గురజాడ వారి బుచ్చమ్మ

అయ్యగారి సీతారత్నం

కన్యాశుల్కంలోని బుచ్చమ్మ అనకుండా గురజాడ వారి బుచ్చమ్మ గురించి మాట్లాడమన్నారు, రాజాం సభలో రామినాయుడు గారు. బహుశా కన్యాశుల్కం అంటే ‘కన్యాశుల్కం’ సినిమాలోని బుచ్చమ్మ అనుకొంటారేమోనని అయివుంటుంది. నిజానికి గురజాడ భావజాల స్థాయిని ఏమాత్రం అందుకోలేకపోయింది తెలుగు సినిమా.

స్త్రీవాదులు వచ్చేదాకా తెలుగుసాహిత్యం కూడా గురజాడని స్త్రీల విషయంలో అందుకోలేకపోయింది. కన్యాశుల్కంలో మధురవాణి ఆకర్షించినంతగా విమర్శకుల్ని బచ్చమ్మ ఆకర్షించలేదు. ఒక అమాయక పాత్రగా మాత్రమే పరిగణించారు. వోల్గాలాంటి మేధావులు కూడా గిరీశం మాటలకి ఔనుకాబోలు…. అని అతనితో వెళ్లడం తప్ప ఆ పాత్ర ఏమీ చేయలేనిదిగానే గుర్తించారు.

అయితే గురజాడ అసలు కన్యాశుల్కం నాటకం ఎవరికోసం రాసారు? అని ప్రశ్నించుకొంటే కన్యాశుల్కానికి బలి అయి పోయిన బుచ్చమ్మ లాంటి స్త్రీల కొరకే అనేది స్పష్టం. వారి పట్ల ఆర్ద్రతతోనే, వారి జీవితాలలో మార్పుకోసమే, వారి జీవన సమస్యల పరిష్కారం కొరకే కలం పట్టారు. ఇలాంటి స్థితి మారాలనే సుబ్బి పెళ్లి ఆపడమనే అంతర్నాటకాన్ని సృష్టించి పాఠకులికి కన్యాశుల్కం పట్ల పూర్తి ఏహ్యభావాన్ని కలిగించారు. కన్యాశుల్కానికి బలి అయిన ముగ్గురు విధవలు మీనాక్షి, పూటకూళ్లమ్మ, బుచ్చమ్మల ద్వారా కన్యాశుల్కం, బాల్య వివాహాల వలన స్త్రీలు ఎదుర్కొంటున్న లైంగిక అణచివేత, లైంగిక దోపిడి, అనారోగ్యం… వీరిలో ఏర్పడిన మోరటుదనం చిత్రించి వైవిధ్యభరితమైన నాటి సామాజిక జీవన చిత్రాన్ని కళ్లముందుంచారు. మీనాక్షి ద్వారా గర్భస్రావాలు… అనారోగ్యం, అపహాస్యం, పోలీసుల బాధ… పూటకుళ్లమ్మ పాత్ర ద్వారా మోసపోవడం… దాని వలన ఏర్పడిన మొరటుదనం, బుచ్చమ్మలో ఆలోచనతో కూడిన బాధ్యత… చూపించారు.

ముగ్గురూ ఒకే కులానికి చెందిన విధవ స్త్రీలే అయినా మానవ నైజపరిశీలనా శక్తితో వారిలో భిన్న పార్శ్యాలూ చూపించారు గురజాడ. బుచ్చమ్మ పాత్ర ద్వారానే స్త్రీలకి ఒక విశ్వజనీనమైన పరిష్కారాన్ని చూపించారు రాచమల్లు రామచంద్రారెడ్డి లాంటి వారు మాత్రం కన్యాశుల్కంలో యే సమస్యకూ పరిష్కారం చూపలేదు అనడం ఆశ్చర్యమే. అలాగే శ్రీశ్రీ లాంటి వారు కూడా దీనిని విషాదాంత నాటకంగా పరిగణించడం ఆశ్చర్యకరమే. సామాజిక విషాదం నాటకంలో హస్యపూరితంగా చూపించారే గానీ ఇది విషాదాంత నాటకం కాదని బుచ్చమ్మ పాత్ర మొత్తం పరిశీలిస్తే స్పష్టమవుతుంది. అయితే మోదాంతం, లేదా విషాదాంతం… అని రెండు విధాలైన నాటకాలే మనం గుర్తించాం. కానీ నిజానికి ఆధునికతత్వాన్ని జీర్ణింపజేసుకొన్న క్రాంతదర్శియైన గురజాడ ‘చైతన్యద్యోతక నాటకం’గా దీన్ని తీర్చిదిద్దారు. బుచ్చమ్మకి గిరీశానికి పెళ్లిచేసేస్తే బహుశా మోదాంత నాటకం అనేవారేమో! కానీ అది చాలా అన్యాయమైన ముగింపు. సౌజన్యరావు పంతులు గిరీశం గురించి మధురవాణిని అడిగినపుడు ఆమె నిజం చెప్పకుండ ‘బతకనీయండి’ అంటుంది. అపుడు సౌజన్యరావు ”వీడు అవ్యక్తుడైతే పాపము ఆ బుచ్చమ్మ బతుకు చెడుతుంది. అది ఆలోచించావు కావు” అని చెప్పి నిజం తెలుసుకొంటాడు. అప్పుడు గిరీశాన్ని పిలిచి నిజస్వరూపం బయట పడినదని తెలుపుతూ ”బుచ్చమ్మను పూనాలో విడోస్‌ హోమ్‌కు పంపమనీ నీ గురువుగారి పేర టెలిగ్రాం యిస్తాను. ఆమె చదువు కొని ప్రాజ్ఞురాలై తన యిష్టము వచ్చిన వారిని పెళ్లి చేసుకొంటారు. లేకుంటే మానతారు”… అని చెప్పి ”దుర్మార్గుడైన నీ చేతిలో పడకుండా బుచ్చమ్మని కాపాడింది” అని మధురవాణిని మెచ్చుకొంటారు.

స్త్రీలకి పెళ్ళి విధాయకంకాదనే విషయాన్ని గురజాడ ”నచ్చిన వారిని చేసుకొంటారు లేదా మానుకొంటారని” బుచ్చమ్మ పాత్ర ఆధారంగా స్పష్టం చేసారు. గురజాడ చెప్పిన ఈ విషయాన్ని స్త్రీవాదులు ముఖ్యంగా మన వోల్గా వంటి వారు పట్టుదలగా అందించారు గానీ అంతవరకు మిగిలిన వారు గ్రహింపలేరు. సినిమాలయితే మరీఘోరం. కన్యాశుల్కం సినిమాలో గిరీశంలాంటి దుర్మార్గుడికి బుచ్చమ్మని ఇచ్చి పెళ్లిచేసి ఆమె గొంతు కోసి విషాదాంతం చేశారు. నిజానికి ఆ పెళ్లి చేయడంతో ప్రేక్షకుడి మనసుకి హమ్మయ్య అని తాత్కాలికంగా అన్పించి అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తాడు. అదే గురజాడ ఇచ్చిన ముగింపు బుచ్చమ్మలాంటి జీవితాల పట్ల ఒక ఆలోచన కలుగుతుంది. ఆలోచనామృతమైన సాహిత్యం ఆలోచనని అందించాలి. అత్యాచారం చేసినా, మోసం చేసినా, దుష్టుడైనా, స్మగ్లరైనా వాడితోనే మౌన పోరాటాలు చేసో మరొకటి చేసో తాళి కట్టించడం లాంటి ముగింపు గురజాడ లాంటి క్రాంత దర్శి ఇవ్వడు. వితంతు వివాహం అవలేదు కాబట్టి పరిష్కారం లేదని అనడం నిజంగా చాలాదారుణం. వితంతు సమస్య పరిష్కారానికి మూలమైన కన్యాశుల్కం, బాల్య వివాహం రద్దవడం, విద్యావంతురాలవడం మాత్రమే పరిష్కారంగానీ ఎవడికి పడితే వాడికి ఇచ్చి తాళికట్టిం చేయడం పరిష్కారం కాదనే స్పష్టమైన అవగాహన ఉంది. గురజాడకి విద్యావంతురాలవడం కాదు. ప్రాజ్ఞురాలవ్వాలనేది నాటకలక్ష్యంగా తెలిపారు. మొదట అగ్నిహాత్రావధాన్లుతో సాజన్యరావు మాట్లాడినపుడు బుచ్చమ్మ గురించి విద్యావంతురాలవుతుందని తర్వాత మధురవాణితో మాట్లాడిన పిమ్మట ప్రాజ్ఞురాలవుతుందని పేర్కొన్నారు. కేవలం డిగ్రీల విద్య లాభంలేదనీ సందర్భానుసారంగా తన జీవన సమస్యల్ని పరిష్కరించుకోగలిగి అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలిగే శక్తి లేదా ప్రజ్ఞ స్త్రీలకి అవసరమని తెలిపారు. అంతేకాదు. స్త్రీకి సంపాదన ఉంటే హాయిగా దోపిడి రహితంగా ఉండడానికి అవకాశంలేదని కూడా ‘పూటకూళ్లమ్మ’ పాత్ర ద్వారా చెప్పారు. నిజానికి పూటకూళ్లమ్మకి ఎలాంటి పరిష్కారం లేదు. ప్రస్తావన లేదు నాటకం చివర పూటకూళ్లమ్మ నేటి భాషలో చెప్పాలంటే ‘ఎంటర్‌ప్రెన్యూర్‌’. తనకున్న నైపుణ్యాన్ని నాటి అవసరానికి తగినట్లుగా మార్చుకొని గిరీశంలాంటి వాళ్లని పోషించింది. కొత్తగా వచ్చిన ఉద్యోగి వర్గం, అప్పటికి ఇంకా వదలుకోలేని కులనియమాలు వలన పూటకూళ్లమ్మ అవసరం నాటి సమాజానిది. గిరీశం లాంటి వ్యక్తి మోసం తెలిసాక వెతికి మరీ చీపురు కట్ట తిరగేసింది. పూటకూళ్లమ్మకి కుటుంబ అణచివేతాలేదు. ఆమె గిరీశం నుండి కూడా బయటపడింది. పాత్ర సంచలనం ద్వారా తెలుస్తుందీ విషయం. అయితే పరిస్థితుల వలన ఆమెలో మొరటుదనం కన్పిస్తుంది. ఒంటరిగా ఉన్న పూటకూళ్లమ్మ ఆ మొరటుదనం లేకపోతే ఆ మాత్రం బ్రతకలేదేమో!

బుచ్చమ్మ పాత్రలో మాత్రం సంచలనం ద్వారానో, ఆమె సంభాషణ ద్వారానో చైతన్యం కనబరచలేదు. చైతన్యం అనేది పాత్ర స్థితినిబట్టీ ఉంటుంది. గురజాడది వాస్తవిక దృష్టి అనంతర కాలంలో లాగ సిద్ధాంతం కోసమో, మరొకదాని కోసమో పాత్ర చేత విపరీతంగా మాట్లాడించి, పోరాటపటిమనో, మరో చైతన్యాన్నో గురజాడ ప్రదర్శించరు. బుచ్చమ్మ కుటుంబ పరిధిలో విపరీతమైన అణచివేతకి గురికాబడిన పాత్ర. అసలు బుచ్చమ్మ మొదలు దర్శనమీయదు. కరటకశాస్త్రి సంభాషణలో కన్పిస్తుంది. అగ్నిహాత్రావధాన్లు. కరటక శాస్త్రి సంభాషణలో ఆమె పట్ల అణచివేత ముఖ్యంగా తండ్రి ఏ విధంగా అణచివేస్తున్నాడో తెలుస్తుంది. అసలు అగ్నిహాత్రావధాన్లు ఎవరినైనా తృణీకరించే ఆధిపత్యధోరణి కలవాడు. బుచ్చమ్మ ఉనికి ఏ మాత్రం సహించడు. ఆమెకి విలువీయడు. ఇది బుచ్చమ్మ పరిచయ సన్నివేశంలోనే తెలుస్తుంది.

బుచ్చమ్మ తండ్రి అగ్నిహాత్రావధాన్లు కొడుకు చదువుకి దమ్మిడి ఇవ్వను అంటే కరకటశాస్త్రులు ”అగ్నిహాత్రావధాన్లూ? కుఱ్ఱవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంతముందూ వెనకా చూస్తున్నావు. బుచ్చమ్మనమ్మిన పదిహేను వందల రూపాయలేంజేసావ్‌?”

గిరీశం : సెల్లింగ్‌గర్ల్‌? డామిట్‌! ”అనగానే అగ్నిహాత్రావధాన్లు ప్రతీగాడిదెకొడుకూ అమ్మావమ్మ వంచూచాడు. కూరగాయల్షోయ్‌ అమ్మడానికీ? ఆ రూపాయలు పుచ్చకోకపోతే మొగుడు చచ్చాడు గదా, దాని గతి యావైయ్యుండును?”

కర : చచ్చాడంటే వాడిదా తప్పు? మంచం నుంచిదిం చెయ్యడానికి సిద్ధంగా వున్న వాడిక్కట్టావు?….

ఆ మాటలేం పట్టించుకోకుండా ”అల్లుడు చచ్చిపోయి నాడంటందువల్ల ఎంతలాభం కలిగింది. భూవులకి దానా తెచ్చావా లేదా? అని యీ మధ్య దాఖల్సేయించిన పిటీషను మీద ఆర్డరు చదివి పెట్టండి….” అని ఆస్తిగోల, పిటీషన్‌ గోల తప్ప బుచ్చమ్మ స్థితి గురించి పట్టదు.

మరో సన్నివేశంలో బుచ్చమ్మ చైతన్యాన్ని అగ్నిహాత్రావధాన్లు అసలు భరింపలేడు. ”నాన్నా, తమ్ముడికి పెళ్లి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చేయండి గాని దాని కొంప ముంచి లుబ్ధావధాల్నుకి యివ్వొద్దని” చెప్పింది. దానితో నీ తండ్రికి వెఱ్ఱి కోపం వొచ్చి ఉత్తరా పోశనం పట్టకుండానే ఆ పెరుగు అన్నం విస్తరి తీసుకెళ్లి దాన్నెత్తినరుద్దేశాడు అని గిరీశం వెంకటేశ్వర్లుతో చెప్పాడు. అగ్నిహాత్రావధాన్లుతో నేరుగా ”నా సొమ్ము పెట్టిచేయండి…” అని తన ఆస్తిహక్కుని వెల్లడించింది బుచ్చమ్మ. అసలు భరింపలేడు అగ్నిహాత్రావధాన్లు నేటికి కూడా ఆపేక్షగా ఏదైనా చీరో, సారో ఇస్తారేమో గానీ హక్కుగా కోరే స్త్రీలని భరింపలేరు. గురజాడ ఇది గుర్తించారు.

ఆరవ అంకంలో అగ్నిహాత్రావధాన్లుతో సౌజన్యరావు ”వితంతువుల మఠంలో విద్యాబుద్ధులు చెప్పించుతారు. ఆమె తాలూకు ఆస్తి తమవద్ద వున్నది. ఆ పిల్లకి పంపిచెయ్యండి” అని చెప్తే అగ్నిహాత్రావధాన్లు ”ఫకీరు ముండ, రేపు యింటికి వెళ్లి ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను.

”కనికరంగాకేం… ఆస్తిగీస్తీయిమ్మంటే మాత్రం యిచ్చేవాణ్ణి కాను. ఆ వెధవని పెళ్లి చేసుకోకుండా యిల్లు జేరితే యింట బెట్టుకొంటాను. అని తన పెత్తందారీ స్వభావాన్ని, బుచ్చమ్మ పట్ల తీవ్రతృణీకారాన్నీ వ్యక్తం చేస్తాడు.

”ఆస్తి ఇవ్వకపోతే దావా పడుతుంది….. అంటే” దావాగవా అని బెదిరించితే భయపడేవాణ్ణికాను. వెధవ ముండకి పెళ్లి చెయ్యడవుపోయీ కాలంపట్టాకుండేవి,…..” అని అగ్నిహాత్రావధాన్లు ఉద్రిక్తుడవుతాడు. ఇలా కుటుంబంలో విపరీతమైన అణచివేతకి గురవుతుంది బుచ్చమ్మ.

నిజానికి గురజాడే కుటుంబ అణచివేతని బయటపెట్టిన మొదటివ్యక్తి. స్త్రీలకి ఆస్తి అనుభవం లేదని బయటపెట్టిన మొదటి వ్యక్తి. స్త్రీలకి ఆస్తి హక్కులు ఇచ్చినా వాటిని అమలు చేసుకొందుకి పోరాటం తప్పదని సూచించారు. సమానత్వాన్ని కోరిన కమ్యూనిస్టులు కూడా కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొన్నారే గానీ కుటుంబంలోపలికి తొంగిచూడలేదు. కుటుంబ అణచివేత నుండీ బయట పడితేగానీ స్త్రీలు సామాజిక అభివృద్ధి సాధించలేరనే నిజం గుర్తించారు గురజాడ.

బుచ్చమ్మ అణచివేతకి గురవుతున్న ఆలోచనా పరురాలు. ఆమె ఆలోచనని ఎలా అణచేస్తారో స్పష్టంగా తెలుస్తుంది.

వెంకటేశంతో బుచ్చమ్మ.

”గిరీషం గొప్పవారష్ర”…… గొప్పవారనగానే ”మరి వుద్యోగం కాలేదేమి? నీకేం తెలియదు” అంటాడు. ”ఆయనెందుకు పెళ్లాడారు కార్రా……”

”మరి వుద్యోగంకాలేదేమి?” అని అడగగానే.

”నాన్సెన్స్‌, నువ్వు ఆడదానివి? నీకేం తెలియదు” అంటాడు. ఆయనెందుకు పెళ్లాడారు

కార్రా…..

”నీకెంత చెప్పినా తెలియదు….. అంటాడు”

ఇంకాస్తా అడిగే సరికి

ఆడ దానివి నీకెందుకయాభోగట్టా అంతాను……. అని ఆమెకి విలువ నియ్యడు.

బుచ్చమ్మ పాత్ర స్వరూప స్వభావాలు మొత్తం గిరీశం స్వగతంలోనూ, సంభాషణలోనూ తెలుస్తుంది. గిరీశం స్వగతంగా యివిడ బ్యూటీ చూస్తే యేమీతోచకుండా వున్నది. అయితే యిది చెప్పినట్టల్లా వసమయ్యే మనిషి కాదు. పాత రస్తాలేం పనికి రాకుండా వున్నాయి…… దీనిని చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు. చేసినా సాగేది కాదుకనక కొత్తదారీ కొంతన్యాయమైన దారీ తొక్కాలి. యేమిటయా అది? మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకు పోయివిడో మ్యారేజి చేసుకొంటినట్టయినా కీర్తీ, సుఖం దక్కుతాయి. ఇదేవిటయ్యా బుచ్చమ్మ, సాక్షాత్తూ పరమపవిత్రమైన విడోవిత్‌ గిల్ట్‌ లెటర్స్‌.

దీన్ని బట్టి బుచ్చమ్మ గిరీశం మాట మీనాక్షి, పూటకూళ్లమ్మలా మోసపోయేది కాదు, లొంగిపోయేది కాదని స్పష్టమవుతుంది.

అలాగే గిరీశం వివిధ వివాహాల గురించి ఉపన్యసించినపుడు ”మా నేస్తం రాంబొట్లుగారి అచ్చమ్మ మీరు వొప్పుకొంటే మిమ్మల్ని పెళ్లాడతానంది అంటుంది. దీన్ని బట్టి బుచ్చమ్మ విధవా వివాహాల గురించి తన స్నేహితులతో చర్చిస్తున్నాదని ఆలోచిస్తున్నాదని స్పష్టమవుతుంది.

బుచ్చమ్మ తన వ్యక్తిగత జీవితాన్ని నష్టపోయిందని స్పష్టంగా తెలుసుకొని ఆ విధంగా తన చెల్లి నష్టపోకూడదని తన కుటుంబంతో శాంతి సౌఖ్యాలు కావాలని కోరుకొన్న పాత్ర. గిరీశం ఆమె కళ్ల ముందు ఒక అందమైన స్వప్నాన్ని ఉంచుతాడు. ”పసుపు కుంకుమ పెట్టుకొని మహాలక్ష్మిలాగ యింట్లో పెత్తనం చేసుకుంటే ఒకపిల్ల యిటువేపు వచ్చి మెడ కౌగిలించకునీ……. ఒక పిల్ల అటువైపు వచ్చి మెడ కౌగలించుకునీ….. అని చెప్తూ…… ‘మన వెంకటేశం మన దగ్గరే ఉండి చదువుకుంటాడు” అంటాడు. అందులో తన సౌఖ్యానికి, స్థితికి స్పందించలేదుగానీ వెంకటేశం గురించి చెప్పగానే ఆనందంగా స్పందిస్తుంది. ”అయి, అయితే మరి నాన్నకు ఖర్చుండదు. నాన్న అమ్మా వాడి చదువు కోసం దెబ్బలాడ్రు” అని కుటుంబ శాంతిని కోరిన వ్యక్తి.

అంతేకాదు, చెల్లి బాల్యవివాహాన్ని తప్పించ లేకపోయానని దుఃఖిస్తుంది. గిరీశం తప్పించలేదని నిందిస్తుంది. అది సాధ్యం కాదని గిరిశం అంటే ‘అయితే మీతో నాకేంపనీ? ఇంత సందడిగా పెళ్లి పనులు చేయిస్తున్నారు. మా నాన్నక్కూడా తోచకూడదా! యీ బంధం కూడదనో! మీకు కూడా దాని మీద యింత కనికారం లేకపోవాలా లుబ్ధావధాన్లు మీ అన్నగారని కాబోలు……’ అని సూటిగా అడుగుతుంది. తండ్రులు ఆడ బిడ్డల నిజదైన్యస్థితిని గుర్తించాలనీ, సామాజికంగా పురుషులకి స్త్రీల స్థితిపట్ల దయ కలగాలని కోరుతుంది. ఈ తాపత్రయం వలనే బుచ్చమ్మలో ఔన్నత్యాన్ని గుర్తించగలం. కర్ణుడి పాత్ర గురించి ఇర్వాతిక విశ్లేషిస్తూ కర్ణుడు నాయకుడు కాలేక పోవడానికి కారణంగా కర్ణడు సూతకులం వలన ఇబ్బంది పడి తర్వాత రాజు అయిన తర్వాత సూత కుల ఇబ్బందుల్ని తొలిగించడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకపోవడమే అని చెప్తారు. బుచ్చమ్మ మాత్రం తానుపడ్డ కష్టం తన పరిధిలో తన చెల్లికి కలగకుండా ఉండాలని గిరీశంతో పెళ్లికివొప్పుకొంటుంది. విధవా వివాహానికి ఆమెని మూడు రకాలుగా భయపెట్టి ఒప్పిస్తాడు గిరీశం. చెల్లి పెళ్లి తప్పించడానికి ఆమె తనతో లేచిరావాలంటాడు. తల్లిదండ్రులు పోయిన పిమ్మటైనా ఖాయిదాపోయి కాలుజారుతా వంటాడు. తనని పెళ్లాడకపోతే తను బతకనని చచ్చిపోతానని మరీ బెదిరిస్తాడు. మొదట భయపడినా చెల్లి పెళ్లికోసం, గిరీశం చచ్చి పోతాననడంతో సున్నితమైన మనసుగల బుచ్చమ్మ అంగీకరిస్తుంది.

నాలుగో అంకం తర్వాత బుచ్చమ్మ అసలు ప్రత్యక్షంగా కన్పించదు. ఆమె గురించి సౌజన్యరావు పంతులే ఆలోచిస్తాడు. కుటుంబ పరిధిలో సామాజిక భాగస్వామ్యం లేని బుచ్చమ్మ తమగురించి తాము ఆలోచించుకొనే స్థితి ఆ నాటి సమాజానికి లేదుగనుకే ఆనాటి సమాజ స్త్రీలస్థితిమారాలనే గురజాడ బుచ్చమ్మ చదువుకొని ప్రాజ్ఞురాలవ్వాలనే ఒక సార్వజనీయమైన ముగింపునిచ్చారు. ”చచ్చి బ్రతికి ప్రజలకెవ్వరు బ్రీతిగూర్చు వాడె ధన్యుడు’ అన్నట్లుగా గురజాడ స్త్రీలకు ప్రీతి గూర్చిన ధన్యుడు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.