సారా అబూబక్కర్ – శాశ్వత కీర్తి

రాజేశ్వరి దివాకర్ల

కన్నడంలోని సుప్రసిద్ధ ముస్లిం రచయిత్రి శ్రీమతి సారా అబూబక్కర్. ఈమె కథలు, నవల, వ్యాసం, అనువాదం ఇత్యాది అనేక రచనలను కావించారు. వీరికి ఈ నడుమ నంజనగూడు తిరుమలాంబ గారి పేరిట శాశ్వతి మహిళా అధ్యయన కేంద్రం వారిచ్చిన పురస్కారం లభించింది. శ్రీమతి నంజన గూడు తిరుమలాంబ కన్నడంలోని మొట్టమొదటి లేఖకి, సంపాదకురాలు, పుస్తక ముద్రణకర్త. సారా అబూబక్కర్ గారు ఇతర రచనలనెన్ని కావించినా, కథా, నవలా రచయిత్రిగా విశేషమైన ఖ్యాతిని గడించారు. వీరికి సాహిత్య అకాడమీ, అత్తిమబ్బె, అనుపమా, నాడోజు మొదలైన ఘన పురస్కారాలు ఇదివరలో లభించాయి. ఈ ‘శాశ్వతి’ పురస్కారం వీరి కీర్తిని మరింత ఉన్నతం కావించింది.

తోటి ముస్లిం అక్క చెల్లెళ్ళు మౌనంగా అనుభవిస్తున్న కష్టాలను సంవేదనలను, ప్రబలమైన కథలుగా, విస్తృతమైన నవలగా చెప్పవచ్చిన రచయిత్రి శ్రీమతి సారా అబూబక్కర్. వీరు తమ ఆత్మకథనానికి ‘ముస్లిం హుడిగి శాలె కలెతదు’్ద (ముస్లిం పిల్ల బడికెళ్ళింది) అని శీర్షికనిచ్చారు. తాము బడికెళ్ళి కావించిన విద్యాభ్యాసంతో, సంపాదించుకున్న పఠనాసక్తితో రచనలను చేయడమే కాదు, వాటికి చక్కని ప్రయోజనం చేకూర్చి మతఛాందసాలను, మూఢ నమ్మకాలనూ ప్రశ్నించారు. వీరి రచనలకు తాము బడికి వెళ్ళగలిగిన నేపథ్యం ఎంతగానో తోడ్పడింది. కనుక తమ ఆత్మకథకు ఆ శీర్షిక ఎంతగానో నప్పింది.

తరతరాలుగా సంప్రదాయం, కట్టుబాట్ల సంకెళ్ళకు లోబడి బాధతోనూ దుఃఖంతోనూ కుమిలిపోతున్న ముస్లిం స్త్రీలకు ప్రతినిధిగా సారా కలం పట్టడం కన్నడ భాష చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. సారా రాసిన అనేక కథల్లో చప్పలిగళు (చెప్పులు) కథాసంపుటం ముస్లిం భావజాలాన్ని అద్దంలా చూపుతుంది. ‘చంద్రగిరి తీరదల్లి’ అనే నవల వీరి మొట్టమొదట నవల. ఈ నవల ధైర్యంగా మతాధికారులను ప్రశ్నించింది. కొన్ని విషయాలపట్ల వారికి పునరాలోచనను కలుగజేసింది. కథరాసినా నవలను రాసినా సారా తాను ప్రత్యక్షంగా చూసిన మధ్యతరగతి స్త్రీల ముస్లిం సంవేదనలను పలికిస్తారు.

సారా కట్టుదిట్టమైన మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించారు. స్త్రీలు బయటకు వెళ్ళకూడదు, బుర్ఖా లేకుండా తిరుగకూడదు అని ఆంక్షలున్న ముస్లిం కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు. ఆమె భర్త సహాయంతో నగర గ్రంథాలయం నుండి పుస్తకాలను తెప్పించుకుని చదివేవారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త మంగుళూరు హార్బరులో పనిచేసినప్పటి ఐదు సంవత్సరాలు తమ బతుకులో బంగారు దినాలని వారంటారు. అక్కడ ఆమెకు తానే గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని చదివే అవకాశం కలిగింది. ఆ పుస్తకాలను చదువుతూ తాను త్రివేణి గారిలా ఎందుకు రాయకూడదు? కారంత్గారిలా తన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అక్కడ జన జీవితాన్ని గురించి ఎందుకు చెప్పకూడదు? అని ఆలోచించారు. తానున్న పరిసరాల్లోని ముస్లిం సమాజ చిత్రణను కావించాలన్న కోర్కె వీరికి గాఢంగా కలిగింది. చీకట్లో మగ్గిపోతున్న ముస్లిం స్త్రీల మౌనరోదనను ఎలుగెత్తి, గట్టిగొంతుతో వినిపించాలని వారు నిశ్చయించారు.

సారా అబూబక్కర్ 1972లో కథలు రాయడం మొదలు పెట్టారు. ఆ కాలంలోనే ‘లంకేశ్ పత్రిక’ ప్రారంభం అయింది. విప్లవ భావాలు కలిగిన లంకేష్ దళితులు, ముస్లింలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రభావితురాలైన సారా ముస్లిం జనాంగాన్ని గురించి ఒక వ్యాసం రాసి పంపారు. అది ఆ మరుసటి వారమే ఆ పత్రికలో వచ్చింది. ఆ సమయంలోనే బీజాపూర్లో ఉన్న నాజిమా భాంగి అనే మహిళ ‘ముస్లిం స్త్రీలు సినిమాలెందుకు చూడకూడదు?’ అని ఫత్వా వెలువరించింది. దానికి ప్రతిఘటించిన ముస్లింలు ఆమెను బహిష్కరించారు. ఆమెకు జరిగింది అన్యాయం అంటూ సారా, మరొక రచయిత్రి బానూ ముష్తాక్ ప్రతిస్పందించి రాసారు. అవి కూడా లంకేష్ పత్రికలో వెంటనే వచ్చాయి.

సారా రచనలో పదునుందని గ్రహించిన లంకేశ్, ఆమెను ముస్లిం జీవనాన్ని గురించిన నవల నొక్కటి రాసి ఇమ్మని అడిగారు. అప్పుడు సారా, ‘చంద్రగిరి తీరదల్లి’ నవలను రాసారు. ఆ కథ సారా హైస్కూలులో చదువుతున్నప్పుడు జరిగింది. ఆ కథలోని నాయిక అనుభవించిన దుఃఖం సారా స్వయంగా చూసింది. ఈ నవలలోని ‘తలాఖ్’ విషయాన్ని గురించి ఒక వ్యక్తి రచయిత్రికి లేఖను రాస్తూ అలాంటి నియమం ఉంది కదా! దానికి పరిహారమేమిటి? అని అడిగారట. ఒకేసారి మూడు మార్లు ‘తలాఖ్’ అని చెప్పే క్రమం తప్పు. ఆ పదాన్ని మూడు నెలల్లో ప్రత్యేకంగా చెప్పాలి అని వీరు సమాధానం రాసారట. ఈ నవలను చదివిన ముస్లిం పెద్దలు తమ మత నియమాలను గూర్చి పునరావలోకనం చేసారట. తాము 1974లో పై నవలను రాస్తే పది సంవత్సరాల తరువాత ఆ విషయాన్ని గూర్చి చర్చలు మరల జరిగాయట.

సారా కథల్లో దక్షిణ కన్నడ – కేరళ గడి ప్రాంతాల జనుల బతుకులు ప్రధాన కథా వస్తువులు. అక్కడి ముస్లింలు పేదరికం, నిరక్షరాస్యత మౌఢ్యాలతో వెనుకబడి ఉండడమే కాదు, మత ఛాందసత్వంతో అణచివేయబడ్డారు. వారి జీవితమంతా నమాజులతోనూ, మౌల్వీలు చెప్పే నిర్ణయాలతోనూ బద్ధమై ఉంటుంది. అక్కడ పురుషాధికారానికి తిరుగులేదు. తాను కళ్ళారా చూసిన వ్యవస్థలోని క్రౌర్యాన్నీ, యధేచ్ఛను సారా గాఢంగా, యథాతథంగా చిత్రించారు. పురుషాధికారం అన్నది దేశకాల మతాలను అధిగమించి సర్వత్రా కనవస్తున్నదే అయినా, ముస్లిం మత శాసనం స్త్రీల పట్ల చూపిన దాష్టీకం ఒక ప్రత్యేకమైన రూపాన్ని ధరించింది. ముస్లిం మత పెద్దల చండశాసనాలకు చిక్కుకున్న స్త్రీల నిస్సహాయత వీరి కథా కథనంలో అంతటా అల్లుకుంటుంది.

సారాగారి చంద్రగిరి తీరదల్లి (చంద్రగిరి తీరంలో)లోనైనా చప్పలిగళు (చెప్పులు) కథా సంపుటంలో నైనా, స్త్రీల బతుకును నిర్ణయించడంలోనూ, వారు ఘోషాను పాటించడం మొదలుకుని ‘తలాఖ్’ వరకుగల ప్రముఖ నిర్ణయాలను గైకొనడం వరకు పురుషుల అధికారమే కనిపిస్తుంది. వకాల్వీలు, భర్త, తండ్రి అందరూ ముస్లిం కుటుంబాలలోని స్త్రీల పట్ల చూపే చులకన భావం వారికి మానవత్వమే లేదన్న సంగతిని నిరూపిస్తుంది. చప్పలిగళు (చెప్పులు) కథలో హసన్ చ్యారీ తన అల్లుడు కబీర్తో ఇలా అంటాడు.

“ఆడవాళ్ళని కాళ్ళ చెప్పుల్లా ఉపయోగించాలి. కావలసినప్పుడు వాడుకుని తరువాత ఒక మూల వదిలేయాలి. అలా కాకుండా వాళ్ళని తలమీద కూచో పెట్టుకుంటే ఎలాగ..? చెప్పుల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి” కుటుంబ పెద్ద అయిన తండ్రికున్న ఈ కఠిన భావాలు కూతురి జీవితాన్ని నాశనం చేస్తాయనడంలో ఇక ఆశ్చర్యం ఏం ఉంటుంది.

సారాగారి కథల్లో పితృస్వామ్యం అనేక కోణాలతో స్త్రీల బతుకును దుర్భరం చేస్తుంది. ఒకవైపు మత నిబంధనలకు తల ఒగ్గిన అసహాయత్వం ఉండనే ఉండగా, ఘోషాను పాటించవలసిన అనివార్యత ఎంతగానో బాధిస్తుంది. స్త్రీల చలనగతుల పట్ల నిర్భంధం వారి స్వేచ్ఛను పూర్తిగా హరిస్తుంది. మగవారికి బహుభార్యత్వం ఎంతో అనుకూలంగా ఉండడం తలాఖ్ విషయంలో పురుషుని నిర్ణయమే పై చేయిగా ఉండడం, వీటికి తోడు పేదరికం, వారికి దిక్కుతోచని స్థితిని కలిగిస్తుంది.

సారా కథల్లో పురుషులు ధనార్జనకోసం గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళడం పరిపాటి. భర్తలు దూరమైన స్త్రీలు, ఒంటరి తనంతో, పొట్ట కూటికి, ఇల్లు గడవక కష్టించి పని చేయవలసిన తప్పనిసరి పరిస్థితులతో జీవితం సాగిస్తారు. వారికి, చదువు, తగినంత ఆర్థిక స్తోమతులేని కారణంగా నోరెత్తలేని నేపథ్యంలోనే తమ ప్రతిక్రియను తెలుపుతారు. ఇక భర్తలు దగ్గరున్న స్త్రీలు నిరంతరం బాలెంత, చూలెంత తనాలతో కృంగిపోతుంటారు. దీనికి తోడు ఆధునిక వైద్య శాస్త్ర పరీక్షలు వారికి కొత్త సమస్యలను తెచ్చిపెడతాయి.

‘చప్పలిగళు’ కథా సంకలనంలో ‘విజ్ఞాన భవిష్య నుడిదాగ’ (వైజ్ఞానికత భవిష్యత్తును చెప్పినప్పుడు) అన్న కథలో ఇద్దరు కూతుళ్ళను కన్నందుకు భర్తతో పదే పదే మాటలనిపించుకున్న మాలిని మూడోసారి గర్భం ధరించిన్పుడు, ఇష్టం లేకపోయినా భర్త బలవంతం మీద భ్రూణ పరీక్షను కావించుకుంటుంది. అతని ఆదేశానుసారం గర్భస్రావం చేయించుకుంటుంది.

ఆమెకు కలిగిన దైహిక శోషణనూ మానసిక ఆఘాతాన్ని లెక్కచేయకుండా భర్త ఇంకా అటువంటి పరీక్షలను చేయించుకోమని అన్నప్పుడు ‘భార్య అంటే ఏమిటి..?’ అని ఆలోచిస్తుంది. భార్య అంటే కొడుకుని కని ఇవ్వవలసిన యంత్రంగా భర్త భావించినందుకు ఎంతో విచారిస్తుంది.

సారాగారి నవల ‘చంద్రగిరి తీరంలో’ నాదిరా, తండ్రి, మత గురువులకున్న ప్రత్యక్ష పరోక్ష అధికారాలకు విలవిల లాడిపోతుంది. అల్లుడు తన రెండవ కూతురు పెళ్ళికి కావలసిన డబ్బును అప్పుగా ఇవ్వలేదన్న ఒకే ఒక చిన్న కారణానికిగాను, కోపం వచ్చిన నాదిరా తండ్రి కుయుక్తులను పన్ని నాదిరాను భర్తనుండి వేరు చేస్తాడు. కూతుర్ని ఇంటికి తెచ్చి పెట్టుకుంటాడు. భర్తతో సుఖంగా కాపురం చేస్తున్న నాదిరా ఈ హఠాత్పరిణామానికి కారణం తెలియక తల్లడిల్లుతుంది. తండ్రి అహం, అతని ముక్కోపం భర్త అసహాయత, తల్లిదండ్రుల మాటను జవదాటకూడదన్న నియమం అమాయకురాలైన ఆమెలో అలజడిని రేపుతాయి. అత్తింటికి భర్తకూ ఆమెకూ ఇలాగే దూరం పెరిగి పోతుంది. ఇంతలో నాదిరా అత్త ఆమెను మోసం చేసి నాదిరా బిడ్డను తీసుకుని పోతుంది. ఇవన్నీ చాలవన్నట్టుగా, ఆమె పరోక్షంలోనే నాదిరా తండ్రి ఆమెకు భర్తతో విడాకులిప్పిస్తాడు. ధనికుడైన ఒక ముసలివాడికిచ్చి నాదిరాకు వివాహం చేయాలని తలుస్తాడు. నాదిరా అందుకు ఒప్పుకోదు. కాని తలాఖ్ తీసుకున్న భర్త వద్దకు తిరిగి వెళ్ళాలంటే, ఆమె మరొకరిని పెళ్ళిచేసుకుని ఒక రాత్రి గడపాలన్నది వకాల్వీ ఆజ్ఞ. తన మీదకు ముంచుకు వచ్చిన అవాంతరాలకు తట్టుకోలేని నాదిరా మసీదులో ఉన్న చెరువులో పడి ఆత్మహత్యను చేసుకుంటుంది. నాదిరా బతుకిలా విషాదాంతమైనా సరే తండ్రి నాదిరా మనస్సును తెలుసుకోడు.

‘తిండీ బట్టా ఇవ్వడానికి ఎవ్వడో ఒక్కడుంటే చాలు. ఆడవాళ్ళు తమ బతుకుల్లో అంతకంటె ఎక్కువ ఆశించకూడదు. అన్న నాదిరా తండ్రిలాంటి వాళ్ళ ప్రభావం స్త్రీల మీద ఎంత గాఢంగా ఉంటుందంటే సాటి స్త్రీకి జరిగిన అన్యాయాన్ని స్త్రీలు కూడా సమర్థనీయమైన దృష్టితోనే చూస్తారు.

సారా కథల్లోనూ, నవలల్లోనూ స్త్రీలు సాధించింది ఏమీ లేదని మనం అనుకోకూడదు. ఎందుకంటే వారు మౌనంగానే అనేక సందర్భాల్లో ప్రతిఘటనను చూపుతారు. ఒక నిశ్శబ్దంలోనే మేలుకోవడం వీరి రచనలోని విశేషం. స్త్రీలను చెప్పులతో పోల్చిన తండ్రి మాటలకు మనసు విరిగిన నాదిరా తీవ్రంగా సంచలిస్తుంది. నాదిరా అకారణమైన దౌర్జన్యాన్ని ఎదిరించలేకపోయినా, ధార్మిక వ్యవస్థకు కేంద్రమైన మసీదు చెరువులో పడి ఆత్మహత్యను చేసుకోవడం ద్వారా తన తీవ్ర తిరస్కారాన్ని తెలుపుతుంది. ఆత్మహత్యతో తాను ఓడిపోయానని ఒప్పుకోవడం కాదు అని నిరూపించినట్లుగా తనకెంతో ఇష్టమైన చంద్రగిరి నదిని ఎన్నుకోకుండా, చనిపోవడానికి మసీదులోని నీటిలో పడుతుంది.

ఇందుమూలంగా నైనా తనకూ స్వేచ్ఛ అనేదొకటుందని ఋజువు చేయాలనుకుంటుంది. ‘అల్లా కరుణిస్తే’ మనం న్యాయం జరిగే రోజున కలుసుకుందాం అని ఆమె అన్న మాటల్లో తనకెంతో అన్యాయం చేసిన న్యాయాన్ని వెతికేందుకు ఆమె ఆత్మహత్యనే మార్గంగా ఎంచుకున్నందుకు హృదయం కలుక్కుమంటుంది.

తమ బాధలకు కష్టాలకూ పురుష ప్రధాన వ్యవస్థ ఆరోగ్యకరమైన బదులివ్వనప్పుడు సారా కథలలోని స్త్రీ పాత్రలు ప్రకృతితో సంబంధాన్ని కల్పించుకుంటాయి. ప్రకృతి వారి భావాలనెంతో సన్నిహితంగా అర్థం చేసుకుంటుంది. చాలా కాలం తరువాత చూసినా నాదిరా బిడ్డ తల్లిని గుర్తించడాన్ని చూసి ప్రకృతి “మూడు సార్లు తలాఖ్ అంటే వదిలేసి థూ అంటే విడిపోవడానికి ఇది ‘నిఖాహ్’ కాదు కదా! ఇక్కడ మనుషులను కలుపుతున్నది రక్తం అంటూ నిరూపక శైలిలో మాట్లాడుతుంది.

సారాగారి కథల్లో స్త్రీలు కష్టాలను గట్టి మనస్సుతో ఎదుర్కోవడం కూడా కనిపిస్తుంది. ‘ధర్మబలె బీసిదాగ’ (ధర్మం వలను విసిరినప్పుడు) అన్న కథలో ‘ఖతేజాబి’ ఎవ్వరెంత వత్తిడిని తెచ్చినా బాలికయైన తన కూతుర్ని ముదుసలి కిచ్చి పెండ్లి చేయడానికి ఒప్పుకోదు. భర్తను రెచ్చగొట్టి, ఆ ఆపదను నివారిస్తుంది. అలాగే సారాగారి కథలన్నీ పురుషద్వేషానికి అంకితమైనవి కావు. సానుభూతిని చూరగొన్న పురుష పాత్రలు కూడా తరచు కనబడుతూనే ఉంటాయి. ‘చంద్రగిరి తీరదల్లి’ నవలలో ‘రషీద్’ చప్పలిగళు కథలో ‘కబీరు’ ఇలాంటివారు, సారా స్త్రీ పురుషుల బాంధవ్యంలోని మధుర క్షణాలను కూడా ఎంతో ఉదాత్తంగా చిత్రిస్తారు. పురుషులు కూడా అనుభవంతో పాటు మృదువుగా మారతారని అనడానికి చంద్రగిరి తీరంలోని మహమ్మద్ ఖాన్ ఒక ఉదాహరణ, ముందు ముంగోపిగా క్రూరంగా ఉన్న అతను వయస్సు పెరుగుతున్న కొద్దీ పాశ్చాత్తాపాన్ని పొంతూడు. ఇలా తాత్వికంగా చేసిన పాత్ర చిత్రణ రచయి&రతి పరినతను తెలుపుతుంది.

సారాగారి కథలలోని స్త్రీలు కష్టాలను అనుభవిస్తూనే అపారమైన జీవన ప్రీతిని చూపడం అబ్బురమనిపిస్తుంది. పేదరికం, భర్తల బాధ్యతారాహిత్యం ఇవేవీ కూడా వారి హృదయాలలోని ప్రీతిని దూరం చేయవు. అతిథుల కోసం చేసే ప్రత్యేకమైన భోజనం మొదలుకుని బతుకులోని దీర్ఘ చింతలను సహించడం వరకూ ఈ పాత్రలెంతో జాగరూకతను వహిస్తాయి. తమ ఇంటి బాగోగులు, ఇంట్లో ఉన్న వాళ్ళ యోగక్షేమం, పిల్లల ఆలన పాలన, మాతృత్వం వంటి విషయాలలో ఎంతో నిండుతనం చూపుతారు. ఊరంతా బహిష్కరించినా ‘ఖతీజాబీ’ తన బిడ్డ యోగక్షేమమే తన క్షేమం అనుకుంటుంది. నాదిరా, తన భర్త బిడ్డలతో కలసి ఉంటే అదే స్వర్గమనుకుంటుంది. ‘చప్పలిగళు’ సంపుటంలోని కథ ‘విష ఉణిసువవరు’ (విషాన్ని తినిపించేవాళ్ళు) లో ఐసమ్మ కడు పేదరికంలో కూడా విశాల దృక్పథం కలిగి ఉంటుంది. ఆమె జాతి మతాల కతీతంగా ఆలోచించి మనం జాతి జాతి అని అంటాం, మనందరిని కలిపి పుట్టించిన ఆ దేవుడు ఏ జాతి? అని ప్రశ్నిస్తుంది. మరియమ్మన అళియ (మరియమ్మ అల్లుడు) కథలో ఒక్క పైసా కూడా ఆర్థికంగా సహాయం చేయని అల్లుడే అయినా తన కూతురు వివాహం సఫలమైనందుకు ఆమె సంతసిస్తుంది. ఇలా సారా కథలలోని స్త్రీ పాత్రలు తమ చుట్టూ ఉన్నవారి ఆనందంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటాయి.

సారాగారి భాష ఎంతో సరళమైంది. ఆమె చెప్పే విషయం సూటిగా ఉంటుంది. ముస్లిం సంస్కృతి, నుడికారంతో ఘోషణ, గోరీ, జన్నత్ బిరియానీ లాంటి పదాలు విరివిగా వస్తూనే ఉంటాయి. కథనెంతో నేర్పుగా ఎక్కడా జారిపోకుండా చెప్పే నేర్పు వీరికి సహజంగా వచ్చింది. వీరి కథనానికి పాఠకులు స్పందించకుండా ఉండలేరు. ఈ సంచలన స్వభావమే వీరి కథనానికి సౌందర్యం తెస్తుంది.

సారాగారి కథా కథన ప్రక్రియను ‘చికిత్స ప్రజ్ఞె’ (చికిత్సా కౌశలం) అని పేర్కొంటారు. తోటి స్త్రీల సమస్యకు పరిహారం చూపే తపనగల వీరు మంచి సమాజ శాస్త్ర పరిణతురాలిగా కనిపిస్తారు. ‘చప్పలిగళు’ కథా సంపుటంలో సమాజాన్ని మార్చడమే తన ధ్యేయమని రచయిత్రి పీఠికలో చెప్పుకున్నారు.

మనం అతిసామాన్యమని అనుకునే జీవితం కూడా ముస్లింల స్త్రీలకు లభ్యంకాని స్థితిని సారా ఎంతో చక్కగా చిత్రించారు. సారా కథను చెప్పేటప్పుడు ఎంతో సంయమనం పాటిస్తారు. స్త్రీల అణచివేతను చెప్పేటప్పుడు ఆమెలో ఆవేశం, కోపం కనిపించవు. పైగా ‘అయ్యో ఇలా అయిందా’ అలా కాకుంటే బాగుండేది అనిపిస్తుంది.

సారా అబూబక్కర్ కేవలం ఎస్.ఎస్.ఎల్.సి మాత్రమే చదివారు. వారికి ఏ స్త్రీ ఉద్యమాలతో సంబంధం లేదు. కాని వీరిలో వివేచన సాంస్కృతిక అధ్యయన శక్తి అపారం. ‘అతివల మూగ బాధను మాటల పల్లకీ నెక్కించి ఊరేగించిన ధీశాలి సారాకు ‘శాశ్వతి’ పురస్కారం లభించడం ఎంతైనా ముదావహం.

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో