అప్పటి మధురవాణి – ఇప్పటి నళినీ జమీలా

డా|| వాడ్రేవు వీరలక్ష్మీదేవి

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలోని మరపురాని పాత్ర మధురవాణి. ఆమె పందొమ్మిదో శతాబ్దపు వేశ్య. నళినీ జమీలా సజీవ వ్యక్తి. ఈమె ఇరవయ్యొకటవ శతాబ్దపు వేశ్య. వేశ్య అనే పేరు చుట్టూ వున్న భావజాలాన్ని తిరస్కరించి తాము చేస్తున్న పనిని ఒక ఉద్యోగంగా భావించే సెక్స్‌వర్కర్‌.

ఒక సెక్స్‌వర్కర్‌ ఆత్మకథ అనే పేరుతో నళినీ జమీలా తన కథను వ్రాసింది. కేరళలోని త్రిసూల్‌కు చెందిన కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన నళినీ జమీలా (1957) కుటుంబ ఆర్థిక పరిస్థితులవల్ల సెక్స్‌వర్కర్‌గా జీవించవలసివచ్చిన అను భవాలను ఈ పుస్తకంలో రాసింది. ఈ పుస్తకం ఆమె మళయాళీ భాషలో రాసింది. అది ఆంగ్లంలోకి తద్వారా తదితర భాషలలోకి అనువదించబడింది.

ఇరవయ్యవ శతాబ్దిలోనే బెంగుళూరి నాగరత్నం అనే దేవదాసీ వ్యవస్థకు చెందిన మహిళ గురించి వ్రాసిన జీవితచరిత్ర తెలుగు భాషలో ఉంది. కానీ ఆత్మకథారూపంలో దొరుకుతున్న మొదటి పుస్తకం నళినీ జమీలాదే అని చెప్పవచ్చు.

అయితే మధురవాణి నుంచి నళినీ జమీలా దాకా ఆ వ్యవస్థ ఏ విధంగా మారుతూ వచ్చింది. దానివల్ల వారి జీవితాలు ఏ మార్పులకు లోనవుతూ వచ్చాయో ఈ రెండు పాత్రల పరిశీలన ద్వారా గమనించవచ్చు.

మధురవాణి కాలం నాటి సమాజంలో ఒకవైపు వేశ్యావృత్తి నిర్మూలనకు ఉద్యమం మొదలయినా (యాంటీ నాచ్‌ ఉద్యమం) ఆ వ్యవస్థ ఇంకా బలంగానే ఉంది. వాళ్లు సాంఘికమైన గౌరవాన్ని పొందలేకపోయారే తప్ప సంపన్నతకు లోటులేకుండా చూసుకుంటూ వచ్చారు. ఎవరో ఒక సంపన్నుడి ప్రాపకంలో ఉంటూ వృత్తి చేసుకుంటూ, మరోవైపు సంగీత, నృత్య సాహిత్య కళావైభవాలను తమ స్వంతం చేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా సమాజంలో అత్యంత ఆకర్షకమయిన వర్గంగా చలామణి అవుతూ వచ్చారు.

అయితే కుటుంబస్త్రీలున్న భద్ర సమాజంలో వాళ్లు లేరు. అలాగే కుటుంబ స్త్రీలున్న అణచివేతలలోనూ వాళ్లు లేరు. ఈ అంశాన్నే కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర చెప్తుంది.

మధురవాణి అందమూ, మంచితనమూ, తెలివీ మాత్రమే ఉన్న స్త్రీ కాదు. నాటకంలో ఆమె ఉన్న ప్రతి సన్నివేశంలోనూ ఆమె చతురత, గడుసుదనం, ఎదుటి మనిషిని అంచనావేసి తగినట్టు ప్రవర్తించగల సద్యస్ఫురణలాంటి లక్షణాలన్ని స్పష్టంగా కనిపిస్తూ మనకి ఆ పాత్ర పట్ల మోహం కలిగేలా చేస్తాయి.

ఆమె తనని తాను అలా మలచుకోడానికి కారణాలు ఏమయి ఉంటాయి అని ఆలోచిస్తే ఆమె మాటల్లోనే తన తల్లి ఇచ్చిన శిక్షణ అని తెలుస్తుంది. ఆమె మధురవాణికి మంచివాళ్ల పట్ల మంచిగానూ, చెడ్డవాళ్లపట్ల చెడ్డగానూ ఉండమని బోధించిందట. ఇది పైకి విన్నంత సులువయిన విషయం కాదు. సాధన మీద తప్ప అలవడని విషయం. దానికి చదువు, లోకజ్ఞత, లోకపరిశీలన, ప్రత్యేక వ్యక్తుల పరిచయాలు లాంటివెన్నో కావాలి.

ఇవన్నీ మధురవాణికి లభించాయి. వీటన్నిటికన్న ముందు కేవలం తిండితిప్పలకోసం వృత్తిచేసే పరిస్థితి కాదు వారిది. సంపన్నులై ఉండి మరింత సంపద పోగుచేసుకుంటూ వృత్తి చేస్తూ దానికి కట్టుబడి దానినే గౌరవప్రదంగా భావించేవారు.

ముఖ్యంగా మధురవాణి తాను వేశ్యగా ఉండడంవల్ల పొందిన స్వేచ్ఛను, ఆనాటి కుటుంబాలలోని స్త్రీలకు అది లేకపోవడాన్ని గురించి బాహాటంగా చెప్తూ ఉంటుంది.

పూట కూళ్ళమ్మ మధురవాణి ఇంటికి వచ్చి గొడవచేసి గిరీశాన్ని ‘ఎక్కడ దాచావేమిటి’ అని అడిగిన ప్రశ్నకు మధురవాణి చెప్పిన సమాధానంలో ఈ అంశం ఉంటుంది.

”నాకు దాచడమేం ఖర్మ? నేను మొగనాల్ని కాను, వెధవముండనీ కాను. నా ఇంటికొచ్చేవాడు మహారాజులాగ పబ్లిగ్గా వస్తాడు.” అనడంలో ఆనాటి కుటుంబవ్యవస్థలోని కపటం గురించి కూడా మాట వదిలింది.

ఇలా మొదటినుంచి నాటకం చివరిదాకా మధురవాణి ఒక మహారాణిలాగే ఉంటుంది. కిరీటం ఒక్కటే తక్కువ. దానికి కారణం సమాజంలో ఆనాడు వేశ్యావృత్తికి ఉన్న భద్రత. సమాజం తాలూకు ఆమోదమూ, అంగీకారమూ కూడా ఉండడం. ఇది పందొమ్మిదో శతాబ్దపు పరిస్థితి. కుటుంబ పీడనంలో ఉన్న స్త్రీలకన్న కుటుంబం బయట ఉండి స్వేచ్ఛగా ఉన్న వేశ్య ఎంత ఉన్నతంగా ఎదుగుతూ వచ్చిందో మధురవాణిలో కనిపిస్తుంది.

కాని ఇరవై ఒకటవ శతాబ్ది నాటికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వేశ్యావృత్తి నేరంగా పరిగణించబడే దశకు వచ్చేసింది. కానీ సమాజంలో వేశ్యావృత్తి నిర్మూలన మాత్రం జరగలేదు సరికదా అనేక వికృతరూపాలలో పెరిగిపోయింది. ఎంతో దుర్భరమయిన, అభద్రమయిన జీవితాలలో ఎందరో వేశ్యలుగా జీవిస్తున్నారు. దానికంతటికీ నళినీ జమీలా ఆత్మకథ సాక్ష్యం వెయ్యినోళ్లతో పలుకుతోంది.

నళినీ జమీలా వేశ్యగా పుట్టలేదు. కేరళలోని ఒక పెద్దింటి పిల్ల. తండ్రి కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేవాడు. అందువల్ల నూలుమిల్లులో పనిచేసే తల్లి ఉద్యోగం కూడా పోయింది. తండ్రికి సంపాదన లేదు. కుటుంబం పెద్దది. తల్లి పడే కష్టం చూడలేక చిన్నప్పటినుంచి నళిని కూలిపనులు చేసి డబ్బు సంపాదించి తల్లికిచ్చేది. తొమ్మిదేళ్ల వయసునుంచి పెంకుల తట్టలు మొయ్యడంలాంటి కష్టమైన పనులు చేసి కుటుంబానికి సహాయపడేది.

చదువుకోవాలనే ఆశ ఉన్నా సాగక నళిని రకరకాల కూలిపన్లు చేస్తూ ఎదిగింది. ఆ పనులుచేసేచోట మగవాళ్లు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించబోవడం, ప్రతిఘటిస్తే కక్ష సాధించడం, లేదా పనిలోంచి తొలగించెయ్యడం లాంటివి అనుభవించింది.

ఇంతలో ప్రేమ, ప్రేమించిన వ్యక్తికోసం ఇంట్లోంచి బయటకు వస్తే అతని స్నేహితుడు మోసగించి పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఆ మోసగాడితోటే మూడేళ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కంది. ఆ తర్వాత ఆ భర్త విపరీతంగా తాగడంవల్ల కేన్సర్‌ వచ్చి చనిపోయాడు. ఆ రోజుల్లో కూలిపని చేస్తే వచ్చే డబ్బులు సరిపోయేవి కావు. అత్తగారు డబ్బులు తెమ్మని వేధించేది. ఆ రోజుల్లోనే ఆమె పిల్లల్ని పెంచుకోవడం కోసం వ్యభిచారం మొదలుపెట్టింది.

పిల్లల్ని అనాథశరణాలయంలో పెట్టాలని అనుకున్నప్పుడు ఒక స్నేహితురాలు ఆమెకు చెప్పింది. అలా చేస్తే ఇక పిల్లలు దక్కరని ఒక పని చేస్తే ఎక్కువ శ్రమ లేకుండా డబ్బు సంపాదించవచ్చని చెప్పింది. తన భర్తతో చేసిన పనికి మరో మగాడు ఏభయి రూపాయలిస్తాడంటే ఆమెకు భూమి తల్లకిందులైనట్టే అనిపించిందట. ఇలా ఆమె వేశ్యావృత్తిలోకి దిగింది. ఇక ఆ వృత్తిలోకి దిగాక ఆమె రకరకాల మగవాళ్లని చూసింది. మొదట వచ్చిన వ్యక్తి పోలీసు వ్యవస్థలో పెద్ద ఉద్యోగి. ఆయన ఒక జమీందారులా ఉన్నాడట. ఎంతో సున్నితంగా ప్రవర్తించాడట. తన కలల్లో రాకుమారుడు అతనే అనిపించిందట. కానీ ఆ మర్నాడు అరెస్ట్‌ చేయించి లాఠీలతో కొట్టించాడట. తన జీవితంలో అంతటి సున్నితమూ, క్రూరత్వమూ కూడా ఒకే మనిషిలో ఉండడం సాధ్యమని ఆ మొదటి పాఠం నేర్పిందట.

పోలీసులు కొడుతుండగా వచ్చి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆ రాత్రికి తనతోవస్తే వదిలేస్తానని బేరం పెడతాడట. నళినీ జమీలా జీవితం ఇక అప్పటినుంచి సెక్స్‌వర్కర్‌గా మొదలయింది. పోలీసుల వేధింపులు, రకరకాల అభద్రతల మధ్య నడిచింది. క్లయింట్లకోసం రోడ్లమీద ఎదురుచూడడం, అలాంటి సందర్భాలలో రౌడీమూకలకు చిక్కకుండా తప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చెయ్యడమూ, ఎన్నోసార్లు ప్రాణాపాయ పరిస్థితులదాకా వెళ్లడమూ గురించి రాస్తుంది జమీలా.

తన దగ్గరకు వచ్చిన రకరకాల మగవాళ్ల గురించి కూడా చెప్పింది. వాళ్లెవరూ నిజాలు చెప్పరని, భార్యలు మంచివాళ్లు కారని, జబ్బు పడ్డారని రకరకాల కారణాలు చెప్తారని రాస్తుంది. ఇందులో కొంతమంది విటులు అచ్చం భర్తల్లాగే ప్రవర్తిస్తారట. అంటే వాళ్ల సొంత విషయాలు చెప్పరు గానీ వీళ్ల గురించి అన్ని విషయాలూ అడుగుతారట. ఇందులో డబ్బున్నవాళ్లతో ఇబ్బందులు తక్కువట. వాళ్లు హుందాగా ప్రవర్తిస్తారట. డబ్బు విషయంలో బేరాలు చెయ్యడం, అర్ధరాత్రి రోడ్డుమీద వదిలేసి వెళ్లడంలాంటి పనులు చెయ్యరట. ఇలా ఆమె తన దగ్గరికి వచ్చిన రకరకాల వ్యక్తుల గురించి చెప్తూ అందులో కొందరి ద్వారా చక్కగా డ్రెస్‌ చేసుకోవడం, సభ్యతగా మాట్లాడడం, పద్ధతిగా మాట్లాడడం లాంటి లక్షణాలు నేర్చుకున్నా నంటుంది.

మధురవాణి కూడా ఎక్కడా చదువుకోకపోయినా పుట్టకతో వచ్చినవే కాక మరిన్ని గొప్ప లక్షణాలు తను చూసిన వ్యక్తుల నుంచి నేర్చుకుని ఉండవచ్చునేమో. ముఖ్యంగా ఎలా ఉండాలో కంటె ఎలా ఉండకూడదో అన్నవి.

నళినీ జమీలా కేవలం డబ్బు కోసమే ఆ వృత్తిలోకి దిగినా ఎంత డబ్బిచ్చే విటుడేనా సరే తన మీద ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తే ఆ సంబంధాన్ని వదిలేసేదాన్నని రాసింది.

మధురవాణికి డబ్బు ప్రధానం కాదని నాటకమంతటా అనేకచోట్ల ఋజువు చేస్తుంది. మంచికోసం, ముఖ్యంగా ఆడవాళ్లకు మంచి జరగడానికి తనవంతు పాత్ర వహించడంలో డబ్బుని లెఖ్ఖచెయ్యకపోవడం కనిపిస్తుంది. రామప్పంతులు లాంటి వాడితో తనే ఎదురు ఇవ్వగలనని కూడా చెప్తుంది. ఆలోచనను విస్తృతం చేసుకుంది. అక్కడ వాళ్లంతా వచ్చి సెక్స్‌వర్కర్ల అనుభవాలు చెప్పించడం చూసాక అది సరిపోదని గ్రహించి ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది.

సెక్స్‌వర్కర్ల చేత కష్టాలు చెప్పించడం తప్ప పరిష్కారమార్గాల గురించి ఎవరూ చెప్పడం లేదని ఆ విషయమై ఆలోచించవలసి ఉందని గ్రహించింది.

నళిని మొదట్లో కుటుంబస్త్రీ. కానీ పెళ్లిలో మోసగించ బడింది. పిల్లలకోసం సెక్స్‌వర్కర్‌గా మారింది. మళ్లీ నమ్మకస్తుడయిన పురుషుడు దొరికినప్పుడు శ్రమజీవనం చేస్తూ పన్నెండేళ్లపాటు అంటే 1993 దాకా గృహిణిగా గౌరవప్రదమయిన జీవితం గడిపింది. అతను దూరమయ్యాక మళ్లీ ఆమెకు ఈ వృత్తి తప్పలేదు. కానీ ఆమె క్రమంగా ఆ వృత్తిని కూడా సమాజంలోని మిగిలిన వృత్తులలాగే చూడమని కోరగల దశకు ఎదిగింది.

సెక్స్‌వర్కర్‌కి లైంగిక దోపిడీకి తేడా ఉందని చెప్తూ సెక్స్‌ రాకెట్ల చేతుల్లోకి వెళ్లకుండా సెక్స్‌వర్కర్‌ జాగ్రత్త పడాలని దానికోసం ఆమె ఓ పుస్తకం రాయాలనుకుంటున్నానని చెప్పింది.

ఐతే సెక్స్‌వర్కర్లు పోలీసుల వల్ల, లాయర్ల వల్ల పడుతున్న బాధలేమీ తక్కువ కావు. అరెస్టులు, జరిమానాలూ జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఆమె ప్రశ్నించింది. వీళ్లకు డబ్బు పొయ్యడం ఎందుకు? మనమేమీ నేరాలు చెయ్యడం లేదు. ఈ విషయం మనమే కోర్టులో అడుగుదాం. ఒకవేళ మనం చేస్తున్న వృత్తి నేరమే అయితే ఆ నేరంలో భాగస్తుడయిన మగవాడికి శిక్ష పడవద్దా? దానికోసం మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. అందుకోసం సంస్థ కృషి చెయ్యాలని బహిరంగ సభలలో మాట్లాడడం మొదలుపెట్టింది. అనేక సభలలోనేగాక టి.వి. ఛానల్స్‌లో మాట్లాడింది. మేం నేరస్తులమయితే మా దగ్గరకు వచ్చేవారిలో డాక్టర్లూ, లాయర్లూ, వ్యాపారవేత్తలూ ఎందరో ఉన్నారు. వారు మర్యాదస్తులు మేం నేరస్తులం ఎలా అవుతాం అని అడిగింది.

ఏది ఏమైనా సెక్స్‌ వర్కర్లు మాత్రం మంచో, చెడో ఈ వృత్తినే కొనసాగించాలనుకుంటున్నారు. అలాగని దాన్ని ఆనందంగా ఆహ్వానించారని కాదు. బతుకుతెరువుకోసం రాళ్లతట్టలు మోసి పారిశుధ్యం పనులు చేసినట్టు మేం కూడా ఈ వృత్తిని ఎన్నుకుని వాళ్లు క్రమంగా వాళ్ల వృత్తులకు అలవాటు పడినట్టే మేమూ అలవాటు పడుతున్నాం. కాబట్టి జ్ఞానాన్ని అమ్ముకునే ఉపాధ్యాయడిలాగ, గాత్రాన్ని అమ్ముకునే గాయకుడిలాగ సెక్స్‌వర్కర్ల వృత్తిని కూడా అర్థం చేసుకోమని ఆమె కోరింది.

నళినీ థాయ్‌లాండ్‌ వెళ్లి ఫోటోగ్రఫీ నేర్చుకుంది. సెక్సువర్కర్ల జీవితాలమీద డాక్యుమెంటరీలు తీసింది. అవి పలుచోట్ల ప్రదర్శనలకు వెళ్లాయి. ముంబయిలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దాన్ని ప్రదర్శించారు. ఆమె అక్కడ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా గౌరవాన్ని పొందింది.

గురజాడ ”ఆధునిక స్త్రీ చరిత్ర పునర్లిఖిస్తుంది” అన్న మాటకి ఇలాంటివి నూటికి నూరు శాతం ఋజువులు. ఆయనకి యాంటీనాచ్‌ ఉద్యమం మీద నమ్మకం లేదు. సమాజం గురించి, అందులో ఉన్న స్త్రీపురుష స్వభావాల గురించి బలహీనతల గురించి ఎంతో లోతుగా అర్థం చేసుకున్నవాడు. అందువల్ల యాంటీనాచ్‌ అన్నది ఉద్యమంవల్లగానీ చట్టంవల్లగానీ పరిష్కారం కాదని ఆయనకు తెలుసు. ఆయన ‘సంస్కర్త హృదయం’ కథ కూడా అదే చెప్పింది.

కాని 1956లో వచ్చిన ఇమ్మోర్టల్‌ ట్రాఫిక్‌ ప్రివెన్షన్‌ ఏక్ట్‌ (|.ఊ.ఆ.జు.) వల్ల వేశ్యావృత్తి నేరంగా పరిగణించబడడమే కాక, అందులోని క్రిమినలైజేషన్‌ ఆఫ్‌ సెక్స్‌వర్క్‌కి సంబంధించి పోలీసులకి అదనపు అధికారాలు ఇవ్వబడ్డాయి. సెక్స్‌వర్కర్‌ మీద మగపోలీసులే దాడిచేసి అర్థరాత్రి కూడా జైలులో పెట్టేలాంటి అధికారాలు కలిగాయి.దీన్ని చట్టం చెయ్యడంవల్ల స్త్రీలు ఎంత అధోగతి పాలవుతూ వచ్చేరో నళినీ జమీలా ఆత్మకథ చెప్తుంది.

ఈ నేపథ్యంలో సమాజంలో లైంగిక నేరాలు మరింత పెరిగాయి గానీ తగ్గలేదు. సరికదా సమాజంలో ఎంతో కొంత భద్రత ఉన్న వేశ్యలు రోడ్డుమీద పడ్డారు. దానివల్ల వారంతటవారు ఏర్పరచుకొన్న నీతినియమాలకు కూడా సావకాశం లేకుండా పోయింది.కన్యాశుల్కంలో మధురవాణి అలాంటి తన నియమాల గురించి చెప్తుంది, ఎవరి పోషణలో ఉంటే వారిని తప్ప మరొకరిని తాకనివ్వనని. డబ్బు కారణంగా ఎవరైనా మధురవాణి మీద ఆధిపత్యం చేసే పరిస్థితే లేదు. అది ఆమె వ్యక్తిత్వంలోని గొప్ప మనసేకాక హాస్యాలాడుతూనే ఎదుటి మనుషిని ఎంతటి వాడు కాని లొంగదీసుకోగలశక్తి వుంది.

కాని నళినా జమీలా లాంటి వ్యక్తులకు అంత మనోబలాన్నివ్వ గల వెసులుబాటు అటు సమాజంలోనూ లేదు. ఇటు వీళ్ళకూ లేదు. అటు తర్వాత ఆమె జీవితంలోకి పెళ్ళి పేరుతో ఇద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. మొదటి వ్యక్తివల్ల ఒక కూతుర్ని కంది. కాని అతని ముందు భార్య దగ్గర ఉంటూ నికృష్ణ జీవితం గడపలేక బయటకు వచ్చేసింది. రెండవ సారి షాహుల్‌ అనే వ్యక్తి పెళ్ళిచేసుకున్నాడు. నిజానికి ఇది ఆమెకు మూడవ పెళ్ళి. అతని కోరిక మీదనే తన పేరు జమీలా అని మార్చుకుంది. అతనితో కలిసే 12 సం. సంపారం చేసింది. అతను నళిని కూతుర్ని తన కూతురులాగే పెంచాడు. కాని కొంతకాలానికి అతను మరో స్త్రీతో సహవాసం కావడంతో ఆమెను వదిలేశాడు.

నళిని మరలా సెక్స్‌వర్కర్‌ కాక తప్పలేదు. అనారోగ్యం పాలయి అనాధనని చెప్పి మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో చేరి వైద్యం చేయించుకుంది. కూతురు పెద్దదయింది.తాను సెక్స్‌వర్కర్‌నని తేలిస్తే కూతురు ఏమనుకుంటుందో అని భయపడుతూ రహస్యంగా దాచింది.

ఇలాంటి ఏ మాత్రమూ రక్షణ లేని నళిని జమీలా జీవితంలోకి సెక్స్‌ వర్కర్‌ కోసం పనిచేసే జ్వాలాముఖి అనే సంస్థ ప్రవేశించింది. ఈ సంస్థ కేరళలోని త్రిసూరుకి 5 కి.మీ. దూరంలో ఉన్న అంచేరీ అనే వూళ్ళో వుంది. ఆ సంస్థలో చేరి ఆత్మస్థ్తెర్యాన్ని పెంచుకుంది. వివిధ సంస్థల కార్యకర్తలు, విద్యావంతులు, మేధావులు పెట్టే అవగాహనా తరగతుల ద్వారా ఆమె తన జ్ఞానాన్ని పెంపొందించు కుంది. మధురవాణికి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నళినీ జమీలా సంపాదించు కోడానికి జీవితంలో ఎంతోకాలం పోరాడవలసి వచ్చింది. దానికి కారణం సమాజమూ, చట్టమూ.

మధురవాణి తన వృత్తి తప్పని కానీ, తన జీవితం తక్కువ అని కానీ ఎప్పుడూ భావించినట్టు కనపడదు. నిజానికి అలాంటి అవసరం పైకి లేకపోయినా తన మనసులోకి కూడా అలాంటి భావాన్ని రానివ్వదు. కాపు భార్యగా నిరాడంబర జీవితంపట్ల మక్కువ గురించి చెప్పి ఉండవచ్చు కాని అది ఆమె ఆశయమూ, జీవితధ్యేయమూ కాదు.

సౌజన్యారావు పంతులు చివరలో ఆమెకు భగవద్గీత ఇచ్చి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించమని చెప్పాడు. మధురవాణి ఎప్పటికీ భక్తురాలు అవదు. శ్రీకృష్ణుడిలాగే (లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌) నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి.

నళినీ జమీలా తను చూసిన ప్రపంచంనుంచి ఆ నాయకత్వ లక్షణాలను ఎంతో శ్రమపడి నేర్చుకున్న వ్యక్తి. ఆమె సెక్స్‌వర్కర్‌గా ఉంటూ సమాజంలో మరికొన్ని పనులు కూడా చేస్తూ వచ్చింది. తన తోటి వర్కర్స్‌కు ప్రజాజీవితంతో, ప్రజాసమస్యలతో సంబంధాలు ఏర్పరచుకోమని, సమాజాభివృద్ధికి పనికొచ్చే రంగాల్లో పనిచెయ్యమనీ చెప్తో వస్తోంది.

మధురవాణి కాలంనాటి సమాజానికి ఇప్పటి సమాజానికి ఎంత అంతరం ఉందో నళినీ జమీలా ఆత్మకథ చదివితే తెలుస్తుంది. కన్యాశుల్కం రాసినప్పటి 19వ శతాబ్దిలో సమాజంలో ఇంత విచ్చలవిడి కామప్రకోపం లేదు. మధురవాణిలాంటి వేశ్య మృచ్ఛకటికం నాటకం గురించి మాట్లాడిందంటే వాళ్ల విద్యావికాసం, కళావైదుష్యం తెలుస్తున్నాయి. అవన్నీ నేర్చుకునేటంత డబ్బు, వెసులుబాటు, సాంఘికభద్రత ఆనాడు ఉన్నాయి. వేశ్యావృత్తి పోవాలంటే కుటుంబాలలో స్త్రీలు వెంకమ్మలలాగ బుచ్చమ్మలలాగా అమాయకం గానో, పూటకూళ్లమ్మలా ధాష్టీకంగానో ఉండకుండా మధురవాణిలా మార్చగల సమాజమూ, కుటుంబాలూ ఉండాలని ఆయన ఆశయం. దిద్దుబాటు కథలో ‘కమలిని’ మధురవాణికి చెల్లెల్లా ఉంటుంది అందుకే.

కాని సమాజం ఆయన కోరుకున్నట్టు కాదు కదా ఇంకా అధోగతి పాలయింది. ఇంతమంది సెక్స్‌వర్కర్లు తమ వృత్తిని గౌరవప్రదంగా మార్చమని తమ వృత్తికి లైసెన్సు ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నారంటే మధురవాణి, నళినీ జమీలాగా జన్మించి చరిత్రను తిరగరాయడం కాక మరేమిటి? ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల కమీషన్లు కూడా వారికి మద్దతునివ్వడం కొన్ని దేశాల్లో ఇప్పటికే సెక్స్‌వర్కర్లకు లైసెన్సులివ్వడం గమనిస్తే గురజాడ యాంటీనాచ్‌ మూవ్‌మెంట్‌ని ఎందుకు హాస్యం చేసేరో అర్థమవుతుంది. చివరగా నళినీ జమీలా అన్న మాటలు ఇవి.

”ఈ పాతిక ఏళ్లలో చాలా తేడా వచ్చింది. స్త్రీలమీద లైంగిక దౌర్జన్యాలు పూర్వం ఇంతగా లేవు. ఇప్పుడు వయస్సుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. మగవాళ్లు బ్లూఫిల్ములు చూడడం అనే జబ్బు వీటికి కారణం.”

మధురవాణి తన జీవితంలో ఇంత నీచత్వాన్ని చూసి ఉండదు. కానీ నళినీ జమీలా చూసింది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.