మల్లీశ్వరి
తనొక ‘ఆంధ్ర చెగువెరా’నన్న స్పృహ మనలో కలిగించడానికి నిరంతరం తంటాలు పడే కధానాయకుడు పవన్‌కల్యాణ్, తన తాజా సినిమాలో పలికిన ఒక పాతడైలాగ్ పదే పదే ప్రొమోస్‌లో చూశాం మనం ” ఉంచుకోవడానికీ, ఉయ్యాలలూగడానికీ మీడియా ఎవరికీ ఉంపుడుగత్తె కాదు…” అన్న డైలాగ్ రాసిన రచయితకీ రాయించిన దర్శకుడికీ పలికిన నాయకుడికీ ధారాళమయిన ప్రేమతో ఆమోదించిన సెన్సార్ బోర్డుకి ఉన్న సాహసానికీ తెగువకీ ముచ్చట పడుతూనే మూలం ఏంటన్నది ఆలోచిస్తుండగానే ఇంతలో తెలంగాణ వాదులు ఈ సినిమాలోని కొన్ని అంశాలపై తమ అభ్యంతరాలు తెలిపారన్నది కొంత హడావిడిని సృష్టించింది. తెలంగాణ ఉద్యమం ఇపుడు చైతన్యవంతమైన దశలో ఉంది కాబట్టి ఎక్కడ తెలంగాణ వ్యతిరేకత వివక్షత కనబడితే అక్కడ ప్రశ్నించడం ఎదిరించడంలో చాలా చురుకుగా వ్యవహరిస్తోంది.
కానీ నిజానికి కేవలం తెలంగాణ ఉద్యమం మీదనే కాదు ఇపుడు ఉనికిలో ఉన్న అస్తిత్వ ఉద్యమాలన్నింటి మీదా, అత్యంత జుగుప్సాకరమైన అవహేళనతో తీసిన సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. సినిమా ప్రారంభంలోనే కుల పోరాటాల మీదా. కుల సమస్యల మీదా దర్శకుని దాడి మొదలయ్యింది. ఎస్.సి హాస్టల్ విద్యార్థులు, బి.సి హాస్టల్ విద్యార్థులు పనీ పాటా లేకుండా నిరంతరం కొట్టుకుంటూ ఉంటారన్న ‘కొత్త చీలిక’ని తనే తెచ్చి, ”అసలు బి.సిలకు ఒక హాస్టల్, ఎస్.సిలకు ఒక హాస్టల్ ఎందుకుండాలి?.. అందరూ కలిసే ఉండొచ్చు కదా! దీనికి సమాధానం ఎవరైనా సరే వచ్చి చెప్పండి?” అంటూ ఇంత లావు ఇనపరాడ్ పట్టుకొని ఐక్యతని ప్రబోధిస్తాడు కథానాయకుడు.
ఎస్.సిలు, బి.సిలు ఒక్కటేనన్న దర్శకుడికి తన మార్కు ‘సామాజిక న్యాయం’లో ఒ.సిలను కలవడానికి ధైర్యం చాలకపోయి ఉంటుంది కానీ అతని ఆంతర్యం రిజర్వేషన్ సిస్టమ్ మీద ఉన్న వ్యతిరేకతే అన్నది స్పష్టం. అక్కడ మొదలయిన ఈ సాహసదర్శకుడి యాత్రలో మరో మజిలీ స్త్రీల పోరాటాలు. మహిళా సంఘాలను, మహిళా ఉద్యమాలను చిత్రించడంలో తెలుగు సినిమాకి ఏనాడూ సమాజ వాస్తవికత భూమికగా లేదు. ప్రతీ దర్శకుడు తమకున్న నిశ్చితాభిప్రాయాలలోనుంచి పడికట్టుగా మాత్రమే చూశారు. ఈ దర్శకుడు కూడా ఆ ఫినామినాని ఛేధించకపోగా మరింత మెరుగుదిద్దాడు. స్త్రీవాదులు ప్రశ్నిస్తున్న, చర్చకు పెడుతున్న పలు అంశాలపై ప్రాధమిక స్థాయి అవగాహన కూడ లేకుండా వాటిని వక్రీకరించి ప్రతినాయకురాలికి ఆ లక్షణాలను ఆపాదించి పదే పదే ఒక రాడికల్ టోన్‌తో కించపరచడంద్వారా స్త్రీవాద మహిళా ఉద్యమాలపట్ల సమాజానికి వ్యతిరేకత కలిగేలా సందేశాన్ని ఇచ్చారు.
ప్రశ్నించే స్త్రీలను గయ్యాళులుగా, విలన్‌లుగా, క్రూరులుగా, చిత్రించే క్రమంలో స్త్రీత్వాన్ని మళ్ళీ మూసలోకి నెట్టే ప్రయత్నం ఈ చిత్రంలో చేశారు. ‘గంగ’ పాత్ర ఆద్యంతమూ పురుష సమాజానికి నచ్చే విధంగా నమూనీకరించడం, దానికోసం జరిగిన వెంపర్లాటే. ఒళ్ళు కనపడకుండా ఫాంటూ చొక్కాలు వేసుకొనే అమ్మాయిలు, బీరు తాగే అమ్మాయిలు, సిగ్గు అమ్మాయిలు, సెక్సప్సీల్‌ని ప్రదర్శించని అమ్మాయిల పట్ల మగవారికి ఆసక్తి ఉండదని కథానాయకుడు జ్ఞానబోధ చేయడం చూస్తే ఆధునిక స్త్రీత్వం పురుషుడి ఆధిపత్యాన్ని ఎంత అభద్రతకి గురిచేస్తోందో అర్థమై కొంత సంతోషం కలిగినా గంగ బెంబేలెత్తి పోవడం మనసుని చివుక్కుమనిపిస్తుంది.
ఇక ఈ సాహస యాత్రలో దర్శకుడు చాలా నిర్భయంగా కాలుమోపిన చోటు తెలంగాణ ఉద్యమం. అతను ఏ సమైక్యవాదో అయ్యుండి, అందరు కలిసి ఉండాలన్న ఆదర్శాన్ని నిజాయితీని నమ్ముతూ ఈ సినిమాని తీసి ఉంటే అర్థం చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకి ఇంత స్పేస్ అయినా మిగిలి ఉండేది. నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా ఉద్యమాన్ని వేర్పాటు వాదంగా, ఇతరుల హక్కులను గౌరవించని అప్రజాస్వామిక మయినదిగా, కేవలం పార్లమెంటరీ రాజకీయ ప్రయోజనాలకి మాత్రమే పరిమితమయినదిగా మభ్యపెట్టబూనడం చాలా ఆశ్చర్యకరం.
తెలంగాణ ఉద్యమాన్ని వ్యంగ్యంగా చులకన చేయడం, అవహేళన చేయడం ప్రధాన సూత్రంగా పెట్టుకొని ఆ క్రమంలో మిగతా అస్తిత్వ పోరాటాలను కూడా పనిలో పనిగా విమర్శించడం ఈ సినిమా ప్రధానోద్దేశ్యం. ప్రపంచీకరణ మనిషిని సమూహానికి దూరం చేసి ఒంటరిని చేస్తుందన్నది ఒక అవగాహన. ఆ ఒంటరితనాన్ని వ్యక్తివాదంగా తీర్చిదిద్దే శక్తికూడా దానికే ఉంది. వ్యక్తివాదం మూలంగానే రాంబాబులాంటి హీరోలు ఆవిర్భవించి కర్రలు, కత్తులు, రాడ్లు, తుపాకులు, పట్టుకొని బెదిరించి, భయపెట్టి, చావగొట్టి మరీ బలవంతంగా మనకి మంచిని కలగచేస్తారు. ‘సామాజిక బాధ్యత కాదు, వ్యక్తి బాధ్యత’ ముఖ్యమంటూ రెంటినీ విడదీసి చూసే (అ)జ్ఞానానికి పాల్పడతారు.
ఉద్యమ సందర్భాలలో ప్రజలు సమూహాలుగా కలవడం అంటే సినిమా ఎడిటింగ్ రూమ్‌లో కూర్చొని మౌస్‌తో క్లిక్ చేసి గ్రాఫిక్ ప్రజల సమూహాలను సృష్టించడం కాదని, తమ లక్ష్యసాధనకోసం ఏళ్ళకొద్ది మైళ్ళకొద్ది నడిచి పోరాడిన భిన్న సమూహాలన్నీ జనసంద్రమై కవాతు చెయ్యడమంటే, ఒక వ్యక్తి టివి ఛానళ్ళ ముందు నిలబడి ‘నువ్వురా.. నువ్వురా…’ అని పొలికేకలు పెడితే పరిగెత్తుకు వచ్చేసే అల్పత్వం కాదని తెలంగాణ యిష్టులకి అయిష్టులకీ అర్థమవుతూనే ఉంది.
అవసరాలో…
అపర రాబిన్‌హుడ్‌లమన్న భ్రమలో…
అడ్డుపడుతున్నాయిగానీ ఈ వాస్తవం పవన్ కల్యాణ్‌కీ, పూరీ జగన్నాథ్‌కి మాత్రం అర్థం కాదా ఏంటి??
Pingback: ప్రజా ఉద్యమాలకి ప్రతినాయకుడు పూరీ జగన్నాధ్ | జాజిమల్లి
వ్యాసకర్త, పవన్ కల్యాణ్ నీ, పూరీ జగన్నాథ్ నీ విమర్శిస్తున్నారన్న ఒక్క ముక్క తప్ప, మిగిలిన విషయాలు సరిగా అర్థం కాకుండా పోయాయి ఈ వ్యాసంలో. కారణం, హడావిడిగా, ఆవేశంగా వ్యాసం రాసెయ్యడమే. దూసేసిన మాటల వెనకాల అసలు పాయింటును దాచెయ్యడంతో, అది మామూలు పాఠకులను చేరడంలో విఫలమయింది. ఒక స్థాయికి వచ్చిన రచయిత్రులు, తాము విషయాలని ఎంత స్పష్టతతో పాఠకులకు చెబుతున్నామో పట్టించుకోరనుకుంటాను. టప టపా చెప్పెయ్యడమే కనబడుతోంది ఇక్కడ.
కాస్త తీరిగ్గా కూర్చుని, ఆలోచించి, స్పష్టతతో రాస్తే, ఈ గందర గోళం వుండదనుకుంటాను. రాసింది నాలుగు సార్లు చదువుకోవడం, వీలైతే తెలిసున్న వారి చేత చదివించడం, దిద్దుకోవడం, మామూలు పాఠకులు చదివితే వారికి ఎలా అర్థం అవుతుందీ అని ఆలోచించడం చేస్తే చాలా బాగుండేది.
రావు