మల్లీశ్వరి
కొండపల్లి కోటేశ్వరమ్మగారిని 2010 జనవరి 17 తేదీన మొదటిసారి కలిసాను. చాసో స్ఫూర్తి పురస్కార సభకి మేమిద్దరం కలిసి విజయనగరం వెళ్ళాం. ప్రయాణంలో ‘అమ్మమ్మా! నీ గురించి ఏవయినా చెప్పవూ? మాకు స్ఫూర్తిదాయంగా ఉంటుంది కదా!” అని అడగ్గానే, నిష్కపటంగా ఏమాత్రం రాగద్వేషాలు లేని స్వరంతో తన జీవితాన్ని తడుముకున్నారు. పలవరించారు.
ఏళ్ళ తరబడీ ఎందరినో కదిలించిన ఆ కలవరింతలే ఆమె ఆత్మీయుల సహకారంతో ‘నిర్జన వారధి’గా మన ముందుకు రావడం ఆత్మకథాసాహిత్యంలో మేలిమలుపు. నిర్జన వారధి ఆత్మకథ మాత్రమే కాదు, ఈ కాలానికి అవసరమయిన ఒక చారిత్రక గ్రంథం కూడా.
నిర్జన వారధిలో చాలామంది పాఠకులు గుర్తించి మెచ్చిన ప్రధానమయిన అంశం… అందులోని అంతస్స్వరం. నలుపు తెలుపులుగా కాక ఎంతో వైవిధ్యం, పోరాటం, దుఃఖం, విషాదం నిండివున్న జీవితాన్ని సమీక్షించుకుంటున్నపుడు ఆగ్రహ ప్రకటనలను నివారించి రాయడం అన్నది అంత సులువేమీ కాదు. మానవోద్వేగాల మీద ఎంతో పట్టు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ పుస్తకానికి ముందుమాటలు రాసిన ఓల్గా, అనురాధలు కూడా ఆ స్వరాన్ని కాపాడుతూ గౌరవిస్తూ సంయమనంతో రాయడం పుస్తకం ఔన్నత్యాన్ని మరింత పెంచింది.
ప్రముఖుల జీవిత విశేషాలు, ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలోని వారి బలాలూ, బలహీనతలూ తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. ఒక్కసారి సంచలనం సృష్టించే అవకాశాలూ ఉన్నాయి. నిర్జన వారధి కూడా సంచలనమే. అయితే ఆ క్షణానికి ఉర్రూతలూగించే సంచలనం కాదు. జీవితానుభవాల ఆధారంగా యిప్పటికీ సమాజంలో పెనగులాడుతున్న కొన్ని వర్గాల తరుపున నిలబడి ప్రశ్నించిన గ్రంథం. నిర్జనవారధి చదివి మొహమాటపడాల్సిందో, నొచ్చు కోవాల్సిందో, ఆశ్చర్యపడాల్సిందో ఏమీ లేదు. నేర్చుకోవాల్సిందీ, ప్రశ్నించాల్సిందీ చాలా ఉంది.
కొండపల్లి సీతారామయ్యలాంటి విప్లవయోధుడి భార్యగా తను పొందిందీ, కోల్పోయిందీ నిష్పక్షపాతంగా అంచనా వేసుకునే క్రమంలో చాలా విలువయిన ఆలోచనలు చేశారు కోటేశ్వరమ్మ. తన సమస్తాన్నీ త్యజించి, జైలు జీవితానికీ, అజ్ఞాతవాసానికీ చలించక, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విప్లవ పార్టీ రూపకర్తగా, సమరశీలిగా ఆయన సమాజానికి చేసిన సేవ నిరుపమానం… యింతటి త్యాగం ముందు ఆయనలోని ఒకటిరెండు వ్యక్తిగత బలహీనతలను పక్కన పెట్టడం సమాజానికి కష్టం కాదు… కానీ యిదే క్షమ కోటేశ్వరమ్మగారిలో కూడా ఉండాలని ఆశించడంలో అప్రయత్నంగానే పాతివ్రత్యకోణం చేరుతుంది. అందుకే ”మను సిద్ధాంతం, హిందూ మనస్తత్వం నాలో జీర్ణమై ఎన్ని బాధలు పడినా కూడా పతివ్రతలా భర్తను చూస్తానని నేనొకవేళ అంటే కూడా వద్దని కమ్యూనిస్టుల్లా వారించాల్సిన మీరు, అణచబడ్డ స్త్రీజాతికి అన్యాయం చేస్తావా అంటూ చీవాట్లు పెట్టాల్సిన మీరు ఆయనను చూడమని నాకు చెప్పడం వింతగా ఉంది” అంటారు కోటేశ్వరమ్మ.
కొండపల్లి సీతారామయ్యని ఆయన వ్యక్తిత్వపు మొత్తంలోంచి చూసినపుడు అసాధారణ, మహోన్నత వ్యక్తిగా కనిపించవచ్చు. కానీ స్త్రీల దృష్టికోణం నుంచి చూసినపుడు ఆయన కూడా పురుషాధిక్యతకి అతీతుడు కాదని తోచవచ్చు. యిది ప్రత్యేకంగా ఆయన పరిమితి కూడా కాదు. సమాజమే పురుషాధిపత్య భావజాలంలో ఉండటం ముఖ్యకారణం.
కులం, మతం, వర్ణం, జెండర్ వివక్షలు అంత త్వరగా పోయేవి కావు. వాటిని తమలో గుర్తించి, వదులుకోవడం కోసం నిరంతరాయంగా పోరాటం చేయాల్సి వుంటుంది.
ఈ పుస్తకం చదువుతున్నపుడు ‘వ్యవస్థలో మార్పు’ అన్న నినాదం యాంత్రికంగా మారిపోయినట్లు అనిపిస్తుంది. వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజికమయిన అంశాలు మాత్రమే ఉండవనీ, ఉత్పత్తి సంబంధాలతో పాటు మానవ సంబంధాలను కూడా కలుపుకుని మార్పుకి కృషి చెయ్యాలని లేనపుడు మార్పు సమగ్రం కాదన్న హెచ్చరిక కూడా ఈ ఆత్మకథలో ఉంది.
పుస్తకంలో ఒకచోట ”పార్టీలో పురుషాధిపత్యం తక్కువే” అంటారు. దానర్థం లేదని కాదు. తాము అనుభవించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకి కమ్యూనిస్ట్ పార్టీ కారణమంటూనే పురుషులని దాటుకుని స్త్రీలు వెళ్తే మాత్రం సహించలేకపోయేవారు అంటారు. మామూలు పురుషులకన్నా మెరుగే గానీ వారూ ఈ పురుషాధిక్య వ్యవస్థలో భాగమే కదా అన్న అవగాహన ఆమెది.
కమ్యూనిస్ట్ పార్టీ చీలిక పట్ల కోటేశ్వరమ్మకి ఉన్న అసంతృప్తి, బాధ ఈ పుస్తకంలో చాలాసార్లు కనిపిస్తుంది. రాజకీయ ఆచరణల దృష్ట్యా పార్టీ చీలకుండా ఉండటం అసాధ్యమయిన ఆదర్శవంతమయిన ఊహ కావచ్చు కానీ ఒక ఆకాంక్షగా ఆమె చాలాకాలం ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి కట్టుబడి ఉన్నారు. పార్టీ చీలిక తర్వాత ఒక పార్టీవాళ్ళు యింకొక పార్టీ వాళ్ళతో కలవడం ఉండేది కాదని చెపుతూ ”మగవాళ్ళకి మానవ సంబంధాల కన్నా రాజకీయాలే ప్రధానం కనుక ఆడవాళ్ళని కలవనిచ్చేవారు కాదు” అంటారు.
తన అత్తమామలు, కొడుకు కోరిక మీద ‘కొండపల్లి’ అనే ఇంటిపేరుని తన పేరుకి ముందు కొనసాగిస్తున్నానని చెపుతూ దాని మూలంగా తనకి ఒరిగేది ఏమీ లేదంటారు.
భర్తతో విభేదాలు, కొడుకు, అల్లుడు, కూతురుల అకాల మరణాలు, చివరివరకూ తోడుగా నిలబడిన తల్లి అంజమ్మ మరణం, ఆర్థిక సమస్యలు యిన్నింటి మధ్యా స్త్రీ విద్యావంతురాలయి ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండాలని పట్టుదలతో ముప్ఫయిఆరవ ఏట చదువు మొదలుపెట్టి ఆ తర్వాత ఉద్యోగంలో చేరారు.
సీతారామయ్యగారు దూరమయ్యాక ఆయన్ని కలవడానికి ఏమాత్రం యిష్టపడని కోటేశ్వరమ్మ, ఈ పుస్తకంలో భర్తగా అతను విఫలమవడాన్ని గుర్తించి రాసారు గానీ వ్యక్తిగా ఆయన ఔన్నత్యాన్ని పలుసందర్భాల్లో ప్రేమగా తలుచుకుంటూనే ఉన్నారు. కొడుకు జైల్లో ఉన్నపుడు చూడడానికి వెళితే ‘చందూ’ చిరునవ్వుతో నిలబడి ఉండటం చూసి సీతారామయ్య ధైర్యసాహసాలే కొడుక్కి వచ్చాయి అనుకుంటారామె. అలాగే తండ్రి వాటాగా వచ్చిన ఆస్తిని సీతారామయ్య పార్టీకి రాసిచ్చేయడం గురించి ”సీతారామయ్య సంపన్నుడు కాకపోయినా త్యాగసంపన్నుడుగా మిగిలిపోయాడు” అని సంతోషంగా చెప్పుకుంటారు.
కొండపల్లి సీతారామయ్య గారి చివరి రోజుల్లో ఆయన్ని కలవమని మిత్రులు ఒత్తిడి తెచ్చినపుడు తన అయిష్టతని వ్యక్తం చేస్తూ ‘ఆయన పాలిటిక్స్ ఆయనవి నా పాలిటిక్స్ నావి’ అని అనుకోగల ఆత్మవిశ్వాసం కోటేశ్వరమ్మగారిది. ఆఖరిదశలో కోటేశ్వరమ్మతో కలిసుండాలన్న ఆకాంక్షను సీతారామయ్య వ్యక్తం చేసినపుడు ‘యాజ్ ఎ ఫ్రెండ్‌గా ఉండటం వేరు. ఈ భార్యాభర్తల గొడవ నాకొద్దు’ అని సున్నితంగా తిరస్కరిస్తారు.
కోటేశ్వరమ్మ గారి జీవితంలోని పలువిషాద సంఘటనలు కంటతడి పెట్టించి మనసుని ఆర్ద్రం చేస్తాయి. అయితే అది నిస్సహాయ దుఃఖం, నిరుపయోగశోకం కాదు.
మనసుని పిండే విషాదంలోంచి జీవితేచ్ఛతో పదేపదే పైకి ఎగసే ఫీనిక్స్ కోటేశ్వరమ్మ. పార్టీలు, సంఘాలు ప్రజాస్వామీకరించ బడాలంటూనే చచ్చేవరకూ ఉద్యమాన్ని వదలనన్న ధీర… కోటేశ్వరమ్మ, ఊపిరిసలపని కష్టాల్లోనూ స్త్రీగా, వ్యక్తిగా, ఉద్యమకారిణిగా, రచయితగా ఎక్కడా తలవంచని సాహసి… కోటేశ్వరమ్మ…
ఈ పుస్తకం ద్వారా అనేకమందికి అమ్మగా, అమ్మమ్మగా కూడా కొత్త బాధ్యతని ఆనందంగా స్వీకరిస్తున్న కోటేశ్వరమ్మగారిని చదివాక జీవన పోరాటాలకి అవసరమయిన స్థితప్రజ్ఞత కళ్ళకి కడుతుంది. అంతర్లోకంలో వెలుగు నిండి నిలబడి పోరాడగలమన్న గట్టి భరోసా మన సొంతమవుతుంది.