కె. ఆర్. మీరా
అనువాదం: ఓల్గా
“నేను నా రాజకీయ తీర్పులను, స్పష్టంగా, గట్టిగా బలమైన రీతిలో వ్యక్తీకరించటానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను – నేను చెప్పే విషయాలు సత్యమైనవి కావన్నట్లు, నేనేదో కపటంగా ఉన్నట్లూ అనిపిస్తుంటుంది. ఎందుకంటే జీవితం గురించి నా ఆలోచనలను ఒకే గొంతులోంచి వచ్చే సంగీతానికి, ఒకే దృక్పథానికీ కుంచించలేను.
నేను ఒక నవలా రచయితను మాత్రమే. తన పాత్రలన్నిటితో, ముఖ్యంగా చెడ్డ పాత్రలతో తనను తాను గుర్తించుకునే వ్యాపారంలో ఉన్న నవలా రచయితను. నేను నివసించే ప్రపంచంలో, అతిస్వల్పకాలంలోనే, అణచివేతకూ భీకరమైన హింసకు గురైన వ్యక్తులు హఠాత్తుగా తామే అణచివేసేవారిగా తయారవుతారు. విషయాల పట్ల, ప్రజల స్వభావాల పట్ల బలమైన నమ్మకాలు కలిగివుండటమనేది కష్టమైన వ్యవహారమని నాకు తెలుసు. మనలో చాలామంది ఈ వైరుధ్యపూరితమై ఆలోచనలకు మంచితనంతో, మంచి ఉద్దేశాలతోనే తావిస్తారని కూడా నేను నమ్ముతాను. ప్రజలు నిరంతరం తమ స్వంత ఆలోచనలతోనే వైరుధ్యం కలిగి వుండమనే వింతైన ఆధునిక సందర్భాన్ని దాని లోతుపాతులను అన్వేషించటంలోనే నవలా రచనలోని ఆనందం ఉంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ చాలా ముఖ్యమయ్యేంతగా మన ఆధునిక ఆలోచనా రీతులు జారిపోతుంటాయి. మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, మన నీడల్ని, వైరుధ్యపూరితమైన ఆత్మల ఆలోచనల్ని అర్థం చేసుకునేందుకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మనకు అవసరం.”
ఈ మాటలు పెన్ ఆర్థర్ మిల్లర్ స్మారకోపన్యాసంలో ఒర్హన్ పాముక్ చెప్పినవి. నేనిది చదివినపుడు నాలో ఒక కంపం కలిగింది. నేనెప్పుడూ యిలాగే ఫీలవు తుంటాను. దానిని మంచి మాటల్లో స్పష్టంగా చెప్పాడు.
విమెన్స్ వరల్డ్ ఇండియా ప్రచురించిన వ్యాసాలు ఇంటర్నెట్లో తిరగేస్తూ ఈ కింది వాక్యాలు చదివాను.
“స్త్రీలు దేనిగురించి రాస్తారు? ఆకాశం కింద వున్న ప్రతి విషయం గురించీ రాస్తారు అన్న సమాధానం కోరస్లా అందరికీ వినిపిస్తుంది. స్త్రీలు దేని గురించి రాయలేరు? కొంచెం ఆలోచన, ఒక గ్రూపు చెప్పారు. “మతం, రాజకీయాలు, సెక్సు”. అపుడు మనం ఆశ్చర్యపోతాం ఇంక రాయటానికి ఏం మిగిలిందని?”
నా మనసులో వచ్చిన మొదటి ఆలోచన విశ్వంలోని మొత్తం శక్తి స్థిరంగా వుంటుంది గాబట్టి విశ్వంలోని మొత్తం అనుభూతులు కూడా స్థిరంగా ఉంటాయని. వాళ్ళ ప్రకారం విశ్వంలో ఏడు మానవ సందర్భాలు ఉంటాయి. ఈ ఏడు సందర్భాల విభిన్న కలయికలలో 32 మానవ సందర్భాలను మనం ప్రపంచంలో ఏ భాగంలోనైనా సృష్టించవచ్చు. బాధలెప్పుడూ ఒకేరకంగా ఉంటాయి. అద్భుతాల్లాగానే. ఇంతకు ముందు కాలంలోని లలితాంబికా అంతర్జనం లేదా సరస్వతీ అమ్మ కావచ్చు, ఇప్పటి పెద్ద తరం వాళ్ళయిన కమలాసురయ్యా లేదా సారా జోసెఫ్ కావచ్చు, వైదేహి, ఫలియార్, సరూప్ ధ్రువ్ లేదా నేను, అనితా కావచ్చు. అందరం ఒకే రకమైన అనుభవాలతో రూపొందించబడ్డాం. డిగ్రీలలో తేడా ఉండొచ్చు. స్థలకాలాల ప్రమేయం లేదు. ఆశ్చర్యకరంగా మేమంతా ఒకే రకమైన సమస్యల నెదుర్కొన్నాం. స్థలకాలాల ప్రమేయం లేదు. ప్రపంచం ఎక్కడైనా ఏ కాలంలోనైనా ఒకే రకంగా ఉన్నట్లుంది.
వ్యక్తిగతంగా చూస్తే నేనూ నా జీవితాన్ని తిరిగి రాసుకోవటం వల్లనే రచయిత్రి నయ్యాను. నా అనుభవాలను ఎడిట్ చేసుకుంటూ, అచ్చు తప్పులు దిద్దుకుంటూ, విలువలను జతచేసుకుంటూ నేను కథలు తయారుచేస్తాను. నా జీవితం, యితరుల జీవితాల నిర్మాణాలను కూలగొట్టటం, పునర్నిర్మించటం అనేది రచనలో ఒక పద్ధతని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. ఆ క్రమంలో “అలా జరిగినట్లయితే” “అది అలా వుండేది” యిలాంటి వాటిని యితరుల జీవితాల్లో ప్రవేశించి అర్థం చేసుకుంటాను. నేను రాసేటపుడు నాకు కళ్ళు, చెవులు ఉండవు. నేను చూడలేను, వినలేను, స్పర్శించలేను. నాకు మాట్లాడాలని కోరుకునే నాలుకొకటే ఉంటుంది అది పిడుగులను వర్షిస్తుంది. అది ధ్వని నుంచి కాంతిని సృష్టిస్తుంది. ఆ నాలుకను ఎవరూ పహరాలో ఉంచలేరు.
నేనీ సదస్సుకు రావటం ఒక యాక్సిడెంట్. నా కంప్యూటర్లో టైప్ చేసిన కథలను నా భర్త ప్రచురణకు పంపకపోయినట్లయితే ఇవాళ నేనిక్కడ వుండేదాన్ని కాదు. ఒకరకంగా యిది మన అనుమతి తీసుకోకుండా రంగస్థలం విూదకు తోసెయ్యటం లాంటిది. మనం రంగస్థలం విూద ఉన్నాం కాబట్టి డాన్సు చెయ్యటం మొదలుపెడతాం. ఎడిట్ చేయని ప్రచురించ బడిన నా మొదటి కథను చూసినపుడు కలిగిన షాక్, బాధ మాత్రమే కాదు నాకు గుర్తున్నది.
నా సహోద్యోగి అన్న మాటలు కూడా గుర్తున్నాయి. అతనన్నాడు “ఈ రచయిత్రులు ఒక బోరు. వాళ్ళ కథలు వంటింట్లో మొదలై వరండాలో ముగుస్తాయి. స్త్రీలు రాజకీయ కథలు రాయలేరు.”
నాకు చాలా చిరాకేసింది. మలయాళం జర్నలిజంలో కూడా స్త్రీలు ఎప్పుడూ ప్రధాన స్రవంతిలో కనిపించరనే వాస్తవం కూడా నన్ను చికాకు పెట్టింది. మేము, మహిళా జర్నలిస్టులం రాజకీయాలు రాయకూడదు. నా మొదటి కథ తర్వాత సంవత్సరానికి వచ్చిన నా మొదటి పుస్తకంలో నేను వరండా దాటి, గేటు కూడా దాటి వచ్చే సాహసం చెయ్యటానికి ప్రయత్నాలు కావాలనే చేశాను. నా మొదటి పుస్తకాన్ని గురించి ఒక విమర్శకుడు “ఈ రచయిత్రిలోని ప్రధాన లక్షణం ఏమిటంటే, రచయిత్రులు రాసిన రచనలనుండి వారి జండర్ని స్పష్టంగా కనిపెట్టవచ్చు, ఈ కథలలో అలా కనిపెట్టటం కష్టం. పేరుని రఘు అనో, వర్గీస్ అనో మార్చినా తేడా ఏవిూ రాదు.” ఈ వ్యాఖ్య నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది.
రచన చేస్తున్నపుడు నేను స్త్రీగా కంటే ఒక వ్యక్తిగా కనిపించటం ఆనందమే. నా పడకగది బయట స్త్రీగా ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. త్వరలోనే నా రెండవ పుస్తకం వచ్చింది. దాని గురించి అందరూ మంచిమాటలే మాట్లాడారు. కారణం ఆ కథలు ప్రధానంగా స్త్రీపురుష సంబంధాల గురించి. సరూప్ ధృవ్ వర్ణించినట్లు అది “నార్మల్ రైటింగు”. ఆ కథలలో కొన్నిటిలో ఉన్న నిరాశావాదాన్ని, బ్లాక్ హ్యూమర్ని కొందరు విమర్శించారు గానీ ఆ పుస్తకాన్ని అందరూ బాగానే ఆదరించారు. కేరళలో సి.పి.యం పార్టీ లోపలి తగాదాలకు ప్రతిస్పందనగా, ఒక తరం వాళ్ళు చేసిన పోరాటాలను తరువాతి తరాల వాళ్ళు తిరిగి ఎలా సమీక్షిస్తారు, విలువ కడతారు అనేదాన్ని ప్రతిఫలించే ప్రయత్నం చేస్తూ నేను “అవే మారియా” అనే నవల రాసేనాటికి నేను రచయితగా నాతో, నా పాఠకులతో సంతోషంగా ఉన్నాను.
“అవే మారియా”లో నేను శిల్పంలో, కథ నిర్వహణలో ప్రయోగం చేశాను. అది గతకాలాన్నీ, వర్తమానాన్నీ కలనేతగా నేసినట్లుంటుంది. గతం పూర్తిగా చరిత్ర, వాస్తవం. వర్తమానం పూర్తి కల్పన. ఊహ మీద ఆధారపడింది. సూరనాడు తిరుగుబాటు అని పిలిచే, నలభైయవ దశాబ్దం మధ్య, యాభయ్యవ దశాబ్దం తొలి సంవత్సరాలలో ఒక గ్రామంలో భూస్వాము లను ముట్టడించిన సంఘటనలో ఒక పోలీసు అనుకోకుండా హత్యకు గురవుతాడు. ఈ చరిత్రాత్మక పోరాటంలోని అనేకమంది నిజమైన హీరోల ఆధారంగా నేనొక పాత్రను సృష్టించాను. చరిత్రలో రాసివున్న వారి అనుభవాలనే ఆధారం చేసుకున్నాను గానీ వారెవరి అస్తిత్వాలను గుర్తించీ రాయలేదు. అయితే నా కథ ఎక్కడికి వెళ్ళి తగలాలో అక్కడే తగిలింది. ఎందుకంటే కేరళ కమ్యూనిస్టు ఉద్యమం విూద బురద పూయటానికి ఒక మితవాద సంపన్నవర్గ వార్తాపత్రిక చేసిన కుట్రగా నా పుస్తకాన్ని వ్యాఖ్యానించారు.
ఆ కథ 2005 మార్చిలో ప్రచురించబడింది. ఆ రోజుల్లో నాకు పేరు తెలియని చెప్పని వ్యక్తులు ఫోన్లు చేసేవారు. కొందరు నన్ను చంపుతామని బెదిరించారు. తొందరలోనే నాకు అదంతా నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే నేనా కథను మంచి ఉద్దేశంతో, సమాజంలో మార్పు తీసుకురావటానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వారిమీది ప్రేమతో రాశాను. ఐతే దాన్ని పూర్తిగా అవమానపరిచే ధోరణిలో వక్రీకరించారు. ఐనా చాలామంది పాఠకులు ఆ సంవత్సరపు ఉత్తమ కథలలో ఒకటిగా ఆ కథమీద తీర్పు యిచ్చారు.
రాజకీయాల గురించి కథలు రాసే రచయిత, వర్తమాన నాయకుల చేత కమ్యూనిస్టు కలలు ఎలా ధ్వంస చేయబడుతున్నాయో రాసి పాఠకులను నిట్టూర్చేలా చేసే రచయిత, ప్రధాన స్రవంతికి చెందిన రచయిత, తన స్వీయచరిత్రకు సంబంధించిన నోట్సులో రాసింది చదివి నేను మరింత షాకయ్యాను. ఆయన స్మృతులను నేను ముందుగా ఏర్పరుచుకున్న అభిప్రాయాలేవిూ లేకుండా సహానుభూతితో చదువుతుండగా హఠాత్తుగా ఒక వాక్యం నన్ను ఉలిక్కిపడేలా చేసింది. ఆయనిలా రాశాడు – అతను రాయటం ఎన్నడూ ఆపనని, వెళ్ళిపోయిన విప్లవకారుల గురించి రాయటానికి మిగిలిన వ్యక్తి తానొక్కడేనని, తాను రాయటం మానేస్తే చెలక్కొట్టేతు కుంజిరామన్లు మలయాళ సాహిత్యంలో మళ్ళీ అవమానించబడతారనీ అన్నాడు. కుంజిరామన్ జీవితమే నా కథలో ప్రధాన సూత్రం. నన్నీ మాటలు నిజంగా గాయపరిచాయి. రచయితగా ప్రసిద్ధుడైన వ్యక్తి, అదే అంశం మీద రాసిన వ్యక్తి నా కథను అలా వక్రీకరించటం చాలా సీరియస్ విషయమని భావించాను.
ఆ తర్వాతి వాక్యం చదివి కుప్పకూలిపోయాను. “తమ జీవితాలను త్యాగం చేసి పోరాడిన రైతుల ఉత్సాహం ఒక అగ్రవర్ణ భూస్వామి మనవరాలికి అర్థం కాదు” అని రాశాడు. నేనా వాక్యం వంకే దిగ్భ్రాంతితో చూస్తుండిపోయాను. ఆ మాటలు రాసినందుకు అతన్ని నేనెన్నడూ క్షమించలేను. ఒక రచయితగా అతను విషాన్ని చిమ్ముతున్నాడు. ఒక సిద్ధాంత పరమైన విషయంలోకి తెలివిగా కులాన్ని లాక్కొచ్చాడు. రచయితగా అతను పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ కథలు రాశాడు. తర్వాత చాలామంది పార్టీ నాయకులను విమర్శిస్తూ కథలు రాశారు. ఈ రచయిత వాటన్నిటినీ అసలు గమనించనే లేదు.
రెండు వారాల తర్వాత, అతను నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. నామీద అతని ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే రాజకీయాలు అర్థంగాని ఆడవాళ్ళు గౌరవనీయులైన నాయకులపై బురద చల్లుతారని. ఆ తర్వాత రోజు ఒక బహిరంగ సభలో అతన్ని కలిసినపుడు, నా తరం స్త్రీలకు రాజకీయాలు తగినంత తెలుసనీ, అర్థం చేసుకోగలరనీ, నా కథలో అసలు సారాంశాన్ని అతను అర్థం చేసుకోలేక యిలాంటి విమర్శ చేసాడనీ సమాధానం చెప్పాను. అది – ఆ రాజకీయ ప్రాంతం అతనికి చెందిన ప్రాంతం. నేను ఆ ప్రాంతంలోకి జొరబడ్డాను. ఒక స్త్రీగా నేను పడకగదిలోనో, వంటింట్లోనో ఉండిపోవాలి గానీ డ్రాయింగురూంలోని రాజకీయాలలోకి రాకూడదు. నేనన్నదానికి అతనిచ్చిన సమాధానం కూడా మరింత విడ్డూరంగా ఉంది. అతను నా కథకు వ్యతిరేకంగా రాసింది విప్లవకారుల కోసం కాదంట. అతని కథలో కూడా కుంజురామన్ హీరో గాబట్టి వ్యక్తిగతంగానే నా మీద కోపంతోనే రాశాడట. నాకు నవ్వొచ్చింది. తాము ఈ సమాజంలో ఎంత అప్రధానమైన వారమో అర్థం చేసుకోలేని అలాంటి రచయితలను చూస్తే నాకు జాలి కలుగుతుంది. కేరళలో మూడుకోట్ల మంది జనాభా వుంటే పదిశాతం కంటే తక్కువమందే సీరియస్ సాహిత్యం చదువుతారు. రోజుకి పదిరూపాయల కంటే తక్కువ సంపాదనతో కుటుంబాలు నడుపు కోటానికి యాతనపడుతున్న స్త్రీలముందు నేను చాలా అల్పురాలినను కుంటాను. వాళ్ళ జీవితాల్లో నేను గానీ, ఆ రచయిత గానీ ఏం మార్పులు తీసుకురాగలుగుతాం? ఒక స్త్రీ అలాంటి విప్లవకారుల, రాజకీయాల వస్తువు లను పదునైన కథలుగా సమర్ధవంతంగా మలచగలదని ఒప్పుకోలేని పురుష మనస్తత్వానికిదొక ఉదాహరణ.
ఆ తర్వాత పదేళ్ళ నుంచి వస్తున్న ఆరోపణ కొత్త తరం రచయిత్రులు వాళ్ళ కథల్లో సెక్స్ని ఎక్కువ వాడుతున్నారని. నా కంప్యూటర్లో సేవ్ చేసిన ప్రశ్నావళిని రాత్రి నాతోటి రచయిత్రి అనితకు చూపించారు. ఒక పబ్లిషర్ రకరకాల విషయాల గురించి నా అభిప్రాయాలు అడిగాడు. ఆ ప్రశ్నలు చదివి నాకు చాలా కోపం వచ్చింది. నేనొకసారి రచయిత్రినయ్యాక నాకు కనీసపు ఎమోషనల్ ఐక్యూ లేకుండా పోయిందని ఒప్పుకుంటాను. ఎక్కువ సెక్స్ అంటే అతని అర్థం ఏమిటో, ఎంత సెక్స్కి అనుమతి ఉందో స్పష్టం చేయమని అతన్ని అడిగాను.
దీనికి సమాధానంగా ‘సోలో గొయ్య’ అనే కథ రాశాను. ఆ కథను ఒక రెచ్చగొట్టే వాక్యంతో మొదలుపెట్టాను. “19వ శతాబ్దంలో స్పెయిన్లో పెయింటర్ని కూడా తన చేతులు నరికేస్తారనే భయం వణికింపజేసేది. అప్పుడు కూడా, నగ్నత్వం వల్గర్గానూ సెక్స్ నేరంగానూ ఉండేది”. ప్రముఖ రచయిత జచారియా నన్ను పిలిచి ఈ కథ మలయాళ కాల్పనిక సాహిత్యంలో ఒక విముక్తి సంఘటన అన్నారు. నేను పొంగిపోయాను.
నా నాలుకను రక్షించుకోవాల్సిన అవసరం లేకుండా మాట్లాడాలనుకుంటాను. నాకు ఈ అంశం మీద రాయమన్నపుడు నా పూర్వ సహోద్యోగి చేసిన వ్యాఖ్య గుర్తొచ్చింది. “నాలుక అనే చిన్న అవయవంతో యింతమంది శత్రువుల్ని తయారుచేసుకున్న వాళ్ళను నిన్ను గాక యింకొకరిని చూడలేదు” అది నాలో లోపమైతే, నాకు నా నాలుకను రక్షించుకుంటూ బతకటం చేతకాదు. రాజకీయంగా సరిగ్గా ఉండి శభాషనిపించు కోవటం కంటే నేను నా ఆత్మసాక్షిగా, మానవత్వంతో ఉండాలని కోరుకుంటాను.