ఎం. నాగమణి
నిర్లక్ష్యం నీ ఇంటిపేరా?
లేక నీ ఒంటిపేరా?
నిర్లక్ష్యంతోనే నీ జీవితమంతా
గడచిపోయింది.
నీలో ఉన్న అంతులేని
నిర్లక్ష్యపు వైఖరిని వీడవు
నువ్వే లోకమని,
నువ్వే సర్వస్వమని
నీ వెంట వచ్చిన
నీ సహచరినీ నిర్లక్ష్యం చేస్తావు
శ్రమ జీవుల కష్టాన్ని సైతం
పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్నావు
వారి కోసం పోరాడావు, గెలిచావు
నీవొక అభ్యుదయవాదివి, మేధావివి
అంతేకాదు అహంకారానికి పరాకాష్టవి కూడా
నీ అభ్యదయాన్ని చూసి
తాను గర్విస్తుంది,
నీ మేధాసంపత్తిని చూసి
ఆనందిస్తుంది, మురిసిపోతుంది.
నీ అహంకారాన్ని మాత్రం వ్యతిరేకిస్తుంది
నీ పరుష పదజాలానికి మౌనంగా రోదిస్తుంది.
జ జ జ
నీ అనురాగం కోసం
చకోర క్షిలా ఎదురుచూసే నీ సహచరిని
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు
నీకుండే సహజ నైజంతో నీవు
నిర్లక్ష్యపరిచినా….
వెరువక, బెదరక
తనకంటూ ఒక అభ్యుదయ
ప్రపంచాన్ని ఏర్పరచుకున్న
చైతన్యమూర్తి ఆమె!!
ఎండమావితో దప్పిక తీర్చుకోవాలనుకునే
అజ్ఞానివి నీవైతే
స్వచ్ఛమైన జలపాతపు
తుంపరనే అమృతమని
ఆస్వాదించే జ్ఞాని ఆమె!!
మిణుగురు పురుగుల వెలుగులో
ముందుకు నడవాలనుకునే
పిచ్చి బాటసారివి నీవైతే!
అభ్యుదయపు వెలుగులో
ముందుకు సాగుతూ
ఎప్పటికీ అలసిపోని, ఆగిపోని
నవ చైతన్యమూర్తి ఆమె!!
నీవెన్నటికీ ఒప్పుకోవు
ఆమె ఎదుగుదలను
ఆమె ప్రశాంతపు ప్రపంచంలోకి
తొంగి చూస్తావు అప్పుడప్పుడూ…
ఆ ప్రశాంత సరస్సులో
నీ పరుష పదజాలంతో
ఒక గులకరాయి వేస్తావు
ఆమె మనస్సు కల్లోలమవుతుంది
కానీ అది తాత్కాలికమే!
ఆమె తనదైన
అభ్యుదయ ప్రపంచంలో
సేదదీరుతుంది (రీచార్జ్ అవుతుంది)
అహంకారంతో చెలిమి చేసి
నీవు అశాంతి పాలవుతున్నావు!
ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తూ
విజయ దరహాసాన్ని చిందిస్తోంది.ఆమె ఓ సైన్యం
సి.హెచ్. సుజాత
చిట్టడవిలో చిరుతలు
చిరుత చిత్తమునకు ఓ చిత్రమైన వ్యాధి.
చిరకాలంగా వస్తున్న అంటువ్యాధి.
చిన్నదానిని
చిత్రహింసలు పెట్టే అనువంశిక వ్యాధి
చికాకు పెట్టి చిద్విలాసంగా బతికే వ్యాధి.
చిందులు తొక్కుతూ చితకబాదే మానసిక వ్యాధి.
ఈ చిత్రమైన వ్యాధికి
చికిత్స చేయడానికి ఓ వైద్య
చింతామణి సైన్యంతో వచ్చింది.
చిన్నదాని సిపాయిలంతా నిరాయుధులే
చీకూచింతలతో పోరాడే యోధులే
చిరుగాలికి వణికే చిగురుటాకులే.
చిక్కిన శరీరాల
చిరుతలను చిత్తుచేయవచ్చి
చిత్తరువులై నిలిచాయి.
చింక చూపులాడి
చిచ్చరకంటి అయ్యి
చిరుత చిత్తమునకున్న
చిడుములను చితాభస్మం చేసింది.
చికిలించిన కళ్ళతో చితక పట్టింది.
చిలుమును వదిలించింది.
చిటికెలేస్తూ
చిన్నమెదడుకు చికిత్స చేసింది.
చిత్రహింసలకు చిరునామా లేకుండా చేసింది.
చిలుక పలుకులు పలికించింది.
చిన్నదాని మాటలు
చిల్లగింజలై చింతలను శుద్ధిచేసాయి.
చిత్రమైన వ్యాధి చిన్నాభిన్నం అయ్యింది.
చిరుత చిత్తములో
చిరుజల్లు కురిసింది.
చిరుజల్లులో మానవత్వము చిగురించి
చిరుదివ్వెగా వెలిగింది.
చిట్టడవిలోని క్రూరజంతువులు
చివరకు సాధుజంతువులయ్యాయి.
చికిత్స చిరస్మరణీయమైంది.
చిదంబర రహస్యమేమిటంటే
చికిత్స పేరు ”షూట్ ఎట్ సైట్”.వారధి
కొలిపాక శోభారాణి
ఆమె… ఉదయాన్ని.. స్వాగతిస్తూ
వాకిలి.. తెరిచింది
స్వగతం…
బుడిబుడి నడకలు.. అడుగులతో
నడక… నడతా నేర్చుకుంది.
తెల్లనివన్ని.. పాలని. నల్లనివన్ని నీళ్లనుకుంది
ఎన్నెన్నో.. అటుపాట్లు.. ఎదురుదెబ్బలు
లోకాన్ని చదువుకుంది.
అభిమానాన్ని… ఆభరణంగా ధరించింది
కానీ.. నాన్నను పోగొట్టుకున్నప్పుడు..
ఉగ్గబట్టుకున్న దుఃఖం
అమ్మనూ… పోగొట్టుకొన్నప్పుడు..
పచ్చికుండై.. పగిలి పొగిలిపోయింది
కన్నీటిని రెప్పచాటుగా దాచుకొని
కష్టాన్నీ నెత్తికెత్తుకొంది.
ఏదేమైనా…
జీవితం ఎండమావి అయినా..
ఓ ఓయాసిస్సును ప్రస్తావించింది
గతానికి.. భవిష్యత్తుకు..
వారధిగా..
ఆమెను చేసింది
చిక్కని.. చీకట్లను.. తరిమె.. కిరణం..
తానైంది ‘చిన్ని’
వర్తమానపు వేగుపట్టుకొని..
మిరుమిట్లు గొలిపే..
వేకువకే వారి పయనం.
(ఉమకు)
బతుకునిచ్చిన భాగ్యనగరం
కవిని
ఓ భాగ్యనగరమా…!
నువ్వు ఎందరికో బతుకు నిచ్చావు.
నా జీవన సమరంలో నిలువనీడైనా లేని నాకు
నీ చల్లని ఒడిలో చోటిచ్చావు – లాలించావు.
నాఈ ప్రతిభా పాటవాలు నీవు పెంపొందించినవే..
నువ్వు గొప్ప తల్లివి… !
పుట్టిన ఊరును నేను చూడనైనా లేదు.
పెరిగిన ఊరును నేను కాదనుకున్నాను.
మెట్టినిల్లు నన్ను తరిమి తరిమి కొట్టింది.
అప్పుడు నువ్వే కదమ్మా…!
నీ చల్లని చేతుల్ని చాచి అక్కున చేర్చుకున్నావు.
నీ ఋణం ఎలా తీర్చుకోగలను..
నీ చల్లని ఒడిలో సేద తీరుతున్న బడుగుల బతుకులను
యదార్థ గాథలుగా అక్షరాలలో బంధించా…!
అయినా నీ ఋణం తీర్చుకోలేమో?
పెట్టుబడిదారుల బానిస చెరనుండి నిను విడిపించటానికి
ఎత్తిన పిడికిల్లలో నా పిడికిలి ఉంది…
తెలంగాణా ప్రజా వీరులకు జై అన్న నినాదాలలో
నా గొంతూ నినాదమైంది…
ఈ ఊపిరి ఉన్నంత వరకూ ‘అమ్మా హైద్రాబాద్’
నిన్ను నేను మరువను!