అరుణ కవితలలో తాత్త్వికత

ఓల్గా

అరుణ కవితా మౌనం వదిలి మాట్లాడటం మొదలై ఎనిమిదేళ్ళయింది. ఈ ఎనిమిదేళ్ళలో ఐదు కవితా సంకలనాలు, ఒక నానీల సంపుటి వచ్చాయి. మౌనం మాటల్లో పలికించగల నేర్పు పట్టుబడిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టింది అరుణ.

కవులు మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలను మంత్రంగా మార్చే విద్యను సాధన చేస్తారు. ఒకరిద్దరు మహాకవులు మాట్లాడుతూనే ఆ విద్యను స్వాధీనం చేసుకునే వాళ్ళుండవచ్చు. కానీ కవిత్వం సానబెట్టి క్రమంగా వన్నెకెక్కించుకునేవారే ఎక్కువ. కానీ అరుణ అలా చెయ్యలేదు. చతురంగా సాధనంతా తన లోపలే సాగించింది. తనలోపలనుంచి బైటికి రావాలని ఆరాటపడుతున్న పదాలను వాక్యాలను అక్కడే పట్టి ఉంచి వాటి అంతరార్థాలను తానే వెతకటం మొదలుపెట్టింది. ఆ అన్వేషణ పూర్తయి అర్థవంతమయిందను కున్నపుడు ఆమె హాయిగా మాట్లాడటం మొదలుపెట్టింది. కవిత్వం ప్రవాహంలా నిండుగా నిబ్బరంగా నిర్మలంగా రాసాగింది. అందరూ ఇన్నాళ్ళూ ఏమై పోయాయీ భావాలన్ని అని అడిగారు అమాయకంగా. తనలోనే ఉన్నాయని చెప్పకనే చెప్పింది అరుణ.

వరుసగా ఐదేళ్ళూ ఐదు కవితా సంకలనాలు తెచ్చిన అరుణ కవిత్వం గురించి ఆ కవితా స్వరూప స్వభావ ప్రయోజనాల గురించి చివరిగా ఆ కవితా తత్త్వం గురించి ఆలోచించాలనిపించింది. స్త్రీల సాహిత్యం మీద విమర్శలూ అంచనాలూ రావటం తక్కువ. బాగా రాస్తున్నారనే ప్రశంసావాక్యంతోనో, ఫలానా ఫలానా కవయిత్రులు కూడా రాస్తున్నారనే ముక్తాయింపుతోనో వాళ్ళు పక్కకు నెట్టబడతారు. అలాంటపుడు కవయిత్రుల కవిత్వాన్ని అంచనా వేసే పని ఒక బాధ్యతగా తీసుకోవాలి. అరుణ తన ఐదవ కవితా సంపుటంలో తన జీవన నేపథ్యాన్ని కొద్దిగా వివరించింది. కుటుంబ బాధ్యతలతో సృజనాత్మకతను నొక్కిపట్టటం అనేకమంది స్త్రీలకు జీవితానుభవమే. చాలామందికి ఆ బాధ్యతలు ఎన్నటికీ తెగవు. బాధ్యతలు తెగినా అప్పటికి లోపలి జల ఇంకిపోతుంది. అరుణ విషయంలో ఆ జల ఇంకిపోలేదు సరికదా మరింత లోతయింది. తీయనైంది. నిర్మలమయింది. కారణం జీవిత భాగస్వామి ఏర్పరచిన కవితా వాతావరణం ఇల్లంతా నిండిపోవటం కావొచ్చు. తన లోపలి కవితలు వెలికి రావటంలేదు గానీ తన వెలుపలంతా కవిత్వమే – బహిరంతర కవితా సంగమ సమయం ఆలస్యమైతే అయింది గానీ అది పాఠకులకు హృదయంగమమయింది. ఆ రకంగా అరుణ అదృష్టవంతురాలు. తన సృజనను ”భావములోన బాహ్యమునందున” చూసుకుని ఆనందించగలుగుతోంది. సంస్కార యుతమైన వాతావరణం, సున్నితంగా స్పందించగల హృదయం, విషయాలను పైపైన చూసి వదలకుండా వాటిని తాత్త్వికంగా అర్థం చేసుకోవాలనే తపన ఇవి కవయిత్రిగా అరుణకున్న బలాలు.

రెండువందలకు పైగా కవితలు రాసిన అరుణ అనేక విషయాలను తన కవితా వస్తువులుగా తీసుకుంది. వీటిని పరిశీలిస్తే ఏడెనిమిది విషయాల మీద ఆమె చూపు నిశితంగా పడటం గమనించవచ్చు. కవయిత్రి గనుక స్త్రీల అణచివేత, వేదన, మాతృత్వాల గురించి సహజంగానే రాస్తుందని మనం అనుకుంటాం. అదికాక ప్రకృతి, ప్రపంచీకరణ, దాని విపరీత పరిణామాలు, గతానికి సంబంధించిన నాస్టాల్జియా, కళారాధన, ఆనందం, జనరల్‌గా సాగే మానవతా గీతాలు ఇలా ఎన్నో విషయాలు ఆమె కవితావస్తువులయ్యాయి. చివరిగా అన్నిటికంటే ఎక్కువగా తాత్వికతతో నిండిన కవితలు అరుణ రాసింది. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాసిన కవితలలో సగానికి పైగా తాత్త్వికతతో నిండినవంటే. మొదటి కవితా సంకలనం ”మౌనమూ మాట్లాడుతుంది”లో 41 కవితలుంటే అందులో 15 కవితలు తాత్త్విక భూమిక గలవి. ”పట్టుపురుగు” కవితలో

రవివర్మ చిత్రంలోని/సైరంధ్రి బుగ్గమీది/కన్నీటిచుక్క ఆరేదెప్పుడో/జీవయాత్రలో/ఒక నిమిషం నుంచి/మరో నిమిషంలోకి వెళ్ళటం/ఎంతటి సుదీర్ఘ ప్రయాణం

ఈ రెండుచోట్లా ఒక అనంత దుఃఖాన్ని పొదివి పట్టుకున్న కాలాన్ని గురించి అరుణ తాత్త్వికంగా ఆలోచించమంటుంది. సైరంధ్రి చెక్కిలి మీది కన్నీటిచుక్క అనేక చారిత్రక విషాదాల సమాహారం. ఆ తడి ఆరేది కాదు. కాలం మారేది కాదనే సంకేత ధ్వని అందులో ఉంది. ఐతే నిరాశ తప్ప ఏమీ లేదా – అంటే ఉంది – ఎక్కడినుంచో తియ్యటి పాట. భవిష్యత్‌ జీవన సంగీతపు ఆశ – ఆ పాట గబుక్కున ఆగిపోదు కదా – ఆ ఆశను కొనసాగించాలనే కోరికతో కవిత ముగుస్తుంది. ఆ ఆశ అరుణ తాత్త్విక ఆలోచనలన్నిటికీ పునాదిగా ఉంటుంది. జీవయాత్రలో కూడా ఎంతో విషాదాన్ని ప్రకటించినా చివరకు

మనసులో వెలిగే/అపురూప చైతన్యదీపాన్ని/నిరంతరం కాపాడుకోవటమేగా/ జీవితమంటే అని ముగిస్తుంది.

”లేని నేను” కవితలో మనల్ని మనం కోల్పోవటం గురించి ఎంతో వేదన ఉంటుంది. అనుబంధాల పేరుతో ”నీకు నువ్వేమీ మిగలవు” అని కచ్చితంగా చెబుతుంది. మరి ఎలా అనుబంధాలూ మిగలవు గదా – అవీ మిగలక – మనకు మనమూ మిగలక ఏం చెయ్యాలి సమస్తం కోల్పోయి అనే నిరాశలోకి తీసుకెళ్ళి మళ్ళీ తనే పోయిన బంధాలో అనుబంధాలో దుఃఖాన్నిచ్చినా

”ఒక ఆగమనం/చిరువానగా అవతరించి/దరి చేరుస్తుందా?/అందుకే మరి/ ఈ నిరీక్షణ” అంటూ ఆశను ప్రేరేపిస్తుంది. అవిశ్రాంతంలో అన్నీ సేదతీరే రాత్రి

”ఒక్క నేనే/తపస్సు చెదిరిన మౌనంలా” అంటుంది. తపస్సు చెదిరిన మౌనం. ఎలాంటి భావచిత్రమిది.

ప్రతి కవికీ ‘కాలం’ ఒక కవితావస్తువుగా సవాలు విసురుతూనే ఉంటుంది. కాలాన్ని ఎలా కవిత్వీకరిస్తావు – ఎలా నీ అనుభవాల్లోకి ఒదిగించుకుంటావు? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊహ. అరుణ తన అనుభవాలనే కాలం అనుకునే వాస్తవవాది. మంచి అనుభవాలు సేద దీరిస్తే, కొన్ని మంటల్లో కాలుస్తాయి. ఇక అప్పుడు కాలం మీద కోపం వచ్చి దానిని అధిగమించాలనుకుంటుంది అరుణ. అనుభవాలు లేని కాలం ఉండదు కనుక అది అసాధ్యం. దానిని గురించిన కలలు కనటమే మిగులుతుంది. చివరకు అది కూడా ఒక అనుభవమై కాలంలో ఒదిగిపోతుంది. అనేకమంది నిర్వహించిన కాలాన్ని తన కవితలో భిన్నంగా నిర్వహించింది అరుణ. విచికిత్స కవిత కూడా కాలానికి సంబంధించినదే. కాలం జీవితం పర్యాయపదాలే కదా – కాలం జీవితం రెండూ నిగూఢ రహస్యాలే – ‘పాయలు’ కవిత చాలా మామూలుగా కనిపించే గొప్ప కవిత.

ఇలా సంకలనమంతా జీవితానుభవ సారాన్ని తాత్త్విక రూపంలో ప్రకటించింది అరుణ. ఒక పాట, ఒక కాంతి, ఒక నావ, ఒక నిరీక్షణ, ఒక మౌనం, ఆ మౌనానికొక భాష్యం ఇవన్నీ ఆశావహ జీవన సంకేతాలుగా అరుణ కవిత్వంలో మెరుస్తాయి.

‘పాటల చెట్టు’ కవితా సంకలనంలో కూడా తాత్త్విక భావనలున్న కవితలే ఎక్కువ ఉన్నాయి.

జీవిత మూలాలను పట్టుకోలేని శాస్త్ర విజ్ఞానాల పరిమితిని చాలా సున్నితంగా పరిహసిస్తుంది అరుణ. ”ప్రయాణమే జీవితం”, ”ప్రారంభ గీతం”, ”రూపాతీతం”, ”అనిశ్చితం”, ”అతీతం”, ”ద్వైతం”, ”లంకె”, ”కాలికస్పృహ”, ”అంతరార్థం”, ”పరమార్థం” ఇలా అనేక కవితలలో అరుణ తన లోపలి ఒక అన్వేషణను, తనతో తాను చేసుకునే నిరంతర సంభాషణను కవితామయం చేసి మనల్ని ఆలోచించమంటుంది. జీవితాన్ని తేజోమయంగా, కాంతవంతంగా చేసుకోవాలనే తపన ఈ కవితల నిండా – జీవితం వెలుగుతో నిండిపోవాలనే, వెలుగుతో జీవితం ఐక్యమవ్వాలనే ఆర్తినీ, ఆరాటాన్ని పై కవితలన్నీ ప్రతిఫలిస్తాయి. అరుణ కవిత్వంలో ప్రత్యేకత అసాధారణత, అసామాన్యత ఎక్కడినుండి వచ్చాయంటే ఆమె తానేదో తాత్త్విక ప్రవచనాలు చేస్తున్నట్లు కనిపించదు. కనిపించటం కాదు అసలు చేయదు. అన్వేషణ చేస్తూ పోతుంది. తనను, ప్రపంచాన్ని వెతుక్కుంటూ పోతుంది. ఏదో కనుగొనాలని పెనుగులాడుతుంది. ఆ పెనుగులాటలో అనాయాసంగా ఆమె హృదయంలోంచి జీవితసత్యాలు, జీవనసూత్రాలు బయటికి వస్తాయి. ఇది కవి హృదయంలో నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ తేలిక కాదు. అనాయాసం కాదు. కాదని అరుణ కూడా గుర్తించింది.

”ఈ ప్రయాణం ఎక్కడికి/నాలోకా/నాలోంచి బైటికా” అని సందేహపడి ఊరుకోదు.

”నాలోని నిధులను వదిలేసి/బాహ్యంలోకి/భావాలను పోగొట్టుకోవడమే” అని తన లోపలి నిధులను ముందు స్వంతం చేసుకుని తర్వాత పంచిపెడుతుంది.

అందుకే బైట ప్రకృతిలో జరిగే విశేషాలు, అసలు ప్రకృతి అంతా తానే అనగలిగిన ధీమా కనపరుస్తుంది. సముద్రం ఒడ్డున నిలువెల్లా వానలో తడుస్తూ, భౌతికంగా ఆ వానను అనుభవిస్తున్న క్షణంలో కూడా

”నిజానికి వాన/నాలో కురుస్తున్నదే” అనగలుగుతుంది.

”చెట్టుకూ నాకూ/సాపత్య మున్నట్టే వుంది/క్రమంగా ప్రకృతికి నేను/దగ్గరవుతున్నానేమో!” అని సందేహపడి అది నిజమని రుజువు చేసుకుంటుంది. చెట్టూ తనూ ఇక విడివిడిగా ఉండటం కాదు. చెట్టును ఎదురుగా చూసి ఆ వృక్షానికి నీరాజనాలు పట్టటం కాదు. చెట్టులా బతకాలనుకోవటం కాదు. తానే చెట్టునని గుర్తించటం. ప్రకృతితో ఇంత ఐక్యత, మమైక్యం ఎలా సాధ్యమయిందా అనిపిస్తుంది ఆ కవిత చదువుతుంటే –

ఐతే ఈ నిరంతర శోధనను తన స్వభావంగా మార్చుకో గలగటం వల్ల అరుణ ”స్వభావాన్ని బట్టే సంభావ్యం/ఫలితాన్ని బట్టే సాఫల్యం” అని చాలా సులువుగా ఒక జీవిత సత్యాన్ని మనముందుంచు తుంది. మనం ఆ సత్యాన్ని గురించి ఆలోచించే లోపలే

”అన్నిటినీ మించినదొకటుంది/దానికోసమే/ ఈ నిరంతరాన్వేషణ” అంటూ తాను చెబుతున్న జీవిత సత్యాలు అర్థసత్యాలే సుమా అని చెప్పకనే చెబుతుంది. తన ”ఆత్మను ఆవిష్కరించే – మాటల కోసం – వెతుక్కుంటూనే ఉంటాను” అంటూ కవిత్వాన్వేషణలో మునిగిపోతుంది. కాలం గురించి ప్రతి సంపుటంలోనూ అరుణ ఆలోచిస్తూనే ఉంటుంది. ‘కాలిక స్పృహ’లో ఆమె కాలానికి మృత్యువు లేదనే విషయాన్ని గ్రహించింది. మృత్యువు లేనపుడు యాంత్రికతే కదా అని కాలం మీద జాలిపడుతుంది. అంతలోనే ‘నిన్నా నేడని కాదు కాలప్రవాహమే వింత’ అంటూ అమాయకురాలల్లే ఆశ్చర్యపడుతుంది. ‘ఏక్‌తార’, ‘ఆంతర్యం’, అమూర్తరూపం’, ‘అంతర్గమన’ ఇలా ఎన్ని కవితలలోనో అరుణ తన తాత్త్విక ఆలోచనలను మనముందుంచుంది. నిరాశలోంచి ఆశలోకి ప్రయాణించటం, చీకటిలో వెలుతురు చూడటం, మౌనానికి భాష్యాలు రాయటం, రాయి పగలగొట్టుకుని మొలకెత్తటమే స్వేచ్ఛ అని ప్రకటించటం, నాలో నేను, అందరిలో నేను అని గుర్తించటం ”నాలోకం వేరు కాదేమో, ఈ లోకమే దానికి వేరు” అని చెప్పే సాహసం చేయటం ఇవన్నీ అరుణ తాత్త్విక ఆలోచనల అక్షర సారాంశం. దీనిని అర్థం చేసుకోగల పాఠకులకు జీవితాన్ని స్థిమితంగా అనుభవించాలనీ, అనుభవాలను విశ్వసించాలని, విశ్వాసాలతో మానవులకు చేరువగా ఉంటూనే ఒక తాత్త్వికమైన ఎడాన్ని ఏకాంతాన్ని సృష్టించుకోవాలనే ఎరుక కలుగుతుంది. జీవితంపట్ల ఈ దృష్టిని కలిగించటమే అరుణ తాత్త్విక కవితల ప్రయోజనం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.