బి.కళాగోపాల్
దేహంపై లేచిన పుండ్లలా
మాతృత్వం చుట్టూ అల్లుకొంటున్న విషవలయాలు!
కిరాయి గర్భాల ముడిసరుకులో
అమ్మతనం అంగట్లో
కరెన్సీ నోట్ల బరువులో
తూకమేసి కొనుక్కొంటున్న ఆనందం!
ప్రాజెక్టు డెడ్‌లైన్ల ఉక్కుపాదాల క్రింద,
ఆధునిక అమ్మతనం ఆస్వాదించలేని ఒక శాపం
అది ఒత్తిడి ముసుగు తొడుక్కొన్న తొమ్మిది నెలల గడియారం!
రోజుల లెక్కల్లో వదలుతొన్న
ఊపిరి క్రింద లేతశ్వాస కొట్టుకొంటుంది
చిక్కుముళ్ళ పెంపక చిక్కుల్లో,
యాంత్రిక దినచర్యలో బందీలుగా
అమ్మతనం చితుకుతున్నది
ఆధునిక మాతృత్వం నెరవేర్చుకోలేని
ప్రమాణాల ముందు ముక్కలవుతున్నది
కలత నిద్రలో దిగుళ్ళ పగుళ్ళను
వేదనల సెగలను ఎగజిమ్మే ఆవిరి యంత్రపు
అమ్మతనం సున్నితత్వం, సహనసుమం
వసివాడి పోయిందీవేళ
స్పందన లేని రాతిగుండెలా
అమ్మ హృదయం ఎడారైందీవేళ
ఎందరో అమ్మల సాక్షిగా
నేటి అమ్మతనం మాధుర్యాన్ని
కోల్పోయిన ఒక నిర్జీవపు పునర్జన్మ!
పిచ్చిపిల్ల
రాజీవ
ఇది కవితకాని సుదీర్ఘ కథ
కథగా కుదించలేని ఓ కావ్యం
కావ్యంగా మలచలేని ప్రేమాయణం
ప్రేమగా నిర్వచించలేని పిచ్చిపిల్ల జీవితం!
ఎత్తుకుని ”అమ్మా – నువ్వే మా అమ్మ” అని
ముద్దాడిన కన్నతండ్రి మరుగైనపుడు
పదేళ్ళ గారాలపట్టి మానసికంగా షాకయింది
కన్నతల్లి కడుపులో పెట్టుకుని – మరో పదేళ్ళు
పిచ్చిబిడ్డను నరనాగుల కంటబడనీయకుండా
కంటిపాపలా కాపాడి కన్నుమూసింది.
యౌవ్వనం కవ్వింపులు వయస్సు పొంగులు
అర్థంకాని అమాయకత్వం – పసిపాపలా
ముసలాడు – పడుచుగా ఎదగనివాడూ –
మగతనం మోసానికి ఒరిగిపోయింది.
మనసు కోరిన ప్రేమ ఆప్యాయత అనురాగం
వెర్రితల్లి ఆశలు కోర్కెలు – చిదిమేసారు
గుండెకు తగిలిన గాయం
అనాథ యువతీ ఆక్రోశం
పక్కనున్నవారికి పొరుగువారికి
విన్నవారికి ఏడ్పించినవారికీ వినిపించలేదు.
అనాథ యువతిని దవాఖానాలో చేర్చారు
గాయపడిన శరీరం మానుతోంది
దెబ్బతిన్న మెదడు మరింత నెత్తురోడింది
సంస్కర్తలు సంఘాలు నల్లకోట్లు ఖాకీ దుస్తులు
అనాథను ఏ ఆశ్రమంలో చేర్పించలే!
ప్రయివేటు ఆస్థిగా బయటపడనీయకుండా
పబ్లిక్ ప్రొటెక్షన్ విజన్ రాజకీయాలకి
గొప్ప ఇన్వెస్ట్‌మెంటయింది – అందాల పిచ్చిపిల్ల!
పూమొగ్గలు
డా|| జరీనా బేగం
మీకేం తెలుసు
మీరు రేపు కాబోయ్ అందమైన సీతాకోకలని
మీరే రేపటి కావ్యనాయికలని
మీకేం తెలుసు
మీ ప్రతి మాట ప్రతీ పలుకు వీణగా తీయగా పలుకుతుందని
మీరెవరికి జీవనరాగమౌతారోనని
మీకేం తెలుసు
మీరు ఆకాశాన్ని వంచే హరివిల్లులని
మీ ముందు చైతన్యం ప్రజ్వరిల్లుతుందని
మీకేం తెలుసు
మీరెవరికి కాబోయే జీవన పరిమళాలో
ఎవరికి కాబోయే పశిడి శిల్పాలో
ఎన్ని కవితలకి మూలాలో
ఇవన్నీ సహజసిద్ధ ప్రకృతి వరాలు మీకు
వీటన్నింటితో పాటు, కావాలి మీరు
మీ జీవన రథసారథులు
ఆత్మస్థైర్యంతో ఆర్థిక స్వాత్యంత్రంతో
మీ చుట్టూ ఓ కొత్త ప్రపంచం
రారమ్మని పిలిచే ఆకర్షణలెన్నో
కాదు పొమ్మంటే అనర్థాలెన్నో
అందుకే సహజసిద్ధంగా అందమైన
గులాబీలుగా మీరు వికసించినా
గులాబి వెనుక రక్షిత నిశిత కంటకంగా
కుశాగ్రబుద్ధితో మీ వ్యక్తిత్వం
వికసిస్తే ఎన్ని చేతుల్నైనా
అడ్డగించి ఎంత కాలమైనా
నవ్వుతూ వికశిస్తూనే వుండొచ్చు
ఏ కాలానికైనా ఒకే ట్యూన్
తమ్మెర రాధిక
మా బామ్మ,
కుక్కి మంచంలో నిశ్శబ్ద చిత్రపటంలా
కళ్ళు తిప్పుతూ కూర్చునుండేది!
ఏడేడు తరాల చరిత్ర పుక్కిట పట్టిందేమో
ఆ పాటల్ని ఎప్పుడూ దవడలాడిస్తూ వుండేది!
తెల్లవారుజామున తను మేలుకొలుపులు పాడందే
ఊరు మేలుకోదు అనుకునేది.
భద్రాద్రి రామయ్యను లేపి పట్టాభిషేకందాకా తీసుకొచ్చి
అడవి తంత్రం కైకమ్మకు గుర్తుచేసి
ఆయన్తోపాటు అడవులన్నీ తిరిగొచ్చేది.
వయసు పిల్లలకు శివధనస్సు విరవడం నేర్పి
స్వయంవరాలు చూసొచ్చేది.
పెళ్ళయినవాళ్ళు కలహాల కాపురం చేస్తోంటే
సీతారాముల మందిరాలకు తీసుకుపోయి అన్యోన్యత
నేర్పేది. అలాంటిది –
అపనిందల పాలైన అంధరాజ్యంలో అతివల
ధన మాన ప్రాణాలను హారతి కర్పూరంలా
వెలిగిస్తోంటే –
కరిగిపోతున్న విలువల్ని గొంగట్లో మూసి
రామరాజ్యంలోని చరిత్రను
చర్విత చరణం చేస్తోంది.
అంతరించిన ఒక నాగరికత
వర్తమానాన్ని గుబులెత్తిస్తుంటే
మానవతా పరిమళాలు
మసకబారుతున్న జీవితాలకు
అందని జాబిల్లి లాంటిదే
గత దినాల తలపోత బరువులు
నేటి ముదితల తలరాతలు
కావడం ఎవ్వరికీ ఇష్టం లేదు,
అరణ్య రోదనలు అంతమవ్వాలి
ఆధునిక అంతస్సంఘర్షణలో
స్త్రీలు
నాగరికతల ఒంటరి పునాదులపై
రావణుడెత్తుకెళ్ళే సీతలవుతున్నారు.
నాడూ-నేడూ ఎప్పుడూ
రామాయణం
ఒక కూలిపోని పాటే!!!
వర్షాధార
ఎస్.మహేష్, ఇంటర్ ద్వితీయ, న్యూ మోడల్ జూనియర్ కాలేజ్
ఉదయించే సూర్యునిలో నిన్ను చూశా
చల్లని జాబిల్లిని పంచే చందమామతో మాట్లాడి
నీ పేరు రాశా
అమ్మాయిలనే నక్షత్రాలతో
మేఘాలనే అబ్బాయిలతో
స్నేహం చేస్తూ
ఆకాశంలోని మబ్బుల చాటుకు
దోబూచులాడుతూ
వుండే నీవు
ఒక్కసారిగా
అవే మబ్బుల్లాగా మారి
మమ్మల్ని వదిలేసి
వర్షం అనే ధారతో
నేలకు జారిపోయావు
నువ్వు మళ్ళీ తిరిగి రాలేవా నేస్తామా!
(సురేష్‌నాయక్ స్మృతిలో)
అమ్మ త న ము ముక్క ల వు తు ంది లొ అది ఒత్తిది ముసుగు తొదుక్కున్న తొమ్మిది నెల ల గ దియారం అన్న వాక్యం చాలా బాగుంది ఈ వాక్యం ఎప్ప టికి చెల్లు