ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని ఢంకా బజాయించి చెప్పిన గురజాడ జీవితం 54 సంవత్సరాలకే ముగిసిపోవడం తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యంత విషాదమైన అంశం. గురజాడ కాలం నాటికి పౌరాణిక కథలతో, పద్యాలతో కాలక్షేపం చేస్తున్న తెలుగువారికి కందుకూరి, గురజాడల సాహిత్య ప్రవేశం చాలా విలువైంది. కందుకూరి నవల, ప్రహసనాలతో రంగ ప్రవేశం చేస్తే గురజాడ నాటకం, గేయం కథానికలతో ఆధునికమైన నూతన ప్రక్రియలతో తెలుగు వారికి కొత్త రుచులను అందించాడు. అభూత కల్పనలకు సమాధి కట్టి సాహిత్యం సామాజికం కావాలని పట్టుబట్టాడు. ”పుష్కలమైన, అనంతమైన సంఘటనలతో నిండివున్న ఎంతో గాంభీర్యమూ, వైవిధ్యమూగల నేటి జీవితాన్ని వీక్షించక ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ప్రాచీన కాల్పనిక కథల నుంచి రచయితలు యితివృత్తాలను ఎందుకు స్వీకరిస్తారో, అర్థం కాక నాకు ఆశ్చర్యం వేస్తుంది ” అంటాడు.
గురజాడ కన్యాశుల్కం, కొండు భట్టీయం, బిలవాణీయం నాటకాలు, ముత్యాల సరాలు, పూర్ణమ్మ, కాసులు, కన్యక, దేశభక్తి కవితలు దిద్దుబాటు, మెటిల్డా, మీ పేరేమిటి?, సంస్కర్త హృదయం, పెద్ద మసీదు అనే ఐదు కథలు రాసాడు. ఈ ఐదు కథలు సమాజంలోని భిన్న రంగాలకు చెందినవి. సౌదామిని అనే నవల కూడా రాసాడాయన.
గురజాడ కథలు ఒక్క పెద్ద మసీదు తప్ప మిగిలినవన్నీ స్త్రీ ప్రధానమైన కథలు. స్త్రీవాదం అనే పేరు అప్పటికి పోయినా ఈ కథలు స్త్రీ దృష్టికోణం నుంచి రాసినవి.
గురజాడ సాహిత్యం గురించి తలుచుకున్నపుడు, ఆయన సృష్టిించిన స్త్రీపాత్రలు మనసులో మెదలగానే మొట్ట మొదటగా కళ్ళ ముందు రూపుకట్టేది మధురవాణి. చతురత, విజ్ఞత, హాస్యం, తెలివితేటలు అన్నీ మూర్తీ భవించిన అపూర్వపాత్ర మధురవాణి. కన్యాశుల్కం నాటకాన్ని ఒంటి చేత్తో నడిపిస్తుంది మధురవాణి. ఎంతో చురుకైన, తీక్షణమైన మేధస్సు ఆమె సొంతం. మధురవాణి గురించి ఎందరో కుప్పలు తెప్పలుగా రాసారు. ఇంకా రాస్తూనే వున్నారు. భవిష్యత్తులో కూడా మధురవాణి విమర్శకులను వదిలిపెట్టే సమస్యే లేదు. అంత గొప్ప పాత్రని గురజాడ ఎంతో ప్రేమతో సృష్టించాడు.
అయితే ”మీ పేరేమిటి?” కథలో నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, వివేచనతో ప్రవర్తించే నాంచారమ్మ పాత్రను కూడా అంతే ప్రేమతో సృష్టించాడు గురజాడ. కానీ మధురవాణికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు నాంచారమ్మకి రాకపోవడానికి ‘కన్యాశుల్కం’ నాటకంగా ఆంధ్రదేశమంతా ప్రదర్శింపబడడం, మధురవాణి పాత్ర కళ్ళ ముందు ఆవిష్కృతమవ్వడం, ”మీపేరేమిటి?” కధారూపంలో వుండడం ఒక కారణం కావచ్చు లేదా దుడ్డు కర్రతో తిరగబడ్డ నాంచారమ్మ తెగువ సాహిత్య విమర్శకులకు కొరుకుడు పడకపోయి వుండొచ్చు.
ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అని గురజాడ చెప్పిన ఆధునిక స్త్రీ నాంచారమ్మే అనిపిస్తుంది నాకు. మత మౌఢ్యాల మీదే కాదు తమ మీద అమలవుతున్న సవాలక్ష ఆంక్షల మీద, హింసలమీద కూడా భారత స్త్రీలు ఇదే రీతిలో తిరగబడాలన్నది మహాకవి ఆకాంక్ష అయ్యుండొచ్చు.
”మీ పేరేమిటి?” కథలోని నాంచారమ్మ లాంటి పాత్రను సృష్టించడం గురజాడ బతికిన కాలం నాటికి చాలా కష్టమైన పని. ఆయన సృష్టించిన పాత్రలన్నీ ఒక ఎత్తు. నాంచారమ్మ ఒక ఎత్తు. సాంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలోకి కోడలుగా ఆ గ్రామంలో ప్రవేశించిన ఆమె అన్యాయాన్ని ఎదిరించడానికి సాంప్రదాయాన్ని లెక్కచేయదు. ఊరు ఊరంతా మత మౌఢ్యంలో పడి కొట్టుకు చావబోతున్న సమయంలో నాంచారమ్మ రంగ ప్రవేశం అద్భుతంగా వుంటుంది. శైవులు, వైష్ణవుల్లో తగాదాలు, మోతుబరుల కప్పదాట్లు భక్తి, మతం పేరుతో సాగే అకృత్యాలను ఎండగట్టడంతో పాటు గురజాడ ” ఏ దేవుడి మీదనైనా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే ఒక్క గండమే కాదు అన్ని కష్టాలను తరించవచ్చును” అని నాంచారమ్మ చేత అనిపిస్తాడు. ఊర్లోని అందరూ తన భర్తను, మామను నిప్పుల గుండం తొక్కించడానికి కుట్ర పన్ని నపుడు నాంచారమ్మ దుడ్డుకర్ర చేతబట్టి అక్కడ చేరిన వారినందరినీ తన వాదనతో బెదర గొట్టి, మూఢవివ్వాసాలను దుయ్యబట్టడంతోపాటు, నిజమైన భక్తికి, ఆరాధనకి మతాలు అడ్డు రావని ఒప్పిస్తుంది. అంతేకాదు వైషమ్యాలతో పరస్పరం తలపడుతున్న వైష్ణవుల్ని, శైవుల్ని తన మాటలద్వారా ఏకం చేసి పీరును గరుఢధ్వజంగా మార్పుచేసి సాయిబు చేత నిప్పుల గుండం తొక్కిస్తుంది. మానవత్వాన్ని నిలబెట్టుకోడానికి అవసరమైతే దుడ్డుకర్ర పట్టుకోవాలని చెబుతూ
”వేళకి భక్తి నిలుస్తుందో లేదో చేతికర్రలు మాత్రం మరవకండి” అని తన పక్షం వాళ్ళని హెచ్చరిస్తుంది.
ముమ్మాటికీ గురజాడ పేర్కొన్న ఆధునిక స్త్రీ నాంచారమ్మే అని నా బలమైన నమ్మకం. నాంచారమ్మ లాంటి సజీవ పాత్రను సృష్టించిన గురజాడ అత్యంత అభినందనీయుడు.
”గాలీ వెలుతురూ సోకకుండా మీ ఆడవాళ్ళను జనానా కొట్లలో ఎందుకలా బంధిస్తారు. కోళ్ళ గంపల్లో కుక్కితే కోళ్ళు సైతం ఉక్కిరి బిక్కిరవుతాయే. మరి మనుష్యుల మాట చెప్పేదేమిటి? స్వేచ్ఛ లేకపోతే ఎలాగ? ముందు తరాలవాళ్ళు గొప్ప వాళ్ళు కావాలంటే ఇప్పటి ఈ ఆచారాలు మారవద్దా” – గురజాడ లేఖలు
దాంపత్య జీవితంలోని అసంతృప్తులు, స్త్రీ పురుష సంబంధాలల్లోని అసమానత్వం, తారతమ్యాలు,వివాహ వ్యవస్థలోని లోపాలు ఆయన చక్కగా గుర్తించాడు. సాంఘిక దురాచారాలకు స్త్రీలే ఎక్కువ గురవుతున్నారని గ్రహించిన గురజాడ తన కథల్లోను, ఇతర రచనల్లోను స్త్రీ పాత్రనే ప్రధానం చేసాడు. స్త్రీలకు ప్రాధాన్యత నివ్వడం అంటే స్త్రీలకు లేని గొప్పతనాన్ని ఆపాదించడం కాదు. స్త్రీలకి ఎన్ని సమస్యలుంటాయో చెప్పడంతో పాటు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చెబుతారు.
భర్త ఏమి చేసినా సహించే పాతివ్రత్య లక్షణాలను తోసి రాజని, వేశ్యాలోలుడైన భర్తని అదిరించి, బెదిరించి సంస్కరించిన కమలిని పాత్ర దిద్దుబాటు కథలోది. మౌనంగా భర్త చేష్టల్ని భరించకుండా ఉపాయంతో, ధైర్యంగా తన సమస్యను పరిష్కరించుకుంటుంది. గురజాడ 1910లో దిద్దుబాటును రాసాడు. స్త్రీలు బేలగా కన్నీరు కార్చకుండా తమ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని చెప్పడంతోపాటు, స్త్రీ విద్య ప్రాధాన్యాన్ని, చదువుకున్న స్త్రీల చొరవని ఈ కథలో చక్కగా చెప్పాడు.
మెట్టిల్డా కథలో కథానాయిక మెటిల్డాకి ఒక ముసలి అనుమానపు మనిషితో పెళ్ళవుతుంది. ఈ కథ గురించి గురజాడ డైరీలలో ఒక చోట ఒక వంటలక్క చెప్పినట్లుగా రాసుకున్నాడు. ” ఈ విషాధగాథను విన్నంతనే నా హృదయభారం మిక్కుటమైంది. మనసులో ఏవేవో ఆలోచనలు చెలరేగి గుండెలో చేయిపెట్టి కలచినట్టయి కొంతసేపు అలాగునే నిలబడి పోయాను. భరించలేని విషాదానుభూతి కలిగింది.” అని రాసాడు మెటిల్డా గొప్ప సౌందర్యవతి. ముసలిభర్త అనుమాన పిశాచం. వాళ్ళింటికీ ఎవరూ వెళ్ళరు. ఆమె ఇంటి గుమ్మంలోకి కూడా రాకూడదని శాసిస్తాడు. కథను చెప్తున్న కథకుడు పక్కింటి నుండి మెటిల్డాను చూసి ఆమె అందాన్ని మెచ్చుకుంటాడు. ”ఈ ముండను తీసుకుపో. నీకు దానం చేసాను ఫో అంటాడు”
మెటిల్డా అతనికి తన వేపు చూడొద్దని తన సంసారం కూల్చొద్దని ఉత్తరం రాస్తుంది. ఈ ఉత్తరం చదివి భర్త మారిపోయినట్టు గురజాడ రాస్తాడుగానీ పురుషాహంకారం మూర్తీభవించిన కరకు పాషాణంలాంటి ఆ భర్త మారాడంటే నమ్మశక్యం కాదు. అయితే చిన్నవాళ్ళని పెళ్ళి చేసుకుని వాళ్ళని అణిచివేసే ముసలి భర్తల అమానవీయ, అహంకార పూరిత ప్రవర్తనను కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. అయితే మిగిలిన కథల్లోలాగ మెటిల్డాని చైతన్యం, చొరవ కల పాత్రలాగా ఎందుకు చిత్రించలేదో అర్థం కాదు.
”సంస్కర్త హృదయం” కథని గురజాడ ఇంగ్లీషులో రాసాడు. దీనిని అవసరాల సూర్యారావు తెలుగులోకి అనువాదం చేసారు. ఈ కథలో రంగనాథయ్యరు అనే ప్రొఫెసర్ సంస్కర్త. పుస్తకాలు, సిద్ధాంత పఠనం తప్ప సమాజ వాస్తవాలు తెలియవు. వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూంటాడు. అలాంటి వాడికి సరళ అనే అందమైన వేశ్య కంటపడుతుంది. ఏమి సౌందర్యం అని విస్తుపోయి వేశ్యలు ఇంత అందంగా వుంటారా ? అనుకుంటాడు. రంగనాధయ్యరు సరళను సంస్కరించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆమె ఇంటికి వెళ్ళి, ఆమెతో వాదనలు చేసి, ఆమె ఆదమరిచి ఉన్న వేళ ముద్దు పెట్టుకుంటాడు. పైగా ఆమెతో ”నువ్వు పెళ్ళెందుకు చేసుకోకూడదు” అంటాడు. దానికి ఆమె ”అంటే ఎవడో ఒక ఛండాలుడికి నేను కలకాలం పూర్తిగా బానిసనై పడివుండాలనా మీ తాత్పర్యం. నాలాంటి భోగం పిల్లను ఏ మర్యాదస్తుడు పెళ్ళాడతాడో చెప్పండి మీరే” అని కడిగేస్తుంది.(ఛండాలుడు అనే పద ప్రయోగం గురజాడ చేసి వుండకూడదు కానీ అప్పటికి అస్తిత్వ ఉద్యమాల స్పృహలేదు కాబట్టి ఆయన ఈ పదం వాడాడు.)
గురజాడ తన వ్యాఖ్యలో ” సరళ వేసిన ప్రశ్న రంగనాథయ్యరుకు యింతకు ముందెన్నడూ తట్టి వుండలేదు. ఈ సమస్యను సంపూర్ణంగా ఎన్నడూ చర్చించలేదు. వ్యభిచార నిర్మూలన ఎలా సాధ్యమో, ఎలా అసాధ్యమో అతను ఆలోచించలేదు. పుస్తకాలలోని సిద్ధాంతాలను వల్లెవేయడం తప్ప” అంటాడు. గురజాడ ఈ కథద్వారా సంస్కర్త డొల్ల విధానాల మీద దాడి చేసాడు.”పెళ్ళి చేసుకొని ఒక్కరికే బానిసవ్వాలా” అనే ప్రశ్నను సరళ చేత అడిగిస్తూ వివాహ వ్యవస్థలోని లోటుపాట్లను కూడా చెప్పిస్తాడు. ఈ కథలో వేశ్య అయినప్పటికీ సరళలో ఒక సున్నితమైన స్త్రీ మూర్తి కన్పడుతుంది.
గురజాడ సాహిత్య సృష్టికి మూలం స్త్రీ. స్త్రీలకు సంబంధించిన సమకాలీన సమస్యలన్నింటి గురించి ఆయన జీవితమంతా ఆలోచిస్తూనే వున్నాడనడానికి ఆయన లేఖల్లోను, రచనల్లోను ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి.
”శారీరకమైన శక్తిద్వారా కాక ఆత్మికమైన అసమ్మతిద్వారా జీవిత సన్నివేశం మీద విజయం సాధించిన స్త్రీల కథల్నే ఆయన చెప్పుకొచ్చాడని” అని చిన వీరభద్రుడు అంటాడు. అయితే గురజాడ స్త్రీ పాత్రలు కేవలం ఆత్మికమైన అసమ్మతితో ఆగిపోయేవి మాత్రమే కాక అంతకు మించి చతురత, విజ్ఞత, సాహసం మూర్తీభవించిన సజీవపాత్రలు.
‘స్త్రీలు మేలుకొనాలి.ఎదిరించాలి. తిరగబడాలి మానవత్వం ఆమెలో అధికం. ఆడది అబల కాదు” (సౌదామిని నవలలోంచి)
”స్త్రీ శరీర సౌఖ్యంపొందడం గొప్పకాదు
ఆమె మేధాశక్తిని గ్రహించి రసానుభూతిని పొందడం గొప్ప (గురజాడ లేఖలు)
మతం గురించి మత మౌఢ్యం గురించి ”మీ పేరేమిటి”లో ప్రశ్నించిన గురజాడ
”ఏనాడు బౌద్దం భారతదేశంలో తుడిచి పెట్టబడిందో ఆనాడే భారతదేశం మత విషయక ఆత్మహత్య చేసుకుంది.
మత విశ్వాసాలనేవి ఆచరణకు అసాధ్యమైనవి. గుదిబండలవంటివి. మానవుని ప్రేమించడమన్నది అతి సాధారణ జీవిత సూత్రం- ఒకరినొకరు ప్రేమించుకోవడం ఎంత మహత్తరమైనది”.
నార్లవారు చెప్పినట్టుగా ”గురజాడ కథల వెనుక ఒక జీవితకాలపు చింతన వుంది. అది పరి పరి విధాల కొనసాగిన చింతన కాదు. ఏకముఖమైనది. పరిపూర్ణమైన ఆధునికత నిండినది. అందులో రాజీపడే తత్వం లేదు. అంతా వర్తమానంతో ముడిపడ్డ భవిష్యత్తు. వర్తమానం వస్తువు. భవిష్యత్తు లక్ష్యం. గురజాడ శీలం విలక్షణమైనది. దుర్భలమైన శరీరం బలిష్టమైన హృదయం.”
ఒకటిన్నర శతాబ్దం కింద పుట్టిన ఈ మహామనిషి హృదయం నిండా పొంగి పొర్లిన ప్రేమ, మానవీయత తెలుగు సమాజాన్ని ఇంకా తడుపుతూనే వుంది. ఆయనను ఆర్తిగా, ఆర్ద్రంగా మనం తలుచుకుంటూనే వున్నాం. ఆయన ప్రస్తావించిన అన్ని సమస్యలు అలాగే వున్నాయి కాబట్టి మరో నూట యాభై ఏళ్లు మనం ఆయనను స్మరించుకుంటూనే వుంటాం.
”స్త్రీలు మేలు కొనాలని, ఎదిరించాలని, తిరగబడాలని, ఆడది అబల కాదని” పిలుపు నిచ్చిన మహాకవి సందేశాన్ని వినండహో” అని ఎలుగెత్తుతూ గురజాడ వెంకట అప్పారావుకి భూమిక ఆత్మీయ నివాళి ఇది.
-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags