ప్రియంవద (తూర్పుగూడెం)

మా నాన్నగారి పేరు రామకృష్ణారెడ్డి. ఇద్దరు భార్యలుండె ఆయనకి. మొదటి భార్య సంతానం నాగిరెడ్డి అని, ఇప్పుడు చనిపోయిండు. ఇంకొకాయన రాజిరెడ్డి. రెండో భార్య సంతానం నేను, మా తమ్ముడు, చెల్లె. మా ఊళ్ళ నాలుగు తరగతి వరకుండె. మా నాన్నగారు అంతవరకే చదివించిన్రు. నాకు మా అన్నయ్యకు బాగా చదువుకోవాలనే అభిలాష ఉండె. కాని మా ఆర్థిక పరిస్థితులేమొ అంత బాగలేకుండె. అందుకే ఆయననూ చదివించలేదు.
నేను, మా చెల్లెలు, మాతమ్ముడేమొ చిన్నవాడుండె. మమ్మల్ని కూడా చదివించలేదు. దానికారణంగా చదువుకోవాలన్న కోర్కె అప్పటికీ ఇప్పటికీ అదే విధంగా మిగిలిపోయింది. మా కుటుంబాలు వేర్వేరుగనే ఉంటుండె. అంటే చిన్న భార్య, పెద్ద భార్య అట్లా. మా అన్నయ్యంటే మా అమ్మకైనా, నాకైనా, మా చెల్లెలికైనా మంచి అభిమానం. వీళ్ళింకొక భార్య పిల్లలనేటువంటి భావం మా అన్నయ్యకు కూడా లేకుంటుండె అప్పుడు మా అన్నగారొకసారింట్ల నుంచెళ్ళిపొయిండు. ఒక సంవత్సరం పోయిండు. ఒకసారి చాల ఇబ్బందై ఇంటికి లెటర్‌ రాసిండన్నమాట. ఆ లెటరొచ్చిన తర్వాత మా నాన్నగారు పోయితీసుకొచ్చిన్రు. వచ్చిన కొద్దిరోజులకే ఆయన పెండ్లయింది. ఆయన బావమరిది బి.ఎన్‌ అంటరు. ఆయన రాజకీయాలల్ల ఉండె. పెండ్లయిన కొద్ది రోజులకే అత్తవారింటికి పోయి వచ్చేటప్పుడు ఆంధ్రమహాసభ గురించి ఏదో మాట్లాడుకున్నట్టున్నది. అన్నయ్యను మీరొస్తరా అని అడిగినట్టున్నది మరి ఏం మాట్లాడుకున్నరో తెలియదు కానీ, నన్ను కూడా ‘రా తీసుకుపోతం’ అన్నరు. మా నాన్న చాలా కోపిష్టి మనిషి. చండశాసనుడు. సహించకపోయేది. అంచేతనే మేం చెప్పకుంటనే ఇంట్లనించెళ్ళిపోయినం. నాకు అప్పుడు పదిహేను సంవత్సరాల వయసుంటుంది. ఆ తర్వాత చెప్పకుంట బయటికెళ్ళటమనేది ఒకపెద్ద సాహసమైపోయింది. భువనగిరి మహాసభలయిన తర్వాత కమ్యూనిస్ట్‌ కార్యక్రమాలు మొదలైనయి. అంటే కార్మికులు, కూలీలుంటరు కదా, వాళ్ళతో పనిచేసేది. వాళ్ళందరితో తిరిగిన తర్వాత ఇంటికిపోతే మా నాన్నగారేమంటరోనని ధైర్యంలేక చేయలేకపోయినం. ఆయన నేనంటే చాలా ప్రేమగా ఉండె. నేనట్ల వెళ్ళిపోయి ఇంటికిపోతే రానిస్తారో లేదో అని ఇంటికి వెళ్ళలేదు. ఆ తర్వాత పోయినం. కానీ కొంచెం కోప్పడి ఏం అనలేకపోయిండు. ఒకళ్ళంకామైతిమి కోడలాయె, కొడుకాయె, నేనైతిని ముగ్గుర్ని ఆక్షేపణ చెయ్యాలంటే ఇబ్బందికరమైన విషయమే అయింది. అంటే తన మనసును కొంచెం మార్చుకుండన్నమాట. ఇగట్లనే అప్పుడప్పుడు మీటింగులయితే పోనిస్తుండేది. ఆ తర్వాత ఆంధ్ర మహాసభలు భువనగిరి, వరంగల్లు, ఖమ్మంలల్లయినప్పుడు రాజకీయాలు కొంచెం ముందుకు వచ్చినట్టున్నయి. దాని తర్వాతనే అన్నయ్యను భువనగిరి ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా పనిచేసేటందుకు వేసిన్రు. ఆయనతోపాటు నేను మా వదిన ఉంటిమి. కానీ, మాకట్లఉండనీకి ఇబ్బందయింది. అక్కడ కొలనుపాక జైన్‌ మందిరంవాళ్ళు నడిపే స్కూలులో నన్ను టీచర్‌గా పనిచేసెటందుకు పెట్టిన్రు. చిన్న క్లాసులు తీసుకునేది. నేను చదివింది నాలుగాయెను. సాహిత్యం, భారతం, భాగవతం లాంటివి చదవటం అర్థం చేసుకోవటమనే స్తోమత ఉండె నాకు. మొదట యాభై రూపాయలకు పని చేయటానికి అంగీకరించిన. అప్పుడు పార్టీ పరిస్థితి కూడా పెద్దంత ఏముంది! అందరికీ వేతనాలిచ్చేదిలేకుండె. ఆ టైములనయితే నేనప్పుడు పనిచేసి తెచ్చే యాభై రూపాయలే ఆధారమన్నట్టయిపోయింది. అక్కడొక సంవత్సరం పని చేసిన. అప్పుడు అఖిలభారత రైతు మహాసభ విజయవాడలో జరిగింది. దాంట్లో మమ్ముల రమ్మంటే పోయినం. అప్పటికే పార్టీమీద గవర్నమెంటు చర్యతీసుకునే టైమొచ్చింది. అప్పుడే ఈ సమస్యకు సంబంధించి కొన్ని క్లాసులు విజయవాడలో జరిగినయి. అప్పుడు ఊళ్ళల్లో పరిస్థితి ఎట్లఉండెనంటే కమ్యూనిస్ట్‌లంటే భూతమన్నట్టు, వాళ్ళని పూర్తిగా మార్చేస్తారన్నట్టు, వాళ్ళని హింసిస్తారన్నట్టు ఒక ప్రాపగాండా ఉండింది. ఎవరన్నా సహకారం చేస్తే మీరెందుకు చేస్తున్రు అన్నటువంటి వత్తిడి వాళ్ళందరిమీద ఉండింది. అప్పుడు స్త్రీలకు కూడా ట్రెయినింగ్‌ ఇచ్చి ఆడవాళ్ళల్లో పనిచేసేటట్లుగా వాళ్ళని పంపిస్తే మనకు ఏదన్నా నిర్బంధపు రోజుల్ల, రహస్యపు రోజుల్ల సహకారం అన్నది దొరుకుతుంది. స్త్రీలు ముందుకు వచ్చి పాల్గొనకపోతే కల్గదు అని మాకట్లాంటి ప్రోగ్రాములు పార్టీ ఇచ్చింది. రెండు మూడు ఊళ్ళల్లో ఎక్కడయితే పార్టీ నిలదొక్కుకోని ఉందో అక్కడ మమ్ములను పనిచేయమని అన్నరు అక్కడివాళ్ళ కుండేటటువంటి సమస్యలు, కుటుంబ వ్యవహారాలు, కూలీ సమస్యలు, ఇల్లు శుభ్రంగ ఎట్లుంచుకోవాలె, పిల్లల్నెట్ల ఉంచుకోవాలె అని అవన్నీ చెప్పేది. అప్పుడు కూలీ ఎంత? శేరో శేరున్నరో ధాన్యం, కోతకూలి దొరికేది. ఇంక ఇవన్నీ కాకుండ అసలు పార్టీ అంటే ఏమిటి, అసమానతలు కష్టపడేరోజులుపోయి మంచిగ బతికే రోజులు రావాలని పార్టీ ఎట్ల కృషి చేస్తుందని జనానికి చెప్పేది. మనం చెప్పిందంతా వాళ్ళకర్థం కాకపోయినా వీళ్ళు మన బాగు గురించి చేస్తున్రు కనుక వీళ్ళకు మనం సహకరించాలె అని వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఒక్కొక్క చోట చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వచ్చేది. ముఖ్యంగా కొన్ని ఊళ్ళల్ల ‘వాళ్ళెందుకొచ్చిన్రు వాళ్ళ కన్నం ఎందుకు పెట్టిన్రు’ అని ఒత్తిడి చేస్తుండె ఇతర్లు. కానీ ఎదిరించి ‘అది మా ఇష్టం మీ కేమవసరం’ అనే రకంగా జవాబు చెప్పి తట్టుకోని నిలబడుతుండే ఆడవాళ్ళు.
సూర్యాపేటలో భక్తవత్సలాపురం, అనాసపురం, దురాసపల్లి, రాయపాడు గ్రామాలల్ల తిరిగేది నేను. మేం ఎక్కువ పార్టీ ఉన్న ఊళ్ళకే వెళ్ళేది. తర్వాత ఆడవాళ్ళం కలిసి కొన్ని కొత్త ఊళ్ళకి కూడా పోయినం. ఆ ఊళ్ళల్ల ఎక్కువ కూలి నాలి చేసుకునే జనం దగ్గిరికి వెళ్ళేది. రైతు సంఘాలు కానివాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేది. మన కుటుంబాల ప్రభావం మొదటినించీ ఉండెకదా! అన్నయ్య, బి.ఎన్‌. (భీంరెడ్డి నరసింహారెడ్డి) అంటే అక్కడడందరికీ బాగా తెలుసు. ఆ ప్రభావంతోటీ వీళ్ళేదో మన మంచికొరకే పాటుపడుతున్రు. వీళ్ళకు మనం సహకారం చెయ్యాలె అని అనుకుంటుండె అందరు. ‘మీరెందుకొచ్చిన్రు’ అని తొందరగ అనేది కాదుకాని కొంచెం గవర్నమెంటు వత్తిడి కాని పెత్తందారు కానీ ఉంటే, అనేది. ‘మీరు కొంచెం జాగ్రత్తగుండండి అమ్మా! వాళ్ళు జూస్తుండగా మా దగ్గరికి రావ’ద్దని అంటుండె. మా కుటుంబం అంటే మా తాతలప్పటినించీ కూడా బాగా అధారిటీ ఉన్న కుటుంబాలన్న మాట. మా నాన్నగారేమో పోలీస్‌ పటేల్‌ చేసేది. కుటుంబ విషయాలొస్తే ఖచ్చితంగుండేది కానీ, జనం విషయాలొస్తే కష్టనిష్టురాలు కొంచెం ఆలోచించేది. దొంగతనాలు అవీ జరిగితే పోలీసులకు పట్టివ్వకుండా అక్కడికక్కడే పరిష్కారం చేసేది. అందుకే చుట్టుపక్కల రావులపల్లి, తుంగతుర్తి, గూడెం నాలుగూళ్ళల్ల కూడా కిందిజనంనించీ పైవాళ్ళవరకు అందరికీ మానాన్నంటే మంచి అభిప్రాయం ఉండేది. మేం తర్వాత వాళ్ళ దగ్గరికిపోయినప్పుడు కూడా మంచి సహకారం ఇస్తుండె. ‘వీళ్ళు వీళ్ళ తండ్రులలాగానే ఏదోపని చేస్తున్రు’ అన్నట్టుండె.
ఆ తర్వాత విజయవాడలో క్లాసులు కూడా జరిగినయి. ధైర్యంగెట్ల ఉండాలె? రజాకర్లు ఇళ్ళల్లకి వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలె? స్త్రీలకు స్థావరాలు కొన్ని తెలిసున్నా చెప్పకుండా ఎట్ల ఉండాలె? కారం అదీ చల్లటానికి సిద్ధంగ ఎట్ల పెట్టుకోవాలె అని ఇదంతా చెప్పేది. మనం ఇల్లువదిలిపోయేటప్పుడు అన్నంగిట్లఉంటె అండ్ల విషంకలిపి పెట్టిపోవాలె అని చెప్పేది. రజాకర్లకు సొమ్ములు లాక్కెళ్ళటంతోపాటు తిండిసమస్య కూడా ఉండె. ఏదుంటే అది కుమ్మరించుకొని తినేది. క్లాసుల్లల్ల ఇంకా మామూలుగా సమాజంలో స్త్రీలకుండే ఇబ్బందులు వాటినెదుర్కోవాలంటే ఏం చెయ్యాలి, స్త్రీలను ముందుకెట్లా తీసుకురావాలి అని మాట్లాడేది. చదువు విషయంలో ఎవరైనా ముందుకొచ్చేదుంటే వాళ్ళకు పాఠశాలలు పెట్టి ఆ విధంగా ఏర్పాటు చేసేది. పుస్తకాలు చదవటానికి, కుట్లునేర్చుకోవటానికి వస్తేకూడా మగవాళ్ళొప్పుకోకపోయేది. కుటుంబంలో పూర్తిగా భర్త, అత్తమామలే చెప్పినట్టుగాకుండా మనకుకూడా వ్యక్తిత్వమనేది వుంటుంది కదా. మేంకూడా చెప్పేది. తప్పేంవుంది ఇప్పుడు కుటుంబం కొరకు భవిష్యత్తు కొరకేగదా వాళ్ళొచ్చేది. అంతేకాని చెడగొట్టటానికి కాదని వాళ్ళకీ నచ్చచెప్పేది. వాళ్ళ భర్తలకీ నచ్చ చెప్పేది. తర్వాత మేమిచ్చిన సహకారంతోని ఆడవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ మగవాళ్ళకి నచ్చచెప్పేది. ఆ విధంగా ఇట్లనే వీధివీధికి గ్రూపుమీటింగులు పెట్టి ప్రచారంచేసేది. అట్లా ఒక సంవత్సరం పాటుండి చేసినం నిర్భంధమొచ్చేవరకు. ఆ తర్వాత సూర్యాపేటలోనే వుండె, రహస్యజీవితమే వుండె. హుజూర్‌నగర్‌ తాలూకా పొనుగోడులో ఒకామె చిన్నతనంలోనే భర్త చనిపోయిండు. ఆమె ఒక హోటల్‌ పెట్టుకోని నడిపిస్తుండె. అక్కడుంటే పెద్దగా అనుమానాలు రావని నన్నుంచిన్రు. తిండిగినా అంత అక్కడే ఉండేది. పార్టీ కొంత డబ్బు అదీ ఆమెకిచ్చేది. తర్వాత ఏదో పెద్ద ప్రోగ్రాములుగాకుండా మామూలుగనే అక్కడ కార్మిక కుటుంబాలు, పార్టీ సంబంధాలున్న కుటుంబాలతోటి, స్త్రీలతోటి ఎక్కువ అనుమానం రాకుండా వాళ్ళతోనేతిని ఉంటూవుండేది. ఆడవాళ్ళకు ఉదయం పదిగంటలకెళ్తే సాయంకాలం ఆరుగంటలదాకా పనిచేయవలసొచ్చేది కదా. అట్ల కాకుండా పదిపదకొండు గంట్లకెళ్ళి నాలుగుగంటలకే మనం తప్పనిసరిగా వదిలిపెట్టిరావాలని ఎక్కువ చెయొద్దని చెప్పేది. తర్వాత సక్రమమైన కూలి ఇవ్వాలని చెప్పేది. అప్పుడు శేరున్నరవడ్లిచ్చేదానికి రెండు రెండున్నరశేర్లు చెయ్యాలని, పసిపిల్లలున్న వాళ్ళని పాలియ్యటానికి పంపించాలని డిమాండు చేసేది. ఎందుకంటే పనిచేయటానికిపోతే కొంతమంది రైతులు పాలియ్యటానికి తోలియ్యకపోయేది. చిన్నపిల్లలున్నవాళ్ళు కూడా మూడు, నాలుగు మాసాలున్న పిల్లల్ని వదిలి పొట్టకూలికి పోవలసొచ్చె. పాప కెంతిబ్బందిగుంటది! చిన్నపిల్లల్నే పసిపిల్లల్ని చూడటానికి వదిలిపోయేది. ఇట్లాంటివి కొన్ని డిమాండ్లు.
ఇగ నిర్భంధమొచ్చిన తర్వాత తప్పుకొని ఊళ్ళల్లకు వెళ్ళిపోయినం. వెళ్ళి దళాలలోనే తిరిగేది, మనవాళ్ళకు రక్షణఉండటానికి. ఎక్కడ ఉంటే రక్షణ ఉంటుందీ, తిండి ఎక్కడ దొరుకుతుందీ, రక్షణ ఇచ్చేవాళ్ళకు ఆత్మధైర్యం ఉందా – ఇవన్నీ చూసేది. తర్వాత మనకు రక్షణ ఇస్తున్న కుటుంబాలతో మనం ఎవర్నయితే కాపాడుతున్నామో వాళ్ళు మనకు దక్కకపోతే మనకు ఎంత నష్టం వస్తుంది, పోలీసొచ్చి ఊళ్ళల్లోఉంటే పెత్తందార్లు మనమీద వత్తిడి తీసుకొస్తే కూడా ఏ విధంగా చెప్పకుండా ఉండాలనేది వాళ్ళకు భయంకలుగకుండా ఉండటానికి, మనతో సహకారంగా ఉండటానికి ఆ విధంగా మాట్లాడటం చేసేది. కొద్దిరోజులే జరిగింది ఆ విధంగా. ఎక్కువరోజులు చేయలేకపోయినం. ఊళ్ళల్ల రజాకర్ల ఒత్తిడి ఎక్కువైనంక ఐదారుమాసాలకట్టుంది, అన్నయ్యకు పాప పుట్టింది. అప్పుడు ఊళ్ళెవుండే పరిస్థితి లేకుంటవచ్చింది. మా వదిన కూడా రహస్యంగానే వుండె. అప్పుడు మానాన్నగార్ని పోలీసులు బాగా వత్తిడి చేసి కొట్టిన్రు. నీ కొడుకెక్కడుండు, నీ బిడ్డెక్కడున్నది అని. దెబ్బలకి తట్టుకోని నిలబడుండె కానీ చెప్పలేదు. ‘వాళ్ళెన్నడయితె పార్టీలకిపోయిన్రో ఆనాడే నాకు కొడుకు, బిడ్డకాదనుకున్న’ అని చెప్పిండు. ఆయనకప్పటికే కాంగ్రెసువాళ్ళతోటి సంబంధం వుండె. అందుకని ఆ! నన్నేంచేస్తరులే అన్నట్టుండె.  కానీ విపరీతంగా దెబ్బలు తిన్నడు. అప్పుడు కొన్నిరోజులు ఈపరంగనే గూడెంలవుంటిమి. ఆ తర్వాత పార్టీ పిలుపునిచ్చింది. మావదిన రాలేదు – చిన్నపాప కదా. నేనొక్కదాన్నే. ఆడవాళ్ళు లేకపోతే మనకు సహకారందొరక్క ఊళ్ళల్ల మరీ ఇబ్బందయ్యేటట్టుంది. మన కుటుంబాలనుకునే వాళ్ళు కూడా ధైర్యం చాలనట్టుందని అనుకున్నరు. ఇగ నేనుపోయిన నాల్గయిదుమాసాలు కాంగనే అరెస్టయినన్నమాట. చాలా రోజులయ్యింది అమ్మను, నాన్నను చూసి – చూస్తననిపోయి. అక్కడ పక్కనే గౌండ్లవాళ్ళది కల్లుదుకాణం వుండె. మా ఇల్లేమో చిన్నది. ఇగ నేను పెద్దగమాట్లాడిన్నేమో రాత్రి పదకొండు గంటలకు పోలీసును తీసుకొచ్చి అరెస్టు చేసిన్రు. ఆరాత్రే మమ్మల్ని స్టేషనుకు తీసుకపోయిన్రు. అప్పుడుండేటువంటి యస్‌.ఐ. మరి మనపార్టీలు, రాజకీయాలు అనే భయంతో వీళ్ళనేమన్న అంటె పెద్ద గొడవలొస్తయేమోనని కొంచెం మర్యాదగా జాగ్రత్తగనే చూసిన్రు. ఒక అవినీతి హేళన అదేం లేకుండ స్త్రీల విషయంలో వుండె. కానీ వారంపదిరోజులదాంక స్టేషన్‌లనే వుంచిన్రు. దాని కారణంగేమైందంటే ఆ యస్‌.ఐ.ని సస్పెండ్‌ చేసిన్రన్నమాట. అసలు స్త్రీలనెందుకుంచవలసి వచ్చింది. వారంరోజులదాక? అని. మా కుటుంబం చేయబట్టే అసలు ఇద్దరుముగ్గురు పోలీసోల్ల ఉద్యోగాలు పోయినయి. వారంరోజులు తుంగతుర్తి కాంపులవుంచి ఆ తర్వాత సూర్యాపేటకు తీసుకొచ్చిన్రు. అక్కడ ఒక్కరోజుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చిన్రు. మూడుమాసాలున్న చంచల్‌గూడ జైల్ల. మిగతా ప్రాంతాల్లల్ల అరెస్టయిన వాళ్ళని, పార్టీల పనిచేస్తున్నరని అనుమానం వున్నవాళ్ళని బాగ హింసించడం అదీ జరిగింది. కానీ మన ప్రాంతంలో ఏమైందంటే, అంతా ఇప్పుడు కాంగ్రెసులో పనిచేస్తున్నా కమ్యూనిస్ట్‌ పార్టీలో పనిచేస్తున్నా, ఇంతకు ముందు అంతా కలిసున్న కుటుంబాలు కదా.ఇప్పుడు హింసించటం, బాధపెట్టటం జరిగితే రేపన్నరోజు ఎట్లుంటదో వీళ్ళధికారంలోకొచ్చిన రోజు ఎట్ల వుంటదని ఆలోచించి అటువంటి దుర్మార్గం జరగకుండ చూసిన్రు. నన్ను కూడా ఏం కొట్టటానికి  ఏం ప్రయత్నం చేయలేదు. ‘మన వాళ్ళెక్కడున్నారు, సెంటరెక్కడున్నది, వీళ్ళెక్కడుంటరు, బి.ఎన్‌. ఎక్కడున్నడు’ అని ఒత్తిడి చేసిన్రు. రెండురోజులు నిలబెట్టి బాగా విసిగించిన్రు. తిండి ఇంటినించే వచ్చేది. మా నాయనగారినే కాకుండా మా చిన్నాయన్లు ముగ్గురినీ, అమ్మను, చెల్లెనుకూడా కొట్టిన్రు. బాగా నిర్భందపెట్టిన్రు. నేను తర్వాత మళ్ళీ రెండోసారి యూనియన్‌ సైన్యాలొచ్చినంక అరెస్టయిన. అప్పుడు కూడా మా సొంతయింట్లనే అయిన. అప్పుడు పోలీసొస్తున్నది అంటే పొలాల్లల్లకి పోయిన్రు. అప్పుడిట్లనే ఏర్పాటు గాకుండ కాసెపోసుకుని గ్రామాల్లల్ల స్త్రీలలెక్కనే జాకెట్లు  తొడిగుండేది. కానీ కాంగ్రెస్‌ వాళ్ళే వచ్చి చూయించిన్రు ఆయన రామక్రిష్ణారెడ్డి అనివుండె. కాంగ్రెసాయన వెంటవుండి తీస్కపోయిండు. సికింద్రాబాద్‌ కంటోన్మెంటు జైల్లకి పోయిన్రు. తర్వాత లకడికాపూల్‌ సి.ఐ.డి. ఆఫీస్‌ల ఉంచిన్రు మూడు నెల్లు. ఆ తర్వాత నల్గొండ తీస్కపోయిన్రు.  ఐదారు నెల్లున్నక్కడ. ఆ తర్వాత ఖమ్మం తీస్కపోయి అక్కడ నుంచి వరంగల్‌ తీస్కపోయిన్రు. అప్పుడు ఆరుట్లకమల కూడా వుండె. అప్పుడు అన్నాలు పెట్టారని, సద్దులు పెట్టారని, దాచారని అనుమానంతో మందలకు మందలు తీసుకొచ్చిన్రు స్త్రీలను కూడా. మూడు నాలుగు వందలమందిమి ఉంటిమి. ఖమ్మం దగ్గర మేడేపల్లి అనే గ్రామం నుంచి ఒక ముసలామెని తీసుకొచ్చిన్రు. ఎనభై ఏళ్ళామె తలంత తెల్లగనెరిసిపోయింది. ఆమె మనవడి గురించి ఎక్కడున్నడు చెప్పమని బాగ హింసించిన్రు. గోళ్ళల్ల సూదులుగుచ్చి బాగ నిర్భంధం పెట్టినా ఏంచెప్పలేదామె. మాకు తిండికూడా చాలా అధ్వాన్నంగ వుండె. ఆ తిండి గురించి నేను, కమలాదేవి పెద్దపోరాటం చేస్తే మాకే వండుకోవటానికిచ్చిన్రు. కానీ వెంటనే తీస్కపోయి ఔరంగబాద్‌ జైల్ల పెట్టిన్రు. ఎవరో మాతో మాట్లాడటానికి వచ్చిన్రని చెప్పి మా బట్టలవన్నీ తీసుకోకుండానే తీస్కపోయిన్రు. అప్పుడక్కడ కరుణాచౌదరి, హేమలత గుప్త కూడా వుండె. ఇగ ఒక సంవత్సరం వున్న తర్వాత మేమంతా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ పెట్టుకున్నం. ఇగ మేం కూడా ఎలక్షన్ల పాల్గొన్నం. ఆ తర్వాత పార్టీ ఇగ ఏం కార్యక్రమం ఇవ్వలేదు. మేం ఏం చెయ్యలేదు. ఇళ్ళల్లోనే మిగిలిపోయినం. ఎలక్షన్ల టైములో ప్రచారం కోసం తిరుగుతున్నప్పుడు ఒకాయనతో పరిచయం అయింది. నల్గొండ, హైదరాబాద్‌, సికిందరాబాద్‌ ప్రాతాల్లో ఇద్దరంకల్సి పనిచేసినం. ఎటు పోయినా, సభల్లో, మీటింగుల్లో కల్సిపాల్గొన్నాం కనుక, ఆ విధంగానే చేసుకుందామనే నిర్ణయానికొచ్చినం. అతను బయటకి అభ్యుదయ భావాలున్నట్టుగా కన్పించినా, ఆంతరాంగికంగా లేనట్టే అన్పించింది నాకు. తర్వాత కొన్ని నడవడిలనిబట్టి ఎప్పుడు బాగా డబ్బు సంపాదించాలని, ఎట్లా పైకి పోవాలనే ఆలోచించేవాడేమో అన్పిస్తుంది. పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా నాతో చర్చించి సరే అని అనుకున్న తర్వాత పార్టీతో నిర్ణయించకుండానే కార్డ్సు ప్రింట్‌ చేయించిండు. అవి ప్రింటు చేయించే వరకు కూడా నాకు తెలియదు. దాన్ని పార్టీ ముందు పెట్టాలని నా అభిప్రాయం ఉండేది. తీరా కార్డ్సు ప్రింటుచేయించి తాలూకా ఆఫీస్‌కి పంపించేవరకు, ధర్మభూషన్‌ అని పార్టీ కార్యకర్తవుండె. ఆయన బాగా ఆలోచించి ఒక లెటర్‌ రాశాడు. ఎలక్షన్‌లు అయి బైటకి వెళ్ళిన రోజులు. నిర్భంధం ఇంకావుండె. పార్టీ స్థానికంగా లేకుండె. ఆ పరిస్థితుల్లో అప్పుడే చేసేటట్టుగాలేదు. వాయిదా వేసి మళ్ళీ నిర్ణయించుకుందామని లెటర్‌ రాశారు. అట్ల వీలుకాకపోతే ఇంకో రకంగా అన్నా చేయొచ్చుకదా. ఒక ముఖ్యమైన పార్టీ నాయకుని ముందు ఏదో ఒకటి చేయొచ్చుకదా? కానీ చేయలేదు. ఎలక్షన్లు అయ్యేటప్పటికి అతనికి చదువుమీద ధ్యాస ఎక్కువైపోయింది. ఆ విధంగా నాకు తెలియకుండా వేరే దారులు వెతుక్కోవడం మొదలుపెట్టాడు. పెళ్ళి పోస్ట్‌పోన్‌ అయ్యిందోలేదో చదువుకెళ్ళిపోయాడు. చదువుకు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మా ఇద్దరి మధ్య ఉత్తరాలు తక్కువైపోయాయి. దాన్ని గురించి పార్టీ కూడా ఏం పట్టించుకోలేదు. ఇట్లా ఎందుకు జరిగిందీ అని విచారించలేదు. నేను కూడా ఏం ప్రయత్నించలేదు. ఎందుకంటే అప్పుడు కుటుంబ వాతావరణంలో కూడా నేను బయటికిపోయి ఇది ఏం సంగతి అని అడిగే పరిస్థితిలెకుండె. మాకు తెలుసుకదా! స్త్రీ బయటి సహకారం లేకుండా,  పార్టీ సహకారం లేకుండా బయటకి వచ్చి నిలదొక్కుకోవాలంటే అవకాశం లేదు. ఇంట్లోమాత్రం బాగానే ఉండింది. వాళ్ళు పెద్ద ఎందుకిట్ల జరిగింది అని పెద్ద నిర్బంధం చేయలేదు. కాని, కుటుంబంలో గౌరవనీయమైన స్థానం పోగొట్టుకుంది కదా అని బాధపడి చాలారోజులు మళ్ళీ పెళ్ళి ప్రయత్నం చేయలేదు. చెయ్యలేదు అంటే నేనే ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు మనసు విరక్తి అయిపోయింది. నా మానసిక ఘర్షణలో నేను ముందుకు అడుగువేయలేదు. తెలిసో తెలియకో తప్పు చేస్తాం, దాన్ని తప్పుచేసినం అని బాధపడక సరిపుచ్చుకుంటేనే బాగుంటుంది. ఆ పరిస్థితుల్లో పార్టీ తోసి పుచ్చినట్టు మా ఇంట్లో వాళ్ళు తోసిపుచ్చితే నా పరిస్థితి ఏమయ్యేది? ప్రపంచంలో అందరు పెళ్ళిచేసుకుని భార్యాభర్తలుగా బ్రతకటానికే పుట్టలేదు కదా! ఈ రకమైన జీవితంలో కూడా నాకేం పెద్ద అసంతృప్తిలేదు. ఆ రోజు నేనాయన్ని ప్రేమించినా పోగొట్టుకున్నాననే బాధలేదు. అదొక దుర్ఘటన జరిగిపోయింది. అదొక పీడ. కాని ఆ రకంగా అయ్యాక నేను పార్టీలో పనిచేస్తే నా అభిప్రాయాలకి తగ్గట్టుగా నాకు ఇంకా తృప్తి ఉండేది. కాకపోతే అది జరగలేదు. మా చిన్నమ్మ ఒకామె భర్త చనిపోతే కుటుంబంతో కలిసి ఉంటున్నది. ఆమెలాగే ఆ కుటుంబంలో నా స్థానం వుంది. లేకపోతే ఆమెకేమో భర్త చనిపోయిండు. నేనేమో సమాజంలో వుండే దురాచారానికి గురయిపోయాను.
కమ్యూనిస్టులకంతా నీతి ఉండదనీ, నిజాయితీ ఉండదనీ అనేటటువంటి దుష్ప్రచారం ఉండేది. మేం ఇంట్లనుంచి బయట అడుగుపెట్టినపుడు అదంత తట్టుకోని ఏదో భవిష్యత్తు మంచిగుంటుంది, మంచి సమాజం వస్తుంది, చాలా ఇదిగా బతుకుతం అని అనుకునేది. కుటంబాల్లో స్త్రీలు, పురుషులు ఒకరికొకరు లొంగివుండటం వుండదు అని వూహించుకునేది. ఎంతో బాగా, ఉల్లాసంగా బతుకుతామనే ఆలోచనుండేది. కానీ, పార్టీకి నిర్బంధపురోజులు తొందరగా వచ్చినై కనుక సమానం వున్నదీలేనిదీ పోల్చుకునేట్లు లేకుండె. నిర్బంధం రావటం, అందరూ రహస్యం పోవటం చాలా తొందరగా జరిగింది. అట్లా ఉన్నపుడు మగవాళ్ళ పనులు సమానంగా చేయడమనేది జరుగలేదు. ఆ రోజుల్లో నాకంతగా సెక్సు సంబంధాల గురించి అర్థం అయ్యేది కాదు. వయసులో చిన్నదాన్ని, రెండోది, పెరిగిన వాతావరణం కూడా ఆ విధంగా ఆలోచించనేయకపోయేది. ఏదన్నా పార్టీ పనిచేస్తే చేయటం, పుస్తకాలు, పత్రికలు చదవటమే కాని మిగతా ఆలోచనలు ఉండేవి కావు. నాతో పనిచేస్తున్నవాళ్ళు ఏదో గుసగుసగా మాట్లాడుకుంటే నేను పట్టించుకోకపోయేది. అర్థం చేసుకోకపోయేది. అందరంకల్సి వుంటిమి కదా! తిండిదగ్గరా, అన్నిటి దగ్గరా క్లోజ్‌గా మంచిగా వుంటే గుసగుసలనుకునేది. మగవాళ్ళ మీద ఏం అనుకోకపోయేది. ఏదో ఒకటి రెండు దళాల్లల్ల జరిగినాకూడా వాళ్ళ ఇష్టపూర్తిగానే జరిగింది కానీ వాళ్ళకు తెలియకుండా జరగలేదు. ఆ లెక్కలో పార్టీలో ఎన్నో సంఘటనలు జరిగినయి. భోనగిరి దగ్గర ఒక ఊళ్ళో కామ్రేడు ఒకామెవుండె. ఆమె భర్త జైల్లో ఉన్నపుడు ఆమె రహస్య జీవితంలో రెండుమూడుసార్లు గర్భిణీ అయింది. అయితే అబార్షన్‌ చేయించారట. మరి అక్కడ ఆమెని అర్థంచేసుకున్నవాళ్ళు ఉన్నారుకదా. అసలు వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా ఆ సాహసం చేశారు కదా, చేశారుకనుకనే మరి బయటకు వచ్చాక వాళ్ళు మళ్ళీ భార్యాభర్తలుగా బతకగలుగుతున్నారు.
సెక్స్‌ సంబంధాలు పెట్టుకోవద్దు, మగవాళ్ళు మూర్ఖపు పట్టుతో వుంటారు. మనకు పార్టీ సహకారం లేకుండా పోతుంది, అది లేకపోతే గవర్నమెంటు వాళ్ళ చేతుల్లో పడ్డట్టు అవుతాం అనేది గట్టి పాయింటుండేది. దళాల్లో వాళ్ళకి – ‘కోయ యువతులతో సంబంధాలు పెట్టుకుంటే పార్టీ ప్రమాదాలకు గురవుతుంది’ అనేది ఒక వార్నింగు ఉండేది.
ఆ రోజుల్లో మేం ఏ వూరికి వెళ్ళినా కూలీనాలీ జనం ‘మేం మీతోవస్తాం, మీతో వస్తాం’ అని ఉత్సాహం చూపిస్తుంటే పార్టీవాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు కదాని ఏదో ఒక ట్రెయినింగ్‌యిచ్చి అవసరమైన పని చేయించుకోవచ్చు అని అనుకోలే. వాళ్ళడిగితే మిమ్మల్ని చేర్చుకుని ఏం చేయాలి, బయటకి ఎలా తీసుకుపోవాలి, మీరేం చేస్తారు అని అనేవాళ్ళు. ప్రతి ఊరునుంచి కనీసం అయిదారుగురు ఆడవాళ్ళు వస్తామనేవాళ్ళు. యువతులు మంచి ఉత్సాహవంతులు. వాళ్ళవి నిర్బంధపు పెళ్ళిళ్ళు కదా! భర్తతోనో, అత్తతోనో, తోడి కోడళ్ళతోనో ఏదో ఒక బాధతో వచ్చే వాళ్ళు ఎక్కువ. చదువుసంధ్యలు లేకపోయినా ఏదో ఉత్సాహం ఉండేది. కూలీనాలీ జనంలో భర్తకు భార్యకు ఇష్టం లేకుంటే విడిపోయే అవకాశాలు ఎక్కువే. కాని, విడిపోయినా అంతేకదా! వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికిపోతే ఇంకొకళ్ళకిచ్చి చేస్తారు. మళ్ళీ అదే నిర్బంధపు జీవితం కదా! మనలాగా ‘ఆడ, మగవాళ్ళందరితో కలిసి పనిచేస్తే ఇంకేదో మంచి జీవితం ఉంటుంది’ అని వాళ్ళ ఆలోచన. స్పష్టంగా చెప్పక పోయినప్పటికీ వాళ్ళ మనసుల్లో ఉంది. వేరే జీవితం అనుభవించ వచ్చు, మనకిష్టమైనట్టుగా ఉండొచ్చు అని. కాని వాళ్ళకు పార్టీ సహకారం ఇవ్వలేదు. భర్తనుండి దూరమై వస్తోంది తర్వాత ఈమెనేం చెయ్యాలి అనేది. ఒక సరైన దృక్పథం లేకపోవడమే కారణమనుకుంటా. తర్వాత వీళ్ళని తీసుకెళ్ళటం ఎంతవరకు సబబైనది? ఇట్లా భార్యా భర్తల్ని విడదీసి తీసికెళ్తే పార్టీకి ఒక దుష్ప్రచారం వస్తుందనే ఆలోచించారు. కాని వాళ్ళు వస్తుంటే మనం పార్టీకి ఒక పునాదివేశాం కదా, పరిస్థితుల్ని భరించలేక వస్తున్నారు కదా అని ధైర్యం, సహకారం ఇస్తేనే బావుండేది. అప్పుడు గ్రామాల్లో ఆడవాళ్ళు ముందుకు వచ్చారు కాని ఇప్పుడు గ్రామాలకి వెళ్తే ఎవరూ వచ్చేవాళ్ళు లేరు. వాళ్ళది పరిస్థితుల ప్రభావం. ఇప్పుడు ఎలక్షన్లు, చదువులు కొంత ముందుకు వచ్చాయికనుక రాజకీయాలు ఏమన్నా మాట్లాడితే బోడి రాజకీయాలు ఏంచెప్తావులే అంటారు. అప్పుడది లేకుండే. అసలు నిర్బంధపు రోజుల్లో ఏదన్నా ఒక్క పనిచేస్తే దాన్ని ప్రేమించేవాళ్ళు. ఆ రోజుల్లో పార్టీ స్త్రీలల్లో ఎక్కువ బలంగా నాటుకుపోయే వీలుండేది. అది ఒక పెట్టనికోటగా ఉండేది. కాని అప్పుడు మనవాళ్ళకు అవకాశమున్నా చెయ్యలేదు. అట్లాముందు కొచ్చిన వాళ్ళ ఇళ్ళకివెళ్తే తాము తినకుండా కామ్రేడ్సుకి పెట్టేవాళ్ళు. అన్నం పెట్టేవాళ్ళు. ఉత్తరాలు తెచ్చేవాళ్ళు, తన్నులు తినేవాళ్ళు కాని పార్టీలో సభ్యత్వం మాత్రం లేదు.
కుటుంబంలో తల్లిదండ్రుల్ని వదిలేసి పార్టీజీవితంలో ప్రవేశించాక పార్టీ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం చదవటం అలవాటయింది. ‘అమ్మ’ లాంటి పుస్తకాలు చదివేవాళ్ళం. అంతుకుముందు పెద్దచదువు లేకపోయినా ఈ సాహిత్యం బాగా జీర్ణించుకుంది కనుక మీటింగుల్లో మేంబాగా మాట్లాడగలిగే వాళ్ళం. మేం మాట్లాడుతుంటే ‘వీళ్ళు బాగా చదువుకున్నారా బి.ఏ. చదివారా, ఇంటర్‌ చదివారా’ అని కాంగ్రెస్‌ వాళ్ళంతా అడుగుతుండేది. మూడు నాలుగు తరగతులు చదువుకున్నవాళ్ళు ఇంతబాగా మీటింగుల్లో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయేది. ఒకరకంగా పార్టీతో సంబంధం లేకపోయినట్లయితే ఏమీ తెలియని స్త్రీలలాగానే ఉండేది. అట్లా పార్టీలో కొన్నాళ్ళు పనిచేసి తిరిగి కుటుంబంతోవుండే పరిస్థితి వచ్చినా ఇంట్లో అన్నల భార్యలు వాళ్ళు అర్థం చేసుకోలేక ఈర్ష్యగా చూసినప్పటికీ, చిన్నతనం చేసినప్పటికీ బాధ అనేది తట్టుకోని ఉండగలిగే స్తోమత వచ్చింది. ఎవరేమన్నా లెక్కచేయకుండా బ్రతికేయటం అలవాటయింది. ఆ స్తోమత ఎట్లా వచ్చిందంటే పార్టీ పునాదివల్లనే. పార్టీలో పనిచేయటం, సాహిత్యం చదవటం మూలంగా ప్రపంచంలో ఎన్ని సాధకబాధకాలున్నయి సమాజంలో ఉండేటటు వంటి నిర్బంధాలు, స్త్రీల పరిస్థితి, పురుషులు – ఇవన్నీ అర్థం చేసుకోగల్గుతున్నాం. ఒత్తిడులకు లెక్కజేయకుండా బతకగలుగు తున్నాం. అందుకే నాకు జీవితంలో ఏదైతే కోల్పోరాదో ఆది కోల్పోయినప్పటికీ పార్టీ అంటే అభిమానం పోలేదు నాకు. వ్యక్తిపరంగా జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నప్పటికీ పార్టీ పూర్తిగా నా జీవితం ఇట్లా అవడానికి కారణం కాదుగదా.
అసలు మొదట్లో పార్టీ అంటే ఏం తెలియదు. ఏదో ఒకటి మంచిపని చేస్తున్నం కదా అని అనుకునేది. ఆ తర్వాత పార్టీ సాహిత్యం అదీ చదువుతుంటే అసలిప్పుడుండేటువంటి ప్రభుత్వం సంగతేంటి, ఏదో కొత్తరాజ్యం వస్తుంది, అందులో స్త్రీలకు, పురుషులకి సమానత్వం ఏ విధంగా వస్తుంది అనే విషయాలు మాట్లాడుకునేది. మాకు కూడా ‘మనవాళ్ళంతా ఈ పోరాటం చేస్తున్నరు కదా! పోరాటంతో తప్పకుండా మనకు సోషలిస్టు ప్రభుత్వం వస్తుందీ’ అనే దృఢవిశ్వాసం. ఈ పోలీసాక్షనయి పార్లమెంటు ఎన్నికలయిన తర్వాత నిజంగా అప్పుడు – ఆ ఊహలకు ఆలోచన్లకు ఎంత దెబ్బ! ఎంత ఇదయిపోయినం అని! పూర్తిగా చితికిపోయినట్టయ్యింది. కోడిగుడ్డు పట్టుకొని చితిపితే చితికినట్టు. ఈ పార్లమెంటు ఎన్నికలూ అవీ అయిన తర్వాత మేం ఎట్లయిపోయినమంటే ‘ఎక్కడున్నావే గొంగడీ అంటే వేసిన చోటనే కంబళీ.’
(‘మనకు తెలియని మన చరిత్ర’ నుండి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.