కృష్ణాబాయి
కుటుంబరావు తెనాలిలో పుట్టి పెరిగిన కాలంలో ఎన్నో సామాజిక సంచలనాలు, పెనుమార్పులు సంభవించాయి. వాటికి ప్రతిభావంతమైన ప్రతిఫలనం కుటుంబరావు కాల్పనిక, విశ్లేషణాత్మక రచనలు. ఆయన ఆలోచనలో, అధ్యయనంలో, అన్వయంలో స్పష్టత, సూటిదనం, విశ్లేషణ తొణికిసలాడతాయి. డజన్లకొద్ది పత్రికలలో, సంకలనాల్లో, సంపుటాల్లో అచ్చయి, ఎనిమిది వేల పేజీలకి మించి విస్తరించిన కెకె రచనలు తెలుగు సమాజానికి అతివిలువయిన సంపద. డబ్భయి ఏళ్ల జీవితంలో, యాభయి సంవత్సరాలు రచనాజీవితం గడిపిన కెకె, సాహిత్యంలో అన్ని ప్రక్రియల్నీ తడిమారు. కథలు 300 పైనే రాశారనీ సుమారు 230 కథలు అచ్చులో దొరుకుతున్నాయనీ అంచనా. 5 నవలలూ, 6 గొలుసు దిబ్బ కథలూ, 7 నాటికలూ, గల్పికలు సంపుటా లుగా దొరుకుతున్నాయి. కెకె సహస్రమాసజీవి కాదుగాని సహస్రవ్యాసజీవి.
”మన సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరికొందరు స్త్రీలుగా పుడతారు” అంటారు కెకె. ఇది సాదా సూత్రీకరణలాగా కనిపిస్తుందేగాని ఆడవాళ్ల నిజస్థితిని సూచిస్తుంది. మధ్యతరగతి బతుకుల్ని మార్క్సిస్టు కోణంనుంచీ పరిశీలించారాయన. వాళ్ల బాధలూ, గాధలూ, కష్టసుఖాలూ అన్నీ తన కాల్పనిక సాహిత్యంలో రంగరించి పోశారు. ”మధ్యతరగతి మగవాడే నాసి, ఆడది మరింత నాసి. పాతవిలువలూ, ప్రమాణాలూ నష్టదాయకంగా వున్నాయని తెలిసి కూడా మగవాడు ఒదులుకోలేకుండా వుంటే, నష్టదాయకంగా వున్నాయని తెలియనైనా తెలియని స్థితిలో వున్నది ఆడది. వీళ్లనీ వీళ్ల మూర్ఖత్వాన్నీ, దాన్ని ఎదిరించలేని భర్తల నిస్సహాయస్థితినీ కళ్లారా చూస్తున్నాను” అన్నారో వుత్తరంలో.
ఆయన నవలల్లో ఆయనకి బాగా నచ్చింది ‘వారసత్వం’. ఇది 2 తరాల కథ. భానుకి 11వ ఏటనే లక్షాధికారుల సంబంధం చేస్తాడు తండ్రి. అత్తింటివాళ్ల ఆస్తి హరించుకుపోతుంది. భర్త చనిపోతాడు. అనాథ భాను అత్తింట్లో పడుతున్న అగచాట్లు చూసి దూరపుబంధువు సుదర్శనం పట్నం తీసుకువెళతాడు.
కాలం మారినా, దురాచారాలు మారవు. భాను, మతాచారం ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోగూడదు. సుదర్శనం డబ్బుకోసం యిష్టంలేని పెళ్లి చేసుకున్నాడు. భాను సుదర్శనాలది సహజమైన కలయికే. కాని నీతిసూత్రాల ప్రకారం చెల్లదు. సుదర్శనం భార్య అతన్ని సాధిస్తుంది. వాళ్ల కొడుకు, కోడలు పాత్రలు అచ్చంగా వ్యాపార తరగతికి చెందినవి. మొగుడు రామదాసు నపుంసకుడైనా అతని డబ్బు, హోదాలతో తనకేర్పడే భద్రతకోసం అతని భార్యగానే చలామణి అవుతుంది బాల. అందంగా ఆరోగ్యంగా వున్న శాస్త్రి (భాను తమ్ముడు)ని శారీరకసౌఖ్యం కోసం బాల వాడుకుంటే, అతని శక్తియుక్తుల్ని తన వ్యాపారం కోసం వాడుకుంటాడు రామదాసు. సంఘం దృష్టిలో బాలపిల్లలు రామదాసు సంతానమే. ఆస్తికి వారసులు వాళ్లే. అటు సంతానం యివ్వడంలోనూ, యిటు వ్యాపారానికి తన తెలివి ధారపొయ్యటంలోనూ శాస్త్రిదే నిజమైన శ్రమ. తనకి పెట్టుబడి లేదు గనక, పుష్కలంగా పెట్టుబడి పెట్టగలిగిన రామదాసు చేతిలో పనిముట్టవుతాడు. మానవసంబంధాల్లో వుండే మార్దవాన్ని వ్యాపారసంబంధాలు పీల్చివేస్తాయి. ఎంతో సహజంగా వుండాల్సిన స్త్రీపురుష సంబంధాలు కూడా డబ్బువల్ల విషపూరితమవుతాయి….
తెలుగువారికి తనయులెకాని
తనయలు బిడ్డలు కారమ్మా!
ఆడపుటకే అపరాధం,
నీగోడు వినేవారెవరమ్మా
పోవమ్మా బలికావమ్మా
సంఘానికి దయలేదమ్మా!
అయ్యపు వెంకటకృష్ణయ్యగారి ఈ పాట ఆడజన్మకి నిర్వచనం. కెకెగారి రచన ‘ఆడజన్మ’లో ప్రధానపాత్ర లక్ష్మి అచ్చం అలాంటి అభాగ్యురాలే. ”పాపం, ఆ యింటివాళ్ల మొహాలు చూస్తే యింట్లో ఒక పిల్ల పుట్టినట్టు లేదు, పోయినట్టుంది గాని.” పదేళ్ల యీడుకే పుట్టెడు చాకిరి చేస్తుండే లక్ష్మిని కోడలిని చేసుకుందామను కునేవాళ్లు కొందరు. ”మంచి పనిమనిషి ఎవరినైనా ఆకర్షిస్తుంది కదా!” లక్ష్మి అత్తవారిల్లు వుమ్మడి కుటుంబం. ఇల్లు పట్టిన విధవాడపడుచుదే పెత్తనమంతా. లక్ష్మి మీద భర్తకి ప్రేమేకాని చనువివ్వడు – నెత్తినెక్కుతుందని భయం! తన తమ్ముడు తన భార్య మీద అఘాయిత్యం చేశాడని తెలీగానే బడితెపూజ చేస్తాడు – భార్య అనే తన సొత్తు మీద చెయ్యి వేసినందుకు. భ్రమర పుట్టిన అయిదేళ్లకి భర్త మరణిస్తాడు. కూతుర్ని తీసుకుని ఆ యింటినుంచి బయటపడుతుంది. తనమాదిరి కాగూడదని కూతురికి బాగా చదువు, సంగీతం చెప్పిస్తుంది. కాని ఆ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోలేక, సినిమా మోజుతో ఎవరితోనో లేచిపోతుంది భ్రమర. ఆ విధంగా జీవితంలోని వాస్తవికతకి దూరమై, వ్యాపారనాగరికతలో శలభంలా మాడిపోయి ఆఖరికి అమ్మ దగ్గరకి చేరుతుంది. కాని ప్రధానపాత్ర లక్ష్మిని యితర స్త్రీపాత్రలన్నీ యీసడించీ, పెత్తనం చేసీ పురుగేరేశాయి….
కుటుంబరావుగారి నవలిక ‘పంచకల్యాణి’ అయిదుగురు స్నేహితురాళ్ల కథ. చదువుకునే రోజుల్లో హాయిగా, స్వేచ్ఛగా, పిట్టల్లా ఆడుతూ పాడుతూండేవాళ్లు. అందరివీ మధ్యతరగతి జీవితాలే అయినా బోలెడు వైవిధ్యం వుంటుంది. ఎవరి పెళ్లీ సజావుగా జరగదు. ధనం అనే దుర్మార్గంలో పది మధ్యతరగతి జీవితాలు ఎలా నలిబిలి అవుతాయో యిందులో కనిపిస్తుంది. ఈడూజోడూ అయినవాళ్లనే పెళ్లిళ్లు చేసుకున్నా ధనం, హోదా, అంతస్తూ యివే చోటు చేసుకుంటాయి. ప్రేమ, అనురాగం మచ్చుకి కూడా కనిపించవు…..
‘పంచకల్యాణి’ యిప్పటి సమాజానికి అద్దం పడితే, ‘కురూపి’ ఒక రకంగా రాబోయే సమాజపు కథ. వెనకటి సమాజాల్లో అందవిహీనంవల్ల పెళ్లిళ్లు ఆగిపోయేవి కావు. మతాలూ, కులాలూ, ఆచారాలూ, సంప్రదాయాలూ – వీటికి అనుగుణంగా పెళ్లిళ్లు జరిగేవి. నేటి సమాజంలో డబ్బుననుసరించి జరుగుతున్నాయి. అందవిహీనత అనే ‘లోటు’ని డబ్బు కప్పిపెడుతుంది. పైతరగతుల పెళ్లిళ్లలో ఆస్తులు, అంతస్తుల ప్రమేయమే వుంటుంది. కింద తరగతిలో జీవితావసరాలు, ఆర్థికంగా వేణ్ణీళ్లకి చన్నీళ్లు తోడుకావడం ముఖ్యం. ఒక రకంగా మధ్యతరగతిలో మాత్రమే అందవిహీనత పెళ్లిళ్లకు అడ్డంకిగా తోస్తోంది. ఎంతో సామాజిక అవగాహన వుంటే గాని యిలాంటి కథ ఎవరూ రాయలేరు. స్త్రీ సమస్యని ఏనాడూ ఆయన స్త్రీకి మాత్రమే ప్రత్యేకించినదిగా చూడలేదు. స్త్రీ సమాజంలో అంతర్భాగమేననీ, ఆమె సమస్య సమాజసమస్యేననీ చాలా స్పష్టంగా రాశారు…..
‘నీకేం కావాలి?’ అన్నది కొత్త తరహా రచన. కస్తూరి పాత్ర మధురవాణిని తలపిస్తుంది. తన బతుకు గురించీ, స్వేచ్ఛ గురించీ కచ్చితమైన అభిప్రాయాలుంటాయి. కేవలం పొట్టకూటి కోసమే వేశ్య ఒళ్లు అమ్ముకుంటుంది గాని సంసారస్త్రీలాగా మనసు అమ్ముకోదు. స్వేచ్ఛ ఒదులుకోదు…..
‘అనుభవం’ కెకె చివరి నవల. ఏభైఏళ్లపాటు తెలుగుదేశంలో వచ్చిన సామాజిక మార్పులు సంసార జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో ఆయన యిందులో చూపారు. సంస్కరణోద్యమాలు, ఆర్థికసంక్షోభం, సాంఘిక చైతన్యం – వీటి నేపథ్యం కూడా యిందులో చిత్రించారు. ప్రధానపాత్ర పార్వతి తల్లి తరంలో సమాజం భూస్వామ్యవ్యవస్థ గుప్పిట్లో వుండేది. సానిమేళాలు పెట్టించడం, భోగంవాళ్ళని వుంచుకోవడం, దర్జాలూ దర్పాలకి విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం నాటి నాగరికత! పార్వతి మామ పైలాపచ్చీసుగా బతికాడు. భర్త ఆస్తి అంతా హారతి కర్పూరం చేశాడు. అటువంటి పెనిమిటితో కాపురం పార్వతి వూహకి అందదు. పాత సమాజంలోని దైన్యం, దుర్మార్గం, బానిసత్వం వ్యక్తి జీవితాన్ని ఎలా పట్టి పల్లారుస్తాయో గొప్పగా చిత్రించారు కెకె. వ్యక్తి స్వేచ్ఛ లేకపోవడంవల్ల పార్వతి జీవితం గిడసబారిపోయింది. ఆమె మనసు వికసించలేదు.
తన ముందుతరం, తన తరం అనుభవాలను నరనరానా జీర్ణించుకున్న పార్వతి తన కొడుకుని అలా కాకుండా పెంచాలని గట్టిగా కోరుకుంది. వేరే మూసలో పొయ్యాలనుకుంది. ఈ తరంలో నూతన చైతన్యం వెల్లివిరిసిందని గుర్తించలేకపోయింది. ”నాకొక్కటే విచారం నాయనా! నిన్నెట్లా పెంచాలో తెలియక దూరం చేసుకున్నా. మన అద్దెకున్న వాళ్లబ్బాయీ, తల్లీ ఎంత ప్రేమగా ఉంటారో చూస్తే ముచ్చటేస్తుంది” అంటుంది. ఇవాళ ప్రతి మధ్యతరగతి కుటుంబాన్నీ వేధించే తరాల అంతరాన్ని ఎంతో ముందుచూపుతో ఆనాడే పసికట్టి రాశారాయన పాతవ్యవస్థ వ్యక్తుల్ని విషపూరితం చేస్తే, పాత బూజు వదిలించుకోలేని వ్యక్తులు కొత్త వ్యవస్థకు తూట్లు పొడవాలని చూస్తారు. ఆ బూజు ఒదలాలంటే నూతన మానవుడిని మూస పొయ్యాలి…..
ఆయన చిత్రించిన మధ్యతరగతి స్త్రీల సమస్యలు అనేకం ఈనాటికీ పరిష్కారం కాకుండా వున్నాయి. సమసమాజం ఏర్పడే వరకూ, ఆ తర్వాత కొంతకాలం వరకూ కూడా అవి కొనసాగుతూనే వుంటాయి. కనకనే ఆయన విశ్లేషణకి ఎప్పటికీ చారిత్రక ప్రాధాన్యత కలిగే వుంటుంది. వుండనే వుంటుంది.
‘పంచకల్యాణి’లో ”డిగ్రీలు గల పిల్ల శీలం లేని దానితో సమానం” అంటుంది సుశీల. ఆనాటికి ఆ భావన వుండడం నిజమే. కాని ఇవేళ మధ్యతరగతి స్త్రీలలో చదువు, ఉద్యోగం జీవితావసరాలయిపోయాయి.
ఆయన రాసిన ఒక కథ గురించి ‘చెడిపోయిన మనిషి’ – ఆరోగ్యవంతమైన స్వేచ్ఛతో, పెళ్ళి చేసుకోకుండా వున్న తన కూతుర్నీ, తనకి ప్రాణం పోసిన డాక్టర్నీ (యీమె కూడా అవివాహితే) చెడి పోయిన మనుషులుగా భావించే పార్వతీశం డాక్టర్ దగ్గరకెళ్ళి తన అహం గురించీ, కూతురి గురించీ చెప్తాడు. ”మీ అమ్మాయి దగ్గరకి తిరిగి వెళ్లండి; ఆవిడ మానాన ఆవిడని బతకనివ్వండి. ఆడది పెళ్ళి చేసుకుని గృహిణి గానూ పిల్లల తల్లిగానూ బతకడం తప్ప మీరు మరో మాదిరి జీవితం వూహించలేకుండా వున్నారు… మీరామె జీవితంలో జోక్యం ఎందుకు కలిగించుకుంటారు?” అంటుంది డాక్టరు.
”కాని, మనిషికి కొన్ని కట్టుబాట్లుండవద్దా? ఒకరు చేసిన పనే అందరూ చేస్తే ఏమవుతుంది?” అంటాడు పార్వతీశం.
”ఎవరన్నారా మాట? అందరూ డాక్టర్లయితే ఏమవుతుందని నేననుకోలేదు…. మగవాడు ప్రభాకర్‌లాగే బ్రహ్మచారిగా ఉండిపోతే సంఘానికెంత నష్టమో నాబోటిదీ, మీ అమ్మాయి బోటిదీ పెళ్లి కాకుండా వుండిపోతే అంతే నష్టం…. మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ, సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేటట్టు చూసుకోవటమే సరి అయిన ప్రవర్తన. మిగిలిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి” అంది డాక్టరు. ”ఆ మధ్యాహ్నం జనతాలో పార్వతీశం తిరుగు ప్రయాణమైనప్పుడు ఆయన గొంతులో గరళం ఉండివున్న లక్షణాలేమీ లేవు” అని ముగిస్తారు కెకె. 1968లో రాసిన ఈ కథ ఇప్పటికీ ఇలాగే జరుగుతోంది కాదా?
ఆయన 1940లో రాసిన ‘తాతయ్య’ కథ – బ్రాహ్మణ కుటుంబంలోని పదేళ్ల బాలుడి దృష్టిలో అతని చుట్టూ వున్న ప్రపంచం గురించి. తన కథ చూసి తనకి తృప్తి కలగడం ఈ కథ రాసిన తర్వాతే మొదట జరిగిందని కెకె రాశారు. ”గురజాడ ‘దిద్దుబాటు’ లాగా, కె.కె. ‘తాతయ్య’ కథ ఒక మైలు రాయి” అన్నాడో ప్రముఖ రచయిత, విమర్శకుడు.
కొడవటిగంటి రాసిన ‘చదువు’ చాలా పేరు పొందిన నవల, ఇందులో సుందరం ‘చదువు’ అనే మూడక్షరాలలోనే ఒదిగి వుంటాడు. పరిసరాల్లోని సంఘటనలకి బానిస. ఆ చక్రానికి మధ్య వుంటాడే కాని దాన్ని ఎటూ తిప్పలేని దుర్బలుడు. అనుభవాలను స్వీకరించడమే కాని అనుభవాలని కలిగించడం అతనికి చేతకాలేదు. ఆత్మవిశ్వాసం లేనేలేదు. ఈ నవలలో, తెలుగు సీమ గ్రామ వాతావరణాన్ని రాజకీయ ఘటనలు కల్లోలపరచటం కుటుంబరావు సవివరంగా చిత్రించారు. బ్రిటిషు వాడు యుద్ధంలో (1914-18) గెలవగూడదనీ, కాని గెలుస్తాడనీ అనుకుంటున్న రోజులు, తిలక్ ప్రభావం అధికమై గాంధీని అంతగా పట్టించుకోని రోజులు – ఇవేవీ సుందరాన్ని తాకలేదంటే అవి వ్యక్తుల రూపంలో అతని గుండెని తాకకపోవటమే కారణమనాలి. గాంధీ సహాయ నిరాకరణోద్యమం మాత్రం మేనమామ జైలుశిక్షా, తమ పేదరికం ద్వారా సుందరాన్ని కదిలించింది. మేనమామ వైరాగ్యం, అతని అల్లుడి ఆశావహ దృష్టి ఇది రెండు తరాలకి సంకేతాలయితే, మూడవతరం ఆంధ్రదేశం లోకాక సుందరంపై చదువులకి వెళ్లిన బెనారస్ యూనివర్సిటీ హాష్టల్ గదుల్లో రాత్రుళ్లు వెదజల్లబడిన కరపత్రాల్లో దర్శనమిస్తుంది. నైతికబలానికి తోడు బాహుబలం తోడైతేనేగాని స్వరాజ్యం రాదనే టెర్రరిస్ట్ భావజాలం ఇది. మరింకే నవలలోనూ ఇంత విపులంగా ఒక మహోద్యమంలోని వివిధ దశల్ని వర్ణించే వీలు కెకెకి కలగలేదు.
కెకె ”భారత నారీత్వం స్పెషల్ రబ్బరు లాంటిది. ఎంత లాగినా తిరిగి యథాస్థితికి వచ్చి ఏమీ జరగనట్టుగా మసలుతుంది! దాన్నే మనవాళ్లు ఆకాశానికెత్తారు. ఇంకా ఎత్తుతున్నారు” అంటారు.
”ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు. అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసింది వివాహ వ్యవస్థ. అది లేకపోతే ఆడదాని బతుకింత లేత అరిటాకులాగా తయారు కాదు. వివాహ వ్యవస్థననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేశాయి” అంటారు స్పష్టంగా.
ఆయన ఎక్కువ భాగం ఉత్తమ పురుషలో రాశారు. ‘నేను’ అన్నప్పుడు మంచి పాత్రల్నే ఎన్నుకుంటారు. కాని కెకె నెగెటివ్ పాత్రలక్కూడా ‘నేను’ అని రాయడానికి వెనకాడలేదు.
వ్యవస్థలోని మార్పులకనుగుణంగా జీవితం కాలక్రమేణా మారుతుందనీ, అదే విధంగా సాహిత్య విలువలూ మారతాయని కెకె చెప్పారు. ఆ మార్పులకి కేవలం అద్దం పట్టడం కాక, అభ్యుదయ దృక్పథంతో సాహిత్యం అందుకు దోహదం చెయ్యాలని గట్టిగా చెప్పారు, అందుకే కృషి చేసిన ధన్యులాయన.
కొడవటిగంటి కుటుంబరావుగారి కథా నవలా సంపుటాలేగాక ఆయన వ్యాస సంపుటాలు కూడా చదవగలిగితే సమాజాన్నీ, ప్రపంచపోకడల్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం.
(సెప్టెంబరు నెల ప్రరవే హైదరాబాద్ నగరశాఖ, చర్చా కార్యక్రమంలో చదివిన ప్రసంగ వ్యాసం)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags