నరంలేని నాలికలకు వాతలు బెట్టాల్సిందే

జూపాక సుభద్ర

పత్రికలు, చానల్లు ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టు వాల్లు లొల్లిలొల్లిగున్నయి. ఆ లొల్లిలో బక్రాలవుతున్నది బలైతున్నది దళిత సమూహాలు. బాపనోల్లను కించపరుస్తూ ఏదో సినిమా వచ్చిందనంటే బాపనోల్లకంటే ముందుగా ధర్నాలుచేసి, కలెక్టర్లకు మెమోరాండాలిచ్చి బ్రాహ్మణభక్తిని చాటుకున్నయి దళితసంగాలు.

కాని దళితుల సమస్యల్ని, వారి మనోభావాలు దెబ్బతిన్నపుడో లేదా వారి అంటరానితనాల్ని ప్రశ్నిస్తూ వారికి మద్దతుగా బాపనోల్లు ఏనాడు నోరు తెరవలే, మద్దతు ఏరూపాన ప్రకటించలే. అయినా విశాల గుండెలు గొంతులున్న దళితులు అవి పట్టించుకునే పట్టింపుల్లో లేనివాల్లు. వారి స్వంత సమూహంలోని ఆడవాల్లను జోగినీలుగా చేసే దురాచారాన్ని నిరసిస్తూ యీ దళిత మగసంగాలు (మహిళా సంగాలు కూడా) ఏనాడూ గొడవచేయలే. వారు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు ధర్నాచేసే కలెక్టరేట్‌లోనే వందమంది జోగినీలొచ్చి తమ గోడును కమిషన్‌ ముందు చెప్పుకుంటుంటే స్వంతజాతి మగవాల్లు పట్టించుకోరు బాసటగా నిలుచోలే. మరి అన్ని సినిమాల్లో దాదాపుగా దళిత ఆడవాల్లని తక్కువచేసి, నీచంజేసి వాంప్‌లుగా చేసి మాట్లాడినపుడు దళితసంగాలు మాట్లాడవు. అది మాకు కులం బెట్టిన రీతి అని సర్దుకుంటున్నారా అని అనుకోవాల్సి వస్తది. మీడియా మాత్రం యీ దళితుల్ని ఎగదోసి ఎంజాయ్‌ చేస్తుంది.

‘హర్యానాలో దళిత పిల్లల్ని అత్యాచారాలు చేస్తున్నారు’ అనేదానిమీద లొల్లి జరగదు, నిరసనలుండవు. ఒకవేళ జరిగినా ఒక్కరోజుతో ముగిసిపోతవి. యీ అత్యాచారాలాగాలంటే బాల్యవివాహాలు జరగాలని ఛాప్‌ పెద్దలంటే దళిత పిల్లల మీద అత్యాచారాల మీది నిరసనలు ఎటో కొట్టుకపోయి ‘బాల్యవివాహాల మీద చర్చ మొదలైతది. అత్యాచారాలు దళిత అమ్మాయిల మీదనే ఎందుకు జరుగుతున్నాయి అనేది యీ కులసమాజానికి, మనువాద హిందూధర్మ రక్షణ సమాజానికి పట్టదు. దాన్ని చర్చ చేస్తే కులం పెంట పేగుల్ని తోడి క్లీన్‌ చేస్తే ఆధిపత్యాలు బత్కలేవు పీఠాలు కదులుతయి. అవి కదపలేక మిగతావాటికి వెతుక్కుని అసలుది పక్కన పడేస్తరు.

నాకాశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే దాదాపు పాతికేళ్ల కింద మధుర, రమేజాబి, మాయాత్యాగి అత్యాచార సంఘటనలో దేశంలున్న మహిళల సంగాలు పెద్ద ఎత్తున కదిలినవి చర్చలు, ధర్నాలు ఓ గోల గోల గొడవ గొడవ చేసి దేశాన్ని, సమాజాన్ని నిద్రబోనియ్యని పోరాటాలు చేసిన మహిళాసంగాలు హర్యానాలో అంతమంది దళితమ్మాయిలు అత్యాచారాలకు గురవుతుంటే పెద్దగా పట్టించుకోకపోవడం. యిక దళితసంగాలకైతే అసలు పట్టనే పట్టదు మా సమస్య కాదనేట్టుగానే వుంటయి. స్వంతజాతి జెండర్‌ పట్ల దళిత మగసంగాలు పోరాటాలు చేసింది (స్వంతంగా) తక్కువ.

దళితసంగాలు యీ సమాజాన్ని ప్రజాస్వామికంగా ఎలాంటి అసమానతలు లేకుండా వుండే ప్రాపంచిక దృక్పథాన్ని అందించాల్సిన అవసరముంది. చరిత్రలోకూడా దళిత సమూహాల పోరాటాలన్నీ యీ తాత్వికాలతోనే జరినయి. ఓడించబడి, బహిష్కృతులుగా, వూరి సమూహానికి బైట బత్కిండ్రు. అలాంటి అమానవీయ పెయిన్స్‌ వున్న దళితులు కుల, మత, జెండర్‌, ప్రాంత అసమానతల మీద పోరాడాల్సి వుంది. కాని యీ మధ్య పూర్ణానందస్వామి యాత్రను స్వాగతించడం, అంబేద్కర బొమ్మకి పూలమాల వేయించడం దళితజాతులందరికి అవమానం. హిందూయాత్ర చేసే పూర్ణానందకు బతికినంత కాలం హిందూ వ్యతిరేకిగా బతికిన అంబేద్కర్‌ని ముట్టుకునే అర్హత లేదు. కాని కొంతమంది దళితుల దన్నుతో ఆ పనిచేయడం బాకున కుమ్మిన బాదనే పడినారు దళితులు. అందుకే పూర్ణానంద చర్యని ఖండించారు. నిజానికి ఒక దళితసంగానికి పోయివుంటే యితర దళితసంఘాల ఖండనను గౌరవించి వుండాల్సింది. కాని అట్లా జరగక స్వంత దళిత సంగాల మీదనే లేవడం దురదృష్టకరము. పూర్ణానందను నెత్తినెత్తుకోవడం అంటే దళితుల్ని యింకా పాతాళంలోకి తొక్కడమే. హిందూ ధర్మం కులధర్మం అనీ దానివల్లనే మనుషులకు అంటరానితనాలొచ్చినవనే పోయి, దాన్ని నిర్మూలించాలనే అవగాహన లేకుంటే దళితులకు విముక్తి యింకా ఎన్నివేల ఏండ్లు పడ్తుందో.

ఒక దళిత, సీనియర్‌ మంత్రి, మహిళ అనే విచక్షణ కూడా మరిచి తెలంగాణ ఉద్యమ పటేలు నాలికకు నరం లేకుండా కర్రు కాల్చి వాత బెడ్త, గొప్ప తెలంగాణ ఉద్యమ తల్లికి ఎట్ల బుట్టిందో యివి తన కులం ఆడవాల్లను ఎట్ల బుట్టిందో! వాతలు పెట్టాలనే ప్యూడల్‌ మాటలు అనగలడా! అని బతకగలడా! దళిత మహిళల్ని ఏమయినా అనవచ్చనే కులసమాజం యిచ్చిన దమ్ముతోనే పటేలు అట్లా మాట్లాడిండు. హింసలు బెట్టిన పురాభావాలు, దళితుల పుట్టుకలు విలువైనవి కావనే దృష్టికోణాలు ఏంజేసినవి. అంత గొప్ప మహిళ అని ఈశ్వరీబాయి గురించి మాట్లాడినోల్లు ఈశ్వరీబాయి జయంతులు, వర్దంతులు చేసి ఆమె స్ఫూర్తిని బైటకు తీసుకొచ్చారా? వాల్ల సంగాల ఆఫీసుల్లో, పార్టీ ఆఫీసులో ఆమె ఫొటోలు పెట్టుకున్నారా? అట్లాంటి గౌరవ ఆదర్శాలే కనబర్చరు ఆచరణలో. దళితులు ఎట్లా నమ్మగలరు యిట్లాంటి వాల్లను. క్షమించమంటే పోతదా తప్పు. ఆచరణలో కనబర్చాలి. దళిత ఆడవాల్లు మంచి బట్టలు కట్టుకున్నా కళ్లమంటే. యిదంతా కుల అహంకారమే. ఉద్యమ పేర్లు పెట్టుకొని కమ్యూనిస్టు పేర్లు పెట్టుకున్నవాల్లు కూడా అనడంని నిలదీయాల్సిందే.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to నరంలేని నాలికలకు వాతలు బెట్టాల్సిందే

  1. Visakha says:

    ఈ రచయిత్రి లో చిత్తశుద్ది లోపించింది. దళితులు అని సంభోదించిన సంస్కారం , బ్రాహ్మణులు అని సంభోదించడానికి లేకపోయింది. అలాగే బాపనోళ్ళు అని ఒకచోట , బ్రాహ్మణులూ అని వేరొకచోట రాసారు. అన్నిచోట్ల ఒకలాగానే రాస్తే కొంచం పక్షపాత ధోరణి లేకుండా వుండేది. అదికాక తప్పు అని ఎవరైనా నమ్మితే , ఆ నమ్మినవాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినా తప్పుని ప్రతిఘతించవచ్చు.
    అంతేకాక సమాజం లో దుష్ట సంప్రదాయాలని చాల మంది మహానుభావులు (స్త్రీ , పురుషులు) ఖండించారు. అందులో అన్ని సామాజిక వర్గాలవారు వున్నారు.
    సరే , రచయిత్రి చెప్పినట్టు దళితులకి ఎవ్వరు సహాయం చేయలేదనే అనుకుందాం. అప్పుడు దళితులు బ్రాహ్మణులకు మద్దతు ఇస్తే అది వారు కులాలకి అతీతమైన సంస్కారాన్ని చూపించడం అవుతుంది. అది మనం కోరుకుంటున్న సమాసమాజం.
    ఈ వ్యాసం భూమిక లో రావటం దురధృష్టం.

Leave a Reply to Visakha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.