీలకే కాదు వృద్ధులకూ ఈ లైసెన్సు వుండాలి. ఎందుకంటే ఒంటరి తల్లిదండ్రుల్ని ఆస్తికోసం నిస్సిగ్గుగా హత్యలు చేస్తున్న సంతానాన్ని వార్తలుగా మాత్రమే చూస్తున్నాం. పరిష్కారాల్లేవు, వృద్ధాశ్రమాలు తప్ప.
”మేం వార్తలు కాదల్చుకోలేదు మాకు పరిష్కారం కావాలి” అని నినదిస్తున్నారు బాంబేలోని సీనియర్‌ సిటిజన్‌ ఫోరమ్‌ సభ్యులు.
ఈ దేశంలో ఒంటరి మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువ అభద్రతల మధ్య బతుకుతున్నారని ఆ వ్యాసం చెబుతోంది. అందులో చెప్పని విషయమేమీటంటే ఒంటరి మహిళలే కాదు. నిండు కుటుంబాల్లో గృహ హింసకు గురవుతున్న మహిళలున్నారు. ఆడవాళ్లని గురించి విమర్శించడానికి వారి వస్త్రధారణా, పబ్బు కల్చరూ జోడిస్తూ వుంటారు కానీ, వాటికున్న సామాజిక, చట్టబద్ధతని ప్రశ్నించడమేలేదు. అసోంలో పదహారేళ్ల పిల్లమీద నిన్న మొన్న జరిగిన దాడి ఆమె స్నేహితురాలి పుట్టినరోజుకి పబ్బుకి వెళ్ళినందుకే జరిగిందా…?  కాలేజీ నుంచి గాని, మందుషాపుకి గాని వెళ్ళి వస్తుంటే జరగదా…? పబ్బులలో స్త్రీలకు ప్రవేశం లేదు అని బోర్డు ఏమీ పెట్టలేదే, పైగా జంటగానే రావాలని సంస్థాపరమయిన నిబంధన కూడా వుంది. జంటగా వచ్చిన యువతీ యువకులు వినాయక వ్రతకల్పం చదువుకోవడానికి వెళ్లరు కదా. అక్కడ అమర్చిన సౌఖ్యాలు అనుభవించడానికే వెళతారు. ఒక రాజ్యాంగానికీ, చట్టానికీ లేని విజ్ఞత యువతులకి మాత్రమే వుండాలని శాసించగలమా…? వారి హ్యాండ్‌ బ్యాగ్స్‌లోనో, రూమ్స్‌లోనో కండోమ్స్‌ వున్నందుకు పట్టుకుని కొడతారా? దుపట్టాలు లాగి మొహాలు చూపిస్తారా…? ఈ దేశాన్ని, సమాజాన్నీ ఏది శాశిస్తోంది. చట్టమేనా…? ఛ. కాదేమో. మాల వేసుకున్నందుకు పాటించినంత క్రమశిక్షణ అయినా పోలీసు వ్యవస్థ పట్ల భయంతో పాటించడం లేదు కదా. ఆయుధాలు అమాయకులమీద నిరంతరమూ చెలరేగుతూనే వున్నాయి. అసోం చూడలేదా…? లక్ష్మీంపేట చూడ లేదా? ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో తెలుసా…? ”సెక్యురిటీ మొత్తం గూండా ఎమ్మెల్యేలకో, నాయకులకో సరిపోతోంది, మా ధన మాన ప్రాణాల్ని రక్షించుకోవడానికి ఆయుధం కావాలి లైసెన్సు ఇప్పించండి” అని ఇవాళ సగటు స్త్రీ అడుగుతోంది. ఆయుధాలు దుర్వినియోగమవుతాయనే భయం ఎంత తొందరగా అందరిలోనూ వ్యక్తమవుతోందో చూశారా…? రాజ్యమే తోలు బొమ్మలా వున్నప్పుడు మన భుజాల మీదున్న తోలు సంచుల్లో అంటే హ్యాండ్‌ బ్యాగుల్లో ఏ ఆసరా దాచుకుని తిరుగుదాం? ఇంకా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీము లేనా. అన్నట్టు ఇప్పుడు ముఖం ఒక్కటే ఫెయిర్గా వుంటే చాలదట. బాహుమూలాల్లోనూ మరి కొన్ని చోట్లా కూడా అదే స్థాయిలో తళతళ లాడాలట. అలా మెరవకపోవడం వల్ల పదికి ఎనిమిది మంది మహిళలు అద్దం ముందుకి చేరగానే ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారట. కాబట్టి మన సౌందర్యాత్మక కర్మాగారాలన్నీ ఎన్నో ప్రయాసలకోర్చి  కొన్ని క్రీములు రూపొందించారు. శోభాడే అనే రచయిత్రి దీని మీద కోపంతో ఒక కాలమ్‌ రాసింది. ఎన్నాళ్ళు పోయినా కొని పోయినా మన ఆయుధం ఇంకా అందమైన చర్మమేనా…? ఆ చర్మానికి పౌరుషం లేదా…? కోపం రాదా…? మన వేళ్ళు ఈ మురికి విలువల మీద ట్రిగ్గర్‌ గురిపెట్టాలనుకుంటే లైసెన్సు ఇవ్వరా…? ఇవ్వనపుడు హింస లేని సమాజం ఆశించడం ఇక దురాశేనా…?

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.